భాష నేర్పకపోతే కుంగుబాటే!

  • 456 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలుండేవి. అందులోని పెద్దలు, ఇంట్లోని పసి వాళ్లతో నిరంతరం మాట్లాడుతూ ఉండేవారు. పిల్లలు కాస్త భాష అర్థం చేసుకోవడం మొదలు పెట్టగానే వారికి జోలపాటలు వినిపిస్తూ, కథలు చెబుతూ ఉండేవారు. చూసేందుకు చాదస్తంలా కనిపించినా, పిల్లల్లో భాషాపరమైన నైపుణ్యాలు అలవడేందుకు ఇవన్నీ దోహదపడ తాయని తాజా పరిశోధనలన్నీ రుజువు చేస్తున్నాయి. ఇలా పసివయసులోనే భాషా నైపుణ్యాలు ఏర్పడకపోతే పిల్లల మానసిక వికాసం కుంటుపడుతుందని మరో పరిశోధన చెబుతోంది. అదేంటంటే... మూడేళ్ల వయసు వచ్చేసరికి భాషలో ప్రాథమిక జ్ఞానం అలవడని పిల్లలు, 5 నుంచి 7 ఏళ్లు వచ్చేసరికి భాషాపరమైన సమస్యలని ఎదుర్కొంటారట. దీనివల్ల వారు చదువులో ముందుకు సాగలేకా, ఇతరులతో తమ భావాలను పంచుకోలేకా ఒత్తిడికి లోనవుతారట. ఇదే పరిస్థితి కొనసాగితే... 8, 9 ఏళ్లు వచ్చేసరికి వీరిలో కుంగుబాటు ఏర్పడే అవకాశం మూడు రెట్లు అధికంగా ఉంటుందని తేలింది. హవాయిలోని (అమెరికా) 587 మంది పిల్లలను గమనించిన తర్వాత తేల్చిన విషయం ఇది!
ఈ పరిశోధనతో పిల్లల ఎదుగుదలలోని ఒక కీలకమైన దశ బయటపడిందని భావిస్తున్నారు. ఇక మీదట మూడేళ్లు వచ్చేసరికల్లా పిల్లల్లో భాషలోని ప్రాథమిక పరిజ్ఞానం అలవడిందా లేదా అన్నది గమనించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కనీసం 5 ఏళ్ల సమయంలో అయినా వారు కాస్త సంభాషించగలిగేలా ప్రయత్నం చేయాలంటున్నారు. అదీ కాదంటే 8 ఏళ్లు వచ్చేసరికి పిల్లల్లో కుంగుబాటుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధనబట్టి పసిపిల్లలతో ఆట, మాట, పాట ద్వారా భాషని అలవర్చడం చాలా అవసరమని నిర్ధారితమైంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం