మనలోని ప్రాణం అమ్మ!

  • 2982 Views
  • 8Likes
  • Like
  • Article Share

‘అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి- అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి’! అలాంటి అమ్మ మీదే పాట రాయమంటే, మన చలనచిత్ర గీత రచయితలు ఎంత సంబరపడి పోతారో! అక్షరాలు నేర్పిన అమ్మకు అక్షరహారతి ఇచ్చే అవకాశం వచ్చినందుకు ఎంతగా ఆనందపడతారో! ఆ సంతోష సమయంలో వారి కలం నుంచి ప్రవహించే పాట... అమ్మప్రేమంత తియ్యగా ఉంటుంది. ఆనాటి సముద్రాల రామానుజాచార్యుల నుంచి ఈనాటి మిట్టపల్లి సురేందర్‌ వరకూ ఎంత మంది ఎన్ని పాటలు రాశారు! జాబితాలతో పనిలేదు, గుండెను నింపేసే అమ్మ నవ్వులే అన్నీ!! 
‘అన్నమయ్య గీతాల భావన- త్యాగరాజు రాగాల సాధన- ఎన్ని పేర్ల దేవుణ్ని కొలిచినా- తల్లి వేరులా వాటి చాటునా- ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ’ అని తన తల్లి సుబ్బలక్ష్మిని గుర్తుచేసుకుంటారు ‘సిరివెన్నెల’. ‘పాడే ఈ పాట పేరు- సాగే నా బాట పేరు అమ్మ’ అని చెప్పుకున్న కవి ఆయన. ఇక ‘అమ్మ పాటలు రాయాల్సి వచ్చిన ప్రతిసారీ ఆ అక్షరాల వెనక మా అమ్మ జానకమ్మే ఉంటుంద’నే సుద్దాల అశోక్‌తేజ, ‘దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా’ అని పాడతారు. ‘చిన్నప్పటి మాట... మా అమ్మ మధునమ్మ ఇంట్లో నిరంతరం తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుండేది- అందుకే ‘కదిలే దేవత అమ్మ... కంటికి వెలుగమ్మ’ అని రాశానంటారు చంద్రబోసు. ఫలానా అమ్మ పాట ఎలా రాశారని ఏ రచయితను కదలించినా, అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన పసిమనసు జ్ఞాపకాలే అలా అక్షరాలుగా మారాయని చెబుతారు.    
      వేటూరికి అమ్మభాషంటే అభిమానం. ‘మన భాషలోకి బయటి నుంచి పదాలను తెచ్చుకోవచ్చు. కానీ, ఉన్నవి తీసేయడం తప్పు’ అనేవారు. అమ్మకు మారుగా మమ్మీ అంటున్న వాళ్లను చూసే కాబోలు ‘అమ్మ అనేది అచ్చ తెలుగుమాటరా- జన్మజన్మకదే నిత్య వెలుగుబాటరా’ అని హితబోధ చేశారు. ‘బొమ్మాబొరుసే జీవితం’ చిత్రం కోసం రాసిన ఈ పాటలో ‘ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట- తన పిల్లల క్షేమమే పల్లవైన పాట- మధుర మధుర మధురమైన మాటరా అమ్మ’ అంటారాయన. ఇలాంటిదే ఇంకో పాట ఉంది. దాని రచయిత ఏవీఎస్‌. తన హాస్యంతో తెలుగువాళ్లకు చక్కలిగింతలు పెట్టిన ఆయన ముప్పయికి పైగా కథలు, మూడు నవలలు రచించారు.  కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే... ఏవీఎస్‌ రెండు పాటలూ రాశారు. వాటిలో ఒకటి అమ్మపాట. ‘సూపర్‌హీరోస్‌’ చిత్రంలోని ఆ గీతం... ‘అచ్చ తెలుగుభాషరా అమ్మంటే- అచ్చు వేదఘోషరా అమ్మంటే’. ఎంత చక్కటి నిర్వచనం! ఏవీఎస్‌ మాటల్లో చెప్పాలంటే ‘అమ్మపాట మానవాళి జాతీయగీతం’!
మాతాపిత పాదసేవే మాధవసేవ
మన గీత రచయితల్లో చాలామంది అమ్మ పాటలు రాశారు. వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది జూనియర్‌ సముద్రాల గురించి! అరవై ఏళ్ల కిందటి ‘పాండురంగ మాహాత్మ్యం’ కోసం ఆయన రాసిన ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కన్నూమిన్నూ కానక కన్నవాళ్లనే కాలదన్ని, కాళ్లు పోగొట్టుకుంటాడు పుండరీకుడు. అప్పుడు గానీ, చేసిన తప్పు తెలిసిరాదు. వెంటనే కన్నీళ్లతో అమ్మానాన్నల కాళ్లు కడుగుతాడు. ఈ సన్నివేశానికి ఆర్ద్రత నిండిన పాట రాశారు జూనియర్‌ సముద్రాల. ‘పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి- మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా- ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి- తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా’ అంటూ ఆ కొడుకుతో పాడించారాయన. పశ్చాత్తాపంతో కుమిలిపోయే అతని హృదయాన్ని ‘మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా- నీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా’ అన్న మాటలతో ఆవిష్కరించారు. ‘మాతా పిత పాదసేవే మాధవసేవ’ అనే సందేశాన్నందించే ఈ గీతం ఓ ఆణిముత్యం. 
      ఇటీవల వచ్చిన ‘పాండురంగడు’ చిత్రంలో ఇదే సందర్భానికి సుద్దాల అశోక్‌తేజ పాట రాశారు. ‘మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను’ అంటూ ఇది ప్రారంభమవుతుంది. ‘అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవి- నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని- నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని- బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని- తెలియనైతి తల్లీ, ఎరుగనైతినమ్మా...’ అంటూ తల్లి పాదాలను శరణువేడతాడు ఆ కొడుకు. వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు రచయితలు ఒకే సందర్భానికి పాట రాయడం అరుదు. అలాంటి అరుదైన సన్నివేశానికి పునాది అయిన తల్లీబిడ్డల పేగుబంధాన్ని ఆ ఇద్దరూ అంతే బాగా  అక్షరీకరించారు. ఇక అశోక్‌తేజ రాసిన మరో అమ్మపాటా అర్థవంతమైందే. ‘సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా- నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ’ అంటూ మొదలయ్యే ఈ గీతం (‘లోఫర్‌’ చిత్రంలో)... చిన్ననాడే తల్లికి దూరమైన ఓ కొడుకు ఆవేదనకు అక్షరరూపం. 
అనంత సృష్టికి అసలు బ్రహ్మ
అమ్మను మించిన మంచోళ్లు ఎవరైనా ఉంటారా? అందుకే ‘అమ్మ అంత మంచిది అమ్మ ఒక్కటే’ అన్నారు ఆత్రేయ. ‘కలసిన మనసులు’ చిత్రంలో వినిపించే పాట ఇది. ‘బొజ్జలోని పాపాయి పొరలిపొరలి తన్నినా పొంగిపోతుంది, పాల కోసం గుండెలపై గుద్దినా అమ్మ మురిసిపోతుంది, బిడ్డ నిండు నూరేళ్లు జీవించాలని దీవిస్తుంది, రామునికైనా సరే అమ్మకంటే రక్ష ఏమున్నదీ?’ అన్నది ఆత్రేయ మాట. ‘అమ్మంటే అమ్మ, అనంత సృష్టికి ఆమే అసలు బ్రహ్మ’ అంటూ మరో సందర్భంలోనూ రాశారాయన. ‘అమ్మ రాజీనామా’ చిత్రంలోని ‘సృష్టికర్త ఒక బ్రహ్మ- అతనిని సృష్టించిందో అమ్మ’ అన్న దాసరి పాట కూడా బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే తల్లి గొప్పదనాన్ని వివరిస్తూనే, తాగిన రొమ్మునే గుద్దే వాళ్లకు వాతలూ పెడుతుంది. 
      అగ్నిధారలు కురిపించిన దాశరథి కలమూ అమ్మ కీర్తిగానం చేసింది. ‘అమ్మంటే అంతులేని సొమ్మురా- అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా- అమ్మ మనసు అమృతమే చిందురా- అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా’ అన్న ఆ మహాకవి మాటలు అక్షరసత్యాలు. ‘బుల్లెమ్మ- బుల్లోడు’ చిత్రంకోసం దాశరథి రాసిన ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట- అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’  పాట ఎప్పటికీ వాడిపోని ఓ మధురాక్షర పుష్పం. అమ్మ గురించి ‘జగమే పలికే శాశ్వత సత్యమిది’ అంటూ ‘20వ శతాబ్దం’లో డా।। సినారె రాసిన గీతం... ‘అమ్మను మించి దైవమున్నదా’! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అయినప్పుడు ఆవిడే కదా ఆదిదేవత. ఈ తరహాలోనే అంతకు ముందే ‘అమ్మాయిలే నయం’ చిత్రంకోసం డా।। నెల్లుట్ల ఓ గీతరచన చేశారు. ‘అమ్మంటే ఆదిదేవత- అమ్మంటే ప్రేమా మమతా- కని పెంచే తల్లి అంటే- కనిపించే దైవము’ అంటూ చిన్న చిన్న పదాలతో ఆయన రాసిన ఈ పాట కూడా అమ్మ హృదయమంత విశాల భావాన్ని పొదుపుకుంది. 
అమ్మ మనసు ఒకటే
‘మాడంత దీపమ్ము మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు’ అని అమ్మ మురిసిపోతుంది. ఆమె మనసంతా ఎప్పుడూ బిడ్డల తలపులతోనే నిండిపోయి ఉంటుంది. అలాంటి ‘అమ్మ మనసు’కు జాతిభేదం లేదంటూ వీటూరి (‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి...’ గీత రచయిత- వీటూరి వేంకట సత్యసూర్యనారాయణ మూర్తి) రాసిన గీతం అక్షరలక్షలు చేస్తుంది! ‘అమ్మ మనసు’ చిత్ర ప్రారంభంలో పేర్లు పడేటప్పుడు వినపడే ఆ పాట పల్లవి... ‘పశువైనా పక్షయినా- మనిషైనా మాకైనా- అమ్మ మనసు ఒకటే- అమ్మా దైవం ఒకటే’! ఇక చరణంలో అయితే అమ్మ మనసు లోతులను కరుణ రసార్ద్రంగా కవిత్వీకరిస్తుంది వీటూరి కలం. ‘తన తనువెల్లా కరిగించి- తన బిడ్డలకా వెలుగులు పంచి- చీకటిగా తన జీవితమంతా చితికిపోయినా- చితిమంటల చిటపటలో కూడా- చిరంజీవ అని దీవించేది- అమ్మ మనసు ఒకటే- అందుకే దైవం అమ్మంటే’... బిడ్డ బాగులోనే తన భవిష్యత్తును వెతుక్కునే తల్లి గుండెచప్పుడు ఈ గీతంలో ప్రతిధ్వనించట్లేదూ!! ప్రేమ, జాలి, కరుణ, దయలే మూలస్తంభాలైన అమ్మ మనసు మందిరానికి సినారె కూడా అక్షరమాలలు అలంకరించారు. ‘అమ్మ... ప్రేమకు మారుపేరు- అమ్మ మనసు పూలతేరు- ఆ పేరు నీడ సోకగానే- నూరు జన్మల సేదతీరు’ అంటారాయన.  
      తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడూ చెడడని ఓ సామెత. భవిష్యత్తుకు భరోసా భూమి అయితే వర్తమానంలో ధైర్యం అమ్మ. అందుకే ‘ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా’ అంటూ తల్లికి నమస్కరిస్తారు పెద్దాడ మూర్తి. ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి’ చిత్రంలో ఆయన రాసిన ‘నీవే నీవే నీవే నేనంటా- నీవే లేక నేనే లేనంటా’ గీతం, అమ్మపాటలో ఓ కొత్త ఒరవడిని ప్రవేశపెట్టింది. స్నేహితులుగా మెసిలే తల్లీబిడ్డల అనుబంధాన్ని అందంగా అక్షరీకరించింది. పిల్లలు ఆకాశమంత ఎదగాలని అనుక్షణం తపిస్తూ, దానికోసం తను తిన్నా తినకపోయినా బిడ్డలకు మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది అమ్మ. ‘నా కలలని కన్నది నీవే- నా మెలకువ వేకువ నీవే- ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా’ అన్న పెద్దాడ మూర్తి మాటల్లో, పిల్లలకు కొండంత అండగా నిలబడే అమ్మ రూపుకట్టట్లేదూ!!   
జననీ లోకపావనీ
మహామహులైన ముందు తరం రచయితలందరూ అస్త్రసన్యాసం చేశాక, చలనచిత్ర గీతసాహిత్యం వసివాడకుండా కాపుకాసిన సాహితీమూర్తులు వేటూరి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అమ్మపాటల రచనలోనూ వీళ్లిద్దరి అడుగుజాడలు కలకాలం నిలుస్తాయి. వేటూరి అయితే అమ్మపాటతోనే (‘మాతృదేవోభవ’లోని ‘రాలిపోయే పువ్వా...’) జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘పట్టు పరుపేలనే పండు వెన్నెలేలనే... అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే... నారదాదులేలనే నాదబ్రహ్మ లేలనే... అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే’ అంటారాయన. ‘అమ్మ’ చిత్రంలోని వేటూరి పాట ‘మా జననీ లోకపావనీ’ ఓ భావగుళిక. ‘ముగ్గురు మొనగాళ్లు’లో ‘అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం’ అంటూ వాళ్లద్దరికీ జోతలు పట్టింది వేటూరి కలం.  
      కావ్యాలెన్నయినా ఉండవచ్చు కానీ, అమ్మ అనే మాట కన్నా కమ్మని కావ్యం ఉండదు. అలాంటి కావ్యాన్ని ‘ఎవరు రాయగలరూ’ అంటూ ‘అమ్మరాజీనామా’ చిత్రంకోసం సీతారామశాస్త్రి రాసిన పాటకూ కాలదోషం లేదు. ‘అమ్మంటే తెలుసుకో- జన్మంతా కొలుచుకో- ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ’... ‘మావిడాకులు’ చిత్రంకోసం ఈ గీతరచన చేశారు సీతారామశాస్త్రి. ఇందులో వచ్చే ‘పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం- స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం’ అన్న వాక్యాలు ఆయన మాత్రమే రాయగలిగినవి... కవిగా ఆయన ప్రత్యేకతకు నిదర్శనంగా నిలిచేవి. సీతారామశాస్త్రి రాసిన మరోపాట ‘నాలో నిను చూసుకోగా..’ కూడా అమ్మప్రేమకు అద్దంపట్టేదే. ‘అభిషేకం’ చిత్రంలో వచ్చే ఈ గీతంలో ‘అమ్మ లాలన ఎంత పొందినా అంతనేది ఉందా- వెయ్యి జన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా’ అన్న మాటలు తల్లిచాటు బిడ్డలందరి హృదయస్పందనలే. 
బంగారం నీవమ్మా...
తన కంటి వెలుగుగా పెంచుకున్న బిడ్డ ఒక్కసారిగా దూరమైతే ఏ తల్లికైనా గుండె పగిలిపోతుంది. కన్నపేగు కత్తిరించుకుపోయినప్పుడు ఆ అమ్మ పడే బాధ వర్ణనాతీతం. కానీ, దీని మీదే పాట రాయాల్సి వస్తే కవి కలం ఎలా స్పందిస్తుంది? ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా- రక్తబంధం విలువ నీకు తెలియదురా- నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా- తల్లి మనసేమిటో నీవు ఎరగవురా- తెలిసుంటే చెట్టంత నా కొడుకు- తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు’ అని ఆ దేవదేవుళ్లను నిందిస్తూనే వేడుకుంటుంది. ‘పురిటినొప్పుల బాధ ఈశ్వరా- నీ పార్వతిని అడగరా శంకరా- తల్లిగా పార్వతికి ఒక నీతినా- ఈ తల్లిని గుండెల్లోన చితిమంటనా’ అంటూ కన్నీరుమున్నీరవుతుంది. పార్వతి కోసం వినాయకుణ్ని తిరిగి బతికించిన ఆ పరమేశ్వరుడు, నాకోసం నా బిడ్డకు ఎందుకు మళ్లీ ప్రాణంపోయడన్న ఆ తల్లి ప్రశ్నకు ఏ దేవుడు సమాధానమిస్తాడు? ‘పోరు తెలంగాణ’ చిత్రంలో వినిపించే ఈ మిట్టపల్లి సురేందర్‌ గీత సాహిత్యానికి ‘నంది’ పురస్కారం లభించింది. 
      బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదనకు సురేందర్‌ పాట అక్షరరూపమైతే, అమ్మప్రేమను కోల్పోతున్న పిల్లల బాధకు ప్రతిబింబం వనమాలి గీతం. ‘అమ్మ అని కొత్తగా మళ్లీ పిలవాలని- తుళ్లే పసిప్రాయం మళ్లీ మొదలవ్వని’ అంటూ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రానికి ఓ పాట రాశారాయన. క్యాన్సర్‌ కారణంగా తమకు దూరమైపోతోన్న అమ్మను చూస్తూ పిల్లలు దీన్ని పాడతారు. ‘నింగీ నేలా నిలిచేదాకా తోడుగా- వీచే గాలి వెలిగే తారల సాక్షిగా... నువ్వు కావాలే అమ్మ- మమ్ము వీడొద్దే అమ్మ- బంగారం నీవమ్మా’  అంటూ సాగే ఈ పాట రచయిత జీవితంలోనూ ఓ విషాద జ్ఞాపకం. ఈ పాట రాసే సమయంలోనే వాళ్లమ్మకూ క్యాన్సర్‌ అని తెలిసింది. ‘‘ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే- నీకు తనకు బదులుగా కొత్త జన్మ ఇవ్వడా అన్న ఈ పాటలోని పదాలు ఆస్పత్రిలో అమ్మ పరిస్థితిని చూసి ఏడుస్తూ రాసినవే’’ అని ఓ ముఖాముఖిలో చెప్పారు వనమాలి. 
      ఇంకా ఎన్నో చిత్రాల్లో ఎన్నెన్నో పాటలు... సందర్భం వచ్చిన ప్రతిసారీ మన వెండితెర మీద మాతృమూర్తి మూర్తిమత్వం ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. చంద్రబోసు పాడినట్టు ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ’ అని ప్రేక్షకులందరితోనూ పాడిస్తూనే ఉన్నాయి. ఆ పాటలన్నింటి సందేశమొకటే... మాతృదేవోభవ! అందుకే చంద్రబోసు గళంతో మనమూ గొంతు కలుపుదాం- 
మనలోని ప్రాణం అమ్మ 
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ!


వెనక్కి ...

మీ అభిప్రాయం