స్వామియే శరణం అయ్యప్పా!

  • 2488 Views
  • 2Likes
  • Like
  • Article Share

    దుర్గుమహాన్తి మోహనరావు

  • ఈసీఐఎల్‌ విశ్రాంత అధికారి,
  • హైదరాబాదు,
  • 9494941589
దుర్గుమహాన్తి మోహనరావు

మన రెండు రాష్ట్రాల నుంచి ఏటా 80 లక్షల మందికి పైగా మాలధారులు శబరిమల యాత్ర చేస్తారని అంచనా! అందుకే కార్తీకంతో ప్రారంభించి మార్గశిరం మీదుగా పుష్య మాసం వరకూ తెలుగునాడంతా శరణుఘోషతో మారుమోగుతుంటుంది. ఊరూవాడలన్నీ అయ్యప్ప భజనపాటలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటాయి. ఎప్పుడు ఎవరు పురుడుపోశారో తెలియని ఈ పాటలన్నీ ఆ మణికంఠుడి మెడలో మెరిసే అక్షర సుమమాలలే!
చలిచలి స్నానాలు స్వామి ఆరాధనల్‌ నిరుపమ భక్తియు నిష్ఠవలయు 
దీక్షలో దాల్చుచు దీక్షాంబరంబులన్‌ పాదరక్షలు వీడి బ్రతుకవలయు
సంసార సుఖమును, హింసను త్యజయించి గురు స్వాములను గూడి తిరుగవలయు 
‘ఇరుముడి’ తలకెత్తియేగి అయ్యప జూడ ‘శబరిమలకు యాత్ర’ జరపవలయు 
- ‘అయ్యప్పస్వామి చరిత్ర’ పద్యగద్య రచనలో అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు

      ‘‘ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది/... మమకారములను విడిచేది మదమత్సరములను తుంచేది’’ అయ్యప్ప దీక్ష! దీనికి ‘‘శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం’’! ఇంకా ఇలాంటి ‘‘నియమాలు నిష్ఠలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా’’ అని పాడుకుంటారు దీక్షాధారులు. శరణుఘోషలతో, సామూహిక భజనలతో ఆ శబరిగిరీశుణ్ని స్తుతిస్తూ నియమబద్ధంగా మండలదీక్షను పూర్తిచేస్తారు. ‘‘అదిగదిగో శబరిమల అయ్యప్పస్వామి ఉన్న మల/ అదిగదిగో పళనిమల అయ్యప్ప సోదరుడున్న మల’’ (మల అంటే కొండ) అన్న ప్రసిద్ధ పాటలో ‘‘ఉన్నవారని లేనివారని తేడాలేనిది శబరిమల/ కులము మతము జాతిభేదము తేడాలేనిది శబరిమల’’ అన్న పంక్తులు వినిపిస్తాయి. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కులమత బేధాలకు అతీతంగా సమష్టి భాగస్వామ్యంతో సాగిపోయే అయ్యప్ప ఆరాధన ఆరంభమైందే సమాజంలో సౌభ్రాతృత్వం పెంచడానికి! ఒకరికి ఒకరు తోడన్న మానవతా పరిమళాలు పంచడానికి!
      ఒకప్పుడు ఇప్పటి తమిళనాడు, కేరళ ప్రాంతంలో శివ భక్తులు, విష్ణు భక్తుల మధ్య విద్వేషపూర్వకమైన వాతావరణం ఉండేది. ఈ నేపథ్యంలోనే శివుడు, విష్ణువు మధ్య అభేదాన్ని చెబుతూ హరిహర అద్వైత భావనలు వచ్చాయి. ‘‘అనాదిగా పరమాత్మ ప్రకృతే అనేవాళ్లున్నట్టే పరమాత్మ పరమేశ్వరుడనే వాళ్లూ, కాదు శ్రీమన్నారాయణుడు అనేవాళ్లూ ఉన్నారు. హరిహరులకు భేదం లేదు అని ఎంతమంది చెప్పినా వినని వితండవాదుల కోసం అయ్యప్పస్వామి లాంటి హరిహరసుతుడు మహారుషుల మనోసామ్రాజ్యాల్లో వెలిశాడు. దక్షిణ భారతీయులకు అతిముఖ్యమైన వేలుపు అయ్యాడు’’ అంటారు అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు. అయ్యప్ప హరిహర సుతుడు. అంటే శివుడు, ఇంకా క్షీరసాగర మథనం సమయంలో మోహినీ రూపం ధరించిన విష్ణువుకు జన్మించాడన్నది ఓ గాథ. అయితే పందళం రాజుకు పంపానదీ తీరంలో అయ్యప్ప దొరికాడని, పిల్లలు లేని ఆ రాజు ఆ శిశువును తనతో తీసుకెళ్లాడన్నది మరో కథ. అల్లారుముద్దుగా పెరిగిన ఆ శిశువు మహిషి (మహిషాసురుడి సోదరిగా చెబుతారు)ని సంహరించినట్లు, తన పెంపుడు తల్లి కోరిక మేరకు అడవికి వెళ్లి పులిపాలు తెచ్చాడన్నది అయ్యప్ప జీవితకథ. ఇంకో గాథ ప్రకారం అయ్యప్ప పందళం రాజు సోదరి కుమారుడు. అంటే మేనల్లుడు. అయితే శబరిమలలో అప్పటికే ఉన్న శాస్త ఆలయాన్ని అక్కడి స్థానిక తెగల పెద్ద ధ్వంసం చేశాడట. అప్పుడు అయ్యప్ప, ఆయన మహమ్మదీయ స్నేహితుడు వావర్‌ ఆ తెగవారిని ఓడించారట. తర్వాత శాస్త విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించగా అయ్యప్ప అందులో లీనమయ్యాడని చెబుతారు. అందుకే అయ్యప్పను శాస్త, ధర్మ శాస్త అని కూడా పిలుస్తారు. ఇది మకర సంక్రాంతి నాడు జరిగిందట. ఇక తమిళనాడులో కూడా గ్రామాలకు రక్షకుడిగా అయ్యనార్‌ అనే దేవుణ్ని పూజిస్తారు. పల్లెల పొలిమేరల్లో ఈ అయ్యనార్‌ విగ్రహాలు చేతిలో దండం లేదా పాశం పట్టుకుని నిల్చున్న భంగిమలో, గుర్రం/ ఏనుగు మీద ఉన్నవి కనిపిస్తాయి. ఈ అయ్యనార్‌ను కూడా హరిహర సుతుడుగా చెబుతారు. అందుకే అయ్యప్ప, అయ్యనార్‌ ఇద్దరూ ఒకే దేవుడి రెండు రూపాలని భావిస్తారు. అయ్యనార్‌ను కరుప్పన్‌ అనే దేవుడితో కలిపి పూజిస్తారు. శబరిమలలో కూడా కరుప్పస్వామి (కరుప్పన్‌) దేవాలయం ఉంటుంది. కనుక ఇది నిజం కావచ్చు. ఇంకా అయ్యప్పకు యుద్ధంలో సహకరించిన కడుత్తస్వామి, మహమ్మదీయ స్నేహితుడు వావర్‌ల దేవాలయాలూ ఉంటాయి. సాధారణంగా వావరుస్వామిని దర్శించాకే దీక్షాధారులు అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు. అయ్యప్ప ఆరాధనలో ఇదో విశిష్ట లక్షణం.
గురువుకు ప్రణమిల్లి...
మాల వేసుకున్న స్వాములందరూ కలిసి భజనలు చేస్తూ అయ్యప్పను ఆరాధిస్తుంటారు. అందులోనూ ఈ దీక్షకు సంబంధించి ‘గురువు’కు చాలా ప్రాధాన్యముంటుంది. కాబట్టి మొదట విఘ్నేశ్వరుడి భజన చేసి, తర్వాత సద్గురు ఆశీస్సుల కోసం గురు సంకీర్తనం చేస్తారు. తర్వాత అన్యదేవతల సంకీర్తన చేసి చివరగా అయ్యప్ప భజన పాటలు పాడతారు. ‘‘రామ రామ రామ అయ్యప్పా’’ అనేది ఓ గీతం. ‘‘తూరుపు దేశం పోదామా తుమ్మిపూలు తెద్దామా! తెచ్చి అయ్యప్పకిద్దామా అయ్యప్ప భజనలు చేద్దామా/ పడమట దేశం పోదామా! పండు మల్లెలు తెద్దామా...’’ ఇలా రకరకాల పూలతో అయ్యప్పను కొలుద్దామనే భక్తుల ఆకాంక్ష ఇందులో కనిపిస్తుంది.
      అయ్యప్ప భజన పాటల్లో చాలావాటికి ప్రేరణ తమిళ, మలయాళ గీతాలే. అందుకే ఆయా భాషల పదాలూ విరివిగా ఈ పాటల్లో కనిపిస్తాయి. ‘‘భగవాన్‌ శరణం భగవతి శరణం’’ పాట కూడా ఆ కోవకు చెందిందే. ఇది చాలా ప్రసిద్ధ గీతం. భగవతి అంటే అమ్మవారు. అయ్యప్పస్వామి మహిషిని వధించిన తర్వాత ఆమె ఓ అందమైన రూపం దాల్చి తనను వివాహం చేసుకోవాలని అయ్యప్పను కోరుతుంది. ‘‘నా కొండకు ఏనాడైతే కన్నిస్వామి (మొదటిసారి దీక్ష మాల ధరించిన వారు) రాకుండా ఉంటాడో ఆనాడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతవరకూ నా గుడివెనుక మాలికపురోత్తమ మంజమాత అనే అమ్మవారి రూపంలో ఉండ’’మని అయ్యప్ప వరమిచ్చాడన్నది గాథ. ఏటా వేలాది కన్నిస్వాములు సన్నిధానానికి వెళ్తూనే ఉన్నారు! శివకేశవుల పుత్రుడైన అయ్యప్పని స్మరించటంలో ‘‘ఈశ్వరనే ఈశ్వరి’’ అంటూ శరణాలు చెప్పి, స్వామి నివసించే ప్రదేశాలు, మహిషి సంహారాన్ని వర్ణిస్తూ జ్యోతి దర్శనం మాకిమ్మని వేడుకుంటూ పాడుకునే భజన పాట ‘‘భగవాన్‌ శరణం..’’!
కొండవాడు మా అయ్యప్ప
శబరిమల కొండకోనల్లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ‘‘కొండవాడు మా అయ్యప్ప- జాలి గుండె వాడు మా అయ్యప్ప’’ అని పాడుకుంటారు భక్తులు. ‘‘నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు నీలకంఠుని పుత్రుడు- మణికంఠ నామధేయుడు’’ అంటూ వర్ణిస్తారు. ఇలాగే ఇంకో పాటలో ‘‘కొండల్లో కొలువున్న కొండదేవరా/ మా కోర్కెలన్నీ తీర్చుమయ్య కొండదేవరా’’ అంటూ ఆర్తిగా వేడుకుంటారు. ‘‘మాలలు వేసేమయ్య కొండదేవర/ మేము భజనలు చేసేమయ్య కొండదేవరా/ ఇరుముడి కట్టేమయ్య కొండదేవరా/ మేము ఎరిమేలి చేరేమయ్య కొండదేవరా/ ఎరిమేలి చేరేమయ్య కొండదేవరా/ మేము పేటతుళ్లి ఆడేమయ్య కొండదేవరా/ స్వామి దిందిక తోం తోం అయ్యప్ప దిందిక తోం తోం/ అయ్యప్ప దిందిక తోం తోం స్వామి దిందిక తోం తోం’’.. ఇలా శబరిమల యాత్రను వివరిస్తూ సాగుతుందీ గీతం. ‘ఎరుమేలి’ దగ్గర వావరుస్వామి దర్శనంతోనే సన్నిధానానికి యాత్ర మొదలవుతుంది. ఇక ‘పేటతుళ్లి’ అంటే.. మహిషిని సంహరించే సందర్భంలో అయ్యప్ప చేసిన తాండవం. మాలధారులందరూ దాన్ని కచ్చితంగా ఆడతారు. శబరిగిరి యాత్ర చేసేటప్పుడు కన్నిస్వాములు జాగ్రత్తగా ఉండాలని చెప్పే పాట కూడా ఉంది. ‘‘ఇంత తొందరెందుకయ్య కన్నిస్వామి/ కాలు నిల్లదాయె నీకు కన్నిస్వామి/ భక్తితో నీ మనసు కన్నిస్వామి/ ఉయ్యాల లూగుతోంది కన్నిస్వామి/ తనననే తననే తననే తనే తననే తననే/ మెడలోన మాల ముఖ్యం తలమీద ఇరుముడి ముఖ్యం/ నువ్వు శరణుఘోష చేసుకుంటు కన్నిస్వామి/ కొండలెన్ని దాటివెళ్లు కన్నిస్వామి/ తనననే తననే తననే తనే తననే తననే’’- మొదటిసారి మాల వేసుకున్నవారికి గురుస్వామి చేసే హితబోధ ఇది. అసంఖ్యాకంగా భక్తులు వచ్చే సన్నిధానంలో బృందం నుంచి విడిపోతే కొత్తవారికి ఇబ్బంది. ఆ విషయాన్ని అన్యాపదేశంగా హెచ్చరించే గీతమిది.
      ‘‘శబరిమలై నావ సాగిపోతున్నది/ అయ్యప్ప నావ సాగిపోతున్నది/ నామంబు పలికితే నావ సాగిపోతుందీ’’ అనేది అయ్యప్ప ఆరాధనకు భక్తి ముఖ్యం అని ప్రబోధించే గీతం. ధనం కంటే జ్ఞానం, ధ్యానం ప్రధానమన్నది దీని సందేశం. ‘‘డబ్బిచ్చి ఈ నావ మీరెక్కలేరు/ అధికారము చూపించి ఈ నావ ఎక్కలేరు/ భక్తితో ఈ నావ మీరెక్కగలరు’’ ఇలా అలనాటి భక్తికవుల కీర్తనలను గుర్తుచేసే రచన ఇది. ఇక జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పస్వామిని దర్శించుకోండని ఉపదేశించే గీతం.. ‘‘జీవితమందున ఒకసారైన స్వామి సన్నిధికి చేరండి/ హరిహర పుత్రుని కన్నులగాంచి పరవశమంది పాడండి’’! ‘‘మోహిని సుతుని మోహన రూపము చూచిన చాలును క్షణమైన/ కాంతి గిరిపై వెలిగే జ్యోతిని కాంచిన చాలును క్షణమైన’’ అంటూ ఆ జ్యోతిస్వరూపుణ్ని తలచుకుని మైమరచిపోతారు భక్తులు. మణికంఠుడి జన్మ వృత్తాంతాన్ని తెలుపుతూ, మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేది ‘‘సత్యము జ్యోతి వెలుగునయా నిత్యము దానిని చూడుమయా’’ పాట! ఈ జ్యోతి సత్యానికి ప్రతీక. దాన్ని చూడటం అంటే.. సత్యమార్గాన్ని అవలంబించాలనే సందేశాన్ని అందుకోవడం!
ఒణ్ణాం తిరుపడి శరణం..
పద్దెనిమిది ఎత్తయిన కొండల మధ్య ఉంది శబరిమల... అక్కడే స్వామి వారి సన్నిధానం. అఖండ సాలగ్రామ శిలతో రూపుదిద్దుకున్న ‘పడి’ అని పిలిచే పద్దెనిమిది మెట్లు, ఆ మెట్లు ఎక్కటానికే భక్తులు మండలకాలం (41 రోజులు) దీక్ష తీసుకుంటారు. ‘పడిపాట’ను పూజ పూర్తయిన తర్వాత చివర్లో పద్దెనిమిది మెట్ల మీద కర్పూర హారతిని వెలిగిస్తూ పాడతారు. కింది మెట్టు నుంచి హారతి వెలిగించడం పరిపాటి. కానీ శబరిమలలో మీద మెట్టునుంచి వెలిగిస్తూ తంత్రీ (పూజారి) కిందికి దిగుతాడు. అగ్నికి పైకి ఎగసిపోయే లక్షణం ఉంది. కాబట్టి పై నుంచి వెలిగించుకుంటూ వస్తే తంత్రీకి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. పడి పాటలో ఒకటో మెట్టు నుంచి వెలిగిస్తూ ప్రతి మెట్టుకి స్వామివారి ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ ‘‘స్వామిశరణం అయ్యా శరణం/ అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప’’ అంటూ పాడతారు. మిగతా స్వాములు శరణం చెబుతుంటారు. ‘‘ఒణ్ణాం తిరుపడి శరణం పొన్నయ్యప్ప/ ఓంకారమూర్తియే శరణం పొన్నయ్యప్ప/ రెండాం తిరుపతి శరణం పొన్నయ్యప్ప/ హరిహర తనయా శరణం పొన్నయ్యప్ప’’... ఇలా పడిమెట్ల సంఖ్యను మాత్రం మలయాళంలోనే చెబుతారు.
      అయ్యప్ప భజన పాటలు ఒకరు రాసినవి కావు. ఏ సమయంలో వ్యాప్తిలోకి వచ్చాయో కూడా తెలియదు. ‘‘రాగాలే మాకు రావు తాళాలు మాకు లేవు/ అరుపులే మా పిలుపులు అయ్యప్ప శరణాలే మేలుకొలుపులు’’ అని వినమ్రంగా ఆ ధర్మశాస్తకు చేతులు జోడిస్తారు భక్తులు. ఈ పాటల్ని రాసినవారు లేదా అశువుగా పాడినవారెవరూ కవులు కారు. అందుకే, ఆ పదప్రయోగాలన్నీ సామాన్యంగా ఉంటాయి. అందుకే భక్తులకు అవి సులభగ్రాహ్యాలయ్యాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం