రెంటికీ చెడ్డ రేవళ్లే!

  • 305 Views
  • 0Likes
  • Like
  • Article Share

పిల్లల మెదడు మహా చురుగ్గా ఉంటుంది. అది ఎంత జ్ఞానాన్నయినా తీసుకోగలదు. భాష నేర్చుకునేందుకు బాల్యం ఓ గొప్ప సందర్భం. ఆ వయసులో పిల్లలు భాషని మహా భేషుగ్గా గ్రహించగలరు! ఈ తరహా వాక్యాలని తరచూ వింటూనే ఉంటాం. ఆ సాకుతో పిల్లల మెదడులోకి పరాయి భాషలని ఒంపుతూ ఉంటారు. హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్‌ లాంటి భాషలే కాకుండా.... ఫ్రెంచ్‌, జర్మన్‌ లాంటి అంతర్జాతీయ భాషలనూ బలవంతంగా కుక్కేస్తుంటారు. కానీ ఇందులో నిజమెంత! పిల్లలు ఆశువుగా రెండేసి భాషలు నేర్చుకోగలరా! అంటే లేదనే చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. అలాంటి ఓ పరిశోధన ఆధారంగా ఎరికా హాఫ్‌ అనే ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త రూపొందించిన నివేదిక ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
      ఎరిక్‌ హాఫ్‌ అంచనా ప్రకారం ఒకే భాషని క్రమంగా నేర్చుకునే పిల్లలకంటే, రెండేసి భాషలను ఒకేసారి నేర్చుకునే పిల్లలు... భాషా నైపుణ్యంలో వెనుకబడిపోతారు. ఇందుకు స్పష్టమైన కారణాలు ఉన్నాయి.
* పిల్లాడి బడిలో పరాయిభాషను నేర్పుతూ ఉంటారు కానీ మాతృభాషలో పట్టుకలిగించే ప్రయత్నం చేయరు.
* ఇంట్లోకి వచ్చిన తర్వాత మాతృభాషే వినిపిస్తూ ఉంటుంది కానీ పరాయిభాష కాదు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లవాడితో పరాయిభాషలో మాట్లాడే ప్రయత్నం చేసినా... అది చాలా కృతకంగా, నాణ్యత లేకుండా ఉంటుంది.
* ఒకే భాషలోని పదజాలాన్ని అంతకంతకూ పెంపొందించే అవకాశం లేకుండా... ఆ భాషలో కొన్ని పదాలు, ఈ భాషలో కొన్ని పదాలూ అంటూ రెండు పడవల మీదా కాలు వేయాల్సి ఉంటుంది.
స్థాయిని బట్టి నైపుణ్యం
రెండు భాషలనూ ఒకేసారి నేర్చుకునే వాతావరణంలో మరో ఇబ్బంది కూడా ఉంది. పిల్లాడు ఉంటున్న పరిస్థితుల్లో రెండు భాషలూ సమానమైన హోదాలో ఉంటే ఫర్వాలేదు. అలా కాకుండా, వాటి ప్రాధాన్యంలో ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి... పిల్లాడి భాషానైపుణ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఉదాహరణకు కెనడాలో ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ భాషలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. దీని వల్ల చిన్నారి రెండు భాషల్లోనూ మాట్లాడే అవకాశం సమానంగా ఉంటుంది. పైగా ఆ భాషల్లో నైపుణ్యం ఉన్నవారితో మాట్లాడే సౌలభ్యమూ ఎక్కువగా దొరుకుతుంది. ఫలితం! రెండు భాషల్లోనూ తను ఒకే తరహా వృద్ధిని సాధించగలుగుతాడు. కానీ అమెరికాలో స్పానిష్‌, ఇంగ్లిష్‌ భాషలకు ఒకే స్థాయి లేదు. కాబట్టి వాటిని మాట్లాడటంతోనూ, నేర్చుకోవడంతోనూ ఎక్కడికక్కడ అడ్డంకులు కనిపిస్తుంటాయి. ఫలితంగా క్రమక్రమంగా ఇంగ్లిష్‌దే పైచేయిగా మారుతుంది.
      ఒక తరం క్రితం తెలుగునాట బడుల్లో తెలుగు, ఇంగ్లిష్‌లకు సమాన ప్రాధాన్యం ఉండేది. పిల్లలకు అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులు తెలుగులో విడమరిచే ప్రయత్నం చేసేవారు. తరగతి గదిలో తెలుగన్న మాటే వినిపించరాదనే ఛాందసం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు! బడిలో తెలుగు పలుకు వినిపిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో వచ్చీరాని ఆంగ్లంలోనే మాట్లాడుతూ వారిలో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంచుతున్నామనే భ్రమలో ఉన్నారు. ఫలితం! పిల్లలు అటు తెలుగుకీ, ఇటు ఆంగ్లానికీ కొరగాకుండా పోతున్నారు. వారు పెరిగి ఇంజనీర్లయినా, బట్లర్‌ ఇంగ్లిష్‌నే మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఇలాంటి పరిశోధనలని పట్టించుకునే దశలో ఉన్నామా!


వెనక్కి ...

మీ అభిప్రాయం