బుడతకీచులూ... బాగుబాగు!

  • 749 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నిర్జర

బుడతకీచులు... తెలుగుగడ్డ మీద అడుగుపెట్టిన పోర్చుగీస్‌ వారికి మనం పెట్టిన పేరు. 1505లో గోవాలో అధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టిన వీళ్లు దేశంలో చాలాచోట్లే విస్తరించారు. బ్రిటిష్‌ వారితో గొడవలు పడుతూ, సర్దుకుపోతూ... ఏదో ఒక మూలన అధికారాన్ని చలాయిస్తూనే వచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా గోవాలో కొంత భాగం పోర్చుగీసుల చేతిలోనే ఉండేది. చిట్టచివరికి 1961లో మన దేశం నుంచి పూర్తిగా వారి అధికారం తరలిపోయింది. అంటే 450 ఏళ్లకు పైగా బుడతకీచులు మనతో కలిసి జీవించారు. ప్రస్తుతానికి వారి పాలన ఒక జ్ఞాపకమే. విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లో కొన్ని పుటలు మాత్రమే! కానీ వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన ఓ అధ్యాయం మాత్రం మిగిలిపోయింది. అదే భాషాభిమానం! అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా పోర్చుగల్‌ దేశ భాషావిధానంలోని స్ఫూర్తిదాయక అంశాలపై ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక కథనమిది!
పోర్చుగీసులు
భారతదేశం మీదే కాదు... ప్రపంచంలో చాలా దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించారు. సముద్రయానంతో కొత్తకొత్త ప్రదేశాలను కనుగొంటున్న ఆ దేశ నావికులు, అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రపంచంలో తొలి వలస రాజ్యంగా (కలోనియల్‌) పోర్చుగల్‌ని పేర్కొంటారు. 1999లో చైనాలో మకావ్‌ అనే ప్రదేశాన్ని విడిచిపెట్టడంతో, 600 ఏళ్లకు పైగా సాగిన పోర్చుగల్‌ వలస రాజ్యం అంతరించింది. పోర్చుగల్‌ పాలించిన ప్రతి చోటా పోర్చుగీస్‌ భాషే అధికారిక భాషగా ఉండేది. వారి పాలన కాస్త సుదీర్ఘంగా సాగిన సందర్భాల్లో స్థానికులకి కూడా ఈ భాష ఒంటపట్టేది. కానీ ఎప్పుడైతే పాలన పక్కకి తప్పుకుందో, భాషకి ప్రోత్సాహం కూడా కరువయ్యేది. రాజే లేనప్పుడు రాజభాషకి దిక్కేముంటుంది! దాంతో ఇంగ్లిష్, ఫ్రెంచ్‌లాంటి ఇతర భాషలు రంగప్రవేశం చేశాయి. తమ భాష ప్రపంచ పటం మీద నుంచి చెరిగిపోతున్న విషయాన్ని పోర్చుగల్‌ త్వరగానే పసిగట్టేసింది. ఇంగ్లిష్‌కు దీటుగా పోర్చుగీసుని అంతర్జాతీయ భాషగా తీర్చిదిద్దాలని సంకల్పించుకుంది. స్థానిక భాషలకు విఘాతం కలగకుండానే, పోర్చుగీసు భాషను నేర్చుకునేందుకు సిద్ధపడినవారిని ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకుంది. ఫలితం... ఇప్పటి గణాంకాలే చెబుతున్నాయి.
      దక్షిణార్ధగోళంలో వినిపించే భాషల్లో పోర్చుగీసుదే ప్రథమ స్థానం. చాలా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడుతున్న భాషల్లో పోర్చుగీసుది ఆరో స్థానం. 20 కోట్లకు పైగా ప్రజలు ఈ భాషని మాట్లాడుతున్నారని అంచనా. నిజానికి పోర్చుగల్‌ దేశ జనాభా కోటిమంది మాత్రమే! అంటే ఈ భాషని మాట్లాడుతున్న 95 శాతం మంది ప్రజలు ఆ దేశం వెలుపలే ఉన్నారన్నమాట. ఆంగ్లానికి దీటైన అంతర్జాతీయ భాషగా నిలిచేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? అందుకే ఆంగ్లం తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాష పోర్చుగీసేనంటూ యునెస్కో సైతం కితాబిచ్చింది.
దశాబ్దాల వ్యూహం
ఒక్కో దేశంలోనూ క్రమంగా క్షీణిస్తున్న తన భాషను బలపరిచేందుకు పోర్చుగల్‌ ప్రభుత్వం చేసిన కృషి సామాన్యమైనది కాదు. స్వదేశంలో ఉన్న మాతృభాషలను కాపాడుకునే ప్రభుత్వాలే కనిపించని సమయంలో, ఎక్కడో ఎవరో తన భాషని నేర్చుకునేందుకు పోర్చుగల్‌ ప్రభుత్వం చాలా సదుపాయాలే కల్పిస్తూ ఉంటుంది. మిగతా ఐరోపా దేశాలతో పోల్చుకుంటే, ఆ దేశపు ఆర్థికస్థితి సామాన్యమేనని గ్రహించినప్పుడు, పోర్చుగీస్‌ భాషాభిమానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ తరహా ప్రయత్నాలలో ‘ఇన్‌స్ట్యూటో కేమియో’ది ముఖ్యపాత్ర. 16వ శతాబ్దానికి చెందిన కేమియో అనే కవి పేరు మీదుగా ఈ సంస్థని స్థాపించారు. 1928 నుంచే దీని ఉనికి ఉన్నప్పటికీ... చేయిదాటిపోతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1992లో దీన్ని బలోపేతం చేశారు. పోర్చుగల్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ, విదేశాల్లో పోర్చుగల్‌ భాషను నేర్చుకునేందుకు తగిన వనరులను అందిస్తుంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు, అధ్యాపకులకు జీతాలు, పరిశోధనలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రస్తుతం 84 దేశాలకు ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. అక్కడి ప్రజలకు పోర్చుగీస్‌ భాషను నేర్పేందుకు 357 సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీటిద్వారా లక్షన్నర మంది విద్యార్థులు ఆ భాషలో ఓనమాలు నేర్చుకున్నారు. మన దేశంలోని గోవా, దిల్లీలలోనూ ఇన్‌స్ట్యూటో కేమియో ద్వారా ఉచితంగా పోర్చుగల్‌ భాషను నేర్చుకోవచ్చు. 
      భాష నేర్చుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతోనే ఇన్‌స్ట్యూటో కేమియో పాత్ర ముగిసిపోదు. విదేశీ విశ్వవిద్యాలయాలు అన్నింటినీ సంప్రదిస్తూ, వాటిలో పోర్చుగల్‌ భాషను నేర్పే శాఖను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన శాఖలో ఉపాధ్యాయులను నియమించడం, విద్యార్థులకు భాషని బోధించేందుకు పాఠ్యాంశాలను రూపొందించడం, పరీక్షలు నిర్వహించడం, మూల్యాంకనం చేయడం... లాంటి ప్రక్రియలన్నింటిలోనూ చేయూతనందిస్తుంది. బోధనారంగంలోనే కాదు... భాష, సంస్కృతుల ప్రస్తావన వచ్చే ప్రతి సందర్భంలోనూ ఈ సంస్థ, తనదైన ముద్ర వేస్తుంది. సంస్కృతి, భాష, క్రీడలు, మాధ్యమాలకి సంబంధించి ఇతర దేశాలతో ఎలాంటి ఒప్పందం జరుగుతున్నా, ఆయా మంత్రిత్వ శాఖలు ఇన్‌స్ట్యూటో కేమియోని తప్పకుండా సంప్రదిస్తాయి.
పోర్చుగీస్‌ సమాఖ్య
ఓ దేశం తరపున ఇన్‌స్ట్యూటో కేమియో లాంటి సంస్థలు భాషాపరమైన కృషి చేయడమే గొప్పనుకుంటే, భాష కోసం దేశాలనే కలిపిన ఘనత పోర్చుగల్‌ది. అదే- కమ్యూనిడేడ్‌ డాస్‌ పేసెస్‌ డి లింగ్వా పోర్చుగీసా! కాస్త అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ‘అంతర్జాతీయ పోర్చుగల్‌ భాషా సమాఖ్య’. పోర్చుగీస్‌ అధికారిక భాషగా ఉన్న దేశాలు కలిసికట్టుగా ఏర్పరుచుకున్న సమాఖ్య ఇది. ఈ సమాఖ్యలో అంగోలా, బ్రెజిల్, కేప్‌ వెర్డ్, గినియా బిసావు, మోజాంబిక్, పోర్చుగల్, సావోటోమె, తైమూర్, ఈక్విటోరియల్‌ గినియా... అనే తొమ్మిది దేశాలు సభ్యులు. భాషే ప్రాతిపదికగా ఏర్పడిన అతి పెద్ద అధికార సంస్థ ఇదేనేమో! నిజానికి ఈ తొమ్మిది దేశాలూ నాలుగు ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. సంస్కృతీ సంప్రదాయాలలో ఒకటికొకటి పూర్తిగా భిన్నమైనవి. భాష మాత్రమే వాటిని ఏకం చేసిన అంశం. అదే సూత్రాన్ని పెనవేసి 1996లో ఈ సమాఖ్యని ఏర్పాటు చేశారు.
      పోర్చుగీస్‌ భాషా సమాఖ్య మొదలైనప్పుడు, ఎవరికీ దాని మీద పెద్దగా అంచనాలు లేవు. మహా అయితే ఏడాదికోసారి కలుసుకుని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారనీ, అంతకుమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే అభిప్రాయ భేదాలు తప్పవనీ ఊహించారు. గత 20 ఏళ్ల కాలంలో ఈ సమాఖ్య సాధించిన విజయాలను గమనిస్తే, భాషకి ఉన్న బలమేమిటో బోధపడుతుంది. ఈ సమాఖ్యలో మిగతా దేశాలతో పోల్చుకుంటే పోర్చుగల్, బ్రెజిల్‌ దేశాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. తైమూర్‌లాంటి సభ్యదేశాల్లోనేమో యువతకి సరైన చదువు, ఉపాధి అందుబాటులో ఉండేవి కావు. ఇన్‌స్ట్యూటో కేమియో ద్వారా వారిలో పోర్చుగల్‌ భాష మీద పట్టుని నిలిపి, సమాఖ్యలోని ఏ దేశంలో అయినా ఉపాధిని వెతుక్కునే అవకాశం కల్పించిందీ వ్యవస్థ. పైగా ఒక్కో దేశంలోనూ ఒక్కో తరహా వనరులు ఉంటాయి. ఒక దేశంలో మానవ వనరులు ఎక్కువగా ఉంటే, మరో దేశంలో చమురు నిక్షేపాలు అధికంగా ఉండవచ్చు, ఇంకో దేశం సముద్ర రవాణాకు అనుకూలం కావచ్చు. ఇలా సభ్యదేశాలలో ఉన్న సానుకూలతలను ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు దోహదపడిందీ సమాఖ్య. ఇలాంటి చర్యలతో సభ్య దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడిపోయింది. ఆయా దేశాలలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా, సమాఖ్య సూచించిన పరిష్కారాన్ని అమలుచేయడం మొదలైంది. సమాఖ్య జోక్యంతో సైనిక తిరుగుబాట్లు సైతం వెనకడుగు వేశాయంటే... ఈ ప్రభావం ఎంత లోతుకి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. భాష వారధిగా ఉపాధి, వ్యాపారం, ద్వైపాక్షిక సంబంధాలు కూడా మెరుగుపడతాయని నిరూపించిందీ సమాఖ్య. ఈ విజయాన్ని చూసి జపాన్, ఇంగ్లండ్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం సమాఖ్యలో అనుబంధ సభ్యులుగా ఉండేందుకు తహతహలాడుతున్నాయి. భాష అనే అనుబంధంతో దేశదేశాల గతులు ఎంతలా మారిపోతాయో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముంటుంది! ఈ సంస్థ గురించి మరిన్ని వివరాల కోసం https://www.cplp.org అనే అధికారిక వెబ్‌సైటుని చూడవచ్చు. కాకపోతే అందులో మచ్చుకైనా ఆంగ్లం కనిపించదు!!!
గాడిన పెడితే...
ఒక భాషని ప్రచారంలోకి తెచ్చేందుకు ఎంత కృషి అయినా చేయవచ్చు. కానీ ఆ భాషలోనే కొన్ని మౌలిక లోపాలు ఉంటే, ఎలాంటి ప్రయత్నమైనా అరకొర ఫలితాలనే ఇస్తుంది. అలాంటి ఓ లోపం పోర్చుగీస్‌ భాషలో ఉంది. ఒకప్పుడు దానికి నిర్దిష్టమైన లిఖిత నియమాలు ఏవీ ఉండేవి కావు. కవులు, రచయితలు అందులో సాహిత్యాన్ని సృజించినా కూడా... వారికి ఇష్టం వచ్చిన రీతిలో రాసేవారు. అవతలి వ్యక్తికి విషయం తెలియడం ముఖ్యం అన్నట్లుగానే సాగింది పోర్చుగీస్‌లో లేఖనం. 13వ శతాబ్దంలో పోర్చుగీసు భాషను స్థానికంగా అధికారిక భాషగా గుర్తిస్తే, 20వ శతాబ్దం వరకూ దానికంటూ ఓ అధికారికమైన లేఖన శాస్త్రమే (ఆర్థోగ్రఫీ) లేకపోయింది. 1910లో ఆ దేశంలో రాచరిక పాలన ముగిసి, మరుసటి ఏడాది రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కానీ, ఈ సమస్య మీద దృష్టి సారించలేకపోయారు. పోర్చుగల్‌ లిఖిత భాషను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఓ సంఘాన్ని నియమించింది. లబ్దప్రతిష్ఠులైన వ్యాకరణవేత్తలతో రూపొందిన ఆ సంఘం లాటిన్‌ లిపికి ఆధునిక ధ్వనిశాస్త్రాన్ని జోడించి భాషను రాసేందుకు కొన్ని నియమనిబంధనలు ఏర్పరిచింది. అయితే పోర్చుగల్‌ తన దేశంలో వినిపిస్తున్న భాషను చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది కానీ, పోర్చుగీస్‌ మాట్లాడే ప్రదేశాలన్నింట్లోనూ ఏకరీతిన సంస్కరణలు ఉండాలన్న విషయాన్ని మర్చిపోయింది. ఫలితంగా పోర్చుగల్‌ భాష ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరున ‘కనిపించడం’ మొదలుపెట్టింది. అట్లాంటిక్‌ మహాసముద్రానికి ఈవలి ఒడ్డున్న ఉన్న పోర్చుగల్‌లో రాసే భాషకీ, ఆవలి ఒడ్డున్న ఉన్న బ్రెజిల్‌లో కనిపించే శబ్దాలకీ పొంతన లేకుండా పోయింది. ఎప్పుడైతే పోర్చుగల్, బ్రెజిల్‌ దేశాలు తమ భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నాయో, అప్పుడిహ ఏకీకృత లేఖనం ఉండాలనే విషయం మీద దృష్టి పెట్టాయి. పోర్చుగల్‌ భాష మాట్లాడే దేశాల ప్రతినిధులందరినీ ఒకచోట చేర్చి, అందరికీ ఆమోదయోగ్యమైన లేఖనాన్ని రూపొందించాయి. 1986లో మొదలైన ఈ ప్రయత్నం అవిచ్ఛిన్నంగా 2016 వరకూ కొనసాగుతూనే వచ్చింది. ఇంత కృషి జరిగాక ఇక భాష గాడిన పడటమే కాదు... పరుగులూ పెడుతుంది కదా!
బ్రెజిల్‌ చేయూత
క్రీ.శ 1500 సంవత్సరంలో పోర్చుగల్‌ నావికులు బ్రెజిల్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ దేశం పోర్చుగీసుల పాలనలో ఉంది. పోర్చుగీసులను తరిమికొట్టిన బ్రెజిల్‌ వాసులు తమ ఉనికినైతే నిలబెట్టుకున్నారు. కానీ దేశంలో ఉన్న భిన్న జాతులను, సంస్కృతులను ఏకీకృతం చేయడానికి ఒక బలమైన భాష ఆలంబనగా ఉండాలని తెలుసుకున్నారు. అందుకోసం పోర్చుగీస్‌ భాషనే ఎంచుకున్నారు. చుట్టుపక్కల స్పానిష్, డచ్‌ లాంటి బలమైన భాషలు వినిపిస్తున్నా పోర్చుగీసుకే కట్టుబడి ఉన్నారు. అక్కడ అధికారిక వ్యవహారాలన్నీ పోర్చుగీసులో సాగాల్సిందే! ఆ భాషే తమని చుట్టుపక్కల దేశాలన్నింటికంటే భిన్నంగా నిలుపుతుందని భావిస్తారీ దేశ ప్రజలు.
      ఒకప్పుడు అనామకంగా ఉన్న ఈ దేశం ప్రస్తుతం శరవేగంగా పరిగెడుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలంతా ఇప్పుడు ఉపాధి కోసం బ్రెజిల్‌ వైపే అడుగులు వేస్తున్నారు. కానీ అక్కడ ఆంగ్లంతో నెట్టుకువచ్చేద్దామనుకుంటే మాత్రం ఆటలు సాగవు. అక్కడి భాష మీద పట్టు సాధించాల్సిందే. దాంతో అమెరికా లాంటి దేశాలలో సైతం పోర్చుగీసు నేర్చుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోనంతగా అక్కడ పోర్చుగీసు భాషాభిలాషులు బయల్దేరుతున్నారు. ఇక ప్రకృతి అద్భుతాలకు పెట్టింది పేరైన బ్రెజిల్లో పర్యటించాలనుకునే వారు కూడా పోర్చుగీసులో ఓనమాలు నేర్చుకునే వెళ్లాల్సిన పరిస్థితి. 2014లో ఇక్కడ జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్, 2016లో జరిగిన ఒలింపిక్‌ ఆటల నేపథ్యంలో బ్రెజిల్‌ ఒక్కసారిగా ప్రపంచ పటం మీద వెలిగిపోయింది. అక్కడి పరిస్థితులు బాగున్నాయనీ... పెట్టుబడుల కోసమో, పర్యటన కోసమో బ్రెజిల్లో అడుగుపెట్టాల్సిందే అని తపించే వారి సంఖ్య పెరిగిపోతోంది. దాంతోపాటే పోర్చుగీసు భాషకీ గిరాకీ పెరిగిపోతోంది.
ప్రపంచంలోనే తొలి ప్రయత్నం
సావో పాలో... బ్రెజిల్‌లో అతి పెద్ద నగరం. ఆర్థికంగా కూడా ఆ దేశానికి ఆయువుపట్టు. విద్య, వ్యాపారం, వినోదం వంటి అన్ని రంగాల్లోనూ సావో పాలో అభివృద్ధి పథంలో ఉంది. అలాంటి నగరంలో ఉపాధి దొరుకుతుందనే ఆశతో ఏటా లక్షలాది ప్రజలు వస్తుంటారు. అందుకనే అత్యధిక జనాభా కలిగిన ప్రపంచ నగరాలలో దీనిది 11వ స్థానం. సాధారణంగా ఇలాంటి హడావుడిలో భాష తప్పిపోతూ ఉంటుంది. రకరకాల భాషలు వచ్చి చేరుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే భాషలేమో పలచబడి పోతూ ఉంటాయి. కానీ బ్రెజిల్‌ ప్రభుత్వం మరోలా ఆలోచించింది. జనసాంద్రత ఎక్కువగా ఉందికాబట్టి, భాషని ప్రచారం చేసేందుకు ఇదే సరైన భూమికగా భావించింది. కొత్తగా వలస వస్తున్న ప్రజల్లో పోర్చుగీసు భాష పట్ల భయాన్ని పోగొట్టేందుకు, స్థానికంగా ఉన్నవారిలో అమ్మభాష పట్ల అభిమానం పెంచేందుకు ఆడే పాడే ఓ ప్రదర్శనశాలను (ఇంటరాక్టివ్‌ మ్యూజియం)ను సావోపాలో సమీపంలోని ఓ రైల్వేస్టేషన్లో నెలకొల్పింది. ప్రపంచంలోనే ఇలాంటి ప్రయోగం చేయడం అదే మొదలు. మూడంతస్తులుగా ఉండే ఈ భవనంలోకి అడుగుపెట్టినవారికి పోర్చుగల్‌ భాష పట్ల ఆసక్తిని రగిలించడమే దీని ఉద్దేశం.
      ‘మ్యూజిగా డ లింగ్వా పోర్చుగీసా’గా పిలుచుకునే ఈ భవనంలో రకరకాల విభాగాలు ఉండేవి. ఒకచోట మానవ చరిత్రలో భాష పరిణామం చెందిన తీరు, దాని ప్రభావం తదితర విషయాలను కళ్లకు కట్టే లఘుచిత్రాలను ప్రదర్శించేవారు. బ్రెజిల్‌ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలూ ఉండేవి. ఇంకోచోట బ్రెజిల్లో ఎక్కడ ఏ భాష మాట్లాడతారో చూపిస్తూ... ఆయా యాసలనీ, భాషలనీ వినిపించే రేఖాచిత్రాలు కనిపిస్తాయి. మరో అంతస్తులో గత ఆరువందల ఏళ్లుగా పోర్చుగీస్‌ భాష పరిణామం చెందిన క్రమాన్ని వివరిస్తూ, ఆ భాషలో వెలువడిన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల ప్రదర్శన జరిగేది. ఇవన్నీ చూసుకుంటూనే అక్కడక్కడా ఆగి పదాలతో ఆటలు ఆడుకోవచ్చు. వీటన్నింటినీ మించింది ‘ప్లాజా ఆఫ్‌ లాంగ్వేజ్‌’. ప్లానిటోరియంలో, తలపైకెత్తి ఖగోళ వింతల్ని వీక్షిస్తున్నట్టు... ఇక్కడ పోర్చుగీసు సాహిత్యం నుంచి ఎంపిక చేసిన రచనలను వీక్షించవచ్చు. వాటికి పోర్చుగల్‌ చిత్రకారులు సృజించిన కళాఖండాలు జతకాగా ఈ నేపథ్యంలో దేశం గర్వించే సంగీతకారుల శ్రుతులు వినవస్తుండేవి. ఓ అగ్నిప్రమాదం కారణంగా ప్రస్తుతం మూతపడిన ఈ ప్రదర్శనశాల తిరిగి 2019లో మరోసారి భాషాభిమానుల గుండెలు నింపనుంది.
      ఒకప్పుడు పోర్చుగీసులు తమ అధికారాన్ని విస్తరించుకునేందుకు తహతహ లాడారు. కానీ ఇప్పుడో... తమ భాషను వెలిగించేందుకు తాపత్రయ పడుతున్నారు. అంతటి దూకుడుని గమనించి ఒక్కోసారి మిగతా భాషల వారికి భయం వేయక తప్పదు. కానీ ఆ వేగంతో మన పోలిక ఎరుకలోకి వచ్చినప్పుడు సిగ్గుతో తలదించు కోవాల్సిందే. భాషని ప్రోత్సహించడం అంటే సభలు, చర్చలు, శాలువాలు, చప్పట్లతో తూతూమంత్రంగా ప్రయత్నాలు సాగించే ప్రభుత్వాలకి పోర్చుగీస్‌ కృషి ఓ మేలుకొలుపు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం