ఇంటి మాటే భవితకు బాట

  • 304 Views
  • 0Likes
  • Like
  • Article Share

అమ్మ పాడే లాలిపాటలూ, తాతయ్య వినిపించే శతక పద్యాలూ, బాబాయి అభినయంతో సహా వినిపించే జానపద గాథలూ... ఇవీ ఒకప్పటి తరానికి తీపి గురుతులు. ఇంట్లో ఉన్నంతసేపు ఎవరో ఒకరు గలగలా మాట్లాడుతూనే ఉండేవారు. మరి ఇప్పుడో! పిల్లలు టీవీకి, పెద్దలు మొబైల్‌ ఫోన్లకి అంకితమైపోతున్నారు. యంత్రాలు వినిపించే శబ్దాలే కానీ మనుషుల మాటలే ఇంట్లో వినిపించట్లేదు. ఈ కాలంలో ఇల్లంటే ఓ నలుగురు కలిసి ఉండే చోటే కానీ ‘కుటుంబం’ కాదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే... యాంత్రికమైపోతున్న బాల్యంతో మాతృభాష కూడా నలిగిపోతోందని చెప్పుకొనేందుకు.
      జర్నల్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌ అనే పత్రికలో ఈమధ్య వెలుగుచూసిన ఓ పరిశోధనాపత్రం భాషాప్రేమికులను ఆందోళనకు గురిచేసింది. ఇంట్లో పెద్దలు పిల్లల మధ్య సంభాషణలు ఎంత తక్కువగా ఉంటే, పిల్లల్లో భాషాపరమైన నైపుణ్యం అంత తక్కువగా వికసిస్తుందన్నదే ఈ నివేదిక సారాంశం. ఈ ప్రయోగం కోసం పరిశోధకులు నాలుగు నుంచి ఆరేళ్లలోపు ఓ నలభై మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా వేర్వేరు ఆర్థిక సామాజిక వర్గాలకు చెందినవారు. వీళ్ల ఇంట్లో జరుగుతున్న సంభాషణల తీరుని గమనించేందుకు ఓ వారాంతంలో వాళ్ల ఇళ్లలో జరిగిన సంభాషణలన్నీ రికార్డు చేశారు. ఈ సంభాషణల ఎక్కువ తక్కువల ప్రభావం పిల్లల మెదడు మీద ఎంతమేరకు ఉందో గమనించేందుకు సదరు పిల్లల మెదడుని స్కానింగ్‌ చేశారు.
ఆశ్చర్యపరిచే ఫలితాలు!
మెదడులో వెర్నికేస్‌, బ్రోకాస్‌ అనే రెండు ప్రదేశాలు భాషా వికాసాన్ని సూచిస్తాయి. ఈ రెండు భాగాల మధ్య సంబంధం బలంగా ఉంటే, పిల్లల్లో భాషాపరమైన నైపుణ్యం బాగుంటుంది. సగటున గంటకు 210 సంభాషణల్లో భాగమయ్యే పిల్లల మెదడులోని వెర్నికేస్‌, బ్రోకాస్‌ల మధ్య దృఢమైన బంధం ఏర్పడినట్లు తేలింది. ఇక గంటకు 95 సంభాషణలు మాత్రమే వినిపించే ఇంట్లోని పిల్లల్లో ఈ బంధం చాలా బలహీనంగా ఉండటాన్ని గమనించారు.
      పరిశోధన... దానికి సంబంధించిన ఫలితాలు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కాసేపు ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లను కట్టిపెట్టి కన్నవాళ్లతో మాట కలిపే ప్రయత్నం చేస్తే వారిలో భాషని ఎలాగూ పెంపొందిస్తాం... పనిలో పనిగా భావోద్వేగాలకు స్పందించే మనిషిగా వారిని తీర్చిదిద్దినవారమవుతాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం