నేనొక నిషిద్ధ జీవిని!

  • 1175 Views
  • 6Likes
  • Like
  • Article Share

కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇటీవలి పోటీపరీక్షల ప్రశ్నపత్రాల కూర్పును పరిశీలిస్తే కాదేదీ ప్రశ్నకనర్హం అనే భావన కలుగుతుంది. పరీక్ష ఏదైనా సరే, కవిత్వానికి సంబంధించిన కొటేషన్ల మీద ఎక్కువ ప్రశ్నలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక కవితాస్రవంతిలో ఓ ప్రత్యేకత కలిగిన స్త్రీవాద కవిత్వంలోంచి కొన్ని ముఖ్య కొటేషన్లను చూద్దాం
పితృస్వామ్యం,
జండర్‌, అణచివేత, ఇంటిచాకిరీ స్వభావం తదితర ఎన్నో విషయాల మీద విభిన్న పార్శ్వాల్లో స్త్రీవాద కవిత్వం కొత్త ఆలోచనలు రేపింది. స్త్రీల సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక, నైతిక విషయాల ప్రస్తావన కూడా ఇందులో కనిపిస్తుంది. కవిత్వానికీ, జీవితానికీ పెద్ద తేడా ఏమీ లేదని చెబుతూ, ‘‘జీవితంలాగే కవిత్వం కూడా సమాజానికి అతీతమైనది కాద’’న్నారు జయప్రభ. నిజజీవిత సంఘటనలతో ప్రేరేపితులైన కవయిత్రుల అనుభూతులు, ఆవేదనలే అక్షరాల్లోకి ఒదిగి స్త్రీవాద కవిత్వమైంది. ‘‘ఏదో తెలియని బాధ ఒక అవ్యక్తానుభూతిగా, జాలిగా, క్రోధంగా మనసుని మెలిపెట్టి కవిత్వం పుడుతుంది’’ అని జయప్రభ స్పష్టంచేశారు. స్త్రీవాద కవిత్వంలోని కొన్ని ఆణిముత్యాలివి... 
* ‘‘బాల్యంలో/ ‘చిన్నపిల్లవి నీకేం తెల్సు కూర్చో’ అన్నారు/ యవ్వనంలో/ ‘ఉడుకు రక్తం మంచీచెడూ తెలీదు కూర్చో’ అన్నారు/ వృద్ధాప్యంలో/ ‘ముసల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో’ అన్నారు/ అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు/ కూర్చొని కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది’’  - రజియా బేగం
* ‘‘ఈ వంటింటిని తగలెయ్య/ ఎంత అమానుషమైందీ వంట గది!/ మన రక్తం పీల్చేసి మన ఆశల్ని కలల్నీ కాజేసి/ కొద్ది కొద్దిగా పీక్కుతింటున్న/ రాకాసి గద్ద ఈ వంటిల్లు./ ........ ఈ వంటిళ్లను/ దగ్ధం చేద్దాం రండి’’; ‘‘ఓ పునరుత్పత్తి పరికరమా!/ యుగయుగాలుగా/ నీ మేధో ప్రపంచ విస్ఫోటనాన్ని/ కలలు జారిపడిన చప్పుడును/ ఎవ్వరైనా విన్నారా!/ కనుల నుండి నెత్తుటి చుక్కలు రాలడాన్ని/ ఇనుప గానుగ చక్రాల మధ్య నలిగి/ హృదయం బద్దలైన చప్పుడును/ ఎవ్వరైనా విన్నారా’’  - విమల
* ‘‘ఆకాశమంతా ఒలికిపోయిన/ మా అనంత వేదనా హృదయం/ కమిలిగడ్డ కట్టుకపోయి/ నిజంగా నీలినీలిగా ఉంది’’  - శాంతిప్రియ
* ‘‘నన్ను అబలని చేసిన/ పితృస్వామ్యపు అదృశ్యహస్తం పైట/ నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే/ ముందుగా పైటని తగలెయ్యాలి’’; ‘‘ఆ కళ్లల్లో/ లక్ష వర్గాలున్నాయి/ కానీ చూపులకి మాత్రం వర్గ విభేదాలు లేవు’’ - జయప్రభ
* ‘‘బాల్యంలో/ బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను/ ఇప్పుడు/ అమ్మనూ నేనే, బొమ్మనూ నేనే’’  - అంజన
* ‘‘అయ్యో!/ పాలింకిపోవడానికున్నట్లు/ మనసింకిపోవడానికీ/ మాత్రలుంటే ఎంత బావుండు’’  - పాటిబండ్ల రజని
* ‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు/ గారన్నప్పుడే భయమేసింది/ ‘ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమొచ్చినా సెలవివ్వడని’/ అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది/ ‘వాడికేం మగమహారాజని’/ ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది/ పెళ్లంటే పెద్దశిక్ష అని/ మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని/ మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని’’  - సావిత్రి
* ‘‘నీకు పంచేందుకు రక్తం లేకే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదని కదా/ నేన్నిన్ను వద్దనుకున్నది’’; ‘‘బంగారు పుట్టలో చీమ/ ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు/ ఏడో చేప ఎందుకెండలేదో/ తార్కికంగా యోచించే ఓపిక అస్సలుండదు/ లో ఓల్టేజి ఫ్యాను గాలి/ వాయుగుండమవుతుందని/ ఏ వాతావరణ కేంద్రమూ హెచ్చరించదు’’  - పాటిబండ్ల రజని
* ‘‘స్త్రీగా వుండటమంటే ఏమిటో/ నేనెప్పుడు తెలుసుకున్నాను/ పదిహేను వసంతాలుగా విప్పారిన వయసులో/ నే నడచిన దోవంతా/ వెంటాడే విలాస చంచల దృక్కుల నడుమ/ నన్ను పడదోసుకుపోతున్న/ కాంక్షల కెరటాలపై/ ఎత్తుగా గర్వంగా జ్వలిస్తూ/ ముందుకు నడిచిపోయినపుడా?’’ - వసంత కన్నబిరాన్‌
* ‘‘ఎండమావినీ నేనే.. తొలకరి మబ్బునీ నేనే/ కలకత్తా కాళికనీ నేనే సలాం బాంబేనీ నేనే/ మదర్‌ థెరిసానీ నేనే, బీస్ట్‌ అండ్‌ బ్యూటీనీ నేనే/ పుట్టిన కేకనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే’’  - శివలెంక రాజేశ్వరీదేవి
*‘‘నేనెవరినో మీకెవరికీ తెలియదు/ ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును’’; ‘‘ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ’’ - రేవతీదేవి
* ‘‘తాళి కట్టిన మృగం/ తాగి ఇంటికి వచ్చి చేసే ఉన్మాదక్రియల్లో/ కంచం ఎగిరి దూరాన పడుతుంది’’  - తుర్లపాటి రాజేశ్వరి
* ‘‘ఎన్నాళ్లిలా అవయవాల్ని కడుపులోకి కూడగట్టుకోవటం!/ దారం లేని గాలిపటాల్ని ఎన్నాళ్లని కాపాడుకోవటం/ శరీరం ఒక పోరాటం మనసు మరో యుద్ధం’’  - కె.గీత
* ‘‘వివాహం ఊబిలో/ కూరుకుపోతున్నపుడు/ జీవితం నుంచి కాదుగదా/ శరీరం నుంచైనా కించిత్తు కూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని’’; ‘‘గాస్‌పొయ్యి మంటల్లోనే/ నీలాల గగనాన్ని చూస్తాను/ కుక్కర్‌ విజిల్స్‌లోనే/ మనోజ్ఞ సంగీతం వింటాను’’ - మందరపు హైమవతి
* ‘‘వర్గ శత్రువు నా శ్రమనే దోచుకుంటాడు/ ఈ దుష్ట శత్రువు నా బ్రతుకే దోచుకుంటాడు’’  - మొక్కపాటి సుమతి
* ‘‘ఆత్మ/ దేహాన్ని వదిలా/ అద్దం ముందుకెళ్లి నిల్చుని/ ఈలపాడుతూ కన్ను గీటుతుంది’’  - ఊర్మిళ
* ‘‘నేనొక నిషిద్ధ జీవిని/ మొన్నటి దాకా నా నవ్వు నిషిద్ధం/ నిన్న నా చదువు నిషిద్ధం/ నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే’’; ‘‘అమ్మ దృష్టిలో నేను మైనస్‌, వాడు ప్లస్‌’’  - శ్రీమతి
* ‘‘నేను ఈ యుగం ముందు నిలబడి/ మాతృత్వాన్ని ఆవిష్కరిస్తున్నాను’’  - మహెజబీన్‌
* ‘‘అమ్మ కావాలి!/ నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి/ లాలించే జీవనది అమ్మ కావాలి’’  - బి.పద్మావతి
* ‘‘అర్ధనారీశ్వరుడన్నా/ ఆకాశంలో సగం అన్నా/ ఒక్కలాగే వినిపిస్తుంది’’  - ఎస్‌.జయ
* ‘‘నేను/ సమాజం చెక్కిన అబలనీ/ సంప్రదాయపు వంటింటి పిల్లినీ కాదు’’  - రత్నమాను
* ‘‘అనాది నుంచీ/ ప్రకృతితో సహజీవనం నాది/ విధ్వంసం నీది’’  - వకుళాభరణం లలిత
* ‘‘పూరేకులాంటి నా మదిపై, పుల్లలు రాజేసిన నా/ పతి లాలిత్యం మోయలేక, నన్ను నేను తగలెట్టుకున్నాను’’  - రావులపల్లి సునీత


వెనక్కి ...

మీ అభిప్రాయం