నూరేళ్ల నాదకోవెల

  • 1030 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బుడితి రామినాయుడు

  • విజయనగరం,
  • 9490139503
బుడితి రామినాయుడు

ఆ కళాశాలది వందేళ్ల చరిత! పదివేల మంది సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత!! నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, ఘంటసాల, పి.సుశీల లాంటి వారు అక్కడి విద్యార్థులే. తెలుగునాట సులక్షణ సంగీత శిక్షణకు పర్యాయపదంగా నిలిచిన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల... దక్షిణ భారతదేశంలోనే తొలి గాన పాఠశాల! తెలుగు జాతి సాంస్కృతిక, కళాచరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ప్రత్యేకించుకున్న ఈ కళాశాల... శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న అరుదైన సందర్భమిది! 
ఒక చిన్న అవసరం ఓ మహోజ్వల చరిత్రకు బాటలు వేయగలదని నిరూపించడానికి ఈ కళాశాలే ఓ తార్కాణం. తన ఆంతరంగిక కార్యదర్శి చాగంటి జోగారావు కుమారుడు చాగంటి గంగరాజు అంధుడని, అతనికి సంగీత సాధనలో ఆసక్తి ఉందని విజయనగరం మహారాజు నాలుగో విజయరామ గజపతికి తెలిసింది. ఆ కుర్రాడికి సంగీతం నేర్పించే ఉద్దేశంతో 1919 ఫిబ్రవరి అయిదో తేదీ నాడు ఆయన కోటకు పశ్చిమ భాగంలోని పురమందిరంలో ‘విజయరామ గాన పాఠశాల’ను ప్రారంభించారు. దానికి ప్రథమ అధ్యక్షులుగా అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసును నియమించారు. ఇదే ఆ తర్వాత మహారాజా సంగీత, నృత్య కళాశాలగా మారింది. 

      ఓ అంధ బాలుడి కోసం ఏకంగా సంగీత పాఠశాలను నెలకొల్పడం అద్భుతం అనుకుంటే.. అది జరిగిన మూడు నెలల్లోనే మరో విశేషం చోటుచేసుకుంది. విజయరామ గజపతి ఒకనాడు కోరుకొండ రాజభవనంలో తమ స్వదేశీ విదేశీ మిత్రులకు వెన్నెలవిందు ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా రాజుగారికి సన్నిహితుడైన శ్రీరంగం వేంకట నారాయణ (ప్రఖ్యాత అభ్యుదయ కవి శ్రీరంగం నారాయణ బాబు తండ్రి) చొరవ తీసుకుని ఓ యువకుడి వయొలిన్‌ కచ్చేరీని ఏర్పాటు చేయించారు. ఆ కచ్చేరీని ఆద్యంతం ఆనంద పరవశులై విన్న ప్రాచ్య పాశ్చాత్య శ్రోతలు.. చివర్లో ఒక్క పెట్టున కోరుకొండ భవనం మార్మోగేలా కరతాళ ధ్వనులు చేశారు. ఆ వెంటనే మహారాజు తమ సంగీత పాఠశాల అధ్యక్షులతో సంప్రదించి ఆ యువకుణ్ని వయొలిన్‌ ఉపన్యాసకుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ కుర్రాడే ద్వారం వెంకటస్వామినాయుడు. అలా సంగీత పాఠశాలలో విద్యార్థిగా చేరే ప్రయత్నంలో ఉన్న వెంటస్వామి నాయుడు, అదే పాఠశాలలో అధ్యాపక పదవిని చేపట్టారు.
ప్రశాంత గంభీరం..
చుట్టూ ప్రహరీ గోడతో పటిష్టమైన మూలస్తంభాలతో, మెట్ల వరసలతో, సరస్వతీ మందిరంలా భాసించే సభా మందిరంతో.. విద్యార్థులు జంత్ర వాద్య గాన సాధన చేసుకోవడానికి వీలుగా వెడల్పయిన వరండాలతో.. పఠన పాఠనాలకు, గాన ప్రవచనాలకు, సాధనకు ఆరుబయట పరుపులు పరచిన మాదిరిగా దర్శనమిచ్చే మనోహర పచ్చిక బయళ్లతో.. విశాలమైన మైదానాలతో.. శాఖోపశాఖలుగా విస్తరించి ఆకాశాన్నంటే వృక్షరాజాలతో సంగీత కళాశాల ఆవరణం ప్రశాంత గంభీరంగా దర్శనమిస్తుంది. ఇక్కడ ఆరంభించిన వయొలిన్, వీణ, గాత్రం, మృదంగ సంప్రదాయాలు తర్వాతి కాలంలో దేశమంతటా విస్తరించాయి. 
      విజయరామ గజపతిరాజు తర్వాత అలకనారాయణ గజపతిరాజు కాలంలో ఈ సంస్థ మరికొన్ని భాగాలను ప్రారంభించింది. తమిళనాడు నుంచి మునుస్వామిని రాజుగారు ఆహ్వానించి కళాశాలలో నాదస్వర విభాగాన్ని ప్రారంభింపజేశారు. మంథెన వీరన్న డోలు వాయించేవారు. తంజావూరు నుంచి గోవిందరావు పిళ్లైని ఆహ్వానించి నృత్య విభాగాన్ని ఆరంభింపజేశారు. ఆ రోజుల్లో నృత్యవిభాగం కళాశాలలో కాకుండా దివాన్‌ బంగ్లాలో కొనసాగేది. తర్వాత కొన్నేళ్లు నృత్యశాఖ ఆగిపోయింది. ఎస్టేటు కలెక్టరు సి.ఎ.రామకృష్ణన్‌ హయాంలో ‘గాత్ర సర్వస్వ’, ‘గాంధర్వ’ పత్రికా సంపాదకులు, గ్రంథకర్త దువ్వూరు జగన్నాథశర్మ నాట్యోపన్యాసకులుగా ఈ శాఖ పునః ప్రారంభమైంది. ఉచిత సంగీత నృత్య బోధన, ఉచిత వసతి సదుపాయాలు, సింహాచల దేవస్థానం సత్రంలో ఉచిత భోజనసౌకర్యం ఉండటంతో మద్రాసు ప్రెసిడెన్సీ అంతటి నుంచీ విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో చేరేవారు. అలకనారాయణ గజపతిరాజు తర్వాత పి.వి.జి. రాజు కాలంలో కళాశాల సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. 
అందరూ అనితరసాధ్యులే
కళాశాల తొలి అధ్యక్షులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు బహుముఖ ప్రజ్ఞాశాలి. అష్టభాషా కోవిదులు, అష్టావధాని. తెలుగు సంస్కృతాల్లో వందకు పైగా గ్రంథాలు, ఇరవై హరికథలు రచించారు. 72 కర్ణాటక రాగాల్లో సంగీత రచనలు చేశారు. 90 కర్ణాటక రాగాల్లో గీత మాలికను స్వరపరిచారు. సంగీత సాహిత్య సార్వభౌముడిగా, హరికథా పితామహుడిగా వాసికెక్కారు. ఆయన తర్వాత ఫిడేలునాయుడిగా ప్రఖ్యాతి పొందిన ద్వారం వెంకటస్వామినాయుడు కళాశాల అధ్యక్షులయ్యారు. ఈయన వాయులీన వాదనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అది ద్వారం సంప్రదాయంగా ప్రసిద్ధిగాంచింది. వెంకటస్వామినాయుడు శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 1993లో ఆయన పేరిట తపాలా బిళ్లను విడుదల చేసింది. కళాశాల అధ్యక్షులుగా వెంకటస్వామినాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారూ అసామాన్య ప్రతిభావంతులే! ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్‌. శేషయ్యశాస్త్రి లాంటి మహామహులు అధ్యక్షులుగా సేవలందించారు. ప్రస్తుతం బురిడి అనూరాధా పరశురామ్‌ ఆ బాధ్యతలను వహిస్తున్నారు. కళాశాల అధ్యాపకులుగా వాసా వెంకటరావు, కట్టు సూర్యనారాయణ శాస్త్రి, పేరి రామమూర్తి, లింగం లక్ష్మోజీ పంతులు, పట్రాయని సీతారామశాస్త్రి, డొక్కా శ్రీరామమూర్తి, గోపాలరావు, భాష్యం అప్పలాచార్యులు, కోలంకి వెంకటరాజు, కవిరాయని జోగారావు, చెంభోలు వెంకటశాస్త్రి, బురిడి లక్ష్మినాయుడు, సుందరమ్మ, మండా మాణిక్యం, సిహెచ్‌. సన్యాసిరావు, జి. అన్నాజీరావు, యం.బాలసరస్వతి, ద్వారం లక్ష్మి తదితరులు విధులు నిర్వహించారు.
      ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది తెలుగునాటే కాదు, దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆకాశవాణి గ్రేడ్‌ ఆర్టిస్టులుగా, సంగీత దర్శకులుగా, సంగీతోపాధ్యాయులుగా, నేపథ్య గాయకులుగా స్థిరపడ్డారు. మరికొందరు గొప్ప సంగీత విద్వాంసులుగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించారు. అలాంటి వారిలో భువనేశ్వరమిశ్రా, చాగంటి గంగరాజు, ద్వారం భావనారాయణరావు, ద్వారం మంగతాయారు, ద్వారం నరసింగరావునాయుడు, ద్వారం సత్యనారాయణమూర్తి, ద్వారం త్యాగరాజు, ఇవటూరి విజయేశ్వరరావు, డా।। అశ్వత్థామ, బురిడి లక్ష్మినాయుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి.రెడ్డి, కొమండూరి కృష్ణమాచార్యులు, మంచాల జగన్నాథరావు, ఆకెళ్ల మల్లికార్జున శర్మ, మారెళ్ల కేశవరావు, ముళ్లపూడి లక్ష్మణరావు, ముళ్లపూడి శ్రీరామమూర్తి, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన సత్యనారాయణ, పి. సుశీల, సాలూరు హనుమంతరావు, సాలూరు రాజేశ్వరరావు, శ్రీపాద సన్యాసిరావు, వంకాయల నరసింహం, గరిమెళ్ల రాజారావు తదితరులు ముఖ్యులు. వీళ్లు కాకుండా ఇంకా పది వేల మంది విద్వాంసులు ఉన్నారు. అధ్యక్షులుగా, అధ్యాపకులుగా, విద్యార్థులుగా ఈ కళాశాలతో అనుబంధం ఉన్న కొంతమంది ప్రముఖులకు పద్మ పురస్కారాలూ లభించాయి. ద్వారం వెంకటస్వామినాయుడు, ఘంటసాల, శ్రీరంగం గోపాలరత్నంలు ‘పద్మశ్రీ’, డా।। నేదునూరి కృష్ణమూర్తి, పి.సుశీలలు ‘పద్మభూషణ్‌’, డా।। నూకల చినసత్యనారాయణ ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్‌’ గౌరవాలను అందుకున్నారు. 
గురుదేవోభవ!
కళాశాల అధ్యాపకులు మొదటి నుంచీ విద్యార్థులను చాలా ప్రేమగా చూసుకునేవారు. అమితంగా ప్రోత్సహించేవారు. అందుకే ఇక్కడ చదువుకున్న వారు ఎంత గొప్పస్థానాలకు చేరుకున్నా తమ గురువులను భక్తిపూర్వకంగా స్మరించుకుంటారు. ‘‘అది 1940 నాటిమాట. విజయనగరం మహారాజా వారి సంగీత పాఠశాలకు ప్రపంచ విఖ్యాత వయొలిన్‌ విద్వాంసులు డా।। ద్వారం వెంకటస్వామి నాయుడుగారు అధ్యక్షులుగా ఉన్న రోజులు. శ్రీ ద్వారం నరసింగరావు నాయుడుగారు వయొలిన్‌ లెక్చరర్‌గా ఉండేవారు. వారివద్ద వయొలిన్‌ విద్యార్థిగా చేరాను. అప్పటికే ‘వినికిడి’ జ్ఞానంతో గాత్రసంగీతం బాగా పాడుతున్నానని నలుగురూ అనేవారు. మా గురువుగారు ప్రత్యేకించి నన్ను గాత్రం పాడమనే ప్రోత్సహించేవారు. వోకలిస్టుగా మంచి భవిష్యత్తుంది నీకు.. అని సదా నన్ను గాత్రం వైపే మరలించి ఈనాటి నా స్థితిని ఆనాడే ఊహించిన భవిష్యత్తు దార్శనికులు ఆయన’’ అంటూ నరసింగరావు నాయుడికి నేదునూరి కృష్ణమూర్తి వందనాలర్పించారు. ‘‘సంగీత శాస్త్రమూ, లక్ష్య గ్రంథమూ నేను ఇతర పండితుల నుంచి గ్రహించగలిగే వాణ్నేమో కానీ గురువుగారు నాకు ప్రసాదించింది అనితర దుర్లభమైందని నా విశ్వాసం. ముఖ్యంగా గాత్రసాధన చేయడంలో అలవర్చుకోవాల్సిన శ్రుతి శుద్ధి, గమక శుద్ధి, తాళగత స్వరగత స్వరశుద్ధి శిష్యులకు బోధించడంలో ఆ మహానుభావుడు సిద్ధుడు. వారు ఈ నాదానుభవాన్ని ‘సాంబసదాశివ సాంబసదాశివ’ అనే నామసంకీర్తనంతో మంత్రవత్‌గా నాలో ప్రసరింపజేశారు’’ అంటూ ఘంటసాల తన గురువు పట్రాయని సీతారామశాస్త్రి గురించి చెప్పారోసారి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో విజయనగరం సంగీత కళాశాలలో తీసుకునే శ్రద్ధ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. 
ఇప్పటికీ అదే స్ఫూర్తి
ముప్పయి ఆరు మంది విద్యార్థులతో గాన పాఠశాలగా ప్రారంభమై, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలగా దినదినాభివృద్ధి చెందింది ఈ సంగీత కోవెల. ప్రస్తుతం ఈ కళాశాలలో ఏడు విభాగాలు, తొమ్మిది మంది ఉపన్యాసకులు, 436 మంది విద్యార్థులున్నారు. మొదట్లో దీన్ని ఆంధ్రవిశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా పరిగణించేవారు. 1955లో కళాశాల నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన నాటి నుంచి సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగేవి. ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉంది.
      గాత్రం, వీణ, వయొలిన్, మృదంగం, నాదస్వరం, డోలు, భరతనాట్యం విభాగాల్లో నాలుగేళ్ల సర్టిఫికెట్‌ కోర్సు, రెండేళ్ల డిప్లొమాలపై పూర్తికాలపు, పాక్షిక కాలపు విద్యార్థులకు కళాశాల శిక్షణ ఇస్తోంది. కళాశాలలో చేరాలనుకునేవారు జులై 1 నాటికి పదేళ్ల వయసు నిండిన వారై ఉండాలి. ఆపై వయోపరిమితి లేదు. సర్టిఫికెట్‌ కోర్సుకు రూ।। 1300, డిప్లొమో కోర్సుకు రూ.1700 రుసుము చెల్లించాలి. కళాశాల 1944లో రజతోత్సవాన్ని, 1969లో స్వర్ణోత్సవాన్ని జరుపుకుంది. ప్రతి సంవత్సరం శ్రీ సిద్ధివినాయక నవరాత్రి ఉత్సవాలను.. వార్షికోత్సవంతో అనుసంధానం చేసి సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలను.. నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తోంది. వారానికోసారి విద్యార్థులతో కచ్చేరి, నెలకొకసారి ఉపన్యాసకుల కచ్చేరీ తప్పనిసరి. ఇతర ప్రాంతాల నుంచి లబ్ధప్రతిష్టులైన విద్వాంసులను రప్పించి వారితో కచ్చేరీలూ చేయిస్తారు. కళాశాల కీర్తిని ఇనుమడింపజేసిన ప్రముఖులు నిలువెత్తు తైలవర్ణ చిత్రపటాలతో, అనేకమంది సంగీతవేత్తల ఛాయాచిత్రాలతో కళాశాల సభాభవనం శోభాయమానంగా కనిపిస్తుంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కళాశాల ప్రధాన భవనాన్ని పునరుద్ధరిస్తున్నారు. విద్యార్థుల కచ్చేరీలకు ఓపెన్‌ ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. దృశ్యకళలు, హరికథ, కూచిపూడి, పిల్లనగ్రోవి తదితర కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రతిపాదనలూ పంపారు. ఇక్కడ చదువుకున్న వాళ్లలో చాలామంది సంగీత విద్వాంసులుగా, ఆకాశవాణి స్టాఫ్‌ ఆర్టిస్టులుగా, కళాశాల అధ్యాపకులుగా, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో సంగీత ఉపాధ్యాయులుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం డీఎస్సీలో సంగీత ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించారు. సినీ, టీవీ ప్రకటనలు తదితర వినోద రంగాల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. అనేక మంది సంగీత విద్వాంసులు తమ గానమాధుర్యంతో ప్రజల్ని రంజింపజేస్తూ.. తమ మాతృసంస్థ అయిన సంగీత కళాశాల కీర్తిప్రతిష్ఠలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఎందరో మహానుభావులకు ‘సరిగమలు’ నేర్పిన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల శతాబ్ది ఉత్సవాలు ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో విజయనగరంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో వీటిని వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంగీత సరస్వతికి ఆలవాలంగా.. కళాభిమానులకు, విద్యార్థులకు నాదకోవెలగా భాసిస్తున్న ఈ కళాశాల ప్రస్థానం ఇలాగే కొనసాగాలని మనసారా ఆకాంక్షిద్దాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం