భాషకు పొదరిల్లు ... భావాల హరివిల్లు

  • 827 Views
  • 44Likes
  • Like
  • Article Share

మనిషంటేనే ఎన్నెన్నో భావాల వాహిక. బోలెడన్ని అనుభూతుల జమిలిక. వాటికి అక్షర రూపమివ్వాలని, నలుగురితో పంచుకోవాలనే ఆరాటపడేవారెందరో! అలాంటి వాళ్లకి వేదికగా నిలుస్తోంది ‘భావుక’ ఫేస్‌బుక్‌ సమూహం. సామాజిక మాధ్యమాల్లో ‘అ ఆ’లు ఏబీసీడీలను ఆలింగనం చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలుగులో పోస్టులతో అమ్మభాష కమ్మదనాన్ని నలుగురికీ పంచుతోందీ సమూహం. అంతర్జాలమే వారధిగా భావపరిమళాలను ఆస్వాదిస్తున్న ఈ సమూహ సభ్యులు.. ఏటా ఆత్మీయ సమావేశాలతో నిజజీవితంలోనూ నేస్తాలవుతున్నారు. 
విభిన్న
అనుభూతుల సుమమాలిక, తెలుగు భాషా సంస్కృతుల సుగంధ వీచిక ‘భావుక’ ఫేస్‌బుక్‌ సమూహం (గ్రూపు). కథలు, కవితలు, సంగీతం, చిత్రలేఖనం, విజ్ఞానం, హాస్యం, ఆత్మీయ పలకరింపులు, అమ్మభాషలో మనస్ఫూర్తిగా అందించే శుభాకాంక్షలు... మొత్తంగా ‘భావుక’ సమూహం అచ్చమైన తెలుగు పలుకుకి, సంస్కారపూరిత వాతావరణానికీ నెలవు. భాషాభిమానులకు ఆహ్లాదాన్ని అందించడం, అందమైన భావాలను పంచుకోవడం, మనసారా నవ్వుకోవడం, చక్కటి సాహిత్యం, సంగీతం, పర్యాటక అనుభూతులు పంచుకోవడమే ఈ సమూహం లక్ష్యం.
ఫేస్‌బుక్‌లో తమ భావాలు పంచుకోవడానికి 2014లో ఇద్దరు స్నేహితురాళ్లు ‘భావుక’ సమూహాన్ని ఏర్పాటుచేశారు. నాలుగు వసంతాలు గడిచేసరికి ఇది ఆరున్నర వేల మందికి పైగా సభ్యుల కుటుంబంగా ఎదిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన కాశీభట్ల కళ్యాణి గౌరి, బొబ్బిలికి చెందిన వసంత శ్రీ.. బొబ్బిలి కళాశాలలో కలిసి చదువుకున్నారు. కృష్ణశాస్త్రి, రాయప్రోలు లాంటి కవుల ప్రభావంతో భావకవిత్వం రాసుకునేవారు. తర్వాత పెళ్లిళ్లు, కుటుంబం, ఉద్యోగబాధ్యతల్లో ఏళ్లు దొర్లిపోయాయి. అయితే కవిత్వం, తెలుగు పట్ల అనురాగం వాళ్ల మనుసుల్లో పదిలంగా అలాగే ఉంది. నాలుగేళ్ల కిందట ఒకసారి వాళ్లిద్దరూ కలుసుకున్నప్పుడు ‘భావుక’ ఆలోచన వచ్చింది. భావాలు, అనుభూతులను అక్షరాలుగా మలచాలనే ఆకాంక్ష ఉన్నవారిని ఒక వేదిక మీదకి తేవాలనే తలంపుతో వాళ్లిద్దరూ కలిసి ఈ ఫేస్‌బుక్‌ సమూహాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే ఇది అనేకమంది భావుకులకు వేదికైంది. రోజు రోజుకీ ఇంకా ఎందరో భాషా ప్రియులను తనతో కలుపుకుంటూ సాగుతోంది. ప్రస్తుతం పన్నెండు మంది అడ్మిన్ల పర్యవేక్షణలో ‘భావుక’.. తన సభ్యులందరికీ తెలుగు భాషా సుమగంధాలు పంచుతోంది. 
కార్టూన్లు, చిత్రలేఖనాలూ 
దేన్నయినా సరే తెలుగులోనే టైపు చెయ్యాలన్నది ‘భావుక’ నియమం. ఈ సమూహంలో ఆంధ్ర, తెలంగాణ వాసులతో పాటు విదేశాల్లోని ఇరవై మంది, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన రెండు వందల మందికి పైగా తెలుగువారు సభ్యులుగా ఉన్నారు. గుంటూరుకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఆధారపు మురళీకృష్ణ జంధ్యాల పేరడీలతో సమూహంలో నవ్వులవానలు కురిపిస్తుంటారు. పాము, దయ్యం కథలు కూడా రాస్తుంటారు. ఈయన అర్ధాంగి ఉమాదేవి కూడా ‘భావుక’ కుటుంబ సభ్యురాలే. భోపాల్‌లో ఉండే రచయిత్రి భార్గవి ఈ సమూహంలో ధారావాహికలు నిర్వహిస్తున్నారు. విజయనగరానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జేపీ శర్మ కూడా తన కథలను ‘భావుక’లో పంచుకుంటున్నారు. ‘‘కోట్ల ధనము కలుగ కొదవేను మనిషికి/ స్వార్థ చింత నొదిలి సాగడెపుడు/ చిన్న జల్లుతోనె చిగురించి పూయును/ తృప్తిబడును మొక్క తృష్ణలేక’’ లాంటి సందేశాత్మక పద్యాలు పోస్టు చేస్తుంటారు సహాయ వాణిజ్య పన్నుల శాఖాధికారి మంతెన ఝాన్సీ. ‘భావుక’ సభ్యుల పుట్టినరోజులప్పుడు కంద పద్యాలతో శుభాకాంక్షలు తెలపటం విశాఖపట్నానికి చెందిన ఓలేటి శశికళ ప్రత్యేకత. ‘‘భావుక వేదిక నేకీ/ భావము పెనకువను బెంచె భాసురమౌగన్‌/ వేవేల స్నేహకరముల/ కోవిదయై సంఘటించె కూరిమి మీరన్‌’’ అంటూ ‘భావుక’ వ్యవస్థాపకురాలు కళ్యాణికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందించారు శశికళ. గృహిణి అయిన ఈమె మంచి కథకులు కూడా. వాటినీ ‘భావుక’లో పోస్టు చేస్తుంటారు. ‘‘ఎన్ని సమూహమ్ములనవి/ కన్నను మన భావుక గతి కాదొక్కటియున్‌/ మిన్నంటి యెన్ని తారక/ లున్నను శీతాంశుమూర్తి కొకసరి కలదే?’’ లాంటి చక్కని పద్యాలతో సభ్యులను ఆకట్టుకుంటూ ఉంటారు ఆదిలాబాదు చెన్నూరుకు చెందిన పద్యకవి ఎంవీ పట్వర్ధన్‌. ఇక హైదరాబాదులో ఉండే మరో గృహిణి మీనాక్షి వేదుల తన పోస్టుల్లో పురుషాహంకారాన్ని ఎండగడుతుంటారు. ‘‘చావు లాంటి జీవితాన్ని భరిస్తూ నిన్ను బతికించే నైజం మాది/ మంచిగా బతికే అవకాశమున్నా నీ దరిద్రపు కోరికల కోసం మమ్మల్ని చంపే నైజం నీది/ అందుకే నువ్వే చావు చావు చావు’’ అంటూ కొంచెం ఘాటుగానే పోస్టులు పెడతారీమె. ‘‘రామాయణంలో ఏ పాత్ర గొప్ప క్రికెట్‌ ఫీల్డర్‌?’’ అంటూ ప్రాచీన, సమకాలీన అంశాలకి ముడిపెడుతూ సభ్యులకు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తుంటారు విశాఖవాసి, న్యాయవాది వృద్ధుల కల్యాణ రామారావు. ప్రాచీన కావ్యాల్లోంచి చక్కని పద్యాలను విశ్లేషణాత్మకంగా అందిస్తుంటారీయన. రామారావు సతీమణి విజయలక్ష్మి కూడా భావుక సభ్యురాలే.
      ‘భావుక’లో ప్రత్యేకంగా నిలిచేది ప్రహేళిక. విజయనగరానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఎంఎస్‌వీ గంగరాజు 15 రోజులకోసారి ఓ ప్రహేళిక ఇస్తుంటారు. దీన్ని పూరించడానికి నాలుగైదు రోజులు గడువు విధించి, ప్రతిసారీ ఇద్దరు విజేతలను ఎంపిక చేసి స్వయంగా బహుమతులు అందిస్తారు. ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఉండే తాతిరాజు జగం కూడా కాలక్షేపం ప్రహేళిక నిర్వహించి బహుమతులు ఇస్తున్నారు. బెంగళూరులో నివసించే తల్లాప్రగడ మధుసూదనరావు గణిత ప్రహేళికలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ‘భావుక’లో చక్కని చిత్రలేఖకులు, కార్టూనిస్టులు కూడా కనిపిస్తారు. ముంబయిలో ఉండే జూనియర్‌ కన్నాజీరావు, హైదరాబాదుకు చెందిన ఏఆర్‌ సుధాకర్‌ కడుపుబ్బా నవ్వించే కార్టూన్లతో సభ్యులను ఆనంద డోలికల్లో ఓలలాడిస్తుంటారు. గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌ విశ్రాంత ఉద్యోగి పీవీఆర్‌ మూర్తి, హైదరాబాదు వాసి సావిత్రి లొల్ల తమ చిత్రలేఖనాలను సమూహంలో పోస్టు చేస్తుంటారు. సావిత్రి ఒక్కోసారి బొమ్మగీసి ఆ వ్యక్తెవరో కనిపెట్టాలని సభ్యుల మేధకు పరీక్ష పెడుతుంటారు. కన్నాజీరావు కూడా సందర్భానుసారం ఆయా వ్యక్తుల స్మృతిగా చిత్రలేఖనాలు పోస్టుచేసి వాళ్ల గొప్పదనం గుర్తుచేస్తూ ఉంటారు. ఇంతేనా! పురాణాలు, కావ్యాలకు సంబంధించిన అంశాలు, పాత సినిమా పాటలు, సంగీతం, యాత్రా విశేషాలు ఇలా తమ మదిలో భావ మధురిమలు ఊరించే ప్రతి అంశానికీ సభ్యులు అక్షర రూపం ఇస్తుంటారు. స్టేట్‌ బ్యాంకు విశ్రాంత అధికారి పెయ్యేటి రంగారావు విష్ణుసహస్రనామావళిని ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా అందిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన నళిని యర్రా మన పండగలు, ఆచార వ్యవహారాలు, గత స్మృతులు, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు పోస్టు చేస్తుంటారు. ఇంకా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్లలో తమ దృష్టికి వచ్చే మంచి విషయాలనూ సభ్యులంతా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ‘భావుక’ నిర్వాహకులు ‘గొలుసు కథలు’ ప్రారంభించారు. ఒక కథను నలుగురైదుగురు పూర్తిచేయడం దీని ప్రత్యేకత. ఇది సభ్యులను బాగా ఆకట్టుకుంటోంది. ‘‘తల్లిదండ్రులకు పిల్లలు దూరమవుతున్న తరుణంలో ‘భావుక’ ఓ మంచి వేదిక. మీకు మేమున్నామనే భరోసాని ఇది అందిస్తోంది. సభ్యులందరూ ఉత్సాహంగా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటే ఎంత ఉపయుక్తంగా ఉంటుందనే దానికి భావుక ఒక ఉదాహరణ’’ అని చెబుతారు భావుక అడ్మిన్లలో ఒకరైన సుసర్ల సర్వేశ్వర శాస్త్రి. ఈయన విశాఖ ఉక్కులో మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. వసుధైక కుటుంబ భావనకు నిజంగానే ‘భావుక’ ఓ ప్రతీక. 
ఆత్మీయ సమ్మేళనం
ప్రముఖ వైణికులు అయ్యగారి శ్యామసుందరం, ప్రఖ్యాత హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, పాతతరం రచయిత్రి తమిరిశ జానకి, ఇంకా సుజల గంటి, సమ్మెట ఉమాదేవి, మిరాజ్‌ ఫాతిమా, మహమ్మద్‌ అలీరావు లాంటి రచయితలు, వీఆర్‌ గణపతి, ఎం.వి.పట్వర్ధన్‌, అర్క సోమయాజి లాంటి పద్యకవులు, అలాగే రంగస్థల నటులు, నాటక రచయితలు ఇలా ఎందరో ‘భావుక’లో సభ్యులు. ఈ ఫేస్‌బుక్‌ సమూహంలో సింహభాగం నలభై దాటిన వాళ్లే. చాలా మంది విశ్రాంత ఉద్యోగులే. అందుకేనేమో ఇందులోని పోస్టులన్నీ చాలా పరిణతితో కనిపిస్తాయి. ప్రతి పోస్టులో సంస్కారం ఉట్టిపడుతూ ఉంటుంది. విశ్రాంత జీవితంలో ఈ సమూహం తమకి చాలా ఊత్సాహం, సాంత్వన ఇస్తోందని చాలా మంది సభ్యులు చెబుతుంటారు. ‘భావుక’ మొదలైనప్పటి నుంచి వీళ్లు ఏటా ఆత్మీయ సదస్సులు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక చిత్రం ఇచ్చి దానికి వ్యాఖ్య రాసే పోటీని నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు.
‘భావుక’ ఫేస్‌బుక్‌ సమూహం నాలుగో ఆత్మీయ సదస్సు డిసెంబరు 2న హైదరాబాదు మాదాపూర్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రెండు వందల మందికి పైగా సభ్యులు ఉత్సాహంగా దీనికి తరలివచ్చారు. నిత్యం ఫేస్‌బుక్‌ పోస్టుల్లో పలకరించుకునే వీళ్లు, ఒకరికొకరు ముఖ పరిచయాలు చేసుకున్నారు. సొంత కుటుంబ సభ్యులను కలుసుకున్నంతగా సంబరంలో మునిగిపోయారు. పేరుపేరునా పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు, పాటలు, కబుర్లతో సందడి చేశారు. మధ్యాహ్నం ప్రముఖ వైణిక విద్వాంసులు వడలి ఫణినారాయణ కచ్చేరీ ప్రేక్షకులను స్వరసాగరంలో ఓలలాడించింది. సదస్సు సందర్భంగా తొలిసారిగా ‘భావుక’ నిర్వాహకులు సభ్యుల రచనలతో ప్రత్యేక సంచిక తెచ్చారు. సదస్సు నేపథ్యంలో ‘భావుక’ గురించి వ్యాఖ్య రాయడం మీద నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. సమూహం లోని రచయితలను సత్కరించారు. చాలామంది సభ్యులు ‘భావుక’తో తమ అనుబంధాన్ని భావోద్వేగంగా వివరించారు. చివర్లో సభ్యులందరికీ తిరుగు బహుమతి, సావనీర్‌ అందించారు. ‘భావుక’ నిర్వాహకుల్లో ఒకరైన ఎల్లాప్రగడ సంధ్య ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఉత్సాహపూరితమైన వాతావరణంలో నడిపించారు. 
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని భాషలు నేర్చినా అమ్మభాషతో అనుబంధం.. అది అందించే ఆనందం వర్ణించరానిది. ఆ విషయాన్ని ‘భావుక’ తేటతెల్లం చేస్తోంది. అందివచ్చిన సాంకేతికత సాయంతో తెలుగు అక్షరాలు, పలుకులను పట్టినిలుపుతున్న ఇలాంటి సమూహాలే అమ్మభాషకు తరగని ఆస్తులు!

- సహకారం: యద్దనపూడి ఛత్రపతి, విశాఖపట్నం


మాది విజయనగరం జిల్లా. ముంబయి ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీలో తెలుగు ఉపాధ్యాయురాలిని. మన సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాల మీద మక్కువ ఉన్న వాళ్లని ఒక వేదిక మీదకి తేవాలని ‘భావుక’ను మొదలుపెట్టాం. సమూహంలో చాలా వరకు పెద్దవాళ్లే. అందరూ చాలా సంస్కారవంతంగా నడచుకుంటారు. ఇదో ఆరోగ్యకరమైన, అవధులు లేని ఆప్యాయతా వేదిక.

 - కళ్యాణి గౌరి కాశీభట్ల, ‘భావుక’ వ్యవస్థాపకురాలు


చాలా మంది త‌మ అనుభూతుల‌ను న‌లుగురితో పంచుకోవాల‌ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ల‌కోసం భాష మీద మ‌మ‌కారంతో ఏర్పాటు చేసిందే ఈ భావుక‌. నాలుగేళ్ల‌లో ఈ స‌మూహంలో ఇంత‌మంది వ‌చ్చి క‌ల‌వ‌డం మాకు సంతోషం క‌లిగిస్తోంది. స‌భ్యులంద‌రూ ఉత్సాహంగా ఆలోచ‌ల‌ను పంచుకుంటూ వాటి ద్వారా పెద్ద‌ల సాయంతో వారికి మ‌న భాష మాధుర్యం తెలుస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది.

- వ‌సంత శ్రీ, ‘భావుక’ వ్య‌వ‌స్థాప‌కురాలు


మూడేళ్ల నుంచి ఈ సమూహంలో ఉన్నాను. కవితలు పోస్టు చేస్తుంటాను. ఇది చాలా పద్ధతైన సమూహం. ఎక్కడా వెకిలితనం కనిపించదు. సాహిత్యంతో పాటు పౌరాణిక విషయాలు, ఆచార వ్యవహారాలు, సంగీతం లాంటి వాటికి సంబంధించి సభ్యులు చక్కని పోస్టులు పెడుతుంటారు. అందరూ ఒక కుటుంబంలా ఉంటారు. 

- ఆర్‌.వి.గణపతి, కరీంనగర్‌


బంధాలు, బంధుత్వాలు నానాటికీ కనుమరుగవుతున్న తరుణంలో ‘భావుక’ లాంటి సమూహం ఆవిర్భవించడం చాలా ఆనందకరం. దీని ద్వారా సభ్యుల మధ్య బంధాలు ఏర్పడుతున్నాయి. భాష మీద ప్రేమ అంతకంతకూ పెరుగుతోంది. 

- జె.పి.శర్మ, విజయనగరం


నాలుగేళ్ల నుంచి ఈ సమూహంలో ఉన్నాను. కవితలు పెడుతుంటాను. 16 నవలలు, 400 కథలు, 4 నాటకాలు రాశాను. సమూహంలో అందరూ సొంత కుటుంబసభ్యుల్లా చాలా కలివిడిగా ఉంటారు. నా కవితల మీద చాలామంది స్పందిస్తూ ఉంటారు. 

- తమిరిశ జానకి, హైదరాబాదు 


ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నా మాతృభాష కన్నడం. తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే ఈ సమూహంలో సభ్యురాలినయ్యాను. నా ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో ఈ సమూహం ఎంతో తోడ్పడింది. 

- వసుధ ఉతంకల్‌, కర్నూలు  


వెనక్కి ...

మీ అభిప్రాయం