అమ్మభాషే ఆరోగ్యలక్ష్మి

  • 456 Views
  • 0Likes
  • Like
  • Article Share

భాష కేవలం కథలు రాసుకోవడానికీ, కవితలు అల్లుకోవడానికీ పరిమితం కాదు. ఒకరినొకరు తిట్టుకోవడానికీ, పొగుడుకోవడానికే ఉపయోగపడేది కాదు. అది కొన్ని తరాల సాంస్కృతిక సంపద. అందుకే మాతృభాషకు దూరమైనవారు త్వరగా ఆత్మహత్యకు పాల్పడతారని ఆ మధ్య ఓ పరిశోధన వెలువడింది. మాతృభాషకు దూరమయ్యేవారు ‘నాది’ అనే ఉనికిని కోల్పోతారనీ, తనది కాని ప్రపంచంలో ఇమడలేకపోతారనీ పరిశోధకులు తేల్చారు. ఆ పరిశోధన అప్పట్లో ఓ సంచలనం. ఇప్పుడు ఏకంగా మాతృభాష వల్ల మనిషి శారీరకంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని నిరూపించే పరిశోధన మొదలైంది. గిలాడ్‌ జుకర్‌మాన్‌ అనే ఇజ్రాయెల్‌ భాషావేత్త ఈ పరిశోధనకు పూనుకున్నారు. 
      జుకర్‌మాన్‌ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి ఆదిమ భాషల గురించి తెలుసుకున్నారు. వాటిలో ‘బర్న్‌ గర్లా’ భాష ఆయన దృష్టిని ఆకర్షించింది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ‘బర్న్‌ గర్లా’ తెగవారి మాతృభాష అది. ఐరోపా వాసుల ఆధిపత్యం, ప్రపంచీకరణ నేపథ్యంలో ఆ భాష నిద్రాణమైపోయింది. కొత్త తరం ఆ భాషని నేర్చుకోవట్లేదు. భాష ఎరిగిన పెద్దలు దాన్ని మాట్లాడే అవకాశం లేదు.
      ఇదంతా 2011 నాటి విషయం. అప్పటికి యాభై ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న బర్న్‌గర్లాకు జవసత్వాలను కల్పించాలను కున్నారు జుకర్‌మాన్‌. వెంటనే ఆ తెగ పెద్దలను కలిశారు. ‘మీ భాష మళ్లీ మీకు కావాలా?’ అంటూ అడిగారు. అవునంటూ ఉద్వేగంగా స్పందించారు ఆ పెద్దలు. అంతే! ఆ భాషని పునరుద్ధరించేందుకు ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ భాషని నేర్పేందుకు ఒక పాఠ్యగ్రంథం అవసరం కదా. వెతికితే ఎప్పుడో 1844లో ఓ క్రైస్తవ మతాచార్యుడు రూపొందించిన నిఘంటువు కనిపించింది. మూడువేల పదాలతో ఉన్న ఆ నిఘంటువు ఆధారంగా, బర్న్‌గర్లా పెద్దల సహకారంతో ఆ భాషని పదిమందికీ నేర్పడం మొదలుపెట్టారు.
సంతోషం నింపింది!
అయిదేళ్లు గడిచేసరికి బర్న్‌గర్లాను నేర్చుకున్నవారు గణనీయంగా పెరిగారు.  అలాంటి ఔత్సాహికులకు సాయంగా ఉండేందుకు 2016లో రెండువేల పైగా బర్న్‌గర్లా పదాలతో ఒక యాప్‌ను విడుదల చేశారు. బర్న్‌గర్లా.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆ భాషని ప్రచారం చేయసాగారు. ఈ విజయాలన్నీ ఒక ఎత్తయితే ఈ సందర్భంగా జుకర్‌మాన్‌కు ఎదురైన అనుభవాలు మరో ఎత్తు.
      మాతృభాషని నేర్చుకోవడం వల్ల తాము చాలా సంతోషంగా ఉన్నామంటూ జుకర్‌మాన్‌కు సందేశాలు వెల్లువెత్తాయి. తన ఉనికికి కొత్త అర్థం తెలిసిందని ఒకరంటే, మనసు స్వేచ్ఛగా ఉందని మరొకరు సంబరపడ్డారు. తన పట్లా, తన కుటుంబం పట్లా చాలా సంతృప్తిగా ఉన్నామంటూ ఇంకొకరు మురిసిపోయారు. ఇలాంటి సందేశాలు జుకర్‌మాన్‌లో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. మనిషి సంతోషంగా ఉంటే దాని పర్యవసానం అతని బాహ్య జీవితం మీద ప్రతిబింబిస్తుంది. చదువులో మంచి మార్కులు రావడం, ఆత్మవిశ్వాసంతో మెలగడం జరుగుతుంది. అతని ఆరోగ్యం కూడా తప్పకుండా మెరుగుపడుతుంది. మాతృభాషకి దూరమైనవాడు ఇంత సంతోషంగా ఉండలేడు. అతను ఆత్మను కోల్పోయినవాడిలా ప్రవర్తిస్తాడు. ఫలితంగా కుంగుబాటు, మధుమేహం లాంటివి తలెత్తుతాయి. అందుకనే ఒక భాషని తిరిగి పునరుద్ధరించడానికీ, ప్రజల ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే పరిశోధనను చేపట్టారు జుకర్‌మాన్‌. ఆస్ట్రేలియా జాతీయ ఆరోగ్య, వైద్య పరిశోధనా సంస్థ ఆయన పరిశోధన ముందుకు సాగేందుకు 50 లక్షల రూపాయలకు పైగా నిధిని మంజూరు చేసింది కూడా. 


వెనక్కి ...

మీ అభిప్రాయం