హరిలో రంగ హరి!

  • 581 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి

  • జానపద చారిత్రక రచయిత,
  • అద్దంకి, ప్రకాశం జిల్లా
  • 9949999908
విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి

పుష్యమాస చలిరాత్రుల్లో సంక్రాంతి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. గుమ్మడి, బంతిపూలు పసుపు గంధాలను చిందుతాయి. నులువెచ్చని భోగిమంట నవోత్సాహాన్ని అందిస్తుంది. గొబ్బెమ్మలూ, గొబ్బిపూలూ పసిడికాంతితో వెలుతురుబాట పరుస్తాయి. పెద్దపండగను ఇంకా శోభాయమానం చేసేలా ఇదే సమయంలో ఆధ్యాత్మిక తరంగాలను మీటుతూ.. తెలిమంచు పరదాలను చీల్చుతూ వచ్చే హరిదాసులు సరికొత్త జీవన తాత్వికతను పాటలాగ వినిపిస్తారు. 
‘‘శ్రీరమారమణ గోవిందోహరి! శ్రీజానకీరమణ గోవిందోహరి!’’ అంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతూ భిక్ష వేసిన గృహస్థులను రామార్పణం, కృష్ణార్పణం, భగవతార్పణం అంటూ దీవిస్తుంటారు హరిదాసులు. ధనుర్మాసం ఆరంభం నుంచి మకరసంక్రమణ రోజు వరకు వైష్ణవ భక్తిగీతాలను ఆలపిస్తూ పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లే ఈ హరిదాసులనే మాలదాసులు, మాలదాసర్లు అనీ పిలుస్తారు. 
‘‘కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తుడు/ య్యులమును వాడు వామన తనే వసియింపనొ పుణ్యభూమినం/ దులకొక యోజనత్రయపు దూరపుటూరు వసించి బ్రహ్మవే/ ళల జనుదెంచి పాడుమము లాలస మంగళకైశికిన్‌’’ అంటూ తన ‘ఆముక్తమాల్యద’లో ‘మాలదాసరి’ కథను ప్రారంభిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. వామన దేవాలయానికి దగ్గర్లోని ఊళ్లో ఉండే నా భక్తుడు రోజూ బ్రహ్మ ముహూర్తంలో ఆలయానికి వచ్చి, మంగళకైశికీ రాగంలో శ్రావ్యంగా నన్ను స్తుతిస్తాడంటూ శ్రీహరి ముఖతా మాలదాసరి గురించి చెప్పిస్తాడు. అతడు ధరించిన వస్తు విశేషాలను కూడా ఇలా వర్ణిస్తాడు...
చమురైన తోల్కుబుసంబు టెక్కియును నిత్తడిశంఖ చక్రకుండలములమర
దివెదారికొమ్ముదోల్తిత్తియు జోడమ్ము మెడమీది మొగలాకు గొడుగుదనర
మత్పాదరక్షయుమావు పెన్వెఱకగుట్టిన మోటి తిపిరిదండెయును మెఱయ
జిటితాళములు సంకపుటికనొక్కొక మాటు గతిరయంబున దాకి కలసి మెరయ
వలుద వనమాల కంటెయు మలిన తనువు
బట్టె తిరుమన్ను బెదురు గెంబుట్టుజూపు
బసుపు బొడితోలు వల్లంబు నెసకమెసగ
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు 

      తోలు వస్తువులను ధరించి, చెవులకు ఇత్తడి శంఖచక్రాలను పెట్టుకుని, విష్ణు పాదుకలు, మెడలో తులసిహారాలను అలంకరించుకుని కిన్నెరను మీటుతూ ఆ మాలదాసరి రోజూ దేవాలయానికి పోయి వస్తున్నాడట. 
      క్రీ.శ 11, 12 శతాబ్దాల్లో కుల వ్యవస్థ కరాళనృత్యం చేస్తున్న సమయంలో విశిష్టాద్వైతమత సిద్ధాంత కర్త, పరమ వైష్ణవులు శ్రీ మద్భగవత్‌ రామానుజాచార్యులు కులాలన్నీ ఒకటేనని, భగవంతుడు అందరికీ ఒక్కడేనని నినదించారు. శ్రీరంగంలో అందరికీ తారక మంత్రోపదేశం చేశారు. అదే కాలంలో పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు విశిష్టాద్వైత మత ప్రచారంలో భాగంగా పద్దెనిమిది కులాల వారిని కలిపి రామానుజ కూటంగా ఏర్పాటు చేశాడు. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, మాలలకు దేవాలయ ప్రవేశం చేయించాడు. అలా వాళ్లంతా చెన్నకేశవ భక్తులుగా మారారు. విష్ణు భక్తి ప్రచారానికి శూద్రుల్లో సాతానులను, మాలల్లో మాలదాసులను ఏర్పాటు చేశారు. వీరు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తారు. వీళ్లలో మాలదాసరులు.. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కాగానే ‘హరిదాసులు’గా ఊరూరా సంచరిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతుంటారు. 
నెల రోజులు నిష్ఠగా...
హరిదాసులు ధనుర్మాస ప్రారంభం నుంచి మకర సంక్రమణ వరకు వేకువజామునే లేచి తలంటుస్నానం చేస్తారు. నొసట తిరుమణి, తిరుచూర్ణం, పట్టెనామాలు ధరించి కొత్త బట్టలు ధరిస్తారు. తెల్లపంచె/ కాషాయ పంచె, చొక్కా/ అంగి, నడుముకు గుడ్డ, కాలికి అందెలు కట్టుకుని.. మెడలో పూలదండ. తలపై కలశం (అక్షయపాత్ర), కుడిభుజంపై తంబుర, ఎడమచేతిలో చిటికెలు ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరుగుతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించాకే ఆహారం తీసుకుంటారు. ఈ నెల రోజులు వీళ్లు చాలా నిష్ఠగా ఉంటారు. నేలపడక, ఒంటిపూట భోజనం చేస్తారు. తర్వాత రోజుల్లో వీళ్లు వీధి నాటకాలను ప్రదర్శిస్తారు. కొందరు బుర్రకథలు గానం చేస్తారు. ఈ మూడు ఆచారాలూ వీళ్లకి వంశపారంపర్యంగా వస్తున్నాయి. 
      మాలదాసులుగా, హరిదాసులుగా వ్యవహారంలో ఉన్న వీళ్లు మాలల్లో ఒక తెగవారు. పన్నెండో శతాబ్దం నుంచి రామానుజ సిద్ధాంతాలను పాటిస్తూ, ఆయన బోధనలను వ్యాప్తి చేస్తూ వస్తున్నారు. మాలలకు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తూ భజన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వీళ్లు వివాహ వ్యవస్థలో మేనరికానికి ప్రాధాన్యమిస్తారు. మేనరికం లేనప్పుడు బయట వధువును వెతుకుతారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ‘ఓలి’ సంప్రదాయం వీళ్లలోనూ ఉంది. ఇది కన్యాశుల్కం లాంటిది. మాలదాసులు అపరకర్మ కాండలను రాత్రుల్లోనే నిర్వహిస్తారు. రామానుజకూటంలోని అందరూ ఇలాగే చేస్తారు. చనిపోయిన వారిని శ్మశానం వరకూ చేతుల మీదనే తీసుకెళ్లి ఖననం చేస్తారు. పాడెలాంటిది కట్టరు. తగవులను సంఘపెద్దలే తీరుస్తారు. అందరూ సంఘానికి కట్టుబడి ఉండాలి. తప్పు చేసిన వారిని సంఘ బహిష్కరణ చేస్తారు. తప్పు చెల్లిస్తే మళ్లీ సంఘంలో చేర్చుకుంటారు. 
      కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని వీరు ‘మంగళ కైశికి ద్వాదశి’గా వ్యవహరిస్తారు. ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైష్ణవ గీతాలను గానం చేస్తారు. ‘‘హరిహరి రామానుజా/ నీమతమందు నమ్మీనహరిదాసునీ/ కోరిభజింతును- కోర్కెలీడేరగాను/ సారిసారేకు నీదు- సహజీవనంగూరి/ విరతాము నీ సేవ నేమరకజేతుము/ పారాయణము చేతు నీ పాదములీడక’’... ఇలా దాదాపుగా అందరూ ఒకేవిధమైన పాటలు పాడుతుంటారు. అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో వీళ్ల జీవనోపాధి ఒడుదొడుకులకు లోనవుతోంది. వీరి ప్రదర్శనా కళలకు కూడా ఆదరణ లేకపోవడంతో ఈ హరిదాసులకు జీవనభృతి కష్టంగా ఉంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది వృత్తిని మానేస్తున్నారు. ఇదో విషాద వాస్తవం! ఏడాదికేడాదికీ సంక్రాంతి రోజుల్లో తగ్గిపోతున్న హరిదాసుల దర్శనభాగ్యం దీనికో నిదర్శనం. తమ జీవికకు, కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదనే విశ్వాసం కలిగితేనే ఎవరైనా తమ వృత్తినీ, వంశపారంపర్య ఆచారాలనూ కొనసాగించగలరు. హరిదాసులకు ఆ నమ్మకం కలిగించాల్సిందీ.. వారినీ, వారి ప్రదర్శన కళలనూ అక్కున చేర్చుకోవాల్సిందీ మనమే!


