భాష మారితే రంగు పడుద్ది

  • 470 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆలోచనల దగ్గర్నుంచీ అభివ్యక్తీకరణ వరకూ భాష ప్రభావం అనూహ్యమైనదని తెలుసు! కానీ మన ఇంద్రియాలను కూడా భాష ప్రభావితం చేయగలదంటే నమ్మగలరా! ఓ పరిశోధన గురించి విన్నాక నమ్మితీరాలి మరి!!!
      బెర్లిన్‌కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు వేర్వేరు మాతృభాషలు కలిగిన వ్యక్తులు రంగులను గుర్తించే తీరులో తేడాలు ఉన్నాయేమో గ్రహించే ప్రయత్నం చేశారు. అందుకోసం రష్యన్‌, జర్మన్‌, గ్రీక్‌ మాతృభాషీయులైన 103 మందిని ఎన్నుకున్నారు. వారందరికీ వేర్వేరు వర్ణాలను చూపించారు. ఆ వర్ణాల్లో దాగిన ఓ త్రిభుజాన్నీ, దాని పక్కనే ఉన్న అర్ధచంద్రాకారాన్ని కనుక్కోమని చెప్పారు. విచిత్రంగా ఏ భాషలో అయితే అర్ధచంద్రాకారంలో ఉన్న రంగులని భిన్నంగా గుర్తించే సంస్కృతి ఉందో, ఆ భాషలవారు రూపుని స్పష్టంగా పసిగట్టారు. మిగతావాళ్లంతా త్రిభుజాన్ని మాత్రమే పోల్చుకోగలిగారు. ఈ పరిశోధన సమయంలో, ప్రయోగానికి గురవుతున్నవారి మెదడులో ఎలాంటి స్పందనలు ఏర్పడుతున్నాయో తెలుసుకునేందుకు ‘ఈఈజీ’ లాంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. విచిత్రంగా భాషలో ఉన్న పదాలను బట్టే మెదడు కూడా స్పందిస్తున్నట్లు తెలిసింది. ఒక భిన్నమైన రంగుకి వారి భాషలో తగిన శబ్దం ఉంటే, వారి మెదడు కూడా ఆ రంగుని గుర్తించగలుగుతోంది. లేదంటే లేదు!
భాషని విడిచిపెడితే!
భాష కేవలం సంభాషణ కోసమే కాదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించి, ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి కూడా! ఈ భూగోళం మీద ప్రతి సంస్కృతీ, వాతావరణం, జీవన విధానం దేనికది విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మంచులో తేడాలను వివరించేందుకు ఇన్యూట్‌ భాషలో 50 రకాల పదాలు ఉన్నాయి. అలాగే తన చుట్టూ కనిపిస్తున్న రంగులను వివరించేందుకు ఎంచుకునే పదాలు వైవిధ్యంగా ఉంటాయి. ఉదాహరణకు తెలుగులో రక్తవర్ణం, కరక్కాయ, నెమలి పింఛం లాంటి పదాలతో, రంగులలోని సూక్ష్మమైన భేదాలను గుర్తిస్తాం. కానీ క్రమంగా ఓ తరాన్ని తెలుగు నుంచి దూరం చేస్తే.... రంగులన్నీ ఆంగ్లంలోనే గుర్తించేలా బలవంతం చేస్తే! చూపు మారిపోతుంది. గ్రీకు భాషలో ముదురు నీలాన్ని ‘బ్లె’ అంటారు. లేత నీలాన్ని ‘గలాజియో’ అని పిలుస్తారు. వారి దృష్టిలో ఆ రెండూ వేర్వేరు రంగులు. కానీ గ్రీకు భాష క్రమంగా మరుగునపడిపోయి, ఆంగ్లాన్ని నేర్చుకుంటున్న తర్వాత వారి మెదడు ఆ రెండింటి మధ్యా భేదాన్ని గుర్తించడం లేదట. రెండింటినీ ‘బ్లూ’గానే వాతావరణానికి సంబంధించిన భాషను కాదని ‘ఇంగ్లిష్‌ కలర్ల’ను బట్టీపట్టే ప్రతి ఒక్కరికీ ఇదే అనుభవం ఎదురుకానుంది. తస్మాత్‌ జాగ్రత్త!!!


వెనక్కి ...

మీ అభిప్రాయం