మా పలుకే ‘పలవా కని’!
 

  • 582 Views
  • 4Likes
  • Like
  • Article Share

ఆస్ట్రేలియా అంటే ఆంగ్లమే గుర్తుకువస్తుంది. పాశ్చాత్యులని పోలిన వేషభాషలే స్ఫురిస్తాయి. కానీ ఒకప్పటి సంస్కృతి ఇది కాదు! 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఆస్ట్రేలియాలో ఆదిమ మానవుల సంచారం ఉండేది. అక్కడి నేలనీ, నీటినీ నమ్ముకుని వేర్వేరు తెగలు నివసించేవి. వారిలో ప్రతి తెగకీ ఓ భిన్నమైన జీవనవిధానం ఉండేది. 18వ శతాబ్దంలో ఎప్పుడైతే ఐరోపావాసులు ఆస్ట్రేలియా మీద అడుగుపెట్టారో... అప్పుడే స్థానిక జాతుల పతనం మొదలైంది.
       ఆస్ట్రేలియాకి వలస వచ్చిన పాశ్చాత్యులు, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు వేలమంది స్థానికులను హతమార్చారు. అలా దక్కించుకున్న అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకునేందుకు వారి సంస్కృతిని ధ్వంసం చేశారు. ఫలితం! ఒకప్పుడు 330 భాషలు వినిపించే ఖండంలో సగానికి పైగా అంతరించిపోయాయి. మిగిలిన వాటిలో ఓ పదమూడు తప్ప మిగతావి కూడా అంతరించే దశకి చేరువలో ఉన్నాయి. అదృష్టం ఏంటంటే... ఇప్పుడు ఆ మిగిలిన భాషలనన్నా కాపాడుకోవాలన్న తపన పెరుగుతోంది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేర్వేరు స్థాయులలో వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిలో నేషనల్‌ ఇండీజీనియస్‌ టెలివిజన్‌ (ఎన్‌ఐ టీవీ) ఒకటి. ఈ సంస్థ బుల్లితెర ద్వారా ఆదిమ జాతుల సంస్కృతిని ప్రచారం చేస్తోంది. ఈ ఎన్‌ఐ టీవీ చేస్తున్న ఓ కార్యక్రమం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
పిల్లల కోసం...
ఎన్‌ఐ టీవీలో ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ పెద్దలకి సంబంధించినవే! కానీ ఆదిమ సంస్కృతిని కాపాడుకోవాలంటే... పిల్లల్లో కూడా ఆసక్తిని కలిగించాలి కదా! అందుకని ఆదిమజాతి పిల్లలే పాత్రలుగా ఓ కార్టూన్‌ ధారావాహికను ఎందుకు రూపొందించకూడదు అన్న ఆలోచన వచ్చింది నెడ్‌ లాండర్‌ అనే నటుడికి. ఫలితంగా ‘ద ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌’ అనే సంస్థ సహకారంతో లిi్మ్మః’ రి ఖీ తీi్ణ ద్యి) అనే 13 భాగాల బొమ్మల ధారావాహికను రూపొందించారు. ఇందులో సరదా సరదాగా సాగిపోయే కథతో పాటు ఆదిమజాతి ప్రజల సంస్కృతినీ పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ ధారావాహికను కేవలం బుల్లితెర మీదే కాకుండా, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో కూడా ప్రదర్శించే ఉద్దేశం కూడా ఉందట.
మరణించిన భాషకు ఊపిరి
Little J & Big Cuz ధారావాహికను ఆంగ్లంతో పాటుగా యవురు, పింటిన్‌జర్రా, విరద్‌జురి, పలవా కని లాంటి ఆదిమభాషల్లోకి కూడా అనువదించే ప్రయత్నాలు మొదలయ్యాయి. వాటిలో ‘పలవా కని’ అనే భాష గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాకి అనుబంధంగా ఉండే టాస్మేనియా అనే ద్వీపంలో ఒకప్పుడు పన్నెండు భాషలు వినిపించేవి. కానీ ఇరవయ్యో శతాబ్దానికి అవన్నీ కనుమరుగైపోయాయి. టెరెసా సెయింటీ, జెన్నీ లాంగే అనే ఇద్దరు భాషాభిమానులకు, ఆ భాషలను ఎందుకు పునర్నిర్మించకూడదు అన్న ఆలోచన వచ్చింది. 1999లో వాళ్లు ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతరించిపోయిన టాస్మేనియా భాషలన్నింటినీ కలగలిపి ‘పలవా కని’ పేరుతో ఒకటే భాషను రూపొందించే ప్రయత్నం సాగించారు.
       ఎలాంటి లిఖిత సాహిత్యం లేని ఆదిమభాషలను పునర్నిర్మించడం.. అదీ ఒకటే భాషగా తీసుకురావడం అంత తేలిక కాదు కదా! టాస్మేనియా భాషల గురించి ఆనాటి బ్రిటిష్‌ అధికారులు, నావికులు, చరిత్రకారులు వదిలివెళ్లిన రాతప్రతులే కొత్త భాషను రూపొందించేందుకు ఆధారంగా నిలిచాయి. వాటితోపాటుగా ఫేనీ కోచ్రేన్‌ స్మిత్‌ అనే గాయని పాడిన పాటలు కూడా ‘పలవా కని’ని రూపొందించేందుకు సాయపడ్డాయి. అలా ఒకప్పటి టాస్మేనియా భాషలన్నింటి సారంతో కొత్త ‘పలవా కని’ని సృష్టించారు. ఇది  ఓ కలగాపులగపు భాష కావడంతో అందులో లోటుపాట్లు లేకపోలేదు. అప్పట్లో భాషని ఉచ్ఛరించే తీరు తెలియదు కాబట్టి ఇది అసంపూర్ణమే! కానీ టాస్మేనియా మూలాలు కలిగిన వ్యక్తులు తమకంటూ కొన్ని భాషలు ఉండేవనీ, వాటికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశామనీ చెప్పుకొనేందుకూ... తమ సంస్కృతిని గర్వంగా చాటుకునేందుకు ‘పలవా కని’ ఉపయోగపడుతోంది. లిi్మ్మః’ రి ఖీ తీi్ణ ద్యి) ధారావాహిక దీనికి మరింత ప్రచారం తీసుకువస్తోంది.

జాతీయ స్మృతి  
టాస్మేనియా ఆదిమభాషని అనర్గళంగా మాట్లాడగలిగిన ఆఖరు వ్యక్తి ఫేనీ కోచ్రేన్‌ స్మిత్‌ అని భావిస్తారు. ఆమె తన జీవిత చరమాంకంలో తనకు వచ్చిన జానపద గేయాలను రికార్డు చేయాలనుకున్నారు. ఇది 1903 నాటి మాట! అప్పట్లో ఫోనోగ్రామ్‌ అనే పరికరం ద్వారా, మైనం అద్దిన కాగితాల మీద శబ్దాలను నమోదు చేసేవారు. అలా అయిదు రికార్డుల మీద జానపద గేయాలని నమోదు చేశారు ఫేనీ కోచ్రేన్‌. 1905లో ఆమె మరణంతో టాస్మేనియా భాషలు ఇక వినిపించకుండా పోయాయి. వాటికి సంబంధించి, ఫేనీ కోచ్రేన్‌ నమోదు చేసిన గేయాలే మనకు వినిపించే ఆఖరు శబ్దాలు! దాంతో యునెస్కో వాటిని ‘ఆస్ట్రేలియా జాతీయ స్మృతి’గా పేర్కొంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం