జోర్దార్‌ దోస్తానా!

  • 1121 Views
  • 6Likes
  • Like
  • Article Share

    సంపత్‌ కుమార్‌ శ్రీవత్స

  • విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు,
  • కరీంనగర్‌
  • 9346435123
సంపత్‌ కుమార్‌ శ్రీవత్స

పరిణామం భాష స్వాభావిక లక్షణం. పాలకవర్గాల వ్యవహార భాష, విభిన్న సంస్కృతుల సంగమ సందర్భాలు, ప్రపంచీకరణ లాంటివి స్థానిక భాష మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో పరాయి భాషా పదాలు లెక్కకు మిక్కిలిగానే స్థానిక భాషలోకి చొచ్చుకొస్తాయి. లేదంటే స్థానిక భాషతో మిళితమై కొత్త పలుకుబడిగా స్థిరపడతాయి. తెలంగాణ ప్రాంతం చాలా ఏళ్ల పాటు కుతుబ్‌షాహీలు, నిజాంల పాలకుల ఏలుబడిలో ఉంది. అందుకే ఇక్కడి తెలుగు పలుకు మీద] ఉర్దూ ప్రభావం గణనీయంగానే కనిపిస్తుంది. 
పదకొండో
శతాబ్దం ముందునుంచే తెలుగు భాషకు ఛందస్సు ఉంది. విస్తృత సాహిత్యమూ ఉంది. అయినా, నన్నయ భారతమైనా, పోతన భాగవతమైనా, సంస్కృత పదాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. పదిహేడో శతాబ్దం దగ్గరి నుంచి సుల్తానుల పాలనలో వ్యాప్తిచెందిన ఉర్దూపదాల ప్రభావమూ తెలుగుపై పడింది. అలాగే, వలసపాలకులైన పోర్చుగీసు, ఫ్రెంచి, బ్రిటిష్‌ వారి భాషా పదాలు కూడా తెలుగులోకి వచ్చిచేరాయి. 
      తెలంగాణలో ముఖ్యంగా నిజాముల పాలనలో ఎక్కువ మంది మాట్లాడే తెలుగును కాదని, ఉర్దూకి అగ్రాసనమేశారు పాలకులు. తహసీల్దార్లు, జమేదార్లు, ఇతర అధికారులంతా ఆ భాషనే ఉపయోగించేవారు. రాతకోతలు అందులోనే ఉండేవి. పటేల్‌ పట్వారీలు, దేశ్‌ముఖ్‌లు ‘పసీఉర్దూ’ మాట్లాడేవారు. ఈ సుదీర్ఘ కాలం ఎన్నో ఉర్దూ పదాలను తెలుగులోకి తీసుకొచ్చింది. గుండీ (బొత్తం), జవాబ్, ఖైదీ, వకీల్, రాజీ, దర్వాజా, చెమ్చా, కుర్చీ, పరదా, దర్వాజా, చాబీ (తాళంచెవి), గాడీ (వాహనం), లాల్చీపైజామా, కుర్తా, కమీజ్‌ లాంటి దుస్తులకు సంబంధించిన ఉర్దూ పదాలు ఉన్నవి ఉన్నట్టు తెలుగులోకి చేరిపోయాయి. ఖబర్‌ (కబురు), నిగాహ్‌ (నిఘా), బేవారిస్‌ (బేవార్సు), రోజ్‌ (రోజు), ఫరార్‌ (పరార్‌), షర్త్‌ (షరతు), ఖర్చ్‌ (ఖర్చు), ఖిడ్‌కీ (కిటికీ), చాదర్‌ (చద్దర్‌), తూఫాన్‌ (తుపాను) లాంటి ఎన్నో పదాలు జన వ్యవహారంలో కొద్దిపాటి మార్పులతో తెలుగులోకి వచ్చిచేరాయి. 
తెలుగుతో కలగలసి
‘దస్కత్‌ పెట్టు’, ‘నిషాని వెయ్యి’ అంటూ ఉంటారు తెలంగాణలో. వీటి మూల ఉర్దూ పదాలు ‘దస్తఖత్‌ (సంతకం)’, ‘నిషాన్‌’ (వేలిముద్ర). మంచి బట్టలేసుకుని, పౌడరు రాసుకొని ఆహా అనిపించేలా ఎవరైనా సిద్ధమైతే ‘జోర్‌దార్‌ తయారైనవుకదా!’ అంటారు. జోర్‌దార్, తయార్‌ రెండూ ఉర్దూ మాటలే. చట్టాల అమల్లోని లోటుపాట్లను న్యాయస్థానాలు సరిచేస్తూ ఉంటాయి. ఈ ‘అమలు’ ఉర్దూ ‘అమల్‌’ నుంచి వచ్చిందే. ఇంకా ‘మస్త్‌ ఉన్నవ్‌’ అంటే ‘చాలా బాగున్నావ్‌’ అని అర్థం. ‘గలీజ్‌ పాడైనవ్‌రా’ అంటే ‘చెత్తగా కనిపిస్తున్నావురా’ అని అన్నమాట. వానికి గింతకూడా ‘ఫికర్‌’ లేదు, వాడు ‘డర్‌పోక్‌’, వాళ్లిద్దరూ ‘జాన్‌దోస్త్‌’లు అంటుంటారు. ప్రయోజనం లేని పనులు చేసేటప్పుడు- దానితోని ‘ఫాయిదా’ లేదు అని చెబుతుంటారు. ఇక్కడ ‘ఫికర్‌’ అంటే బాధ. ‘డర్‌పోక్‌’ అంటే పిరికివాడని అర్థం. జాన్‌+దోస్తులులో జాన్‌ అంటే ప్రాణం, దోస్తులు అంటే స్నేహితులు. అంటే ప్రాణస్నేహితులన్నమాట. ఇక ‘ఫాయిదా’ అంటే లాభం/ ప్రయోజనం. వాడు పెద్ద ‘తీస్‌మార్‌ఖాన్, తురుమ్‌ఖాన్‌’ అన్నారంటే ‘గొప్పవాడు’ అని ‘వ్యంగ్యం’గా చెప్పడమే. అలాగే విశేషణాలతో కూడిన ‘చల్లటి నీళ్లు’, ‘వేడి చాయ్‌’లకు ‘ఠండాపానీ, గరమ్‌చాయ్‌’లు ప్రత్యామ్నాయాలయ్యాయి. బాధ్యత అని చెప్పాలంటే ‘జిమ్మేదారి’ అనడం పరిపాటి. నిజాయితీ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే ‘నియ్యత్‌’ కూడా పక్కా ఉర్దూ పదమే. శరమ్‌ లేదా శర్మ్‌ అంటే సిగ్గు, పతా అంటే చిరునామా, రహెమ్‌ అంటే దయ అని అర్థాలు. కొన్ని పదాల ముందు ‘బే, లా, బిన్‌’లను చేరిస్తే వ్యతిరేకార్థం వచ్చేస్తుంది. ఉదాహరణకు లా పతా - చిరునామా లేకపోవడం, బేశరమ్‌ - సిగ్గులేని, బేదర్ద్, బేఫికర్‌ - బాధలేని, బేరహెమ్‌ - దయలేని, బిన్‌పతా - జాడ తెలియని లాంటివి. ఇక బే ఇమానోడు (కృతఘ్నుడు), బేకార్‌గాడు (పనికిమాలినవాడు) లాంటివీ ఉర్దూ ప్రభావంతో వచ్చినవే. 
      జర+ అంత - జరంత (కాస్త, కొంచెం), ఖరాబ్‌+ అయ్యింది - (చెడిపోయింది) లాంటి ఉర్దూ, తెలుగు కలగలసిపోయిన పదాలు కూడా తెలంగాణలో చాలా వినిపిస్తాయి. ఇవన్నీ తెలుగు పదాలే అనేంతగా ఇక్కడ వాడుకలో వినిపిస్తుంటాయి. బాకీ (రుణం), బకాయి (చెల్లించాల్సిన సొమ్ము), నుక్సాన్‌ (నష్టం), బరాబర్‌ (తప్పక/సరిసమానం), గిరాకీ (డిమాండు), ధోకా (మోసం), అసల్‌ (నిజమైన), నకిలీ (అబద్ధపు), నజ్‌రానా (కానుక), జులుమ్‌ (దౌర్జన్యం), షుమార్‌ (దాదాపు/ సుమారు), హాజర్‌ (ఉపస్థితి), గైర్హాజరు (అనుపస్థితి), ఖుష్‌ (సంతోషం), దమ్‌ (శ్వాస/ ఊపిరి/ ప్రాణం), నజర్‌ (దృష్టి/ చూపు), బదిలీ (స్థానచలనం), బంద్‌ (మూసివేత/ ఆపివేత), బద్నాం (అపనింద), జుల్మానా (అపరాధ రుసుం), మద్దతు (సహకారం), రివాజు (ఆనవాయితీ/ సంప్రదాయం), దర్‌ఖాస్త్‌ (దరఖాస్తు), అర్జీ (రాతపూర్వక మనవి), ఖరార్‌ (నిర్ణయం), దావత్‌ (విందు), కస్రత్‌ (సమృద్ధి), పరేషాన్‌ (చికాకు), లడాయి (కొట్లాట), బడాయి (గర్వం), గరీబ్‌ (పేద), గులామ్‌ (బానిస), ఇజ్జత్‌ (గౌరవం), బగోని (గిన్నె), షత్రంజి (చదరంగం), బీమారీ (రోగము), ఖతర్‌నాక్‌ (అపాయకరమైన) లాంటి ఉర్దూ పదాలు తెలుగులో కలిసిపోయి తెలంగాణ నిత్య వ్యవహారంలో వినిపిస్తూ ఉంటాయి. (వీటిలో రివాజు, బదిలీ, బందు, మద్దతు, అసలు, నకిలీ, గిరాకీ, సుమారు లాంటివి తెలుగునాట మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి) ఇలా పరాయి పాలకుల ఏలుబడి కారణంగా తెలంగాణ తెలుగులో ఉర్దూపదాలు గణనీయంగా చేరినా, ఇప్పటికీ లెక్కకు మిక్కిలి అచ్చ తెలుగు పదాలు ఇక్కడి గాలిలో భావ పరిమళాలు పంచుతుంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం