అవధాన శిఖరం

  • 592 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ఆశావాది ప్రకాశరావు

డా।। సి.వి.సుబ్బన్న శతావధాని 500కు పైగా అవధానాలు చేశారు. మొక్కవోని ధారణతో, అఖండమైన ధారతో అవధానాలు ప్రదర్శించారు. సుబ్బన్న అవధాన నిర్వహణలోని శేముషీవైభవం, విశ్వనాథ, చెలమచర్ల రంగాచార్య, మధునాపంతుల, దాశరథి, కరుణశ్రీ, తుమ్మల సీతారామమూర్తి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, దివాకర్ల వెంకటవధాని, సి.నారాయణరెడ్డి లాంటి దిగ్దంతుల ప్రశంసకు పాత్రమైంది. దుష్కర ప్రాసల్ని అవలీలగా దాటడం, సందర్భోచిత శైలిని సారించటం, వృత్త వైవిధ్యాన్ని పాటించటం, హృదయవర్జక భావాన్ని పొదగటం సుబ్బన్న ప్రతిభకు నిదర్శనం. 
      కడప జిల్లా ప్రొద్దుటూరులో నవంబరు 12, 1929న సుబ్బన్న జన్మించారు. 1950లో తొలి శతావధానం చేశారు. 1997 వరకూ అవధానాలు చేస్తూనే వచ్చారు. నాభీకుహరం నుంచి వెలువడే ఈయన పద్యపఠనం వేదనాదాల్ని తలపిస్తుంది. రసజ్ఞ శ్రోతల్ని ఆనందపారవశ్యంలో పడేస్తుంది. నిషేధాక్షరిలో వినూత్న పదబంధాల కల్పన, దత్తపది, విరుపుల్లో ఆశ్చర్యకర భాషా వైదుష్యం, సమస్యాపూరణంలో కొంగొత్త పోకడలు, వర్ణనల్లో అతిలోక సౌందర్యం కనిపిస్తాయి. తన ప్రయోగాలను అధిక్షేపించినవాళ్లకి పూర్వకవి ప్రయోగాలను, నిఘంటు ప్రామాణ్యాన్ని చూపి ఆమోదింపజేసేవారు. అనితరసాధ్యమైన స్వీయ అధ్యయనానికి సాక్ష్యంగా నిలిచేవారు. నేటితరం అవధానాల్లో చాలామంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సుబ్బన్న శిష్యులే. ఆయన సిద్ధాంత గ్రంథం ‘అవధాన విద్య’తో పాటు, అవధాన పద్యాల సంపుటాలు మూడు అవధాన రంగ ప్రవేశం చేసేవారికి కరదీపికలు. సుబ్బన్న అవధానాల దగ్గరే ఆగిపోకుండా ‘శ్రీవ్యాస విలాస ప్రబంధము, శ్రీ భద్రాచల రామదాస ప్రబంధము’ లాంటి అయిదు ప్రబంధాలు, ‘పల్లెపదాలు, కళావాహిని’ లాంటి కావ్యాలు, ‘కుంతి, చెంచులక్ష్మి’ నాటకాలు రాశారు. 2017 మార్చి అయిదున స్వర్గస్థులయ్యారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం