ఇంటిపేరు చరిత ఇంతింత గాదయా!

  • 1636 Views
  • 10Likes
  • Like
  • Article Share

    దినకర్

  • నంద్యాల
  • 9985101420

ఇంటిపేర్లు చ‌రిత్ర చెబుతాయి!
      వినటానికే ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఎక్కడైనా నగరాలు, దుర్గాలు, కోటలు, శిథిలాలయాలు, రాతిదిబ్బలు లాంటివి చరిత్ర చెప్పటం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. చదువుకుంటున్నాం కూడా. కానీ ‘ఇంటిపేర్లు’ చరిత్ర చెప్పటమేంటీ! 
      అవును; చెబుతాయి. కాకపోతే అందరి ఇంటిపేర్లూ చెప్పకపోవచ్చు. లోతుగా పరిశీలిస్తే అవీ చెప్పనూవచ్చు.
      అయితే ఎలాంటి చరిత్ర! అని సందేహమూ కలుగవచ్చు. అందులోనూ ఈ చరిత్ర అంత ముఖ్యమైందా? తెలుసుకోవడం అవసరమా? తెలిసీ ప్రయోజనం ఏంటీ? అనే ప్రశ్నలూ పుట్టుకు రావచ్చు.
      ఆ మాటకు వస్తే ‘ఏ చరిత్ర తెలిసీ ఏం ప్రయోజనం పొందగలుగుతున్నాం!’ అన్నది అన్నిటికంటే పెద్ద ప్రశ్న.
ఎందుకులేదూ! అనంటే- ఇందులోనూ ఉందనే సమాధానం. కొందరి ఇంటి పేర్లను చూద్దాం ముందు.
నాటి ఉపాధ్యాయులే
‘వఝల, గౌరావఝల, పాలావఝల, రంగావఝల, రామావఝల, గంగావఝల, ఐలావఝల, కేశావఝల, తల్లావఝల, మల్లావఝల, లక్ష్మణవఝల’ ఇంకా ఇలాంటి ‘వఝల’ వారుండవచ్చు. ఈ మాటల్లో ‘వఝల’ అనేది సంస్కృతపదం. ‘ఉపాధ్యాయుడు’ నుంచి తెలుగులో తద్భవంగా ఏర్పడిన పదం. ‘ఓఝ’ ప్రాకృతంకాగా, తెలుగు వికృతి ‘ఒజ్జ’ అని.
      ఒజ్జ అంటే బోధించేవాడని కదా అర్థం. ‘ఒజ్జబంతి’ నుడికారమూ ఉంది. ‘గురువులవరుస’ అని పెద్దచేసి చెప్పటం. ఆ విధంగా ‘బోధచేసే వర్గం’ పూర్వం తెలుగునాట (దేశమంతటా కూడా ఉండేది - ఉత్తరాదిన ‘ఓఝా’, ‘ఝా’ పదాలు వీటికి సంబంధించినవే) చాలాచోట్ల ఉండేది. ఆ రోజుల్లో ‘పాఠ్యబోధనం’ అంటే వైదిక విద్యలైన శ్రౌత, స్మార్త, పూర్వాపర క్రియానిర్వహణాంశాలు, వేదాలు, ఉపనిషత్తులు, అమరం, పంచకావ్యాలు, ఆంధ్రనామ సంగ్రహము’ ఇలాంటివి నేర్పడమే. వాటి తర్వాత ‘వ్యాకరణం, ఛందస్సు, తర్కం, జ్యోతిషం, అలంకార శాస్త్రం’ ఉండేవి. అయితే, వీటిలో అన్నిటినీ అందరూ నేర్పేవారు కాదు. కొందరు ‘శ్రౌతస్మార్త విద్య’కే ఒజ్జలు; కొందరు ‘వ్యాకరణం’, మరికొందరు ‘తర్కం’, ఇంకొందరు ‘జ్యోతిషం’ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు ఈ పలు ప్రక్రియా బోధనలో ప్రఖ్యాతులై ‘ఒజ్జలు’గా గురుపీఠాలను అధిష్టించి ఉండేవారు.
      పూర్వం ఓ చతురోక్తి ఉండేది. వేదాధ్యయం చేసిన నిత్యాగ్ని హోత్రుడైన శ్రోత్రియుడు తన భార్యని పిలుస్తూ ‘‘ఏమిషే! ఏమిషేష్తున్నావుటే?’’ అని స్వరయుక్తంగా అడిగేవాడనీ, అందుకావిడ ‘మీరిలా తొందరపెడితే ‘ఇహ పప్పులోకి పషపషే’ అని జవాబు చెప్పిందనీను. వేదమంత్ర స్వరాలు పలకడానికి సంబంధించిన ఛలోక్తి ఇది. అలా ‘ఒత్తిఒత్తి పలుకుతారబ్బా’ అని వెటకరించటం. ఆ వెటకారపు పిలుపు భావమే మన తెలుగు ‘ఒజ్జ’ మీదా ప్రసరించి అదికాస్తా ‘ఒఝ్ఝలవారంటే - వఝ్ఝలవారట’ అయి చివరకు ‘వఝల’గా మారింది.
      అంటే ఈ వఝల ఇంటిపేరున్న వారు తరతరాలుగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయులన్న మాట. అంతకుముందు వారింటిపేరు ఏదో అయి ఉండవచ్చు. ఆ వూరికి వచ్చిన కొత్త బాటసారి ఎదురైన వ్యక్తిని ‘అయ్యా ఇక్కడ సీతారామయ్య గారిల్లెక్కడ!’ అనడుగుతాడు. ఆ వ్యక్తి ‘ఏ సీతారామయ్యగారూ!’ అని తిరుగు ప్రశ్నిస్తాడు.
      ‘అదేనండీ ఆ వఝలవారు... అంటే పాఠాలు చెప్పే సీతారామయ్యగారూ!’ అంటాడు. అలా ఆ రోజునుంచీ ఆ గ్రామంలో ఎందరో సీతారామయ్యల్లోంచి వఝల వారిని ప్రత్యేకించి చెప్పినందువల్ల ఇంటిపేరు కాస్తా ‘వఝల’ అయి కూర్చుంటుంది. ‘వఝల చినసీతారామశాస్త్రి శాస్త్రులు’ తెలుగునాడు గర్వించవలసిన గొప్ప వ్యాకరణ పండితుడు కదా! ‘వఝల కాళిదాసు’ మంచి పండితుడు!
      అలాగే ఒకానొకప్పుడు కొన్ని దశాబ్దాల కిందట కావచ్చు ‘గౌరీనాథశర్మో, శాస్త్రో’ ఓ ఇంట గొప్ప ‘ఒజ్జ’గా ప్రసిద్ధుడై ఉంటాడు. అందరూ ఆయనను ‘గౌరయ్యగారు’ అని పిలుస్తుండవచ్చు. ఆయన ప్రసిద్ధితో ఆ కుటుంబం వంశపారంపర్యంగా ‘గౌరావఝల వారు’గా మారుంటారు. ‘గౌరావఝల సీతారామ సోదర కవులు’ ప్రసిద్ధులు.
      ఏ ‘గంగావధానులు’ గారో ఒజ్జలైయుంటే వారి ప్రఖ్యాతి ఆ వంశీకులను ‘గంగావఝలవారు’గా మార్చి ఉంటుంది. అలాగే ఒజ్జలై ప్రసిద్ధి చెందిన ‘రంగనాథ సిద్ధాంతి’ పేర ‘రంగావఝల’ (నటుడు ‘సాక్షి’ రంగారావు ఇంటిపేరు ఇదే), ‘రామశాస్త్రి’ పేర ‘రామావఝల’, ఇలా ఆయా ఇంటిపేర్లు నామాంతరంగా ఏర్పడి అసలింటి పేర్లు కనుమరుగై ఉంటాయి.
రాచకొలువు నుంచి...
అసలైన మరో ‘చారిత్రక విశేషం’ తెలిపే ఇంటిపేర్లు కొన్ని ఉన్నాయి. ‘అక్కినేని, అక్కిరాజు; దేవినేని, దేవరాజు; మాచి(కి)నేని, మాచిరాజు; కేశినేని, కేశిరాజు; దేశినేని, దేశిరాజు; అల్లమనేని, అల్లమరాజు; అయ్యపు(రెడ్డి)నీడు, అయ్యలరాజు; యల్లమనీడు, యల్లంరాజు; కోటంనీడు, కోటంరాజు; గోపినీడు, గోపరాజు; పేరమనీని, పేరంరాజు; సోమానీడు, సోమరాజు; అబ్బనీడు, అబ్బరాజు; సూరపనీని, సూరపరాజు; బాపినీడు, బాపిరాజు; అప్పలనీడు, అప్పలరాజు; కాచినీడు, కాచిరాజు;’ మొదలైనవి కులాన్నీ, నిర్వహించిన పదవినీ తెలిపే పేర్లంటే ఆశ్చర్యమే కదూ!
      ఇప్పుడైతే ఈ ఇంటిపేర్లు ఉన్నవాళ్లలో ప్రసిద్ధులో, పండితులో ‘సరికొత్త కథనాలు’ వినిపించవచ్చు. కానీ, వీటి పుట్టుకకు నేపథ్యమైన చారిత్రక సత్యం ఒకటుందీ అనేది మర్చిపోరాదు. కొద్దిపాటి బేధముండే ఈ రెండు రకాల పేర్లు ఒకానొకప్పటి ‘రాజకీయ హోదా’ను తెలిపేవి. ఓ విషయం - ‘నాయకుడు- నాయుడు- నేడు, నీడు’(రేడుకు తుల్యార్థం)గా మారడం గమనించాలి.
      అనేక చిన్నిచిన్ని దుర్గాల రాజులు, వారి దగ్గర పెద్ద పదవుల్లో ఉండే వాళ్లూ, వీళ్లనీ ఆశ్రయించి తమకైన కార్యనిర్వహణం చేసేవాళ్లూ - పలురకాలుగా ఉండటం చారిత్రక విశేషం. మహారాజుకు ఓ కవి తన కావ్యాన్ని అంకితమిస్తే; ఆ రాజమార్గంలో కొందరు మంత్రులూ, దళపతులూ, ధనికులూ కూడా కవుల నుంచి కావ్యాలు అంకితం తీసుకున్న సందర్భాలు మన సారస్వత చరిత్రలో తక్కువగానేమీ లేవు. ఆ రీతిగా ఓ రాజు గారి కొలువులో ‘పాలన వ్యవహారం, సైనిక నియంత్రణ, ఆయుధాలు, వాహనాలు, కోట, కందకం నిర్మాణాలు’ తదితర రాజ్య సంబంధ వ్యవహారాలు చూసే పదవుల్లో కొందరుంటారు. వీరందరూ ‘యోధజాతి’ అన్నమాట! వీరంతా ‘నీడు, నేడు, రెడ్డి’ పదాంత్యులు. ‘అక్కినేని, మాచినేని, వీరమాచినేని’ ఇలా. ఆ రాజులకు ‘కుల పురోహితులుగా, నియోగులుగా’ కొలువుదీరిన వారూ కొందరుంటారు. వీరంతా ‘అక్కిరాజు, అయ్యలరాజు, అప్పలరాజు’ ఇలా ‘రాజు’ పదాంత్యులు. అయితే వీళ్లలో ‘రాజు’ పదాలంకృతులందరూ నియోగి, నందవరీక బ్రాహ్మణులైనవారే కాకపోవచ్చు. భట్రాజులలోనూ కొందరు ఇలాంటి ఇంటిపేరుండే వారున్నారు.
      అలాగే ‘భద్రిరాజు, బూదరాజు, పుల్లంరాజు’ వంటి ‘నియోగుల’ ఇంటిపేర్లలో ‘భద్రినీడు, బూదనీడు, పుల్లంనీడు’ ఇంటిపేర్లు కనిపించవు. కాకపోతే ఓ విశేషాన్ని వూహించవచ్చు. ‘గోనరాజు’ ఇంటిపేరు వారి పూర్వీకులూ, ‘బూదరాజు’ ఇంటిపేరు వారి పూర్వీకులూ ‘గోన-బుద్ధారెడ్డి’ వద్ద కొలువులో ‘నియోగించబడిన కార్యశీలురై’ ఉండవచ్చు. అలాగే, బుద్ధారెడ్డి కుమారులు కాచ, విఠలులు కదా! ఈ కాచ విభుడితో నియోగించబడిన కార్యనిపుణుల వంశం ‘కాచ(చి)రాజు’ వారై ఉండవచ్చు. విశ్వనాథనాయుడు నియమించిన వాళ్లు ‘విశ్వం(స్సం)రాజు’ వారయ్యుంటారు. ఇక ‘దేవిని, దేవరాజు’ పదాలు గమనిస్తే, బహుశా కాకతీయ మహాసామ్రాజ్ఞి రుద్రమదేవి వద్ద రాజకార్యాలు నిర్వహించిన యోధవర్గం ‘దేవినేని’ వంశంగానూ, ప్రతాపరుద్రదేవ మహారాజు వద్ద ‘నియోగులు’గా ఉన్నవారు ‘దేవరాజు’ ఇంటిపేరుగానూ అయ్యుండవచ్చు.
      మొత్తం మీద ‘నీడు, నీని, నేని’ పదాంత్యులు కమ్మవారిగానూ, ‘రాజు’ పదాంత్యులు (ఏ ఒక్కరో ఇద్దరో తప్ప) నియోగులుగానూ ప్రసిద్ధికి వచ్చిన మాట చారిత్రక సత్యం.
మంత్రులు, కవులు
ఇక ‘ప్రగడ, ప్రగ్గద, ప్రెగ్గడ’ పదాలున్నవారు పూర్తిగా రాజుల వద్ద అమాత్యాది పదవుల్లో నియోజితులైన వాళ్లన్నది సుస్పష్టం. వీళ్లు రాజనీతిశాస్త్ర నిపుణులు, కవులు, పండితులు అయ్యింటారు. మనకు మొట్టమొదట వినిపించే ప్రెగ్గడ ‘ఎఱ్ఱాప్రెగ్గడ’. మహాభారతం అరణ్య పర్వ శేషాన్వయం, హరివంశం, నృసింహపురాణం రచించిన కవిత్రయ కవి. విచిత్రమేంటంటే ఈయన పేరే ఇంటిపేరుగా కలవారు నేటికీ ఉండటం, ‘ఎర్రాప్రెగ్గడ రామకృష్ణ’ మంచి కవి, వక్త, విమర్శక వ్యాసకర్త కదా! కొంచెం తేడాలో ‘ఎల్లాప్రగడ’ వారూ నేడు కనిపిస్తారు.
      కేశాప్రగ్గడ, రామాప్రగ్గడ, పోలాప్రగ్గడ, వెట్రిప్రగ్గడ, మంత్రిప్రగ్గడ వంటి ఇంటిపేర్లు తెలుగునాట సుప్రసిద్ధం. గమనిస్తే ‘కేశిరాజు, కేశావఝల, కేశాప్రగ్గడ’ ఇంటివారు ఒకే రాచకొలువులోని వాళ్లయి ఉండవచ్చు అనిపిస్తుంది. అలాగే ‘రామినేని, రామినీడు, రామావఝల, రామాప్రగ్గడ’ తదితర ఇంటిపేర్ల వారంతా ఒక రాజు కొలువులోని వారే కావచ్చు.
      ‘పోలాప్రగ్గడ’ బహుశా ‘ప్రోలాప్రగ్గడ’ కావచ్చేమో! ఎందుకంటే ‘ప్రోలరాజు’ - కాకతి వంశ స్థాపకుడు. ఇతని కొలువులో ‘నియోగులు’గానో, అమాత్య బృందంలోనో ఉన్న వాళ్ల వంశమే ‘ప్రోలాప్రగడ’ అయ్యుండే అవకాశం అధికం. ఏ రాజు కొలువులోనో ఉన్న ‘మంత్రిబృందం’లో శ్రేష్ఠుడి వంశమే ‘మంత్రిప్రగ్గడ’ వారై ఉంటారు. ‘మంత్రిప్రగ్గడ భుజంగరావు’ మంచి రచయిత. ‘మల్లాప్రగ్గడ శ్రీమన్నారాయణమూర్తి’ గొప్ప పండితులు, వక్త, సాహిత్య విమర్శకులు. ‘మానాప్రగ్గడ శేషసాయి’ గొప్ప విద్వాంసులు!
      సారాంశం ఏంటంటే ‘రాజులను, వారి మంత్రులను, సేనాని, దండనాథ, వణిక్‌ ప్రముఖులను’ సేవించి పలు హోదాల్లో ఉన్నవారు - వారు సేవించిన వారి పేరిట ‘ఇంటిపేరు’ కలవారిగా ఏర్పడుతూ - ఇందులోనూ వర్గభేదం - అంటే జాతిభేదం (కమ్మలు, వెలమలు, రెడ్లు, నియోగులు అని) తెలిపేలా ‘అక్కినేని, అక్కిరాజు; సోమానీని - సోమరాజు’ ఇలా నిలిచిపోయారని తెలుసుకోవడం.
నన్నయ కన్నడిగుడా!
ఇంకొక విచిత్రమైన పదం ఉంది. అది కొన్ని ఇంటిపేర్లకో, అసలైన నామధేయాలకో చివర అలంకృతమవుతూ ఉంటుంది. అదే ‘భట్టు’. ఇది ‘భట్టారకుడు’ నుంచి వచ్చిందే. అలాగే ‘భట్టరు, భట్టుల, భట్ల’ పదాలు కూడా. ‘భట్టకేతుడు, కుమారిలభట్టు, కమలాకరభట్టు, భట్టనారాయణుడు, డిండిమభట్టు, నన్నయభట్టు, నారాయణభట్టు, కుల్లూకభట్టు’ పేర్లు చాలా ప్రసిద్ధమైనవి.
      వీళ్లలోనూ ‘నన్నయభట్టు, నారాయణభట్టు’లు మనకు సుపరిచితులు. మొట్టమొదట ఓ కథన రూపంలో తెలుగు పద్యాన్ని హృద్యంగా తాళపత్రాలలో సంపుటీకరించి ‘ఆదికవి’ అయిన నన్నయభట్టు మహాభారతాన్ని తెలుగులో అందించినవాడు. ఆయన ‘నన్నయ భట్టారకుడు’ అయితే ‘నన్నయభట్టు. నన్నిభట్టు’గా ప్రసిద్ధుడు. ఆ మహాకవి ద్వారానే మనకు పరిచయమైనవాడు అష్ట భాషా విశారదుడైన నారాయణభట్టు.
      వీళ్లందరికీ ముందు బహుశా అగ్నిదేవుడే తొలి ‘భట్టు’ కావచ్చేమో. ఎందుకంటే నన్నయభట్టు తన మహాభారతంలో ఒకచోట ఈ అగ్నిని ‘అగ్నిభట్టారకు నర్చించి’ అనిపిస్తాడు కనుక. ఇంకా విచిత్రమేంటంటే ‘నన్నయభట్టు’ను కన్నడిగుడు - కర్ణాటక ప్రాంతంవాడు అని నిర్ధరించిన ‘సాహిత్య పరిశోధకులూ’ ఉన్నారు. మనవాళ్లేమో కన్నడ కవిత్రయంలో ‘పంపడు, రన్నడు’ మన తెలంగాణ వారే - తెలుగువారే - కన్నడ సీమకు వలసవెళ్లిన వారు’ అంటారు. మనవాళ్లే కొందరు మన తెలుగు నన్నయని కన్నడిగుణ్ని చేసేస్తారు. కారణమేంటంటే - ‘భట్టు’ వాలపదం నేటికీ కన్నడదేశంలో విరివిగా వినిపిస్తూండటమే! నరసింహభట్‌, వేంకటేశభట్‌, ప్రహ్లాదభట్‌ పదాలు నేటికీ కనిపిస్తుంటాయక్కడ. వీళ్లలో పండితులు, కవులు, వ్యాపారులు, వేదాంతులు, భక్తులూ కనిపిస్తారు కూడా. ఆ కారణంతోనే ‘నన్నయభట్‌’ కన్నడిగుడేనంటారు. ఆయన భారతంలో ‘కెలము’ వంటి ఒకటి రెండు కన్నడ పదాలు అందుకే వచ్చాయనడం కొసమెరుపు.
      వైష్ణవ సంప్రదాయంలో ఈ ‘భట్టు’ పదమే ‘భట్టరు’గా మారింది. ‘రంగభట్టరు, చిక్కభట్టరు’ వంటివి. ఇవి కన్నడ పదాలనేది సుస్పష్టం. ‘భట్టరు’ అంటే కన్నడంలో ‘భట్టుగారు’ అని. కన్నడిగులు గౌరవ సంబోధనలోనే ఈ ‘భట్టరు’ పదాన్ని వాడతారు. దాన్నే కొందరు వైష్ణవులు - వీరు ద్రావిడులూ కావచ్చు, మైసూరీయులూ కావచ్చు. పేరు చివరనే ‘భట్టరు’ పెట్టుకోవడం గమనార్హం.
      అలా ‘భట్టు-భట్టులు-భట్లు’ మారిన క్రమంలో ప్రసిద్ధులైన ‘భట్టుల’ పేరునే ఇంటిపేరుగా మలచుకొనే సంప్రదాయం మన తెలుగు వాళ్లదిగా గుర్తించవచ్చు. శ్రీనాథుడు కూడా తనను ‘శ్రీనాథభట్ట సుకవి’ అనే చెప్పుకున్నాడు. హరికథా పితామహుడు, బహుభాషావేత్త, అవధాని, రచయిత, కవి, పండితుడు, సరసశృంగార విలాసుడు - నారాయణ దాసు గారింటి పేర్లు రెండు. మొదటిది గ్రామనామం ‘అజ్జాడ’ కాగా; రెండవది ‘ఆదిభట్ల’.
      అలాగే జన్నాభట్ల, త్రైపురాదిభట్ల, మల్లుభట్ల, సింగరభట్ల, కాశీభట్ల లాంటి ఇంటిపేర్లున్నాయి. ఇక (తాతంభట్టుల) తాతాభట్ల బహుశా తాతంభట్టువారి పేరే కావచ్చు. వ్యవహారంలో ‘తాతా-తోతాగా’ పరిణమించిన రూపమూ అయ్యుండవచ్చు. తాతంభట్టు ప్రసిద్ధ ఛందోగ్రంథకర్త. ‘లక్షణ చింతామణి’ ఆయన రచన. ప్రాచీన ఖగోళ గణిత శాస్త్రవేత్త ‘ఆర్యభట- ఆర్యభట్టు’ అయ్యుంటాడు. తరువాతి రూపాంతరీకరణం ‘ఆర్యభట్ట - భట’ పేర్లు. వీరివీరి వంశపరంపరలో వచ్చినవారు ‘మల్లుభట్ల గోపాలకృష్ణ; మహిమభట్టు పేరిశాస్త్రి’ ఇలా ఆ ప్రసిద్ధుల పేర్లు ఇంటిపేర్లుగా మిగిలిపోయాయి.
ఆ ఒక్కడు
ఒక్కోసారి కొన్ని వంశాల్లో ఎవరో ఒకరు ఎందుకో ప్రసిద్ధుడవుతాడు. ఆ ఇంటివారు ఆ ప్రసిద్ధుడి పేరునే ఇంటిపేరుగా స్థిరీకరించుకుంటారు. వెనకటి ‘వఝల, ప్రగడ, భట్టు’ అలాంటివే. తర్వాత ఆ సంప్రదాయం తదుపరి రెడ్డికుల రాజుల్లో విరివిగా కనిపిస్తుంది.
      ‘పామిరెడ్డిగారి, బైరెడ్డిగారి, అల్లాడరెడ్డిగారి, సోమిరెడ్డి, నల్లపురెడ్డి, సన్నపరెడ్డి (సన్నపనేని కూడా), జీరెడ్డి, చిన్నపరెడ్డి, నాగిరెడ్డి, వేమారెడ్డి, కశిరెడ్డి, బసివిరెడ్డి, సింగిరెడ్డి, ఆదిరెడ్డి, (ఆదిరాజు కూడా) సంగిరెడ్డి, (సంగిశెట్టి కూడా), బోరెడ్డి, బొమ్మిరెడ్డి, పెద్దిరెడ్డి’ ఇలా ఈ ఇంటి పేర్లతో చాలామంది ఉన్నారు. వీటిలోనూ ‘సన్నప్ప’ అనే ఓ ఘనుడి కొలువు చేసిన రెడ్డిగారు ‘సన్నపరెడ్డి’ కాగా; కమ్మలు లేదా వెలమలు ‘సన్నపనేని’గా అయ్యారు.
      అలాగే ఆదినారాయణ వర్మనో, దేవునినో కొలిచిన రెడ్డిగారు ‘ఆదిరెడ్డి’ వారు కాగా; అమాత్యం నెరపినవారు ‘ఆదిరాజు’లయ్యారు. ఆదిరాజు వీరభద్రరావు తెలుగు సాహిత్యవేత్తలలో ఒకరు. అలాగే సంగభూపాలుని కొలువులో ఉన్న రెడ్డిగారు ‘సంగిరెడ్డి’ కాగా; వాణిజ్యశాఖ నిర్వహించిన వాళ్లు ‘సంగిశెట్టి’వారుగా ఏర్పడ్డారు.
      ఇలా చాలా చాలా ఇంటిపేర్లు చిత్రమైన చరిత్రను చెబుతుంటాయి. మనమే పరిశీలించి పరిశోధించి గ్రహించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం