ఎవరో వస్తారని... ఏదో చేస్తారని

  • 1113 Views
  • 18Likes
  • Like
  • Article Share

    డి.కస్తూరి రంగనాథ్‌

  • షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా
  • 8008573907
డి.కస్తూరి రంగనాథ్‌

పాట ఓ క్రాంతి బాట.. చైతన్య బావుటా! అందుకే, సామాజిక సమస్యలను ప్రజల దృష్టికి తేవడానికి దాన్నో వేదికగా మలుచుకున్నారు తెలుగు సినీకవులు. రాజకీయాల లోగుట్టును వివరించి.. నాయకుల పేరిట చెలామణీ అయ్యే గోముఖవ్యాఘ్రాల ముసుగులను తొలగించడానికీ వాళ్లు పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ఆసేతుహిమాచలమంతా ఎన్నికల కోలాహలంతో నిండిపోయిన ఈ సందర్భంలో ఆ ప్రబోధగీతికలను ఓసారి గుర్తుచేసుకుందాం! 
‘‘పదవీ
వ్యామోహాలు.. కులమత భేదాలు.. భాషా ద్వేషాలు చెలరేగే నేడు.. ప్రతి మనిషి మరియొకని దోచు కునేవాడే.. తన సౌఖ్యం తన స్వార్థం చూసుకునేవాడే’’ అంటూ సమకాలీన సమాజంలోని కుళ్లును ఎండగట్టారు శ్రీశ్రీ. 1961లో వచ్చిన ‘వెలుగునీడలు’ చిత్రంలోని గీతమిది. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి పద్నాలుగేళ్లు. రాజ్యాంగం అవతరించి పదేళ్లు. కానీ, సామాన్యుల బతుకులేమీ మారలేదు. స్వార్థపూరిత రాజకీయాలతో ఎక్కడికక్కడ విద్వేషబీజాలు నాటుకుంటున్నాయి. వాటిని మొగ్గలోనే తుంచేయాలన్నది శ్రీశ్రీ ఆకాంక్ష. ‘సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం.. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం’’ అన్నది ఆ మహాకవి ఉద్బోధ! కానీ, ఆయన కల కలగానే మిగిలిపోవడమే విషాదకరం. 
      అప్పట్లో ఇలాంటి చైతన్యగీతాలకు చిరునామాగా నిలిచింది శ్రీశ్రీనే అయినా రాజకీయ పోకడల మీద చురకలకు పాదులు వేసింది మాత్రం కొసరాజు కలమే. 1954లో విడుదలైన ‘పెద్దమనుషులు’ చిత్రం కోసం ఆయన రాసిన ‘‘శివశివ మూర్తివి గణనాథ’’ ఆనాడు రాజకీయ కలకలం సృష్టించింది. ‘‘కాంగ్రెస్సోళ్లు నిన్ను గొల్వ గణనాథ.. నీవు కామితార్థమిత్తువయ్య గణనాథా.. కమ్యూనిస్టులు నిన్ను గొల్వ గణనాథ.. వార్నీ కాపాడుచుందువయ్య గణనాథా’’ అంటూ నేరుగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు కొసరాజు. ‘‘ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా.. నీవు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా.. పదవి ఊడకుంటె ఒట్టుపెట్టు గణనాథా’’ అంటూ వ్యంగ్యబాణాలు సంధించారు. ఇదే చిత్రంలో ‘‘నందామయా గురుడ నందామయా’’ పాటలో ‘‘స్వాతంత్య్ర గౌరవము సంతలో తెగనమ్ము స్వార్థ మూర్తులు అవతరించారయా.. అఆలు రానట్టి అన్నయ్యలందరికి అధికార యోగమ్ము పడుతుందయా’’ అంటూ చేదునిజాలకి ఛలోక్తులను జోడించి చెప్పారు. ఆ ఏడాదిలోనే వచ్చిన ‘రాజు పేద’ చిత్రంలోని ‘‘కళ్లుతెరచి కనరా సత్యం వళ్లు మరచి వినరా సర్వం నీకే బోధ పడురా’’ పాట ద్వారా స్వార్థ నాయకులను హెచ్చరించారు. పదవుల కోసం జుట్లు ముడేసి, ప్రజల నెత్తిమీద చేతులుపెట్టి, కన్నూమిన్నూ కాననివారికి ఎప్పటికైనా ఓటమి తప్పదని విస్పష్టంగా చెప్పారు.
ఓట్ల సమయానికే వస్తారు
కొసరాజు తర్వాత ఎనభయ్యో దశకం తొలినాళ్ల వరకూ రాజకీయాల మీద శ్రీశ్రీ సంధించిన అస్త్రాలు ఇన్నీ అన్నీ కావు. 1974లో వచ్చిన ‘భూమికోసం’ చిత్రంలో ‘‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా.. నిజం మరచి నిదురపోకుమా’’ అంటూ ప్రజలకు హితబోధ చేశారాయన. ఇదే పాటలో ‘‘బడులే లేని పల్లెటూళ్లలో చదువేరాని పిల్లలకు.. మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు.. చాలీచాలని పూరి గుడిసెలో కాలే కడుపుల పేదలకు.. ఎవరో తోడు వస్తారని.. ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’’ అంటూ హామీలివ్వడమే తప్ప వాటి అమలుకు ముందుకు రాని నాయకగణాలను పరోక్షంగా విమర్శించారు. 1982 నాటి ‘ఈనాడు’ చిత్రంలో శ్రీశ్రీ కలం సమకాలీన రాజకీయ పోకడలను వాడిగా, వేడిగా ప్రశ్నించింది. ‘‘చిరకాలపు ఘోరాలకు చివరిరోజు ఈనాడే.. అణగారిన జీవాలకు నవజీవనమీనాడే.. కనులు తెరచి, నిజం తెలిసి కష్టజీవులే నరాధముల తరిమికొట్టు సమయం నేడే.. ఆ సమరం ఈనాడేే’’ అంటూ పదవుల కోసం పార్టీలు మారే నేతలకు వ్యతిరేకంగా ఉద్యమించే ప్రజల భావాలను తన కలం ద్వారా బలంగా పలికించారాయన. ఇదే చిత్రంలో కథానాయకుడు చెప్పే బుర్రకథ ఒకటి ఉంటుంది. ‘‘వినరా ఓరి వీరపుత్రుడా నిరుపేదల గాథ.. వివరమ్ముగ నే విన్నవింతు వీరనుభవించుగాథ’’ అంటూ సాగే ఈ బుర్రకథలో- ‘‘పూరిపాకల్లోన ఉన్నారు బువ్వకే తలపడుతున్నారు.. మురికి కాల్వల మధ్యనున్నారు దోమకాటుకే బలి అవుతున్నారు.. ఆదరించేవాడు కానరాడు అయ్యో అనెడి వాడు లేడు.. నరకానికి నకళ్లు మన ఇళ్లు’’ అంటూ ప్రజాసమస్యలను ప్రస్తావించారు.  ‘‘సారా కాంట్రాక్టర్లెందరో అధికారులైరి గదరా.. ప్రభుత్వాల నడిపించే సూత్రధారులైరి గదరా.. రాజకీయ బ్రోకర్లు కొందరు బయలుదేరినారే’’ అంటూ దిగజారుడు రాజకీయాలపైనా విమర్శలు చేశారు. ‘‘ఓట్ల సమయానికే వస్తారు.. వంక దండాలెన్నో పెడతారు.. అక్కర తీరాక ఐదేళ్లదాకా మన నెత్తిమీదెక్కి స్వారీ చేస్తారు.. పదవుల మీద ఆశ లేదని బడాయి కొడతారు.. పదవులు వస్తే కుర్చీ పట్టుకు వదలం అంటారు.. పూలదండలు పుచ్చుకోమని నీతులు చెపుతారే.. నోట్ల దండలు వేస్తామంటే మెడలు జాపుతారే’’ అంటూ నేతల అసలు రంగులను బయటపెట్టేశారు. అలాగే, ‘విప్లవ శంఖం’ చిత్రంలో ‘‘మూయించిన ఒక వీరుని కంఠం.. వేయి గొంతుకల విప్లవ శంఖం’’ అంటూ ఉద్యమగళాలను అణచివేసే పెద్దల ఆగడాలను చీల్చి చెండాడారు.
ఎమ్మెల్యేవు అయ్యావంటే..
ప్రాసలతో పాటలను పరుగులెత్తించిన ఆరుద్ర కలం కూడా నాయకుల వైఫల్యం మీద పదునుగానే స్పందించింది. 1971లో విడుదలైన ‘పవిత్రబంధం’ చిత్రంలో ‘‘గాంధి పుట్టిన దేశామా ఇది.. నెహ్రు కోరిన సంఘమా ఇది.. సామ్యవాదం.. రామరాజ్యం సంభవించే కాలమా’’ అంటూ ప్రశ్నించింది. ‘‘సస్యశ్యామల దేశం.. అయినా నిత్యం క్షామం.. ఉప్పొంగే నదీ జీవజలాలు ఉప్పుసముద్రం పాలు.. యువకుల శక్తికి, భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు.. ఉన్నది మనకు ఓటు.. బ్రతుకుతెరువుకే లోటు’’ అంటూ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వానికి నలుగుపెట్టింది! ‘సమ్మె ఘొరావు దొమ్మి.. బస్సుల దహనం లూఠీ.. శాంతి, సహనం  సమధర్మంపై విరిగెను గూండా లాఠీ.. అధికారంపై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ.. హెచ్చెను హింసా ద్వేషం.. ఏమౌతుందీ దేశం’’ అంటూ కల్లోల భారతావనిని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు ఆరుద్ర. ‘‘సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవ్వంత చోటు.. పేరుకి ప్రజలది రాజ్యం.. పెత్తందార్లకే భోజ్యం’’ అంటూ ప్రజాస్వామ్య భావనలోని బోలుతనాన్ని విడమరిచారు. సినారె సైతం రాజకీయ నాయకుల తీరు మీద ధర్మాగ్రహం వ్యక్తంచేశారు. 1976 నాటి ‘బంగారు మనిషి’ చిత్రంలో ‘‘ఎక్కడికెళ్తుంది దేశం ఏమైపోతుంది.. హిమశైల శిఖరం పైకా.. పాతాళ కుహరంలోకా’’ అంటూ ప్రారంభమయ్యే గీతంలో ‘‘ప్రవచనాల పచ్చిక బయళ్లలో పన్నాగాల గోతులు.. ప్రణాళికల గాదెల కింద దాక్కున్న పందికొక్కులు.. పావురాల ఈకలు తొడుక్కుని ఊరేగే రాబందులు.. పొద్దున చూరుకంటు బల్లులై.. మధ్యాహ్నం గోడమీద పిల్లులై.. సాయంత్రం ఊసరవెల్లులై పార్టీల రంగులు ఫిరాయించే అవకాశవాదులు’’ నీతిబాహ్య రాజకీయాలు చేసేవారిని కడిగిపారేశారు. ఇదే సమయంలో మనసుకవి ఆత్రేయ కలం కూడా మరింత ఘాటుగా స్పందించింది. ‘‘భళిరా ఈ దేశమెంత బరితెగించి పోయెనురా.. జండాల మయమాయెరా.. పరమ చెండాలమైపోయెరా’’ అంటూ అవకాశవాద రాజకీయాలను చెండాడింది. 1983లో వచ్చిన ‘ఈ దేశంలో ఒకరోజు’ చిత్రంలోని ఈ పాటలో ‘‘దోపిడి, దొమ్మి, దొంగముఠాలను దువ్వుతూ.. డబ్బు రువ్వుతూ.. పాపపు సొమ్ముతో పదవులు పొంది నవ్వుతూ.. తెగ కొవ్వుతూ.. కొంపలు ముంచి, కోట్లు గడించి.. ఉలకరు, పలకరు జనులతో’’ అంటూ అక్షరాలకు గంధకమద్దారు ఆత్రేయ! ‘‘ఎంఏలు, బీఏలు వద్దుర బాబూ దండగ.. శుద్ధ దండగా.. ఎమ్మెల్యేవు అయ్యావంటే దండిగా జేబు నిండుగా.. కరువులు వరదలు వచ్చాయంటే పండుగ.. రోజు పండుగా’’ అంటూ అవినీతిపరులైన నేతలకు వాతలు పెట్టారు. 
అలాంటి నాయకుడు రావాలి
పాట ఏదైనా తనదైన ముద్ర వేసే వేటూరి సుందరరామమూర్తి ‘ప్రతిఘటన’ చిత్రంలో ‘‘హెచ్చరికో హెచ్చరికా.. గూండాలకే ఓటు.. రౌడీలకే సీటు.. దేశానికే చేటు తందనానా’’ అంటూ ప్రజలకు మేలుకొలుపు పాడారు. ‘‘గాంధీలు పోయారు.. గాడ్సేలు మిగిలారు.. మంచి పెంచిన వాళ్లు పిచ్చోళ్లు అయ్యారు.. దేశాన్ని మీరైనా దారిలో పెట్టండిరో’’ అంటూ యువతకు పిలుపునిచ్చారు. ఇదే చిత్రంలోని ‘‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రువు చిందిస్తూ రాస్తున్నా శోకంతో’’ పాటలో ‘‘కన్నులుండి చూడలేని ధృతరాష్టుల పాలనలో.. భర్తలుండి విధవలైన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు, యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్యసమాజం’’ అంటూ ప్రశ్నించారు. 1983లో విడుదలైన ‘ప్రజారాజ్యం’ చిత్రంలోని ‘‘కదలండీ.. తరలండీ అరకు నడుపు అన్నలారా.. మొరక దున్ను తమ్ములారా సాధించాలి రైతురాజ్యము.. స్థాపించాలి ప్రజారాజ్యము’’ పాట ప్రఖ్యాతం. ‘‘రైతాంగానికి ప్రభుత్వ రంగం రాయితీలను కల్పించాలి.. కర్షకశక్తిని రైతుల యుక్తిని జాతినాడిగా గుర్తించాలి.. గిట్టని ధరలతో రైతును కొట్టి.. పెంచిన ధరలతో ప్రజలను ముంచే రాబందుల కూల్చగా పాలక వర్గం దిగిరావాలి.. ప్రజాశాసనం లిఖించాలి’’ అన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రాసింది తక్కువే అయినా ఆణిముత్యాల్లాంటి పాటలను అందించిన మల్లెమాల కూడా రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే నాయకులను నిరసించారు. ‘‘బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో.. గాంధి మహాత్ముని జన్మభూమిలో మనిషి పశువుగా మారాడు.. మంచిని ఆహుతి చేశాడు’’ అంటూ ‘ఆహుతి’ చిత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే ‘అంకుశం’ చిత్రంలో హత్యారాజకీయాలను ఎండగడుతూ, దీనికి బాధ్యత ప్రజలదేనని అంటారాయన. ‘‘అందుకే కొడుతున్నా డప్పు.. ఇప్పుడైన తెలుసుకొండి తప్పు’’ అంటూ ప్రారంభించి- ‘‘తెల్లోళ్లు ఆనాడు తేరగా దేశాన్ని కొల్లగొడుతున్నారని ఎల్లగొట్టేశాము.. మనవాళ్లు గద్దెక్కి మన కడుపు కొడుతుంటే గుడ్లప్పగించేసి గుటకలేస్తున్నామ’’ంటూ ప్రజల బాధ్యతను గుర్తుచేశారు. ‘‘ఈ పీడ వదిలించి.. లోపాలు తొలగించి.. న్యాయాన్ని నిలబెట్టే నాయకుడు రావాలి’’ అని ఎలుగెత్తారు.  
స్వేచ్ఛ లేని స్వతంత్రం
ప్రభుత్వాల తీరును విమర్శించడం, వివిధ సమస్యలను వెలుగులోకి తెస్తూ పాలకులకు బాధ్యత గుర్తుచేయడం లాంటి కోణాల్లో కొందరు రచయితలు పాటలు రాశారు. మరికొందరేమో నేరుగా నేతలపై ‘అక్షరాలా’ దండయాత్రలు చేశారు. 1973లో వచ్చిన ‘దేశోద్ధారకులు’లో యు.విశ్వేశ్వర రావు రచించిన ‘‘ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు.. కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్లు’’ పాట ఇలాంటిదే. ‘‘దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టామంటారు నాయాళ్లు.. దేశానికే చీడ పురుగులు ఈ దొంగనాయాళ్లు’’ అంటూ విరుచుకుపడ్డారు విశ్వేశ్వరరావు! మాదాల రంగారావు, ఆర్‌.నారాయణమూర్తి లాంటి కథానాయకులు తర్వాతి రోజుల్లో రాజకీయాల మీద ఎన్నో అక్షరాస్త్రాలు సంధించారు. మాదాల నిర్మించిన ‘విప్లవ శంఖం’ చిత్రం- ‘‘ఎన్నాళ్లు ఎన్నేళ్లు ఈ పాట్లు పడతావు.. ఇకనైనా మేలుకో.. నీ రాజ్యం ఏలుకో’’ అంటూ ప్రజలకు దిశానిర్దేశం చేస్తుంది. ‘ఇది తినడానికి తిండిలేని స్వరాజ్యం.. ఏమి అనడానికి స్వేచ్ఛలేని స్వతంత్రం’’ అంటూ ‘స్వరాజ్యం’ చిత్రంలోనూ రంగారావు నిరసనగళం వినిపించారు. ‘‘తెల్లదొరలు పోయారు.. నల్లదొరలు వచ్చారు.. కల్లాకపటం ఎరుగని జనం మోసపోయారు’’ అంటూ ఉన్నమాటను చెప్పేశారు. 
      ‘‘సిగ్గుసిగ్గంటవ్‌ సిగ్గేందిరో.. సిగ్గుపడే పనిచేయలేదురో’’ అంటూ ‘నవభారతం’ చిత్రంలో నిరుద్యోగులు సర్కారుకు వ్యతిరే కంగా నినదిస్తారు. వంగపండు రచించిన ఈ పాటలో ‘‘కూలినాలి కడుపుకొట్టి కోట్లు గుంజుకోలేదు.. నల్లడబ్బు పంచిపెట్టి నాయకుడిని కాలేదు.. బడా చదువు చదవ కున్నా బండిని లాగిస్తున్న నాయకు లకు లేని సిగ్గు మాకెందుకురో’’ అని నాయకుల ‘అర్హత’లను చర్చకుపెట్టారు. ‘చీమలదండు’ లోని ‘బతుకులేమో యెండి పాయె.. మొండిమాను బతుకు లాయె రాజిగ.. ఈ రాజ్యమేలెటోడు చావ రాజిగ.. ఈ రాజ్య మేలెటోడు కూల’’ పాట శాపనార్థాలతో మొదలవుతుంది. మండే సత్యం రచించిన ఈ పాట ‘‘చాలీచాలని బతుకులాయె.. చావన్నా రాకపోయె.. పొద్దుంటే మాపుం డదు.. మాపుంటే రేపుండదు రాజిగో పూటపూట చచ్చుడాయె’’ అంటూ పేదల కన్నీటికి అద్దంపడుతుంది. అదే ఏడాదిలో విడుదలైన ‘ఎర్రోడు’లో ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టులేదు నాగులో నాగన్న’’ అంటూ పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు గద్దర్‌. ‘‘మిరప కాయ కొనబోతే మిర్రిమిర్రిన చూస్తదాయె.. ఎల్లిపాయ, ఉల్లిపాయ ఎగిరెగిరి తంత దాయె.. తాళింపు గింజలేమె తలకొరివై మండుతాయి.. ఉప్పుధర చూస్తే గుప్పున కుమ్మేస్తదమ్మొ’’ అంటూ ధరలను అదుపు చేయడంలో పాలకుల వైఫల్యాన్ని దునమాడుతుంది. ‘‘ఆళ్లు దిగి ఈళ్లెక్కె.. ఈళ్లు దిగి ఆళ్లెక్కే.. ఎవరెక్కినగానీ నాగులో నాగన్న.. ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్నా’’ అంటూ నిష్ఠురసత్యం పలుకుతుంది. ‘‘దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. దొరలు దొరలు కలిసి రాజ్యమేలుతున్నారు.. కటకట రాజ్యాన్ని కూల్చ నాగులో నాగన్నా.. పటపటపట పళ్లు కొరుకు నాగులో నాగన్న’’ అంటూ ప్రజలకు పిలుపునిస్తూ పాట ముగుస్తుంది. ‘కుబుసం’ చిత్రంలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట ద్వారా గోరటి వెంకన్న ప్రపంచీకరణ ప్రభావాన్ని సామాన్యులకూ అర్థమయ్యేలా చెప్పారు. 
ప్రజాచైతన్యమే కీలకం
బందులతో సామాన్య జనజీవనం అస్తవ్యస్తమవుతున్న తీరు ‘అన్న’ చిత్రం కళ్లకుకడుతుంది. ‘‘అరెరె ఏందిరన్న ఎటు చూద్దామన్న.. ఏం చేద్దమన్న బందు’’ అంటూ సాగే గీత సాహిత్యమైతే అక్షరసత్యమే! ‘‘ధర్నాల దేశంలో ఇది కర్ఫ్యూల కాష్ఠంరో.. దినదిన గండం భరతఖండం’’ అంటూ సామాన్యుల ఇబ్బందులను గుర్తుచేస్తుందా పాట. ‘‘వందేమాతర గీతం మారి.. బందే మా తరమైంది చూడరో’’ అని దుయ్యబడుతుంది. అలాగే, ‘‘మీ పార్టీలకు వేలవేల దండాలయ్యా.. మీ పార్టీలో గూండాలను చేర్చకండయా’’ అంటూ ‘రౌడీదర్బార్‌’ చిత్రం హితువు పలుకుతుంది.  
      రాజకీయ చైతన్యాన్ని ప్రోదిచేసే క్రమంలో నేతలనే కాదు.. బాధ్యత మరచిన ప్రజలనూ కవులు వదిలిపెట్టలేదు. ‘‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. మారదు కాలం.. మారదు లోకం’’ అంటూ సమస్యల పట్ల ప్రజల నిర్లిప్తతను బోనులో నిలబెట్టారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘సిందూరం’ చిత్రంలోని ‘‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా’’ అన్న పాట కూడా ప్రజాచైతన్యాన్ని ప్రశ్నించేదే. ప్రజాస్వామ్య దేశంలో ప్రగతిరథాన్ని పరిగెత్తించడంలో పాలకుల పాత్ర ఎంత ఉంటుందో ప్రజల పాత్ర కూడా అంతే ఉంటుందని గుర్తుచేయడమే ఇక్కడ కవుల ఉద్దేశం. ఇదే విషయాన్ని ఇటీవలి ‘రంగస్థలం’ చిత్రంలో సున్నితంగా చెప్పారు చంద్రబోస్‌. ‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా’’ గీతంలో ‘‘ఆ గట్టునేమో సీసాడు సార ఉంది.. కుండేడు కల్లు ఉంది.. బుడ్డేడు బ్రాంది ఉంది.. ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది’’ అంటూ ప్రలోభాలకు లొంగి అసమర్థులను ఎన్నుకోవద్దని చెప్పకనే చెప్పారాయన. ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో రామజోగయ్యశాస్త్రి చెప్పినట్లు ‘‘విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం.. నలుపెరగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతం’’ అనే  నాయకులు రావాలి. ‘‘పాలించే ప్రభువును కానని.. సేవించే బంటుని నేనని.. అధికారం అర్థం ఇది అని.. తెలిసేలా చేస్తా నా పని’’ అని ధైర్యంగా చెప్పగలిగే వారు పాలకులు కావాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం