క‌వ‌చం, సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం - వెండితెర వెన్నెల‌

  • 480 Views
  • 2Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
పదునైన కథనం..

అబ్బాయిలు ప్రేమించే ముందు రిస్క్‌ చేస్తారు అమ్మాయిలు ప్రేమించిన తర్వాత రిస్క్‌ చేస్తారు.. ఎందుకా అని కథానాయకుడు నవ్వుకుంటుంటే, ప్రేమ వర్షం లాంటిది.. అబ్బాయిలు వర్షం పడాలని కోరుకుంటారు. అమ్మాయిలు ఆ వర్షంలో తడవాలని కోరుకుంటారు.. అంతే సింపుల్‌..’’ ‘కవచం’ చిత్రంలోని ఇలాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి.
ప్రేమంటే పిచ్చి అని విన్నాను.. ఇప్పడు చూస్తున్నాను అంటాడు కథానాయకుడు.. ఆ మాత్రం పిచ్చి లేకపోతే ప్రేమ ఎలా అవుతుంది.. ఆ పిచ్చి లేకపోతే తాజ్‌మహల్‌ను సమాధనే వదిలేసేవాళ్లు.. అంటుంది నాయకి. ఇలాంటి సంభాషణలు యువతకు నచ్చేలా సాగుతాయి. 
కథానాయకి ఇంటి పేరు మార్చుకొమ్మని నాయకుడి తల్లి అడగటం నవ్వులు పూయిస్తుంది. నీ రేంజ్‌కి ఇంటిపేరు ఓ దేవరకొండ, ఓ సిరికొండ, ఓ బెల్లంకొండ అయితే బాగుంటుందని అంటుందామె. 
ప్రతినాయకుడు ‘‘గెలిచింది నువ్వా నేనా’’ అని నాయకుణ్ని అడిగితే, ‘‘గెలుపు, ఓటమి అనేవి పరుగెత్తే రెండుకాళ్ల లాంటివిరా.. వాటి ప్లేసులు మారడానికి అరసెకెను చాలు..’’ అని రాసిన అబ్బూరి రవి, కేశవ్‌ పప్పల సంభాషణలు ఈలలు వేయిస్తాయి. పాటËల్లో ‘ప్రేమను మించిన ప్రేమే ఏదని మనసును ప్రశ్నించా.. ఊపిరి మించిన శ్వాసే ఏదని గాలిని ప్రశ్నించా..’ అంటూ సాగిన శ్రీమణి యుగళం మధురంగా సాగిపోతుంది. ‘నాలుగు పెదవులు రెండవ్వాల.. నువ్వూ నేనూ నేనూ నువ్వో ట్రెండవ్వాల’ అంటూ సాగే చంద్రబోస్‌ పాట జోరెత్తిస్తుంది.


ఉత్కంఠపురం..
దేవుడి మీద నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య దోబూచులాట ఈనాటిది కాదు. ఈ నేపథ్యాన్ని మళ్లీ ఓ ఉత్కంఠ రేపే కథతో ముడిపెట్టుకుని తీసిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’.
‘‘మన భారత దేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో పురాతన విగ్రహాలు ఎన్నో ఏళ్ల నుంచీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు, మహిమలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ మహిమలు నిజమేనా? వీటి వెనకాల ఉన్నది దైవశక్తా మానవ మేధస్సా? ఇది కనుక్కోడానికే నేనీ ప్రాజెక్టు స్టార్ట్‌ చేశాను’’ అని నేరుగా కథలోకి తీసుకెళ్తాడు నాయకుడు. నాస్తికుడైన ఇతను పురాతన గుళ్లూ, దేవుళ్లూ వంటి విషయాలను అధ్యయనం చేస్తుంటాడు. కథలో భాగంగా దేవనాగరి లిపిలో రాసిపెట్టిన ఉత్తరాలకు సంబంధించిన చర్చ ఆసక్తి కలిగిస్తుంది.
దేవుడి గుడి శిఖర కుంభం కూలిపోగానే అపశకునం అని పూజలు చేయడాన్ని నిరసిస్తాడు నాయకుడు. ‘‘ఇప్పుడు చూడండి. ఇది దుశ్శకునం అని చెప్పి పూజలు యాగాలు యజ్ఞాలు చేయించమంటారు. రెండువేల సంవత్సరాల గుడండీ ఇది. పగుళ్లు రావా.. వందరూపాయలుపెట్టి సిమెంటుతో అతికించేదానికి ఇప్పుడు స్వామీజీ ఎంత బిల్లు వేస్తారో’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు వేస్తాడు.
మరోవైపు ఉపకథలో సుబ్రహ్మణ్యపురం ఊరు ఎలా ఏర్పడిందో చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలెగ్జాండర్‌, హిట్లర్‌ వంటి వాళ్లు యుద్ధాల్లో వాడిన ఒక ప్రమాదకరమైన మందు గురించి చెబుతారు. తర్వాత సుబ్రహ్మణ్యపురం రాజు రవివర్మ తయారుచేయించిన ఔషధం సంగతులూ రోమాంచితంగా సాగుతాయి. 
‘‘అసెంబ్లీలో అధికార పక్షంలాగ మనవాడికి మాట్లాడే ఛాన్సు కూడా ఇవ్వలేదట..’’ అంటూ నాయకి పాత్ర స్వభావం చెప్పడం బాగుంది. కథా నాయకుడి నేస్తాల మధ్య సన్నివేశాలూ ఆకట్టుకుంటాయి. 
‘ఈరోజిలా..’ పాటలో ‘నీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటే నీ నవ్వు ఊపిరిని పోస్తుందిలే..’ అన్న సురేశ్‌ బనిశెట్టి భావాలు బాగున్నాయి.
సాహో షణ్ముఖా.. పాట జొన్నవిత్తుల కలంలో ఆర్ద్రంగా సాగుతుంది. పూర్ణాచారి స్నేహగీతం నేటి యువత మనస్తత్వానికి అద్దం పడుతుంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం