వయసుతో పనిలేదు!

  • 533 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘నేను ఊరికి వెళ్లి వస్తున్నాను’- ఈ వాక్యాన్ని యథాతథంగా ఆంగ్లంలోకి తర్జుమా చేయాలంటే... ‘ఐ విలేజ్‌ గో కమింగ్‌’ అని రాయాలి. కానీ తెలుగులో వాక్యాన్ని రాసే తీరుకీ, ఆంగ్లంలో వాక్యనిర్మాణానికీ ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది కదా! అందుకనే  ‘ఐ యామ్‌ కమింగ్‌ బాక్‌ ఫ్రమ్‌ విలేజ్‌’ అని అంటాం. ఇదంతా ఏవో వ్యాకరణ సూత్రాలు చెప్పుకోవడానికి కాదు. మాతృభాషకి భిన్నమైన వ్యాకరణ సూత్రాలున్న పరాయిభాషను కూడా మనం అవలీలగా గ్రహించగలమని తెలుసుకోవడానికి.
      చాలా ఏళ్లుగా కేవలం చిన్నతనంలో మాత్రమే రెండో భాషని నేర్చుకోవడం సులువనీ... ఒక వయసు దాటిన తర్వాత రెండో భాషని నేర్చుకోవడం అసాధ్యమని చెబుతూ వచ్చారు. వైవిధ్యమైన భాషలని నేర్చుకునేందుకు చిన్నపిల్లల మెదడు అనువుగా ఉంటుందని నమ్మారు. ఈ సూత్రాన్ని పట్టుకుని చిన్నతనంలోనే పిల్లలకు మూడేసి భాషలను బలవంతంగా నేర్పిస్తున్నారు. కానీ ఇది అర్ధసత్యమే అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎలినోరా రోసీ. ఒక వయసు దాటిన తర్వాత పరాయి భాషను నేర్చుకోవడం కష్టమే కావచ్చు కానీ అసాధ్యం కాదంటున్నారు.
      తమ వాదనను నిరూపించేందుకు రోసీ బృందం పెద్దయ్యాక స్పానిష్‌ను నేర్చుకున్న కొందరు ఆంగ్లేయులను పరిశీలించారు. స్పానిష్‌లో వారి పట్టుని గ్రహించేందుకు కావాలని మరీ తప్పులతడకలుగా ఉన్న స్పానిష్‌ వాక్యాలను వారి ముందు ఉంచారు. నిజానికి స్పానిష్‌కూ ఆంగ్లభాషకూ మధ్య వాక్య నిర్మాణంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినా కూడా ఆంగ్లం మాతృభాషగా కలిగినవారు స్పానిష్‌లోని భిన్నమైన వాక్యనిర్మాణానికి అలవాటుపడటమే కాకుండా, అందులో దొర్లే తప్పులను కూడా గ్రహించారట.
      పైన పేర్కొన్న పరిశోధన చాలా చిన్నదే కావచ్చు. కానీ దీని నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి- చిన్నప్పుడే ఆంగ్లాన్ని అనర్గళంగా నేర్చుకుని తీరాలన్న నమ్మకం నుంచి బయటపడి మాతృభాషకే అధిక ప్రాధాన్యమివ్వాలి. రెండు- తెలుగు మాతృభాషగా ఉన్నా కూడా, చిన్నప్పుడు దాన్ని నేర్చుకునే అవకాశం లేనివారు, ఏ వయసులో అయినా తెలుగుని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక మీదట ‘నాకు యంగేజ్‌లో టెల్గూ నేర్పలేదు తెలుసా!’ అని తప్పించుకునే అవకాశం లేదన్నమాట.


వెనక్కి ...

మీ అభిప్రాయం