పండు వెన్నెల మించు ఆ పణతి మోము

  • 1000 Views
  • 3Likes
  • Like
  • Article Share

‘‘తెలుగులోని జానపద గేయాలలో సీత జీవితంలోని వివిధ ముఖాలు ప్రదర్శించబడ్డాయి. అనేక రామాయణ గీతాలు సీత పేరుతోనే ఉన్నాయి. సీత సమర్త, సీతాకళ్యాణం, సీత అప్పగింతలు, సీత అమ్మవారి అలుక... మొదలైనవి కొన్ని పేర్లు మాత్రమే. సీత జననాన్ని గురించి ఆసక్తిరమైన అంశాలు జానపద కథాగేయాల్లో లభిస్తాయి’’ - డా. ఆర్వీయస్‌ సుందరం 
సీత..
నాగేటి చాలులో దొరికిన నవ్వుల బాల. వైవాహిక జీవితంలోని అన్యోన్యతకు అర్థాన్ని, దాంపత్య సారాన్ని అవనికందించిన సౌజన్యశీల. అలాంటి సీత జననం గురించి అనేక రామాయణాలు అనేక రకాలుగా వివరిస్తాయి. మూలగ్రంథమైన వాల్మీకీ రామాయణం సీతను అయోనిజగా వర్ణిస్తుంది. ప్రకృతిపుత్రిగా, మూల ప్రకృతి, మహా ప్రకృతిగా అభివర్ణిస్తుంది. అయితే, ‘ఆనంద రామాయణం’ సీతను వేదవతి పునర్జన్మగా గుర్తించింది. ఆధ్యాత్మ రామాయణం ఏమో సీతను సాక్షాత్‌ పరాశక్తి స్వరూపంగా నిలిపి గౌరవించింది. ‘శోకంలోంచి పుట్టిందే శ్లోకం’ అన్నది నానుడి. ఆ శ్లోకం మొదట విరచితమైంది రామాయణంలో. అంతటి కరుణరసాత్మక కావ్యం, సహజంగానే సున్నిత మనస్కులైన స్త్రీల మనసులను కదిలించింది. అందుకే వారు పాడుకునే రామాయణ పాటల్లో సీత పాత్రలో, తమ ఇంటి ఆడపడుచును చూసుకున్నారు. సీత పుట్టుక గురించే కాదు.. సీతకు జరిగే ప్రతి వేడుక, ఆమె ఆడిన ఆటలు, అలకలు, సీతారాముల చిలిపి తగాదాలు, కష్టాలు, కాన్పులు.. జానకి జీవితంలోని ప్రతి క్షణాన్నీ తమ పాటలతో స్మరించుకుని తమ తమ జీవితాలకు అన్వయించుకునేంతగా తాదాత్మ్యాన్ని పొందారు. అనుశ్రుత రామాయణ గాథలను అనుసరిస్తూ పురుడుపోసుకున్న ఈ పాటలు తేట తేట తెలుగంత నిర్మలత్వాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడు, ఎవరు సృజించారో తెలియకపోయినా లయబద్ధంగా, సరళ పదజాలంతో సాగే ఈ పాటలు చిరంజీవులు.  
పంకజంబున బుట్టి..
‘సీత సురటి’ అనే పాటలో సీత పుట్టుక ప్రస్తావన ఉంది. పట్టపురాణిగా సీత కొలువు దీరిన శుభసందర్భంలో సభలోని వారందరూ ఆనందపడుతూ ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి చర్చిస్తుంటారు. ‘‘వేదములు చదువగా విప్రవాక్యమునా। ఆదినుదయించిన అవనిజవు నీవే/ ఆదికిన్నరివైన వేదవతి కన్యా। వేదగోచర వీర రాఘవుల రాణీ/ తండ్రి సంకల్పమును తగ సిద్దిజేసి। పుండరీకాక్షులను పురుషుగా కోరి’’ అంటూ సాగే ఈ పాట సీతపుట్టుక విశేషాలను మన ముందుంచుతుంది. ఆనంద రామాయణంలో చెప్పినట్టు పద్మాక్షుడనే రాజు తన తపోఫలంగా లక్ష్మీదేవి అంశ అయిన వేదవతిని పుత్రికగా పొందుతాడు. విష్ణువుతో మాత్రమే తన కూతురి వివాహం జరగాలని కోరుకున్న పద్మాక్షుడు, ఆమె స్వయంవర సమయంలో జరిగిన దేవ దానవ ఘర్షణలో మరణిస్తాడు. అగ్నిలో దాగిన వేదవతి బయటకు వచ్చి తండ్రి కోరిక తీర్చటానికి విష్ణువును గురించి తపస్సు చేస్తుంది. అటుగా వెళ్తున్న రావణుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెపై దౌర్జన్యానికి ప్రయత్నిస్తాడు. రావణుడు తాకిన దేహం అపవిత్రమని తలచిన ఆమె యోగాగ్నిలోకి ప్రవేశిస్తుంది. అగ్నికి ఆహుతి అయ్యే ముందు రావణ వధకు తానే కారణం కాగలనని శపథం బూనినట్టు పాటలో కనిపిస్తుంది. 
      ‘‘పంకజంబున బుట్టి లంకకేతెంచి। కొంకక నీ తలలు కొందునికనంచు/ నీ లంకకేతెంచి నీ వనమునందు। చెరనుండి నిను చెరతు వదరకిక ననుచూ/ పంక్తి కంఠుడ నిన్ను చంపింతుననుచూ। పంతమాడినయట్టి పణతివీ నీవే’’- దీని ప్రకారం సీత లంకలో పుట్టి ఉంటుందని జానపదులు భావించి ఉంటారు. అందుకే తర్వాతి పంక్తుల్లో ప్రతి దినమూ కమలాలతో ఈశ్వరోపాసన చేసే రావణుడికి ఒక రోజు తన ఇరువది చేతులకు బరువుగా తోచేంతటి కమలం లభ్యమైందనీ, దాన్ని తెరిచి చూడగా లక్ష్మీకళతో విలసిల్లే బాలిక కనపడిందంటారు. విస్మయానికి గురైన రావణ దంపతులు ఆ తర్వాత తమ గురువుల సూచనతో ఆ పాపను మందసంలో పెట్టి సముద్రంలో పడేస్తారు. అలా కడలి నుంచి జనక మహారాజు యాగస్థలానికి చేరిన మందసం.. అందులోని పాపను చూసిన జనకుడు తనను కుమార్తెగా స్వీకరించి రాజ్యమంతటా ఉత్సవం జరిపిస్తాడు. ‘‘సీతళంలో నీవు జన్మిస్తివా। సీతాంగనని పేరు చెలియ నీకిడిరీ/ జానకి జనక మహారాజింట పెరగగా। జానకీయని జన్మనామమ్మిడిరీ’’ ఇలా సాగే స్త్రీల పాటలకు కాలభేదమన్నది లేదు. గతాన్నిగురించి ఎంత సహజంగా వివరించగలరో భవిష్యత్తును సైతం పాటలో కలపటానికి సందేహపడరు. పద్మంలో లభించిన సీతను చూసి మండోదరి ‘‘ఆదివిష్ణుని సతి అవతారమెత్తింది। రామ సతి పుట్టింది’’ అనటం దీనికో ఉదాహరణ! 
శరదాకాశపు శుద్ధ చంద్రిక
చిన్నారి సీత ఆటల్లో భాగంగా శివుని విల్లును అలవోకగా అటు ఇటు కదుపుతుంది. శ్రీరాముడా విల్లును చూచి ‘‘శివుని విల్లూ దీనినేమాని పొగిడేదరూ’’ అని అతిశయపు మాటలు పలుకుతాడు. సీతాకల్యాణం పాటలో శివధనుస్సు మూడుసార్లు విరిగిందని చెప్పడం ముల్లోకాలకూ రాముడు తన పెళ్లిసందేశాన్ని పంపడమే కాబోలు. కల్యాణ క్రతువుల్లో భాగంగా ఎదుర్కోలు సన్నివేశంలో శ్రీరాముణ్ని విష్ణ్వంశగా భావించి ‘జయ మత్స్యావతార జయ కూర్మావతార...’ అంటూ దశావతారాల ప్రస్తుతి చేయటం జానపదుల పాటల్లో తప్ప మరే రామాయణంలోనూ కనిపించకపోవచ్చు! అలాగే, ‘‘పండువెన్నెల మించు ఆ పణతి మోము। గండుమీనుల బోలు కలికి కన్నులదీ/... తిలపుష్పమును బోలు తీరు నాసికమూ। తలుకుటద్దము మించు తరుణి చెక్కిళ్లు/.... మదగజగమనంబు మహిని చెలగునది। కొదమతాబేల్వంటి కుదురుపాదములూ..’’ అంటూ జానపద స్త్రీలు చేసిన సీత వర్ణన ప్రసిద్ధ కవుల కావ్యకన్యా వర్ణనలకు ఏ మాత్రం తీసిపోదు. ‘‘స్త్రీల పాటలలోని ప్రత్యేకత సీతమ్మ చందం చైతన్యము. ఈ పాటల లోని సీత వర్షామేఘము మీది విద్యున్మాల, శరదాకాశపు శుద్ధ చంద్రిక, కైలాస శృంగోద్భవ స్వచ్ఛ హిమానీనదం... ఈమె నైసర్గిక శోభ ముందు పండితుల సీత సువర్ణ వికారమగు సీతాప్రతిమ మాత్రమే’’ అంటారు ‘కృష్ణశ్రీ’ శ్రీపాద గోపాల కృష్ణమూర్తి. తెలుగు వారి పెండ్లి ప్రత్యేకతలైన లగ్నం పెట్టుకోవడం ఆదిగా రోకళ్లు కుందెన్లను పూజించటం, సువ్వి పాటలు- పసుపులు, కొత్త వరిధాన్యాలు దంచటం, కొట్నం- పుణ్యవచనం, మంగళ స్నానాలు, ఎదుర్కోలు, విడిది ఏర్పాట్లు, మంటప ప్రదక్షిణం, ఉంగర ప్రదానం మొదలైనవన్నీ ఈ పాటల్లో గోచరిస్తాయి. సీత అప్పగింతలప్పుడు బాలహస్తములను పాలల్లో ముంచి పెద్దలందరికీ అప్పగిస్తాడు జనకుడు. తల్లి కౌసల్యకు తన కూతునప్పగించి, ‘‘నీకిస్తి పాలలో ముంచెత్తవమ్మ। పాలనే ముంచెత్తు నీట ముంచెత్తు/ నెయి కాచనేరని నెలత సుమి వదిన। ఆకలికి వోర్వని అబల సుమి వదిన/ ఆకలని ఎన్నడు అడుగనేరదు। వేళ ఎరిగి పెట్టుమా వెలది మా వదిన... బొమ్మరిండ్లును గట్టి బొమ్మలను పెట్టి। ఆట ఎవరాడెదరమ్మ మా ఇంట.. బంతినారు పోసి మా దొడ్డి నిండా। చెట్లెవరు పెంచెదరు చేడరో సీత..’’ అనటంలో సీత పట్ల జానపద స్త్రీల మాతృహృదయం అర్థమవుతుంది.
      ఒకనాడు సీత తన చెల్లెళ్లతో బొమ్మరిల్లు కట్టుకుని గుజ్జెనగూల్లు ఆడుకుంటూ ఉంటుంది. కొలువు పూర్తి చేసుకుని అటుగా వెళ్తున్న రాముడు ఆ ఆటలను పరికిస్తాడు. ఆ పరిసర ప్రాంతాల్లో నాట్యసభ ఏర్పాటు చేస్తాడు. మంటపంలోంచి ఘల్లుఘల్లుమని ధ్వనులు వినబడటంతో సీత ద్వారం దగ్గర నిల్చుని జరిగేదంతా చూసి ఒక క్షణం కూడా అక్కడ నిలువక మల్లిపోతుంది. ఇదంతా మరుకంట గమనించిన రాముడు సీతను తోడుక రమ్మని సందేశం పంపుతాడు. ‘‘అత్త మరుగుదాన అటు వున్నదాన’’ అంటూ అభ్యంతరం తెలుతుంది సీత. అదంతా పూర్తి కాకముందే తన జడ పట్టి పమిడిస్తంభాలకు ముడి వేసిన రాముణ్ని చూసి ప్రణయ తాపగ్రస్త అవుతుందట సీత. ‘‘జప మంటపములోను జగదేకరాము। కనులు మూసుకు జపం చేయుచుండగను/ పాదముల అందెలు కదలకుండగను। బంగారు చెంబుతో వసంతములు తెచ్చి/ చల్లి యా పద్మాక్షి అటు వేగ రాగ। కనుదెరచి శ్రీరాము కలియగని పలికే..’’- రాముడిపై వసంతాలు చల్లిన సీత తర్వాత ఒక్క క్షణం కూడా ఆయనకు చిక్కకుండా అత్త చాటున దాగిందట!  ‘‘ఓయమ్మా మా మీద వసంతములు జల్లి । మచ్చు వలెనే వచ్చి దాగి యున్నాది’’ అంటూ మారువసంతం పోయటానికి సన్నద్ధమైన రామున్ని చూసి దశరథ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబమూ మురిసిపోవాల్సిందే కదా!
గెలుపు ఎప్పుడూ సీతమ్మదే!
‘సీతాదేవి వామన గుంటలు’ పాటలో ‘‘అఖిల బ్రహ్మాండములు ఆటపీటల్లు। ప్రజల రక్షించుటలు పసిడి దిబ్బీలు’’ అంటూ పరమాత్మ తత్వాన్ని కూడా జొప్పించారు జానపదులు. ఈ పాటలు పాడుకున్నవారికి జానకి అంటే చాలా ఇష్టమేమో! అందుకే భార్యాభర్తల్లో భర్త కొంచెం ఎక్కువ సమానం అన్నదాన్ని పక్కనపెట్టి మరీ సీతారాములాడిన ప్రతి ఆటలోనూ సీతమ్మదే పైచేయిగా చూపించారు.  ప్రతిసారీ శ్రీరాముడూ, సీతా ఏదో పందెం వేసి ఆడతారు. రాముడే ఎప్పుడూ ఓడిపోతాడు లేదా వామన గుంటలు పాటలోలాగా గెలుపు వచ్చీరావటంతోనే ఆట ఎత్తిపెట్టి వెళ్లిపోతాడు. గెలిచీ గెలవంగానే ఆట కట్టేయమన్న రాముని వెనకటి ఆటల బాకీ గుర్తు చేసి నిలువుమంటుంది సీత. ‘‘నీ సొమ్ము నా సొమ్ము ఒకటి కాదటే సీత’’ అన్నా వినక ఓలి కట్టించుకుంటుంది. ఇదంతా చాటున గమనించిన మాండవ శ్రుతకీర్తులు ‘‘బావ గెల్చిరి/ ఓలి గట్టలేక పారిపోయిరి’’ అంటూ పరిహసించటంతో ఆట-పాట ముగుస్తుంది. 
      ఇంకొకసారి గరడి సాధన చేసి అలసొచ్చి చెమటలు తుడవమంటాడు రాముడు. ఏదో కారణంతో తన మాటలను వినని సీత మీద కోపంతో చేతిలో ఉన్న పూలబంతిని విసురుతాడు. జానపదుల దృష్టిలో సీత ఎంతటి సుకుమారి అంటే పూలబంతి తగిలి మూర్ఛల్లు పోయేంత!! అలా సీత పడిపోవటాన్ని చూసి హైరానా పడ్డ రాముడు చెలికత్తెలతో పన్నీటి ఉదకాలు తెప్పించి చల్లుతాడు. ‘‘మూర్ఛల్లు తెలిసెను ముద్దరాలు సీత। తన కోపము పట్టలేకే తా లేచిపోయి/ ఒంటిస్తంభం మీది ఒక మేడలోను। పసిడి తరిమెన కోళ్లపట్టే మంచమున... ముద్రాలు సీతమ్మ ముసుకమర బెట్టె’’ ఆమె పెంచిన చిలక సముదాయించబోతే ‘‘తలపగుల గొట్టేను తన్ని పంపేను’’ అని బెదిరిస్తుంది సీతమ్మ. చిటచిట ఆ చిలక రాముడి దగ్గరకు వెళ్లి పాదాలపై పడుతుంది. ఆయన ముఖం ఎత్తకపోతే ‘‘భూదేవి యల్లుడవు బుద్ధి ఇది తగునా’’ అని అడగుతుంది. దానికి రాముడు ‘‘చిలకరో ఓ చిలక మా రామచిలకా/ నేను జేసినా తప్పు నే జెప్పలేను। మీ సీత జేసినది వాసిగా చెపుదు’’ అనటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని ఉద్దేశం ఈ పాటలు కట్టిన వారి దృష్టిలో శ్రీరాముడూ, సీతమ్మ, శాంత, శత్రుఘ్నుడు, దశరథుడు తదితరులంతా తమలాంటి సాధారణ వ్యక్తులే. సందర్భానుసారం లోకరీతిని వారు వల్లెవేస్తూనే ఉంటారు. చిలక లక్ష్మణుని సాయం తీసుకుని సీతమ్మ చెవి దగ్గరకు వెళ్లి ‘‘రఘురాము ఒంట్లోను లఘువు తప్పింది’’ అని ఊదిందట. ఆ మాట చెవిన పడగానే సీతమ్మ ఠక్కున లేచి ‘‘చిలకరో ఓచిలక మారామ చిలక, ఎర్రాని ముక్కుకు వేయిస్తు వెండి, పచ్చాని రెక్కలకు పయిడి పొదిగిస్తు..’’ అంటూ వివరంగా  చెప్పమని బతిమాలుకుంటుంది. ‘‘ఒయ్యి ఒయ్యిన లేచి వయ్యారి నడకల్ల రాము చేరుకొని ముసుగు తీసి చూడగా, ఫక్కుమని నవ్వినాడ’’ట! సీతారాముల అలకలు అలా తీరిపోయాయి!! ఇలా గోవింద నామాలు పాడి ఇక్ష్వాకుని కథలు స్మరించినందుకూ, లాలిపాటల్లో, కల్యాణాల్లో, అప్పగింతల్లో, సమర్త పాటల్లో, వసంతాలలో, అలకలలో, ఆటల్లో సీతారాముల వినోదాలను పరిశీలించుకున్నందుకూ, రామాయణ కథలను విన్నందుకు ఫలశ్రుతి సామాన్యమని ఎలా చెప్పగలం!?


వెనక్కి ...

మీ అభిప్రాయం