సిక్కురుడు వాడిపేరు గొబ్బియాలో...

  • 436 Views
  • 0Likes
  • Like
  • Article Share

జానపద గీతాలంటే జానపదుల అనుభవసారాలు. వాళ్ల కష్టం, సుఖం, ఆక్రోశం, ఆవేశం అన్నింటినీ ప్రతిబింబించే అక్షరాల కూర్పు. సంక్రాంతి రోజుల్లో పాడుకునే గొబ్బిపాటల్లో ఒకటైన ఈ గీతమూ అలాంటిదే. ఈ పల్లెపాటలో ఓ కథ కనిపిస్తుంది.. బహుశా ఎక్కడో జరిగిన కథ కావచ్చు! ఆడపిల్లకు అన్యాయం తలపెట్టబోయిన వాడికి చివరికి ఏ గతిపట్టిందో చెబుతుందీ గాథ! కన్నుమిన్నూ కానకుండా ప్రవర్తించేవారికి ఇదో గుణపాఠం.. ఓ హెచ్చరిక! 
సిక్కురుడు వాడి పేరు గొబ్బియాలో
బహుసొగసైన వాడే  ।।
పల్లెబోయి సిక్కురుడు   ।।
వెంబడేదావచ్చె  ।।
సిక్కురుడు: తలంటవే తల్లీ తలమాసె నేతల్లి   ।।
తల్లి: నిన్ననే తలలంటి నీళ్లు బోస్తిమి కొడకా    ।।
    మళ్లీ నీళ్లు ఏమికొడకా  ।।
సిక్కురుడు: పందిట్లో వున్నవి పగడాల రాశులు  ।।
పందిట్లో ఉన్నవి వజ్రాల రాసులూ పగడాలరాసులూ  ।।
పట్టికొలువంగా ఏయి మాసెనే తల్లీ  ।।
ఎండీతపలాతో వేన్నీళ్లు కాసింది  ।।
పగడాలకలపతో మంటాలు బెట్టిందీ ।।
చీకాయ పొడివేసి ఊటనూ కలిపిందీ ।।
కూసోని పోసుకుంటే గుమ్మళ్లు బారిందీ ।।
ఊరు తిరిగీ పారీ ఉలవచేను పారీందీ  ।।
తలనిండా తలంబ్రాలు వలేసి ।।
ఒళ్లునిండా వస్త్రాలు తొడిగిందే ।।
వేలేసి ఏల్నిండ ఉంగరాలూ తొడిగిందీ ।।
తలేసి తర్నిండ పాగాలే జుట్టింది ।।
కూడుదీని సిక్కురుడు ।।
అక్కగారూరీడి పయనమైపోయినాడు ।।
పండున్న పరిగ చేన్లో పామడ్డమాయే ।।
కదిలెరా సిక్కురుడు కాలెట్టి దాడినాడు ।।
పోయెనో సిక్కురుడు అక్కడవాడలకూ ।।
అక్కగారు చూచి మదిని మురిసిందే ।।
అక్క: నా కూతురో చంద్రమ్మ నీళ్లియ్యరమ్మా! ।।
సిక్కురుడు: అక్కయ్యో ఓ అక్క ఆకలవుతూందే! ।।
అక్క: కూతురో చంద్రమ్మ కూడుబెట్టవమ్మ! ।।
సిక్కురుడు: అక్కయ్యో ఓ అక్క నిద్దరొస్తుందే ।।
అక్క: కూతురో చంద్రమ్మ మంచమొంచమ్మా ।।
మామనూ చూడగా మంచమొంచబోతే ।।
చీర చెరగూపట్టినాడే! ।।
చంద్రమ్మ: ఇడవరా అన్న విడువరా ।।
ధర్మమెరుగక నీవు విడిచేదిలేదా? ।।
తల్లిదండ్రి వుండగా నా చెరుగులాగావే ।।
ధర్మమా మావా నా చెరుగు విడిచిపెట్టు ।।
తీరిగ్గ మల్లొస్త మావా! ।।
సిక్కురుడు: నామీద వొట్టెట్టి చెరగు విడిచాను ।।  
మాట తప్పకే పిల్లా!  ।।
అక్క: నా ముద్దు కూతురికి ఎవరేమి సీసిరీ? ।।
చంద్రమ్మ: మాయమ్మ తమ్ముడట మా మేనమామ ।।
మంచమొంచాబోతే మలి చెరుగుబట్టాడే! ।।
అక్క: ధర్మ మెరుగము నీవు సెప్పొద్దు కొడకా ।।
నీ అన్న గారితో నీవు సెప్పొద్దు కొడకా! ।।
తండ్రి: అన్నతో ఏమాట సెప్పొద్దు కొడకా? ।।
అన్నయ్య: నీ మింద అంతటే అన్యాయమా చెల్లీ ।।
నువ్వు గట్టే సీరలు నాకు కట్టు చెల్లీ ।।
నువ్వు కట్టే రవికలూ నాకు కట్టు చెల్లీ ।।

          *  *  *
సకల వేషాలు సరిజూసుకోని ।।
కడ్డీల పిడిబాకు మొలలోన సెక్కే ।।
పోయెనే సిక్కురుడు విడిది చేసిన సోటికి ।।
          *  *  *
సిక్కురుడు: నువ్వు గనక మాయింటి ఇల్లాలివయితే ।।
బంగారు మేడలు కావించతాను ఇవేమి మట్టికుండలూ ।।
నిద్దుర పొద్దునా మెడవత్తి జూచీ ।।
తిన్నగా కొంచేపు జూడమాడినాడు ।।
పక్కనా కొంచేపు పొందుజూపినాడు ।।
నిద్దురపొద్దునా మెడజూసినాడు ।।
సిక్కురుని మెడమీద పిడిబాకు దింపినాడు ।।
నెత్తురు కాలువై ఈదిలోకి పారినాది ।।
ఇంటిముందు రక్తమడుగులో బాలలాడగనూ ।।
ఇంటి ముందు మడుగులో కాకులాడంగాను ।।
సిక్కురుడి ఇంటిముందు పీనువెండగానూ ।।
సిక్కురుడు బొందె విడిచినాడు గొబ్బియాలో

సేకరణ: మండా శ్రీధర్‌, శ్రీకాకుళం


వెనక్కి ...

మీ అభిప్రాయం