ఎవరి మాటలు వాళ్లవి!

  • 406 Views
  • 0Likes
  • Like
  • Article Share

భాషలో స్త్రీలింగం, పురుషలింగం ఉంటాయని తెలుసు. కానీ కొన్ని పదాలు స్త్రీలు ఎక్కువగా వాడతారనీ, మరికొన్ని పదాలు మగవారి నోట వెంట ఎక్కువగా వినిపిస్తాయనీ నమ్మగలమా! అమెరికాకు చెందిన స్టోనీ బ్రూక్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు మాత్రం ఇది నమ్మితీరాల్సిన విషయమే అంటున్నారు. అందుకు వారు సాగించిన పరిశోధననే ఉదాహరణగా చూపిస్తున్నారు.
      భాష వాడుకలో లింగభేదం గురించి నిర్థరించేందుకు ఆ పరిశోధకులతో పాటు పెన్సిల్వేనియా, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయాల్లోని మనస్తత్వవేత్తలు, కంప్యూటర్‌ నిపుణులతో కలిసి ఓ ప్రయోగానికి ఉపక్రమించారు. అందుకోసం ఫేస్‌బుక్‌ని ఉపయోగించే 68 వేల మంది అంగీకారంతో వారి సందేశాలని విశ్లేషించారు. ఇలా వందలు, వేలు కాదు... దాదాపు కోటి సందేశాల్లోని పదాలు పునరావృతం అవుతున్న తీరుని గమనించారు.
ఇటు అనుబంధం అటు పోరాటం
ఆడవారు తమ సందేశాలలో ఎక్కువగా బంధాలు, అనుబంధాలను ప్రస్తావించారు. అద్భుతం, సంతోషం, పుట్టినరోజు, కృతజ్ఞతలు, పిల్లలు... లాంటి పదాలు వీరి సందేశాల్లో ఎక్కువగా కనిపించాయి. అలాగని కేవలం ఉద్వేగాలు మాత్రమే వారి సందేశాల్లో ప్రతిబింబించలేదు. ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చే పదాలు కూడా మెండుగా ఉన్నాయట. ఇక మగవారి విషయానికి వస్తే వృత్తి గురించీ, వస్తువుల గురించీ ఎక్కువగా చర్చించడం కనిపించింది. స్వేచ్ఛ, గెలుపు, పోరాటం, శత్రువు, విముక్తి... లాంటి పదాలు వారి సందేశాలలో తరచూ పునరావృతం అయ్యాయి. మొత్తంగా ఆడవారి వ్యాకరణం అంతా కరుణనీ, మర్యాదనీ సూచించే పదాలతో నిండిపోతే మగవారి వ్యాకరణం వారిలోని దూకుడుని ప్రతిఫలించింది.
      ఈ పరిశోధన ద్వారా స్త్రీలు వేటికి ప్రాధాన్యతని ఇస్తారు? మగవారి తీరు ఎలా ఉంటుంది? అన్న విషయాలు మరోసారి రుజువయ్యాయి. ఈ పరిశోధన ఆధారంగా చేపట్టిన మరో ప్రయోగంలో.... పదాలను బట్టి, సందేశం పంపిన వ్యక్తి ఆడామగా అన్న విషయాన్ని కూడా 90 శాతం సందర్భాలలో నిర్ధరించగలిగారట!


వెనక్కి ...

మీ అభిప్రాయం