హరిదాసులు ఆలపించే హరి సంకీర్తనల్లో ఓ రెండు..
దశరథా శ్రీరామచంద్రా మమ్ముదయజూడు శరణు మహేంద్రా ।।దశరథా।।
దేవాదేవోత్తమ- దేవేంద్రసన్నుత- ఘోరరాక్షస గర్వహరా విశ్వంభరా 
చేరి మీ పాదాబ్జములను భావమున మీ కథలు బాడితి- కోరికతొ
దయ జూడు వల్లభ తారకామృతయో మురారి ।।దశరథా।।
భాండనోద్దండ దోర్థండా- నిండు పన్నువెన్నెల రీతినుండా 
పితృవాక్య పరిపాలన నుద్ఘటజటా- సీతాలక్ష్మణసహిత చిత్రకూట ప్రవేశ
పక్షివాహన భక్తపోషణ రక్షకుడవో జగద్రక్షణ- మోక్ష
బంధన ముక్తి పాలక బంధచేదన వాలి హరణా ।।దశరథా।।
వనజాసనాది దేవతలూ- యిట్లు వర్ణింపుచుంద్రు భూపతులు
సర్వేశ నీపాద సరసీజములకునా- యిహలోక సౌఖ్యములబ్బే వేగిరమున-
తాటకా సంహరణ శ్రీహరి- మేటి రాక్షసకోటి మదహర
నీటుగా రక్షించు నీకు సాటి యెవ్వరు ధనుజ సంహార ।। దశరథ।।
కూరిదయ చేయవేరా- జ్యోతి కోటాదాసుని బ్రోవవేరా
నారాయణ నీదునామామృతంబెల్ల పారాయణము నారసింహయౌతార-
పొందుగను ప్రహ్లాదునేలిన - అందముగనో సుందరాంగుడి
ఇందుజూచెద బహువిధంబుల వినుతజేసేద చంద్రవదనా ।।దశరథ।।

(ఆనందభైరవి రాగం, అట తాళం)


త్రాహిమాం- దాశరథీ ।।త్రాహి।।
త్రాహి దుష్టసంహార పాహి ముని- హ్యూహసేవ కమలాంఘ్రిదేహి
ఓహో చరచాప్రోజ్వలహస్త జగత్కంఠకా దైత్యవిద్ధశవా ।।త్రాహి।।
సాగర గర్వభంగ విశిఖం- సాత్విక తత్వ ముద్రత తనుభం
నాగతల్పశాయి నమోనమః- విరాడ్విగ్రహం పరానుగ్రహం ।।త్రాహి।।
రాజాధిరాజ రాజాయారామ- రాజీవనేత్రకామా
ఆజానుబాహు రాత్రించరారి రాజత్కింకిణి కంకణాంకితకర ।।త్రాహి।।
పారావార గభీర గుణనిధిం వీరశ్రేష్ఠ సీతాపతిం
ఘోరారి ప్రకరాధిప్రకరణ కోదండ రామరామంభజే ।।తా।।
ధీరన్‌ జ్యోతి శ్రీరామాయాభ్య నీకరాబ్జ యుగళం లలాటోజ్వలం
పరమేష్ఠాది పిపీలికాది నిలపర బ్రహ్మ సంసేవిత రామం ।।త్రా।।

(కేదాళగౌరి రాగం, ఆది తాళం) 


వెనక్కి ...

మీ అభిప్రాయం