విస్తృత వారసత్వ దీపాలు

  • 895 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సన్నిధానం నరసింహశర్మ

  • హైదరాబాదు
  • 9292055531
సన్నిధానం నరసింహశర్మ

‘నిచ్చెన మెట్ల కులవ్యవస్థను అర్థం చేసుకుంటేనే భారతదేశం అర్థం అవుతుంది’ అన్న అంబేడ్కరు మాటలు అక్షర సత్యాలు. ఆధిక్య భావనలు మానవత్వాన్నే గుచ్చుతాయి. ప్రశ్నలను లేవదీస్తాయి. కుల సంస్కృతులు సంపూర్ణ భారత చరిత్ర అధ్యయనానికీ, రచనకీ దారి దీపాలవుతాయి. ఆ దారిదీపాల దీపావళి పండగ ఒక్కరోజు కాదు, మూడు రోజుల కనుల పండగైంది, హైదరాబాదు రవీంద్రభారతిలో, 2017 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో. జానపద సాహిత్య మౌలిక పరిశోధకుడు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు తెలంగాణ లోతట్టు జనపదాల్లో, గిరిజన ప్రాంతాల్లో కాళ్లరిగేలా తిరిగారు. కాలగతిలో నిర్లక్ష్యానికి గురైన ఉపకులాల బతుకుల, కళల ప్రతిబింబాలను సేకరించారు. తన నాలుగు దశాబ్దాల శ్రామిక శోధనను ఈ మూడు రోజుల్లో ప్రదర్శించారు.
      అది వైయక్తిక- ప్రజా ప్రదర్శన. హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని దళిత ఆదివాసీ అధ్యయన అనువాద కేంద్రం నిర్వహించిన ప్రదర్శన. అట్టడుగు ఉపకులాల నుంచి ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సేకరించిన సామాజిక సాంస్కృతిక కళాఖండాల ప్రదర్శనమది! వందల ఏళ్ల వారసత్వ సంపద- ఇందులో తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు, గంటాలు, రాగిరేకులు, కంచుముద్రల వస్తువులు, చరిత్రాత్మకమైన పొడుగుపాటి కాగితపు చుట్టలు, నిషేధిత గ్రంథాల సాహిత్య సంచయం, రంగులతో కొన్ని బొమ్మలతో కాగితపు చుట్టలు, గుజిలీ ప్రచురణలు, దళిత ఉపకులాల అభిలేఖలు, నకాషీ చిత్రకళాఖండాలు, బొమ్మలు, కోయ గిరిజనుల పడిగెలు, ఇన్నింటినీ ఒక్కచోట ఒక్కసారిగా చూసేవేళల్లో ఈ నిర్మాతలనా మనం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేశాం అని అబద్ధాలను ప్రదర్శించలేని మన కళ్లు చెమరుస్తాయి. కొలనుపాక మాదిగ మఠానికి చెందిన నాగమణి, తిరుమలగిరివాసి మెట్టు వెంకట నారాయణ; హైదరాబాదుకు చెందిన కె.సి.గుప్త; అద్దంకి వాసి జ్యోతి చంద్రమౌళి, కాకిపడగల వారు, గుర్రంవారు, నల్లగొండకు చెందిన మందహెచ్చుల వారు, నందికొల్లవారు, విజయనగరానికి చెందిన బైకాని వారు.. ఇలా ఎంతోమంది నుంచి సేకరించిన కళారూపాలివి.
నిధి నిక్షేపాలు
తాళపత్రాల్లో పొడుగువీ, పొట్టివీ ఉన్నాయి. కాళిదాసు రచనగా ప్రచారంలో ఉన్న ‘నవోదయం’ వెలుగుచూసింది. దళిత వైద్య మంత్ర తంత్ర శాస్త్ర తాళపత్రాలున్నాయి. నాలుగు రకాల నాలుగు గంటాలున్నాయి. ఒక గంటానికి పైభాగం కొడవలి వంపు ఉంది. తాటాకును శుభ్రపరచడానికి, రాయడానికి వీలుగా ఆ గంటం ఉంది. కాళిదాసుకు వ్యాఖ్యాత మల్లినాథసూరి వాడిన గంటం ఇలాగే ఉండేదని ఆచార్య బిరుదురాజు రామరాజు చెప్పేవారట. 
     రాగిరేకు పట్టుకున్న చెంచు వ్యక్తి రంగుల చిత్రం, ఒగ్గువారి రాగిశాసనం, విశ్వబ్రాహ్మణుల ఆధారిత వర్గమైన పనసవారి కంచు శాసనం రేకు వంటివి ఈ ప్రదర్శనలో ఉన్నాయి. రాజులకీ చక్రవర్తులకీ చెందినవి కాకుండా ఉపకులాల హక్కుల లాంటివీ, ప్రజలు సంక్రమింపజేసిన అధికారాలు, నిర్ణయాలు, ఉనికికి చెందినవీ ఇందులో ఉండటం విశేషం. నగిషీల రాగిరేకుల మీద ఇన్ని వరుసలు ఇంత అందంగా ఎలా చెక్కారా అని ఆశ్చర్యపోతాం. పూజాస్థానాల్లో దేవతల బొమ్మలు పెట్టుకునే సింహాసనాన్ని పోలిన- గొల్లపూజారుల సింహాసనంలోని కంచులోహపు బొమ్మ పనితనపు అందాన్ని తెలిపింది. ఏళ్లూ పూళ్లూ గడచినా అందం చెదరని దస్తూరీతో పొడుగాటి కాగితపు చుట్టలు, రంగులు పొదిగిన కాగితపు చుట్టల ప్రదర్శన ప్రధానాకర్షణ. గురు సంప్రదాయ మార్గంలో కులాల ఉపకులాల మఠాల్లో దొరికేవి ఇవి. ఏ కులానికి ఏది ఉపకులం, దాని పుట్టు పూర్వోత్తరాల గుట్టుమట్లు ఈ కాగితాల చుట్టల్లో దాక్కొని ఉన్నాయి. రెండొందల ఏళ్ల చరిత్ర సాక్ష్యాలివి. కలల కళల వెలుగులివి.
కొత్త విశేషాలు
కులాల అధ్యయన ఆంగ్ల పొత్తాల్లో ఎడ్గార్‌ థర్‌స్టన్‌ రాసిన ‘కేస్ట్స్‌ అండ్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ సదరన్‌ ఇండియా’ ఓ నిఘంటు సమాన గ్రంథం. దానిలో కూడా చేరని ‘లంబాడీ మాదిగ’ వంటి రెండుమూడు కొత్త ఉపకులాల ప్రసక్తులు ఈ చుట్టల్లో ఉండటం ఆసక్తికరం. కొలనుపాక కుమ్మరి మఠం చుట్టల్లో ఉపకులాల వారు మర్యాదలకు ఇవ్వాల్సిన రుసుము వైనాలున్నాయి. కొలనుపాకకే చెందిన మేదర మఠం చుట్టలూ ఉన్నాయి. మాదిగ ముద్రతో ఉన్న విశ్వపురాణం కాగితం చుట్ట చూస్తుంటే దానిలోని భాష, రాత విస్మయపరుస్తాయి. సమాంతర సంస్కృతిలో కులాల ఉపకులాల అధికారాలు, భూముల ప్రదానాలు, కుటుంబాల విశేషాలు, పెద్దల నిర్ణయాలు లాంటివెన్నో ఈ కాగితాల చుట్టల్లో చూస్తాం. మొత్తమ్మీద ఇది చరిత్ర ‘నికరపత్ర’ ప్రదర్శనం. సాహిత్యం సాంస్కృతికం, రాజకీయాది విభాగాలుగా విభజితమైన పదిహేను వేల కరపత్రాల ప్రదర్శనం. ఈ కరపత్రాలు ఇరవైవేల నుంచి ముప్పయివేల పుటల విస్తృతి ఉన్నవి. కొన్ని కరపత్రాల్లో సంబంధిత రచయితల పేర్లు కూడా ఉండటం విశేషం. మూడు గజాల నుంచి పదమూడు గజాల వరకూ ఉండే పటం బొమ్మలు చెప్పే కథలూ ఆకట్టుకుంటాయి. 
      సామాన్య జనులు ఒకనాడు నెత్తిమీద పెట్టుకున్న గుజిలీ ప్రతుల్లో వీరరాజయ్య కథ, అణాగ్రంథమాల పుస్తకాలు, యక్షగానాలు కొన్ని ఈ ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. చలనచిత్రాలకు మూలకందాలైన తోలుబొమ్మలు చూస్తే అప్పటి రంగులూ సొబగులూ భలే ఉన్నాయనిపిస్తుంది. అలాగే, స్వాతంత్య్ర సమర కాలంలోనూ, నిజాం పరిపాలనా కాలంలోనూ దొరతనాల నిషేధానికి గురైన సాహిత్యం మీద సాధికార పరిశోధనా గ్రంథాన్ని నిర్మించారు తిరుమలరావు. ఇందుకోసం ఆయన న్యూదిల్లీ, చెన్నై, పాండిచ్చేరి లాంటి తావుల్లో ఎన్నో అభిలేఖాగారాల్నీ, పొత్తపుగుడుల్నీ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభిలేఖాగారాన్నీ, సచివాలయ అభిలేఖా విభాగాన్నీ తెరిచారు. నిషేధిత సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలూ, నాటి ప్రభుత్వ ఉత్తర్వులు కొన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆంగ్ల దొరతనం నిషేధించిన 13 నాటకాల ప్రతుల్ని, ఆంధ్ర ప్రాంత గ్రంథాల్నీ ప్రదర్శించారు.
అన్నీ అపురూపమైనవే...
ఈ ప్రదర్శనలో వీణలా ఉన్న ఓ కడ్డీ వాయిద్యం ఆకట్టుకుంది. ఇది మాలల ఉపకులమైన మిత్తుల అయ్యవారు వాయించేది. దీనితో రెండు రామాయణాలు పాడతారట. నకాషీ చిత్రకళాఖండాల ప్రదర్శనలో ఓ మేదర దేవతగుడిలో దొరికిన కళాఖండికలు నిర్మాణ సౌందర్యానికి మచ్చుతునకలుగా సాక్షాత్కరించాయి. నకాషీ గుర్రం మెడలో గంటలతో వివిధ అలంకరణలతో పరిగెత్తడమే తరువాయి అన్నంత చలనాత్మకంగా ఉంది. గుంజల గొండి లిపి వాచక పుస్తకాలు పరిశోధనా శ్రమఫలాలుగా నిలిచాయి. కాటంరాజు కథా చక్ర వీరగాథల చిత్రాలు చూస్తుంటే మౌఖిక లేఖనాలు సహజీవన పరిమళం అద్దుకున్నాయనిపిస్తుంది. 
      తెలంగాణ ప్రాంతంలోని వందల ఏళ్ల నాటి సంస్కృతికి ఈ ప్రదర్శన అద్దంపట్టిందనేది ‘అస్మిత’ సంస్థ బాధ్యురాలు సుశీతారు అభిప్రాయం. రచయితలు, ప్రదర్శన కార్యకర్తలైన డా।। మనోజ, డా।। వి.కె.ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘సమకాలీన సామాజిక సాంస్కృతిక అధ్యయనాలకు ఉపకులాల కళాఖండ వస్తు ప్రదర్శనం దోహదం చేస్తుంది. ఈ అధ్యయనం లేకపోతే పరిశోధక కార్యం అసమగ్రమవుతుందన్నది ఆచార్య తిరుమలరావు విశ్వాసం’ అని చెప్పారు. అయితే, ఉపకులాల సంస్కృతులు సముద్రమంత ఉంటే చెరువు పరిధిలోని విశేషాలే మనకు మిగిలాయని తిరుమలరావు ఆవేదన వ్యక్తంచేశారు. 
      వందలాది సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతమైన విలువైన వారసత్వ సంపద గుప్తగానంగా ఉండిపోవడం బాధాకరమే. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా అట్టడుగు ఉపకులాల సంస్కృతిని పాడుకుందాం... అంతకుమించి అందరం కలసి కాపాడుకుందాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం