ఆదిమూలం ఆకుపచ్చ సంగీతం

  • 1991 Views
  • 10Likes
  • Like
  • Article Share

అరుదైన జానపద గిరిజన సంగీత వాద్యాలు రెండు రోజుల పాటు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అడవి బిడ్డల సంగీత సౌరభాలను గుబాళింపజేశాయి.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూరు ఆడిటోరియంలో మార్చి 17, 18 తేదీల్లో ‘మూలధ్వని’ పేరుతో జరిగిన జానపద, గిరిజన సంగీత వాద్య సమ్మేళనం ఇందుకు వేదికైంది. విశ్వవిద్యాలయం తెలుగు, ఆంగ్లం, సామాజికశాస్త్రం, పాత్రికేయ శాఖల సహకారంతో తెలంగాణ రచయితల వేదిక, గుంజాల గోండ్‌ అధ్యయన వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ విశిష్ట సమ్మేళనానికి దాదాపు రెండొందల మంది కళాకారులు 63 విభిన్న వాద్యాలతో తరలివచ్చారు.
వినే
మనసుండాలేగానీ వీచే గాలిలో, ఊగే చెట్లలో, పారే సెలయేరులో, కూసే కోయిలలో సంగీతం ఉంది. ఈ సమస్త ప్రకృతి నిగూఢంగా తాళ లయాత్మకంగా కనిపిస్తుంది. ఆ స్ఫూర్తితోనే మనిషి తన మేధకి పదునుపెట్టి ప్రకృతి వనరులతో వాద్య పరికరాలు రూపొందించుకున్నాడు. సంస్కృతిలో వాటిని భాగం చేసుకున్నాడు. అయితే కాలక్రమంలో ఈ వాద్యాలు కనుమరుగవుతున్నాయి. వాటికి సంబంధించిన సామాజిక చరిత్రకూడా తెరమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఉస్మానియాలో జరిగిన జానపద గిరిజన సంగీత వాద్య సమ్మేళనం.. ఆయా వాద్యాల గొప్పదనాన్ని తెలియజేసింది. తెలంగాణ మారుమూల గిరిజన గూడేలు, బంజారా తండాలు, పల్లెల నుంచి 25 నుంచి 80 ఏళ్ల వయసున్న కళాకారులు దీనికి తరలివచ్చారు. ఇప్పటి వరకూ బయటి ప్రపంచాన్ని చూడని గుత్తికోయ వాద్య కళాకారులు భద్రాచలం నుంచి వచ్చి ఇందులో భాగస్వాములవ్వడం విశేషం!
      గోండు కళాకారుల రంగోలీతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభ సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ... సమాజంలో మనల్ని పెనవేసుకున్న రాగాలను మర్చిపోతుండటంతో మనిషిలో ఒక ఎండుతనం ఆవరించిందని అన్నారు. ఒకప్పుడు ప్రతిరోజూ మనకు పనికొచ్చిన ఈ వాద్యాలను వాడుకున్నామే తప్ప, ఇప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు, వీటి మీద పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ మానవ జీవితంలో సంగీతం పాత్ర ఎనలేనిదని, అది సంస్కృతికి ప్రతిబింబమని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.రామచంద్రం, తెలుగువారి ఆత్మబంధువు డానియెల్‌ నెజర్స్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు సంగీత దర్శకులు రామాచారి ఆధ్వర్యంలో అన్ని వాద్యపరికరాలతో ఏకకాలంలో నిర్వహించిన సంగీత కార్యక్రమం శ్రోతలను ఆనందడోలికల్లో ముంచెత్తింది. ఈ సమ్మేళనంలో సుస్వరాల విందు అందించిన కొన్ని విశిష్ట వాద్యాలివి..!!
రుంజ
రౌంజకాసురుడు అనే రాక్షసుణ్ని వధించి, అతని అవయవాలతో చేసిన తోలు వాద్యమే రుంజ అంటారు. నరాలు తాళ్లుగా శరీరమే డొల్లగా, వేళ్లు వాయించే పుల్లలుగా, చర్మాన్ని వాద్యంపై తోలుగా చేశారని చెబుతారు. పలనాటి చరిత్ర, యోగసక్త పరిణయం, మొల్ల రామాయణం వంటి సాహిత్య రచనల్లో రుంజ ప్రస్తావన ఉంది. మెక్సికో, ఆఫ్రికా దేశాల ఆదివాసీల్లోనూ ఈ తరహా వాద్యం కనిపిస్తుంది. రుంజ కళాకారులు రామమూర్తి దీన్ని పరిచయం చేశారు.
బృహత్‌ కిన్నెర
దీన్ని ఆదివాసీ కిన్నెర, కర్నట్ కిన్నెర అంటారు. గొండి చెంచులు వాడతారు. ఆనపకాయ బుర్రలు మూడు, నాలుగు ఆధారంగా ఓ కర్రకి పెడతారు. దాని మీద రెండు తీగెలు, 12 మెట్లు అమర్చి ఉంటాయి. కిన్నెర ప్రస్తావన 5వ శతాబ్దికి చెందిన మాతంగుని బృహద్దేశి గ్రంథంలో ఉంది. అబుల్‌ ఫజల్‌ రాసిన అయినీ అక్బరీలోనూ ఇది కనిపిస్తుంది. ఈ ఆదివాసి కిన్నెరకు ఒక్క కన్నుగా మిగిలిన కళాకారుడు కొమ్రు లింగు దీని మాధుర్యాన్నీ సగళంగా ఆవిష్కరించారు.
సారంగి
ఇది జానపద వాయిద్యంగా మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తుంది. బంజారా తెగ భాట్లు వాయిస్తారు. వాయించే విధానం వయోలిన్‌ను పోలి ఉంటుంది. ఉత్తర భారతంలో శాస్త్రీయ సంగీతానికి అనువయ్యేందుకు ప్రయత్నించింది. అయితే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోకి అడుగు పెట్టలేకపోయింది. 8 మెట్లు, రెండు కర్రల చెక్క కలిపి తయారు చేసిన వాద్యమిది. దీనిపై తంత్రులని విల్లు లాంటి దానితో వాయించుతారు.  మహారాష్ట్ర, పుణె నుంచి వచ్చిన కళాకారుడు ఉత్తమ్‌ రాథోడ్‌ సారంగి స్వరాలను శ్రోతలకు పంచారు.
గుమేల
గుమట్, డింకీ అనీ పిలుస్తారు. కథాగానం చేసేటపుడు గుమేలా ప్రధాన భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా శారద వాద్యం కథల్లో స్త్రీలు వంత పాడుతూ డింకీ వాయిస్తారు. మట్టితో చేసిన కూజా లాంటి భాగాన్ని సురాయి అంటారు. ఒక వైపు చర్మంతో మూసి మరోవైపు తెరిచి ఉంచుతారు. ఇది గోండుల్లో విస్త్రతంగా వాడుకలో ఉంది.
కిక్రీ
కిక్రీ.. కిక్కిరి/ కింగ్రీ అనీ అంటారు. గోండుల్లో ఉపకులం ప్రధాన్‌లు వాయించే గొప్ప వాద్యం. చతురస్త్రాకారపు చెక్క మీద మేక చర్మం అమరుస్తారు. దాని మధ్యలో ఓ వెదురు బొంగు చొప్పిస్తారు. దీనికి మూడు రంధ్రాలు చేసి శృతి కర్రలు అమర్చుతారు. వీటిని పూటీలు అంటారు. దీన్ని విల్లులాంటి కర్ర ‘ఖోమ్‌’తో వాయిస్తారు. ఖోమ్‌కు గజ్జెలు కూడా ఉండటంతో సహవాద్యం ఉన్నట్లే ఉంటుంది. ఇంకా తోడుగా పెప్రే (సన్నాయి లాంటి వాద్యం), డక్కి (చిన్న డోలు) వంటివి వాయిస్తారు. కిక్రీకి మణిపుర్‌ ‘పేనా’, ఒడిశా ‘కెన్రా’, బాణం, రాజస్తాన్‌ ‘రావణహట్టా’, కేరళ ‘వీణా కుంజ్‌’ వాద్యాలతో పోలిక కనిపిస్తుంది. 
కాలికోమ్‌
గోండు సంగీతంలో ఎంతో కాలం నుంచి పెనవేసుకున్న వాద్యమిది. కొందరు తూటుకొమ్ము, మూడు మూపురాల నంది అనీ అంటారు. కంచరివాళ్లు రాగి/ఇత్తడి రేకులతో గ్రహణకాలంలో తయారుచేస్తారు. అది కూడా ఆలుమగలు కలిసి ఎవరికంటా పడకుండా! తయారీకి ఖర్చు ఎక్కువ. మీటరున్నర పొడవు ఉంటుంది. థింసా నృత్యాల్లో ఉత్సాహం కోసం సహవాద్యంగా ఉపయోగిస్తారు.
నగారా
యుద్ధానికి నగారా మోగిందని అనడం తెలిసిందే. ఈ చర్మవాద్యం ప్రత్యేకంగా తయారైందీ అందుకే. దీన్ని మొదట కర్రతో చేసేవారు. తర్వాత కంచు, ఇనుములతో కూడా చేస్తున్నారు. సంగీతంలో దీన్ని అంతగా ఉపయోగించడం లేదు. గోండీ ఆదివాసులు ఇలాంటి వాద్యాన్నే తుడుం అని చెబుతారు. దీని ధ్వని ఎక్కువగా వస్తుంది. పెద్దగా ఉండే నగారాలను భేరీలు అంటారు.
రబాబ్‌
ఇదొక తంత్రీవాద్యం. నాలుగడుగుల పొడవు, పది అంగుళాల వెడల్పు ఉంటుంది. చూడటానికి వీణ, సితార్‌ మాదిరిగా ఉంటుంది. సరోద్‌ వాద్యానికి ఇదే మాతృక అని కొందరి వాదన. దీనికి తీగెలుగా గొర్రె/ మేక పేగులను ఎండబెట్టి వాడటం ప్రత్యేకత. వీటిని మీటేందుకు సబాస్‌ అనే చిన్న జిల్లేడుకర్ర పుల్లను ఉపయోగిస్తారు. కబీర్, కృష్ణదాస్‌ల సాహిత్యంలో రబాబ్‌ ప్రస్తావన ఉంది. 17వ శతాబ్దినాటి సంగీత పారిజాతంలో రబాబ్‌ వర్ణన ఉంది. భాగ్‌ కిషన్‌ బృందం ఈ వాద్య వాదన వినిపించారు. 
కడ్డీవాద్యం
ఇది సంతూర్‌ని పోలి ఉంటుంది. ఇందులో మూడు లేదా నాలుగు తంత్రులు ఉంటాయి. పుల్లతో తీగలనుకొట్టి రాగాలను పలికించడం దీని ప్రత్యేకత. మహబూబ్‌నగర్, నారాయణపేట దగ్గర దామరగిద్ద ప్రాంతంలో ఈ వాద్య కళాకారులు ఇప్పటికీ కనిపిస్తారు. మిత్తుల అయ్యవార్లు దీన్ని వాయిస్తారు. ఈ వాద్య సహాయంతో ధర్మపురి రామాయణాన్ని, వైష్ణవ గీతాలను ఆలపిస్తారు. 
నపీరా
బూర లాంటి శబ్దం చేస్తుందిది. ఇత్తడి, కంచు లోహాలతో తయారుచేస్తారు. యాదవుల ఉపకులమైన మందహెచ్చులు కథాగానం చేసేటప్పుడు మధ్య మధ్యలో దీన్ని వాయిస్తారు. పల్లెవాసులు పొలం పనుల సమయాన్ని సూచించే మేలుకొలుపుగా కూడా వాయిస్తారు. ప్రస్తుతం ఇది తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది.
గోంధళీ నృత్యం
గోంధళ్‌ అనేది దేవి ఉపాసనలో భాగం. ఇందులో ఛోన్‌ కా, సంభళ్‌ వాద్యాలు విశిష్టమైనవి. ఛోన్‌కా మొగలిపొద కాండంతో తయారుచేస్తారు. జమిడికని పోలి ఉంటుంది. సంభళ్‌ ఇత్తడి డోళ్ల మీద ఇనుపచట్రాన్ని అమర్చి దాన్ని మేక చర్మంతో మూస్తారు. ఛోన్‌కా, సంభళ్‌ విడివిడి వాద్యాలే అయినా రెండింటి సమ్మేళనంలో వెలువడే స్వరం  గమ్మత్తుగా ఉంటుంది.
దుబ్బు వాద్యం
ఇది జానపద వాద్యాలన్నిటికంటే భిన్నమైంది. కింద కూర్చుని ఒక కాలుని ముందుకు సాచి దానిపై ఆనించి ఈ వాద్యాన్ని వాయిస్తారు. ఈ దుబ్బుకి గజ్జెలు కట్టిఉంటాయి. జానెడున్నర లేదా రెండుజానల పొడవున్న ఈ వాద్యం డుడుంబా అనే శబ్దాన్ని చేస్తుంది. పరిమాణంలో చిన్నదైనా గొప్ప ధ్వని కలిగిన వాద్యమిది. మధ్యప్రదేశ్‌ ఆదివాసీలు, తెలంగాణలో కొన్ని వర్గాల వారు ఈ వాద్యాన్ని వాయిస్తారు.  
చామల్లాలి
రాజన్నలు వాయించే వాద్యం శ్యామలం కాబట్టి దీనికి చామల్లాలి అనిపేరు. ఇది జోడు డప్పుల చర్మవాద్యం. ఒక డోలుని డెంకూ మరో డోలుని శంకు అంటారు. రాజన్నలు ఈ వాద్యంపై పది రకాల బాణీలను వినిపిస్తారు. వీరు వేములవాడ రాజన్నను మొక్కుకుంటారు. ఏటా శివరాత్రినాడు వాద్యాలతో తరలివెళ్లి అక్కడ మోగిస్తారు.
తిత్తివాద్యం
దీన్ని కొమ్ములవారు ఉపయోగిస్తారు. కాటమరాజు కథలో వీరణాలతో పాటూ దీన్ని ఊదుతారు. యాదవుల చరిత్రను గానం చేస్తూ జీవిస్తారు. వరంగల్లు, ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో వీళ్లు ఎక్కువగా నివసిస్తున్నారు. శృతికోసం, శబ్ద విలక్షణత కోసం తిత్తిని కూడా మిగతా వాయిద్యాలతో కలిపి వాయిస్తారు
పంబ జంటవాద్యం
పొడవైన రెండు డోళ్లను కలిపి వీరణం తయారుచేస్తారు. ఒకదానిని చెక్కతో, మరోదాన్ని ఇత్తడితో తయారుచేస్తారు. రెండూ కలిసి జోడుగా ఉంటాయి కాబట్టి దీన్ని పంబజోడు అంటారు. పంబను మోగిస్తూ ఎల్లమ్మకథా చక్రాన్ని గానం చేయడం వల్ల వీరికి పంబాలవారు అనిపేరు. ఎల్లమ్మ, ఈరెమ్మ, పోచమ్మ వంటి గ్రామదేవతల కథలను గానం చేస్తారు. 
బుర్రవీణ
జానపద సంగీతం ఎక్కువగా తంత్రీవాద్యాలమీదే ఆధారపడి ఉంటుంది. సొరకాయ బుర్రలు, తంతులు, మెట్లు ఇలా రూపాంతరం చెందినవాటిలో బుర్రవీణ ఒకటి. తత్వాలు పాడటానికీ, పౌరాణిక గాథలు చెప్పడానికీ బుర్రవీణ సహాయపడుతుంది. సొరకాయబుర్ర కాకుండా ఏకోనాదం కాయ బుర్రతో కూడా వీణను తయారుచేస్తారు. మాలదాసరులు లేదా దండదాసరులు భిక్షాటన చేసుకుంటూ ఈ బుర్రవీణనే దైవంగా భావించుకుంటూ జీవిస్తారు. ఈ కళలో ప్రస్తుతం పాత మహబూబ్‌నగర్‌ జిల్లా దామనగిద్దలో ఉంటున్న దాసరి కొండప్ప ఒక్కరే మిగిలారు.
      ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరినీ ఆయా రంగాల్లో ప్రసిద్ధులైనవారితో సత్కరింపజేశారు. రెండో రోజు ముగింపు కార్యక్రమంలో ఆయా వాద్యాలను పరిచయం చేస్తూ రూపొందించిన ‘మూలధ్వని’ తెలుగు పుస్తకాన్ని బుర్రవీణ కళాకారులు దాసరి కొండప్పతో ఆవిష్కరింపజేశారు. మొత్తంగా మూలధ్వని కార్యక్రమం ఈ అరుదైన వాద్య పరికరాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ గుర్తుచేసింది. సాంస్కృతిక మూలాలను మర్చిపోయిన సమాజ వికాసం సక్రమంగా ఉండదని చాటిచెప్పింది.
గ్రీకు అతిథి
ఈయన కాన్‌స్టాండినోస్‌ కలైజిస్‌. గ్రీస్‌ దేశానికి చెందిన సంగీతవేత్త, పరిశోధకులు. ఈ కార్యక్రమం జరుగుతున్న రెండు రోజులూ చాలా దీక్షగా వాద్య పరికరాలను ఫొటోలు తీసుకున్నారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం కార్యక్రమాన్ని వీడియోలో బంధించారు. ‘తెలుగువెలుగు’ ఆయన్ని పలకరించగా కుంభమేళాకు వచ్చిన తనకు డానియల్‌ నెజర్స్‌ ద్వారా ఈ కార్యక్రమం గురించి తెలిసిందని అన్నారు. ‘‘ఇప్పటివరకూ నాలుగుసార్లు భారత్‌కు వచ్చాను. 130 వాద్య పరికరాలు సేకరించాను. భవిష్యత్తులో వీటిన్నంటితో మా దేశంలో ఓ సందర్శనశాల ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం. ఆంధ్ర, తెలంగాణల నుంచి ఏక్‌తార, అందెలు లాంటివి సేకరించాను’’ అని చెప్పారాయన.
విశ్వవిద్యాలయం వేదికగా ఇలాంటి కార్యక్రమం జరగడం హర్షణీయం. సంగీతానికి ప్రాంతీయ, కుల, మత భేదాలు లేవని ఇక్కడికొచ్చిన కళాకారులందరూ నిరూపించారు. ఈ వాద్య పరికరాల మీద పరిశోధనలు జరగాలి. వీటి గురించి ప్రజలందరికీ తెలియజెప్పాలి. 
- ఆచార్య ఎస్‌.రామచంద్రం
ఇంటికే పరిమితమైపోతున్న, అంతరించిపోతున్న ఈ వాద్యలను బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యడం, వాటికి తిరిగి ప్రాణం పొయ్యడం ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాలుగు శాఖల సహకారంతో దీన్ని ఏర్పాటు చేశాం. ఆయా శాఖల విద్యార్థులు ఈ వాద్యాలను పరిశోధనాంశాలుగా ఎంచుకునేలా వారిలో స్ఫూర్తి నింపడం కూడా ఈ కార్యక్రమ మరో ప్రధాన లక్ష్యం. తద్వారా సంగీత వాద్యాల సామాజిక చరిత్ర వెలుగులోకి వస్తుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. కళాకారులకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తూ, కొత్త తరం వీటిని నేర్చుకునేలా చూడాలని అభ్యర్థిస్తాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం