తేలి తేలి  నా మనసు..

  • 596 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొట్టి వెంకటశివప్రసాదరావు

  • అద్దంకి ప్రకాశం జిల్లా
  • 9866391738
పొట్టి వెంకటశివప్రసాదరావు

ఆమె:    తేలి తేలి నా మనసు తెలియకనే నావ వలే ఊగుచున్నదే 
అతడు:    అలలు లేచి ప్రేయసీ హాయియని పాట విని తాళం వేయునే    
ఆమె:    ప్రేమ ముందు కొండ కూడ చిన్నదైనదో 
అతడు:    కొండ వంటి గుండె నీవు తెలియలేవులే 
ఆమె:    తేట నీరు వంటి మంచి ప్రేమ ఇదేనోయ్‌... 
అతడు:    నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే
ఆమె:    ఇంత వింత మాటలాడ ఎవరు నేర్పిరో    
అతడు:    నీదు ఓర చూపులోన నేర్చుకుంటినే
ఇద్దరూ:    సాగరాన ఆగకనే ప్రేమయనె పెన్నిధికై సాగిపోదమా

‘వీరకంకణం’ (1957) చిత్రం కోసం ఆరుద్ర రచించిన పాట ఇది. సుసర్ల దక్షిణామూర్తి స్వరాలందించారు. ఘంటసాల, జిక్కి ఆలపించారు. జగ్గయ్య, జమునల మీద చిత్రీకరించారు. ఈ పాట ఆలాపన మధురంగా ఉంటుంది. చరణానికి చరణానికి మధ్య ఉన్న విరామాల్లోనూ, పాడే పద్ధతిలోనూ గీత స్వభావానికి తగ్గట్టుగా తేలిపోతున్న భావన కలిగేలా స్వరపరిచారు దక్షిణామూర్తి. అడ్డూ ఆపూ లేని ఓ నది ఎన్ని మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుందో.. నది పేరుని ఇముడ్చుకున్నందుకన్నట్టుగా యమన్‌ కల్యాణి రాగం కూడా ఈ పాటలో అన్ని పోకడలు పోయింది. ‘ప్రేమ ముందు కొండ’, ‘తేటనీరు’ లాంటి చోట్ల మెలికలు తిరిగిపోయింది. ‘ఇంత వింత మాటలాడ ఎవరు నేర్పిరో’ దగ్గర ఒదిగిపోయింది. ‘కొండవంటి గుండె’, ‘నీదు ఓర చూపులోన’ దగ్గర ఎగుడు దిగుడుల్లో పూర్తి పట్టుగల శాంతి గంభీరత్వాన్ని పోలిన నడకలు నడిచింది. ‘నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే’ అన్న చోట ఎంత ఎదగాలో అంత ఉవ్వెత్తున ఎగసిపోయింది. తమ ప్రతిభను తెలుసుకోవాలనే గాయనీగాయకులకు ఈ పాట ఓ చిన్న పరీక్షలాంటిది. 
తమిళంలో ఇంతకు ముందే (1950ల్లో) వచ్చిన ‘మంత్రికుమారి’ చిత్రంలో ఇదే బాణీతో వచ్చిన ‘‘ఉలవుమ్‌ తెండ్రళ్‌ పాటైయిలె ఓడమదె నా మదిళ్లె ఊంజలాడిదే’’ పాటను జిక్కి, తిరుచ్చి లోకనాథ]న్‌ పాడారు. తమిళ గీతాల్ని వినే అలవాటున్న తెలుగువారికి ఈ తిరుచ్చి లోకనాథన్‌ మన ‘‘వివాహ భోజనంబు’’ పాటను తమిళంలో ‘‘కళ్యాణ సమయపాదం’’గా పాడిన గాయకుడని గుర్తుండే ఉంటారు. ఒకే బాణీతో రెండు పాటలు వేర్వేరు భాషల్లో వచ్చినప్పుడు వాటిని పాడిన వాళ్ల గాన సామర్థ్యానికి సంబంధించిన చర్చ తప్పనిసరిగా వచ్చితీరుతుంది. అందులో భాగంగా చూస్తే- ‘‘తేలి తేలి..’’ని, ‘‘ఉలవుమ్‌..’నూ పక్కపక్కన పెట్టుకుని వింటే ఘంటసాల మనవాడైనందుకు గర్వపడతాం. అలాగని మరో గాయకుణ్ని తక్కువ చేయడం సంస్కారం అనిపించుకోదు- ఈ పోలిక కేవలం సామర్థ్యం తెలుసుకోవటానికే! పాట విలువను తెలియచేయటానికే! ఈ గీతం మరో ప్రత్యేకత.. చరణాలు మొదలైన తర్వాత పాట పూర్తయ్యే వరకూ పల్లవి ఎక్కడా తిరిగి రాదు. ఆరుద్ర రచన గొప్పదనమదే! చిత్ర కథానాయకుడు ఎన్‌.టి.రామారావుకు ఎ.ఎమ్‌.రాజాతో పాడిస్తే, ప్రతినాయకుడు జగ్గయ్యకు జమునతో ఉన్న రెండు యుగళగీతాలను ఘంటసాలతో పాడించ టం ‘వీరకంకణం’లోని మరో విశేషం! 


వెనక్కి ...

మీ అభిప్రాయం