బహుముఖ ప్రజ్ఞాజ్యోతి

  • 383 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పసుపులేటి ఆనంద్‌

  • విశాఖపట్నం
  • 8008574768
పసుపులేటి ఆనంద్‌

కాన్వాసు మీద అపురూప వర్ణచిత్రాలను సృష్టించి... నాటక రచయిత, దర్శకుడిగానూ రాణించిన వ్యక్తి అబ్బూరి గోపాలకృష్ణ. అనారోగ్యంతో బాధపడుతూ జనవరి 31న విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన తండ్రి అబ్బూరి రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి గ్రంథాలయాధికారి. మార్చి 2, 1936న గోపాలకృష్ణ జన్మించారు. విజయనగరంలో ఆంట్యాకుల పైడిరాజు దగ్గర చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నారు. గురువు సూచనలతో హైదరాబాదు ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో సీటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. యాజమాన్యం నిరాకరిస్తే, నేరుగా అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు లేఖ రాశారు. బూర్గుల స్పందించి అబ్బూరిని పిలిపించారు. ఆయన చిత్రాలను చూసి ముచ్చటపడి, ఒకదాన్ని తీసుకున్నారు. సీటు ఇవ్వమని కళాశాలకు సిఫార్సు చేశారు. అలా అబ్బూరి చిత్రలేఖనం విద్య పూర్తిచేశారు. తర్వాత గుంటూరు జిల్లాలో వారసత్వంగా వచ్చిన మున్సబు ఉద్యోగంలో చేరారు. తర్వాత దాన్ని వదిలేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖలో అధ్యాపకుడిగా చేరారు. ఆ సమయంలోనే ఆయన రాసి ప్రదర్శించిన ‘త్రిజాకి యమదర్శనం’ నాటకానికి మంచి స్పందన వచ్చింది. కన్నడంలోకి వెళ్లింది. ‘శిరీషిక, చీకటి చెప్పిన కథ, లయ, స్వాతంత్య్రం’ నాటకాలతో పాటు వందకు పైగా కవితలూ అబ్బూరి కలం నుంచి జాలువారాయి. శ్రీశ్రీ రేడియో నాటిక ‘విదూషకుడి ఆత్మహత్య’నూ రంగస్థలం మీదికి తెచ్చారు అబ్బూరి. ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ, నృత్య అకాడమీ వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన సేవలందించారు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. 200లకు పైగా పుస్తకాలకు ముఖచిత్రాలను అందించిన ఆయన, దేశవ్యాప్తంగా చిత్రకళా ప్రదర్శనలు ఇచ్చారు. ‘అబ్బూరి కళాకేంద్రం’ ఏర్పాటుచేసి, ఎంతో మంది చిత్రకారులతో ప్రదర్శనలు ఇప్పించారు. తన వేసిన అనేక చిత్రాలను విశాఖ ప్రదర్శనశాలకు అందజేశారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం