శ్రీరామ జననం - సీతా జననం

  • 539 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - వల్లూరు దాలినాయుడు,

  • బొద్దూరు, శ్రీకాకుళం జిల్లా
  • 9440344601

శ్రీరామ జననం 
సిరసాగ్రము పైని  సిద్విలాసుండు
సేసతల్పమూ పైని పవలించియుండి
అమురులందరితోడా ఆమునులంతా కూడీ
ఆ రావణూ బాదలకూ బరియించా లేకా
సీర సంద్రములోన పడి సావబోగా
అమరులంతా కలిసీ ఆమునులంతా కలిసీ
ఆదివిష్ణు పాదాలూ అమరంగా పట్టీ
ఆ విష్ణువావేలా అబయమొసగేరూ
కరుణించి కమలాచ్చు కనికరించేరూ
కడుపుణ్యవతియైనా కౌసల్య గర్భాన
రాముడై జలిమించీ ఐవోజ్యయందూ
ఆదిశేసువుబుట్టె లచ్చనామూరితియై
సెంకుసెక్కరాలే బరత సెత్రికులుగా
అవతారమెత్తేరూ అవని లోపలనూ
బాలచందురినిలా దినదినము వుద్దియై
ఆటపాటల తోడ ఆనందముల తోడ
తల్లిదండ్రులకెల్ల తనివితీరంగా
కడుబాల్యమందునా కవుసికిని వెంటా
వనములకె వెళ్ళారూ విలువిజ్జె నేర్చారూ
మంత్రంబులను నేర్చి మర్మములను తెలిసి
అకిల విద్దెలనెల్ల అలవోకగా నేర్చి
యాగమును కాసారూ రక్కసుల జంపారు
మునులు ఆనందింప సురలు పువ్వులనొంప


సీతా జననం
బూమిలో పుట్టింది వారుద్ర పురుగూ
మేగాన పుట్టింది అది మెరుపు గన్నె
తమ్ముడా ఇబీషణా తొందరగా బయలెల్లు
యేటలకె యెల్లాలా అడవెల్ల తిరగాల
లంక సుట్టూ తిరిగి లంక వనముల తిరిగి
వనముల్లా తిరిగి వేటలే ఆడారూ
ఆవనములోపలా ఎర్రనీ కండా
ఎర్రనీ కండనూ ఏటలే ఆడారు
మాంసమూ ముద్దనూ మండోద్రి కిచ్చీ
వండవే మండోద్రి కండనూ వండవే
వండబోయి మండోద్రి కుండలో బెట్టి
కుండలోన మండోద్రి కండనే బెట్టే
మూడు రోజుల్నాడు రావణులె అడిగే
వోలోలె మండోద్రి వయ్యారి మండోద్రి
మొన్న తెచ్చిన కండా కూరసెయ్యావే
కుండ మీదన కుండ మూత జూసేనా
మూత తీసిన కుండా యెత్తిజూసేనా
మూడురోజుల నాడూ బాలసినదాయే
బాలలాగా మారి మెరుపుతీగలాగా మారీ
దీనిజూసి నామొగుడూ నన్ను మరిసేడూ
కంసాలోడి కాడా కనకాల పెట్టొకటిజేసీ
బాలాకు తగ్గట్టు పెట్టొకటి జేసీ
పెట్టిలో బాలాను బద్రంగా పెట్టి
ఇరిసి కట్లూ గట్టీ మారు కట్లూ గట్టీ
అలాగ మండోద్రి బుర్రకెత్తేనా
నట్టేట సంద్రంలో పెట్టి ఇసిరేనా
జనకులవారేమో ఏరుబూసేరూ
నాగలీ పట్టుకొనీ సాలుదున్నేరూ
సాలుకూ ఆపెట్టీ తగలగా ఆపి
పెట్టెలో ఏముందో డబ్బు దనముందో
దనముంటె పంచెదనూ బిడ్డాంటే పెంచెదనూ
బిడ్డనే గాంచీ ఇడ్డూరమొందీ
ఇంటికీ తీసుకెళ్లి ఉయ్యాల్లోవేసె
ఊరంత కదిలిందీ జోల పాడిందీ
వృత్తి కళాకారులు, యాచకవృత్తిలోని వివిధ వర్గాలు ఆలపించే అపురూప జానపద గీతాలెన్నో ఇప్పుడు అంతర్థానమైపోతున్నాయి. సీతారాముల జన్మ వృత్తాంతాలకు సంబంధించిన ఈ రెండు పాటలూ అలాంటివే. యాచకవృత్తి జరుపుకుంటూ జీవిస్తూ.. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పల్లీయుడు పాడుతుంటే ఆయన అనుమతితో నేను రాసుకున్న గీతాలివి.. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం