సారస్వత సింధుదర్శిని

  • 993 Views
  • 72Likes
  • Like
  • Article Share

    చీకోలు సుందరయ్య 

  • విశ్రాంత సీనియర్‌ అకౌంటెంట్‌, ఏజీ కార్యాలయం,
  • హైదరాబాదు
  • 9030000696
చీకోలు సుందరయ్య 

సృజనశక్తితో పాటు నిబద్ధత, ప్రాపంచిక దృక్పథం, జ్ఞానం, పలు సామాజిక శాస్త్రాల పరిచయం ఉంటే తప్ప మంచి విమర్శకులు కాలేరన్నది ఈ రంగంలో నిష్ణాతులైన వారి సూత్రీకరణ. ఇవన్నీ ఇనాక్‌కి కొట్టిన పిండి. అందుకే ఆయన తన ముందు తరం విమర్శకులు గుర్తించని, ప్రతిపాదించని, రుజువు చేయలేని అనేక అంశాల్ని వెలుగులోకి తెచ్చారు. ఇనాక్‌ పలు సందర్భాల్లో రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలు, లఘు పరిశీలనలు, జానపద సాహిత్య అధ్యయన ఆవశ్యకతని ప్రతిపాదించే ముఖాముఖి లాంటివాటితో ‘విమర్శిని’ గ్రంథం 2013లో ముద్రితమైంది. ఇందులో ‘తెలుగు వెలుగులు, తెలుగు నవల, తెలుగు కథానిక’ అనే మూడు విభాగాలున్నాయి. 
      ‘‘మాండలికం అంటే భాష కాదు. జీవితం. ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఇల్లు, వాకిలి, సొమ్ము, సొత్తు, మొత్తం కలిస్తే ఆ మండల లక్షణం’’ అంటూ, పరిశోధనల్ని, విమర్శల్ని కూడా మాండలిక భాషలో రాసే స్థితికి మనం ఎదగాలని అంటారు ఇనాక్‌. ‘తెలుగువెలుగులు’ విభాగంలో ఒక వ్యాసంలో మాండలికాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. పరవస్తు చిన్నయసూరి- జీవితం, కృషి గురించి ఆయన పరిశోధన సంక్షిప్తమైనా సమగ్రం. సూరి ఎదుర్కొన్న పరిస్థితులు, అవహేళనలను చిత్రిస్తూ బాలవ్యాకరణం, తెలుగు నిఘంటువు, నీతి చంద్రిక నిర్మాణంలో ఆయన కృషిని బేరీజు వేశారు.   సి.నారాయణరెడ్డి వచన కవితా శిల్పం, రెక్కల సంతకాలు కావ్యం మీద ఇనాక్‌ రెండు వ్యాసాలు రాశారు. సినారె వచన కవితా శిల్పాన్ని అనుభూతి- అనుబంధం - నిర్ణయంగా సూత్రీకరిస్తూ భావి పరిశోధకులకు మార్గం సుగమం చేశారు. డా।। బోయి భీమన్న సాహిత్యంలో జాతీయ దృక్పథం ఎలా ఉందో వివేచించిన తీరు ఇనాక్‌ అసమాన ప్రతిభకు నిదర్శనం. ప్రాచీన సంప్రదాయాన్ని తిరస్కరించి నవీన సంప్రదాయాన్ని భీమన్న సృష్టించే క్రమంలో పొందిన తాదాత్మ్యాన్నీ, తిరుగుబాట్లనీ, చైతన్య జ్వాలా తపస్సునీ ఇనాక్‌ తాననుభ వించి పాఠకులు అనుభవించేలా చేశారు. 
      మాతృభాషలో విద్యాబోధన ఎందుకు, ఎలా జరగాలో తనకున్న అపారమైన అనుభవంతో విశ్లేషించారు ఇనాక్‌. ఆయా పాఠ్య విష యాలకు సంబంధించిన పుస్తకాలు లేక పోవడం ఓ సమస్య అయితే, చాలినంతగా స్వతంత్ర గ్రంథ రచన జరగకపోవడం మరో సమస్య అని ఆయన గుర్తించారు. తెలుగు వాచకరచనలో ఎలాంటి మార్పులు తేవాలో సూచించారు. విచిత్ర పదరూపాల్ని, అర్థంకాని వ్యాకరణ విషయాల్ని విసర్జించాలంటూ పాండిత్య ప్రకటన కాదు భావ ప్రకటనకు వీలు కల్పించాలని స్పష్టం చేశారు. తెలుగు సాహిత్యం పండిత ప్రాంగణం నుంచి భిన్న సామాజిక వర్గాల సమాలోచనంలోకి విస్తరించిన క్రమాన్ని తెలుపుతూ నాళం కృష్ణారావు, ఆయన కుమార్తె ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సారస్వత కృషిని రేఖా మాత్రంగానే అయినా చక్కగా చిత్రించారు ఇనాక్‌. నాళం వారి ‘పాపాయి’ కావ్యం ప్రపంచ స్థాయి స్మృతి కవిత్వమని పేర్కొన్నారు. ‘అందారు పుట్టీరి హిందమ్మ తల్లికి’ అనే పాట నూరేళ్లు పూర్తి చేసుకున్నప్పుడు 2009లో ఇనాక్‌ దాని మీద వ్యాసం రాశారు. కవి పేరు తెలియకపోయినా దళిత కవిత్వంలో తొలి గీతంగా అవతరించిన ఆ పాట ఎవరెవరికి ప్రేరణగా నిలిచిందో విశదీకరించారు. మరో వ్యాసంలో అడవి బాపిరాజు ఉప్పర వాళ్ల జీవితాన్ని చిత్రించిన ‘వాన’ కథని సమీక్షిస్తూ సమాజంలోని సామాన్యుల్ని సాహిత్యంలో మాన్యుల్ని చేసిన ఘనత బాపిరాజుకి దక్కిందన్నారు. ‘వలస రచయితలు-సాహిత్య చైతన్యం’లో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన రచయితలు తమ ప్రాంతం వారి పట్ల సహానుభూతి చూపలేకపోతే తాము స్థిరపడిన ప్రాంత ప్రజల సమస్యల్ని చిత్రిస్తూ గొప్ప రచన చేయలేరని సోదాహరణంగా పేర్కొన్నారు. 
      ఆర్థిక సమానత్వం వాంఛించే క్రమంలో అసమానతలు అంతరించడానికి తెలుగు నవల విశేష కృషి చేసిందని తేల్చారు ఇనాక్‌ ‘తెలుగు నవల’ విభాగంలో. తెలుగు నవల పుట్టుక, వికాసం, జీవిత చిత్రణ, సంప్రదాయ పునరుద్ధరణ, ఆర్థిక రాజకీయ దృష్టికోణాలు, స్వాతంత్య్రేచ్ఛ, అపరాధ పరిశోధన, వస్తు పరంగా విభజన లాంటి విస్తృత అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. నరహరి గోపాలకృష్ణమ చెట్టి రాసిన ‘శ్రీరంగరాజ చరిత్ర’ తొలి తెలుగు నవల అని సప్రమాణంగా ఇందులో నిరూపించారు ఇనాక్‌. ఇక ‘మాలపల్లి’ నవలని కాంగ్రెస్‌ వాళ్లు ఎందుకు నెత్తికెత్తుకున్నారో, జస్టిస్‌ పార్టీ ఎందుకు నిషేధించిందో, ఉన్నవ అపరచాణక్య నీతి ఏంటో వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. సంప్రదాయ పునరుద్ధరణ కోసం నడుం బిగించిన విశ్వనాథ సత్యనారాయణ నవలలు, స్త్రీ జనోద్ధరణ కోసం అంకితమైన చలం గురించి చేసిన వ్యాఖ్యలు, వివరణలు కొత్త కోణాలు ఆవిష్కరిస్తాయి. గోపీచంద్‌ సృష్టించిన అబ్రాహ్మణ స్త్రీ పాత్రల ఆర్థిక దృష్టిని ఇనాక్‌ పటాపంచలు చేశారు. అనువాద నవలు, అపరాధ పరిశోధన నవలల్లోని పాత్రలు తెలుగు సమాజంపై చూపిన ప్రభావాన్ని బాగా పట్టుకోగలిగారు. రచయిత్రుల నవలల్లోని సామాజిక చిత్రణ, అనుభూతి మాధుర్యం, పాత్రల చైతన్యం లాంటి వాటిని, పంచమ జీవిత సానుభూతి నవలల్లోని సమాజ స్థితిగతుల్ని ప్రత్యేకంగా వివరించారు. మనో వైజ్ఞానిక, అస్తిత్వవాద, సైన్స్‌ ఫిక్షన్‌, మనో వైజ్ఞానిక తదితర నవలల గురించీ ప్రస్తావించారు. 
కథాదీపాలపై...
కథకీ, కథానికకీ తేడా ఏంట‌నే వివరణతో మూడో విభాగం ప్రారంభమవుతుంది. మొదటి వ్యాసంలో తెలుగు కథానిక విశ్వరూపాన్ని పరిచయం చేశారు. తెలుగు కథానికకి ఆద్యురాలు బండారు అచ్చమాంబ (ధనత్రయోదశి - 1803) అని పేర్కొన్నారు. నాటి గురజాడ కథానికలు, తెలుగు కథానికల్లో స్త్రీల జీవితాలు, అబ్రాహ్మణ జీవితాలు... ఇలా వివరిస్తూ ప్రముఖ కథకుల రచనలను సోదాహరించారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ‘గొల్ల రామవ్వ’ కథానికని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక స్త్రీల కథానికలు, రచయిత్రుల చైతన్యం శీర్షికల్లో గోపి భాగ్యలక్ష్మి ‘జంగుబాయి’, కరుణ ‘తాయమ్మ’ కథానికల్నీ పేర్కొంటూ ఇవన్నీ స్త్రీ హృదయ సౌకుమార్యం ప్రకటించేవని విశ్లేషించారు. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, గిరిజన, మైనార్టీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ వాదాలకు సంబంధించి పలువురు ప్రముఖుల కథానికల్ని వ్యాఖ్యానించారు. ప్రాంతీయంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, సర్కారు ప్రాంతాల కథానికలకు విడిగా స్థానం కల్పిస్తూ ఆయా రచయితల ముఖ్య కథానికల్ని విశ్లేషించారు. వర్తమాన కథానిక స్వరూపాన్ని చిత్రిస్తూ సమాజంలో మౌలిక మార్పులు వచ్చినప్పుడు సాహిత్యంలో అవి గుణాత్మకంగా ప్రతిఫలిస్తాయన్నారు. అనుబంధంలో-వర్తమాన సాహిత్య స్వరూపం, కథానికా నిర్వచనం, పరిణామం, తెలుగు కథానికా వస్తువు, పాత్రల చిత్రణ అనే అంశాల మీద అదనపు సమాచారం, విశ్లేషణ అందించారు. పలు కథానికల్లోని పాత్రలు ఎలా సజీవంగా నిలిచాయో ఉదాహరించారు. ‘‘భిన్న సామాజిక రంగాల్లోని విభిన్న పాత్రలు కథానికా సాహిత్యంలో దర్శనమిస్తున్నాయి. ఇంతకు పూర్వమెప్పుడూ ఇంతమంది పాత్రలుగా సాహిత్యంలో గోచరం కాలేదు. ఉత్తమ కథకు మిగతా హంగులతో పాటు ఉత్తమ పాత్రల అవసరం గుర్తించి, సజీవ పాత్ర చిత్రణం చేస్తున్న తెలుగు కథా రచయితలు తెలుగు కథను అంతర్జాతీయ గౌరవానికి అర్హంగా నిలుపుతున్నారు’’ అని ప్రశంసించారు ఇనాక్‌. 
      కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల స్పందిస్తూ.. ‘‘ఏ మనిషైనా రచయిత, పరిశోధకులు, విమర్శకులు కావడానికి దోహదపడిన సామాజిక సమకాలీన సాహిత్య చైతన్యానికి రుణపడి ఉన్నాను. నన్ను రుణ విముక్తుణ్ని చెయ్యొద్దని ఈ పురస్కారాన్ని వేడుకుంటున్నాను’’ అన్నారు ఇనాక్‌. ఇది ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. స్వయంగా కథా, నవలా రచయిత అయినా తన రచనల గురించి ‘విమర్శిని’లో ఎక్కడా ప్రస్తావించుకోలేదాయన. ప్రస్తుతం ఏడు పదులకు పైబడిన వయసులోనూ అలుపెరుగకుండా సారస్వత కృషి సాగిస్తున్న ఇనాక్‌, తెలుగు సాహితీ కీర్తి కిరీటంలో నిత్య ధగద్ధగాయమాన రత్నం.


వెనక్కి ...

మీ అభిప్రాయం