ఎఫ్‌టూ, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు  - వెండితెర వెన్నెల

  • 370 Views
  • 43Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
నవ్వాలిగా.. నవ్వాలిగా..

చిత్రకథల్లో అల్లుళ్ల ఆరాటాలు పోరాటాలు.. భార్యల్ని తమ తాటిలోకి తీసుకురావాలన్న ఆకాంక్షల్నీ ఒకనాడు గుండమ్మ కథలో చూశాం. తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏదీ గుర్తుకురాదు. ఈ ఎఫ్‌టూ చిత్రం ఆ కోవలోని సరదాను పంచేసింది.
      వ్యంగ్యానికి వివాహవ్యవస్థ, అందులోని అమాయక భర్త చాలాకాలం నుంచి మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. కథానాయకులు అలాంటి భర్తలే ఈ చిత్రంలో. ‘చివరిగా నవ్వుకుని తాళికట్టు నాయనా..’ అనడం దగ్గర్నించి అసహనాల ప్రహసనాలు మొదలవుతాయి. అట్టా ఏడిపించకపోతే దాని కడుపున ఓ కాయ కాయించొచ్చు కదా అంటే.. ఇరవై నాలుగ్గంటలూ మీరు నా కొంపలో తగలడితే కాయలెలా కాస్తాయ్‌.. నా తలకాయ్‌..’ అంటూ అల్లుడి అసహనం ఆకాశాన్ని తాకుతుంది. ఒక చరిత్ర గురించి చెప్పాలంటే. క్రీస్తుపూర్వం కీ.శ అని మొదలుపెడతాం. అదే ఒక మగాడి గురించి చెప్పాలంటే.. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని మొదలు పెడతాం.. అంటూ దీనాతిదీనంగా చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ‘లేడీస్‌ చాలా ఈజీగా నమ్మేవి చాడీస్‌’ వంటి కొన్ని తర్కాలు కితకితలు పెడతాయి. ఊత పదాలను బలే సరదాగా వాడుతూ ప్రేక్షకులకు చేరువ చేయడం ఈ మధ్యకాలంలో అంతగా చూడలేదు. కథానాయకి ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ అందర్నీ బెంబేలెత్తించడం ఓ వైపు.. ఎంతో సహనంగా ఓ భర్త ‘అంతేగా.. అంతేగా..’ అంటూ భార్యకు వత్తాసు పలకడం మరోవైపు అలరించాయి. అనిల్‌ రావిపూడి సంభాషణలు, దర్శకత్వంతో ఈ చిత్రం పండగ రోజుల్లో వినోదాల విందు అందించింది. 


కథానాయకుడి కథ..
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా.. త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా కథానాయకా. అంటూ సాగే ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్ర శీర్షికాగీతం (కె.శివదత్త, డా.కె.రామకృష్ణ) అంచనాలను అక్షరాల్లో చూపించింది. అలనాటి తెలుగు చలనచిత్ర రంగానికి కొత్తబాణీని తీసుకొచ్చిన ఎన్టీఆర్‌  జీవితకథనే చిత్రంగా మలిచిన ప్రయత్నం ఇది. క్రిష్‌ దర్శకత్వ ప్రతిభకు తోడుగా సాయిమాధవ్‌ సంభాషణలు ఇందులో తెలుగుదనాన్ని తేజోవంతం చేశాయి. 
      ‘నీకూ నాకూ రెండు ఇష్టాలు ఉంటాయా బావా’ అంటూ బసవతారకం పాత్రతో చెప్పించిన మాటతీరు ఓ ప్రయోగం. సామాన్యంగా ‘మన ఇద్దరి ఇష్టాలు ఒకటే..’ అన్న మాట ఎన్నో చిత్రాల్లో అరిగిఅరిగి తిరిగింది. దానికి కొత్త విరుపు ఈ మాట.  ‘నిన్ను మించి డబ్బు సంపాదించు.. సంతోషపడతావు.. కానీ ఆ డబ్బుని మించి ఎదగాలని అనుకోకు.. దెబ్బతింటావు..’ వంటి మాటల్లో తాత్వికత చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. 
      ‘సాయానికి కూడా కాపలా ఉండాలా?’ అన్న ప్రశ్న ఎవ్వరికీ రానిది. దానికి జవాబు.. ‘మన కష్టానికి కాపలా ఉండాలి. డబ్బుని గౌరవించాలి. ఆడవారి ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థికస్వాతంత్య్రం అవసరం..’ అంటూ చెప్పించడం.. నేటి తరానికి కూడా దృష్టిలో పెట్టుకుని రాసిందే అనిపిస్తుంది.
      ‘మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి..’ అన్న మాట సినిమా ప్రియులకే కాదు.. ప్రేక్షకులకూ కంట చెమ్మజేస్తుంది.
      ‘జనం నన్ను దేవుణ్ని చేశారు. ఆ జనం కోసం మళ్లీ నేను మనిషిని అవ్వలేనా’ అంటూ కథానాయకుడి అంతరంగానికి అద్దం పట్టే సంభాషణలు చిత్రానికి సగం బలాన్ని అందించాయి.
      అర్థమైంతమైన మాటలతో పాటు పాటలూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కీరవాణి రాసి పాడిన పాట ‘వెండితెర దొరా.. వినుమా మొరా..’ హృదయాలను తడుతుంది. ‘భువన విజయమా కవుల రాజ్యమా కోరుతున్నది.. పట్టెడన్నమా..’ అన్న పంక్తులు ఆర్ద్రంగా సాగిపోతాయి.
      ‘బంటురీతి కొలువు..’ పాటలో సిరివెన్నెల కలం సుమధుర స్వరాలకు మీగడ తరగల్లాంటి పదాలను అద్దింది. గుండెలోన కొలువై కంటజూడ కరువై ప్రాణ వల్లభునిగా పలకరించవేమీ.. అనటం బావుంది. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం