టీవీతో జాగ్రత్త!
 

  • 335 Views
  • 0Likes
  • Like
  • Article Share

పిల్లలు భాష నేర్చుకోవడంలో ఇంట్లోని పెద్దవాళ్ల పాత్ర చెప్పేదేముంది? చిన్నారుల తో ఆడుతూ పాడుతూ మనం మాట్లాడించే మాటలే వారి భాషకి పునాదిగా నిలుస్తాయి. ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఈ ప్రక్రియలో టీవీ పాత్ర ఏంటి? అన్న అనుమానం వచ్చింది కొంతమంది అమెరికా పరిశోధకులకి. వచ్చిందే తడవుగా ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లలతో వారి తల్లిదండ్రులు జరిపే సంభాషణలను గమనించారు.
      చిన్నారులతో మాట్లాడేటప్పుడు... వెనకాలే టీవీ మోగుతుంటే పరిస్థితేంటో వీరు గుర్తించారు. టీవీ నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో చాలా తక్కువగా మాట్లాడుతున్నట్లు తేలింది. ఆ సమయంలో వాళ్ల వాక్యనిర్మాణం కూడా సాధారణంగా ఉంది. ఇక కొత్త పదాలైతే నామమాత్రంగానే దొర్లాయి. పెద్దవాళ్ల మాటతీరు ఇలాగే కొనసాగితే చిన్నారుల భాషా నైపుణ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది పరిశోధకుల హెచ్చరిక! తల్లిదండ్రులు 24 గంటలూ పిల్లలతోనే గడపడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వారితో గడిపే కాస్త సమయంలో అయినా టీవీ పెట్టకుండా జాగ్రత్తపడమంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా పెద్దవాళ్లకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తూ, పిల్లలతో కాలం గడపడం మరింత అనర్థదాయకం అని చెబుతున్నారు. పిల్లలు, పెద్దల సంభాషణ మధ్య టీవీతో పాటు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు కూడా పానకంలో పుడకలా పనిచేస్తున్నాయా అని తేలేందుకు మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందట.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం