పల్లె తెలుగు ఉల్లెడ

  • 1789 Views
  • 48Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

జారిపోయిన కాలాన్ని మళ్లీ కళ్లముందు నిలిపే కాలయంత్రం కథ. మానవ జీవితాన్ని ఉన్నదున్నట్లు చిత్రించే సౌలభ్యం కేవలం కథకి మాత్రమే ఉంది. కొన్ని కథలు అనుభవజ్ఞానాన్నీ..  అనుభూతినీ అందిస్తే.. మరికొన్ని  జీవిత రహస్యాలని వాటి పరిధినీ వివరిస్తాయి. ఇంకొన్ని ఈ రెండింటినీ కాక సమకాలీన జీవితాన్ని కళ్లముందు నిలిపి ఇదా జీవితం! అనిపిస్తాయి. డా।। పాకాల యశోదారెడ్డి కథలు ముమ్మాటికీ తెలంగాణ జీవితాన్ని అంటే స్వాతంత్య్రానంతర తెలంగాణ గ్రామీణ జీవన పరిస్థితులకు అద్దం పడతాయి. అచ్చమైన పల్లెపదాలకు నెలవులుగా నిలుస్తాయి.
యశోదారెడ్డి
కథల్లో స్వచ్ఛమైన గ్రామీణ జీవన సంస్కృతి మాత్రమే కాదు అచ్చమైన తెలుగు భాషా సౌందర్యం కూడా కనిపిస్తుంది. గ్రామీణ జనవ్యవహారంలోని అపురూపమైన పదప్రయోగాలను నమోదు చేయాలనే సంకల్పంలోంచే ఈ కథలు పురుడు పోసుకున్నాయి. ‘‘కేవలము పదములే పట్టిక వలె ఇచ్చిన విసుగు జనింపజేయునను తలంపుతో కథలుగానల్లి చూపుటకు ప్రయత్నించినాను’’ అని చెప్పారు యశోదారెడ్డి. ప్రామాణిక భాష ఉధృతిలో కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ తెలుగు తెరమరుగయ్యింది. పాఠ్యపుస్తకాలు, పత్రికల్లో ఇదే మాదిరి కొనసాగడంతో ఇక్కడి గ్రామీణభాషా సౌందర్యం మరుగునపడిపోయింది. ఆ ఇనుపతెరను ఛేదించుకుని తెలంగాణ మాండలికం సాహితీ గౌరవం దక్కించుకోవడానికి చాలాకాలం పట్టింది. దీనికి బాటలు పరిచిన తొలితరం తెలంగాణ కథకుల్లో యశోదారెడ్డి ఒకరు. ఆవిడ రచనల్లో పదాలను ఇప్పటి తెలుగుతో పోల్చిచూస్తే అసలైన తెలుగు ఏదో స్పష్టంగా తెలుస్తుంది. ఉల్లెడ (మేలుకట్టు, మేనా), కువ్వాడ (వేళాకోళం), కువ్వారం (మోసం) లాంటి పదాలు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు. అందుకే యశోదారెడ్డి కథలను చదువుతుంటే మనం పోగొట్టుకున్న మాణిక్యాలను తడిమి చూసుకున్నట్టే ఉంటుంది.  
      యశోదారెడ్డి కథలన్నీ మూడు సంపుటాలుగా వచ్చాయి. మా వూరి ముచ్చట్లు, ధర్మశాల, ఎచ్చమ్మ కథలు అనే ఈ మూడు సంపుటాలూ వస్తుపరంగానే కాకుండా భాష విషయంలో కూడా ఒక క్రమానుగతంగా వచ్చే మార్పులను వివరిస్తాయి. యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా ఉన్నప్పటినుంచీ కథలు రాస్తూ... అప్పుడప్పుడు సాహిత్య ప్రసంగాలు చేస్తూ గొప్ప వక్తగా పేరుగాంచారు. ‘మావూరి ముచ్చట్లు’ యశోదారెడ్డి మొదటి కథా సంపుటి. 1973లో ప్రచురితమైంది. ఇందులో మొత్తం పది కథలున్నాయి. 1950-65 ప్రాంతంలో స్వాతంత్య్రానంతర గ్రామీణ జీవితం, సామాజిక పరిణామ చిత్రణే ప్రధానంగా సాగిన కథలివి. యాభయ్యో దశకం ప్రారంభంలో వీటిని ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించారు యశోదారెడ్డి. వాటికి అప్పట్లో చాలా మంచి స్పందన లభించింది. ఈ కథలనిండా తెలంగాణ పల్లెవాతావరణం పరచుకుని ఉంటుంది. సామెతలతోనూ, పలుకుబడులతోనూ.. ఒక కాలం నాటి జీవన వైవిధ్యంతోటి ఈ కథలు సాగుతాయి.
భలే భలే ముచ్చట్లు
సాధారణంగా పల్లెల్లో స్త్రీలందరూ ఒకచోట కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం చూస్తాం. ఊళ్ల విషయాలన్నీ అక్కడే తిరుగుతుంటాయి. ‘మా ఊరి ముచ్చట్లు’ కూడా అలాంటివే. ఇందులోని కథలన్నీ ఏదో రాసినట్టుగా కాకుండా... నలుగురి మధ్యలో మాట్లాడుతున్నట్లుగా.. ముచ్చట పెడుతున్నంత సహజంగా ఉంటాయి. చక్కటి భావస్ఫురణతో.. పటిష్టమైన భాషానిర్మాణంతో సాగిపోతాయి. 
      యశోదారెడ్డి కథల్లో చెప్పుకోదగింది ‘గంగిరేగిచెట్టు’. ఇది రచయిత్రి చిన్ననాటి సంగతులను తెలియజేస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర ముత్యాలమ్మ. తన అన్నకూతురు ఎచ్చమ్మతో కొడుకు పెళ్లి ఖాయంచేసుకునే నెపంతో పండక్కి పుట్టింటికొస్తుంది. ఒకనాడు గంగిరేగు పళ్లు కోసుకుని కొడుకు వీపుమీద కాలుపెట్టి దిగుతున్న ఎచ్చమ్మను చూసిన ముత్యాలమ్మ కోపంతో ఊగిపోతుంది. ‘అప్పుడే కొడుకును కర్రె కుక్కను చేసి తిప్పుకుంటోంది. ఇలాంటి పిల్ల నా ఇంటి కోడలైతే ముందు ముందు ఇంకేం చేస్తదో!’ అని, అన్నతో సంబంధం తెంచుకుని వెళ్లిపోతుంది. మేనరిక వివాహాలూ, మూఢవిశ్వాసాలూ, తల్లిలేని పిల్ల స్వేచ్ఛగా తిరిగితే ఓర్వలేని తనం, ప్రజల అమాయకత్వం.. ఇలా ఆనాటి సామాజిక జీవనచిత్రాలు అనేకం ఈ కథలో కనిపిస్తాయి.
      నాగి కథలో రచయిత్రి ఓ నూతన ప్రతిపాదన చేయడం ఆ రోజుల్లో గొప్ప పరిణామమే. నాగి పేదరికం కారణంగా దొంగతనాలు చేస్తూ బతుకుతుంటుంది. ‘‘కడుపునిండా తినడానికి ఉంటే దొంగతనాలు ఎందుకు చేస్తాను దొరా!’’ అన్న నాగి మాటలకి రాంరెడ్డికి అసలు విషయం తెలుస్తుంది. ఆమెకు బతుకుదెరువు చూపిస్తాడు. అవకాశాలు కల్పిస్తే ఆకలి సమస్య దానంతట అది పరిష్కారమవుతుందనీ.. అరాచకాలు సమసిపోతాయనే నైతికసూత్రాన్ని ఈ కథ తెలియజేస్తుంది. ‘మ్యానరికం’ కథ మేనరిక వివాహాలు జరిగే తీరును ప్రస్తావిస్తుంది. కులమత పట్టింపులు లేకుండా గ్రామంలో ప్రజలందరూ సామూహికంగా ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిని పీర్లపండగ కథ రూపుకట్టిస్తుంది. ‘జోగులయ్య, మురారి, మా పంతులు’ లాంటి మిగిలిన కథల్లో కనిపించే జీవనశకలాలు మనసును ద్రవింపజేస్తాయి. ఇందులో కథలన్నింటికీ వ్యవసాయ గ్రామీణ నేపథ్యమే ఆధారం. 
మాండలిక సొగసులు
యశోదారెడ్డి కథల్లో వ్యవసాయ పనులూ.. విభిన్న ఆచారాలు, బలీయమైన మానవ సంబంధాలు కనిపిస్తాయి. పగ్గాలు, పలుపులు, మెడదుత్తలు, బండి, కందెన, పెద్దసవారి ఎడ్లు, పరదాలు... ఇలా ఆనాడు పల్లెల్లో ఏమేమి ఉండేవో అవన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. బతుకమ్మ పండగకు తల్లిగారింటికి పోవడం వివాహితలకు ఒక హక్కుగా ఉండటాన్ని ఈ కథల్లో గమనించవచ్చు. మొత్తమ్మీద 1950ల నాటి గ్రామీణ సంస్కృతినీ, జీవితాన్నీ, భాషను, ఆచార వ్యవహారాలను, మానవ సంబంధాలను పాఠకుల ముందుంచుతాయి. కథల్లో యశోదారెడ్డి చేసే వర్ణనలు సహజంగా.. గమ్మత్తుగా ఉంటాయి. ‘మ్యానరికం’ కథలో ఆడపిల్లను ముస్తాబుచేసే విధానాన్ని గమనిస్తే ముచ్చటేస్తుంది... ‘‘ఇంగ బోజనాలయినాక తీరువాటంగా కమలమ్మ గూసోని లక్ష్మీని పిల్చి ముందల గూసోవెట్టుకుని రొండు జడలిడ్సి పాపితీసి ఊదునూనె మెరుగు వెట్టింది. ఒంటి జడేసింది. పూలగొట్టంతోటి జడనిండా పూలు గుచ్చింది. చెవులకు గున్నాలు వెట్టింది. చేతులకు కాకరకాయ గొలుసులు వెట్టింది. మొకానికి పోడరు ఏసింది. కాట్కె కడకల్లుల దాటంగ దీర్చి సాదుసుక్క వెట్టింది’’! 
      కేవలం వర్ణన మాత్రమే కాదు, అచ్చతెలుగు నుడికారాలనూ చాలా సొగసుగా ప్రయోగిస్తారు రచయిత్రి. ‘నల్లపూసలు కట్టిచ్చింది. కడుపుసిచ్చు కడుపుది, ఇల్లుఇడ్సిన పెయ్యిదూడ, ఉట్టిఊగినట్లు ఊగుతడు, పట్నం కెళ్లివచ్చిన పుట్టంగింజ’ లాంటి చమత్కారాలూ... పదబంధాలూ ప్రతి కథలోనూ కొల్లలుగా కనబడతాయి. ఈ కథలను చదువుతుంటే అచ్చమైన తెలుగుకి ఎంత దూరమైపోయామో తెలుస్తుంది. తెలంగాణ మాండలిక సొగసు, పల్లెజీవితం, మాటల పొందిక ఆకట్టుకుంటాయి. నుడికారాల ప్రయోగం వల్ల కథకు బలం చేకూరడమే కాదు మధ్యలో ఆగుతూ చదవడం వల్ల సరికొత్త భాషావగాహన, సామాజిక పరిశీలన సాధ్యపడుతుంది. యశోదారెడ్డి కథల్లో బాల్యానికి సంబంధించిన అనేక విషయాలూ ప్రస్తావనకు వస్తాయి. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు ఆడుకునే గాజప్పలాట, వెన్నెలకుప్పలాట, చెండాట లాంటి క్రీడావిశేషాలే కాకుండా చిరుతిళ్ల గురించి కూడా రచయిత్రి ముచ్చటిస్తారు. చిట్టిలువలు, బెల్లప్పూస లాంటి ఆహార పదార్థాలు ఇప్పుడు ఎంతమందికి తెలుసు! అలాంటివి యశోదారెడ్డి కథల్లో ఘుమఘుమలాడుతుంటాయి. 
      తను కథలు ఎందుకు రాయాల్సొచ్చింది! తన భావావిష్కరణకి కథాప్రక్రియనే ఎందుకు ఆశ్రయించారు అనే విషయాల్ని ప్రస్తావిస్తూ... ‘‘ఈ నుడికారంలో కథలను వ్రాయుటకు  ప్రోత్సహించిన సాహితీబంధువు డా.బి.గోపాలరెడ్డి గారికిని, ఈ కథలను ప్రకటింప పోరువెట్టిన శ్రీ తిరుమల రామచంద్ర గారికిని నా కృతజ్ఞతలు’’ అని వినమ్రంగా చెబుతారు. 
      జాతిజనుల నోళ్లల్లో నిత్యం కదలాడుతుండే అనేక పలుకుబడులనూ, దేశిపదాలనూ యశోదారెడ్డి ‘మా ఊరి ముచ్చట్ల’లో నిక్షిప్తం చేశారు. భాషతోనే జాతిమనుగడ సాకారమవుతుందని నమ్మేందుకు ఈ కథలే నిదర్శనాలు. ఎంతటి గొప్పభాషైనా మనుగడలో ఉంటేనే ముందుకాలానికి అందుతుంది. విలువైన ఆ పదసంపద మరుగున పడిపోకూడదని రాసిన ఈ కథలు భాషాయజ్ఞానికి తోడ్పడటమే కాదు జాతి సంస్కృతిని, భాషా సంస్కారాన్ని భావితరాలకి అందించే వాహికగా, వారధిగా కూడా నిలుస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం