దివ్యా సుందర నాగో నాగన్న

  • 907 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। జొన్న‌ల‌గ‌డ్డ మార్కండేయుల

  • విశ్రాంత అధ్యాప‌కులు
  • పేర‌వ‌రం, తూ.గో.జిల్లా
  • 9440219338
డా।। జొన్న‌ల‌గ‌డ్డ మార్కండేయుల

నాగ జాతీయులు తెలుగువారితో కలిసి జీవించి ఈ నేలను నాగారాధన కలిగిన నాగభూమిగా చేశారు. తెలుగునాట నాగులు, నాగరాజులు ఉండేవారు. ప్రాచీన బౌద్ధగాథల్లో ఆంధ్రదేశాన్ని నాగభూమిగా వర్ణించారు. ప్రత్యేకంగా నాగలిపి ఉండేది. బుద్ధుడికి ఈ నాగలిపి తెలుసని ‘లలితవిస్తారం’ అనే బౌద్ధమత గ్రంథం 64 లిపిల పట్టికలో ఇచ్చింది. అలనాటి అమరావతి నిర్మాణాల్లో శిల్పులు పాము పడగలు ఉన్న మానవులను చిత్రించడం.. ఆంధ్రభూమిలో నాగజాతి స్థిరనివాసాన్ని బలపరుస్తుందని ఆరుద్ర అభిప్రాయం. అలా సర్పాలు ఆరాధ్యదైవాలుగా, నాగజాతికి చిహ్నాలుగా తెలుగువారి జనజీవనంతో మమేకమయ్యాయి. ఈ క్రమంలో ‘నాగ’ శబ్ద భవాలెన్నో భాషకు అలంకారాలయ్యాయి.
నాగ,
నాగి శబ్దాలు పాము అన్న అర్థాన్నిస్తాయి. వీటిలో నాగ అంటే మగపాము, నాగి అంటే ఆడపాము. ఈ రెండూ పెనవేసుకుని పెనుగులాడటం కళ్లబడినప్పుడు, దాన్ని నాగ శృంగార బంధంగా భావించి ‘పాములు మసకలాడటం’ అని పిలుస్తారు. ఈ నాగపాశ బంధాన్ని శిల్పాకృతిగా దేవాలయాల్లో చెట్టుకింద ప్రతిష్ఠించి పూజలు జరపడం తెలిసిందే. రతి బంధాల్లో ఈ నాగపాశ బంధాన్నీ పేర్కొంటారు. ఈ బంధం చిత్రితమైన నాగశిలల ప్రతిష్ఠ, నాగారాధన దేశమంతటా కనిపిస్తుంది. నాగశబ్దం జాతిపరంగా సర్పాకృతి కామరూపం కలిగిన శబ్దంగా ధ్వనిస్తుంది.
      నాగారాధన వేదకాలం నుంచి ఉంది. ‘అహిబుదన్య’ అనే పేరు నాగదేవతకు సంబంధించింది. అధర్వణ వేదం ‘తిరశ్చిరాజి, పృథక్, స్వాజొ, కల్మాషగ్రీవ, సవితృ’లనే నాగదేవతలు దిక్కులకు రక్షణగా ఉంటున్నాయని పేర్కొంది. తక్షకుడు ఇంద్రుడికి సఖుడుగా మహాభారత కథలో ప్రఖ్యాతి వహించిన విషకోరల నాగ ప్రముఖుడు. అగ్నితో అర్జునుడు దగ్ధం చేయించిన ఖాండవవనం ఈ తక్షకుడిదే! ఇతని కుమారుడు అశ్వసేనుడు అగ్ని నుంచి తప్పించుకుని, కర్ణుడి నాగాస్త్రంలో పగబట్టి దాగి భంగపడ్డాడు.
వేయిపడగల పాము..
పర్వతమూ నాగ శబ్దాన్ని తగిలించుకుంది. పాండురాజు ఉన్న శతశృంగ పర్వతానికి ‘నాగశాత’మని పేరు. నాగాస్త్రమేమో.. నాగపాశంగా శత్రుబంధనం చేస్తుంది. నాగ అనే రాక్షస సంహారం కోసం బ్రహ్మ దీన్ని సృష్టించాడని కంబ రామాయణ కథనం. నాగాసుర సంహారానంతరం అది శివుడికి నాగాభరణంగా అమరింది. సాల్మలిదీవి నాగులకు నిలయం. వాళ్లని గరుత్మంతుడు బాధించేవాడు. వారికి రక్షణగా నిలవబోయిన నాగపాశం గరుత్మంతుడి ఆగ్రహానికి గురైంది. శివుడు కలగజేసుకుని, దాని జోలికి రావద్దని గరుడిని హెచ్చరిం చాడు. గరుత్మంతుడి హింస ఎలాంటిదో ‘నాగానందం- జీమూత వాహనుడి కథ’ చెబుతుంది. నాగపాశ బద్ధంగా నాగాస్త్రాన్ని యుద్ధాల్లో ప్రయోగించడం ఉంది. రామరావణ యుద్ధంలో రామలక్ష్మణులు నాగాస్త్ర పాశబద్ధులయ్యారు.
      మహాభారతం ప్రకారం జనమేజయ సర్పయాగంలో నాగజాతి చాలావరకూ తుడిచి పెట్టుకుపోయింది. నాగప్రముఖులు మిగిలారు. వాసుకి క్షీరసాగర మథనంలో దేవదానవులకు సాయపడ్డాడు. కర్కోటకుడు నలదమయంతుల కథలో నలుడికి బాహుక రూపం రావడానికి కారకుడు. తక్షకుడు ఇంద్రసఖుడు. కానీ సర్పయాగం నుంచి రక్షణ పొందడానికి కారకుడు వాసుకి చెల్లెలి కొడుకు ఆస్తీకుడు. జరత్కారు ముని కుమారుడిగా ఆస్తీకుడు మానవుడవుతాడు. వాసుకికి మేనల్లుడిగా నాగజాతికి చుట్టమ య్యాడు. బాహుకుడనే పేరుగల పాము సర్పయాగంలో దగ్ధమైనట్లు భారతంలో ఉంది. పద్ముడు, మహాపద్ముడు కుబేర నిధి రక్షకులు. వారి ఆకారాది విశేషాలు ప్రత్యేకంగా ఉంటాయి. ధృతరాష్ట్రు అనే పాము వంశముంది. వాసికెక్కిన వాసుకి, తక్షక, కౌరవ్య వంశాలతోపాటు ఇదీ ఒకటి. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడి నూరుగురు సంతానంలో నాగదత్తుడనే వాడున్నాడు. శల్యపర్వం ప్రకారం వాసుకి నివసించిన ప్రదేశం నాగధన్య తీర్థం. భీష్మ పర్వంలో సుదర్శన ద్వీపంలోని నాగద్వీపం గురించిన వర్ణన ఉంది. అక్కడ కుందేలు చెవుల్లాంటి చెవులు కలిగిన నాగులు నివసిస్తాయి. 
      ఇలా నాగజాతి, దేవమానవ జాతులు నామసామ్యాలతో కలిసే జీవించారు. ‘‘వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి’’ అంటారు ‘వేయిపడగలు’ నవల ప్రారంభంలో విశ్వనాథ. పాములు ఒకటికి మించి పడగలు కలిగి నాగజాతి ప్రత్యేకతను చాటుతాయి. ‘మరావి, పోతారి, కరంగ, నురెతి, ధుర్వా’ కోయలు నాగ వంశీయులమని చెప్పుకుంటారు. కొండచిలువ పురుషాకృతితో మానవ స్త్రీతో రమించి తమకు జన్మనిచ్చాడని నాగాలాండ్‌ కొండజాతి తెగలు కొన్ని చెప్పుకుంటాయి.
అన్నదమ్ములే కానీ...
మయసంగ్రహ అనే సంస్కృత గ్రంథం నాగజాతి, నాగదేవతల గురించి వివరిస్తుంది. నాగదేవతలు రెండు నాలుకలు, రెండు చేతులు, ఏడు పడగలు, ఆ పడగల మీద రత్నాలను కలిగి ఉంటారు. అక్ష సూత్రం తిప్పుతారు. చుట్టలుగా ముడుచుకునే తోక ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన ఆడ, మగ, వారి సంతానం దేవతలుగా పూజలందుకుని ప్రసిద్ధి పొందారు. 17వ శతాబ్ది శిల్పరత్న గ్రంథం బొడ్డు పైభాగం నరాకృతి, కింద భాగం సర్పాకృతి కలిగిన సర్పజాతి ఉనికిని పేర్కొంది. నాగజాతి నివాసం పాతాళం. భోగవతి వారి రాజధాని. కద్రువ సుతులైన నాగులు, వినతాసుతులైన గరుడజాతి ఒకే తండ్రి బిడ్డలు. కశ్యప సంతానమైన వీరి మధ్య సోదరభావం పేరుకు మాత్రమే! వీళ్లు వైరానికి కాలుదువ్వే కథనాలను పురాణాలు వర్ణిస్తాయి.
      విష్ణు వాహనుడు గరుడుడు నాగాంతకుడు. ఆ విష్ణువేమో శేషశయనుడు. గరుడ భీతితో కాళింది మడుగులో దాగిన కాళీయుని పడగల మీద తన పాదముద్రలను శిక్షగా వేశాడు తాండవ కృష్ణుడు. అదే సమయంలో నాగాంతకుడు వాటిని చూస్తే సర్పజాతికి హాని తలపెట్టడనే అభయాన్నీ ఇచ్చాడు. శివుడి నాగాకృతాలంకార భూషణత వల్ల నాగజాతికి పూజనీయత కలిగింది. ఆరాధనోత్సవాలుగా నాగపంచమి, నాగుల చవితి పర్వదినాలు వచ్చాయి. నాగులు గణపతికి ఒడ్డాణాలు. స్కంధుడు సాక్షాత్తూ నర్పాకృతిగా సుబ్రహ్మణ్య స్వామి నామధేయుడయ్యాడు. చిత్రంగా పాములకు బద్ధశత్రువైన నెమలి షణ్ముఖుడి వాహనం.
పాము పగ!
ప్రహ్లాదుణ్ని హింసించడానికి హిరణ్యకశిపుడు విషపూరిత నాగుల్ని ప్రయోగించాడు. చాణక్య చంద్రగుప్తంలో రాక్షస మంత్రి విషకన్య ప్రయోగ వృత్తాంతమూ ఉంది. మంత్రౌషధాలతో పాములను బంధించగలమని చెప్పుకునే వారూ ఉన్నారు. పాము విషానికి మందులతో బాటు మంత్రంతోనూ విరుగుడు వేస్తామంటారు. పరీక్షిత్తును తన కాటు నుంచి రక్షించగల మంత్రవేత్తను తక్షకుడు ధనమిచ్చి వెనక్కు పంపేశాడు. పాములను ఆడించి బతికేవారు వాటి కోరల్లోంచి విషాన్ని సేకరించడంలో నేర్పరులు. పాము విషాన్ని కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
      తెలుగువారికి పేర్లలో నాగశబ్దం చేరుతుంది. నాగయ్య, నాగేశ్వరరావు, నాగార్జున పేర్లు ప్రముఖం. బాలనాగమ్మ కథ నాగజాతితో తెలుగువారి అనుబంధాన్ని తెలుపుతుంది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలలో రాజును కాటందుకుంది నాగే! నాగేశ్వర లింగం జ్యోతిర్లింగం. ‘‘తోక తొక్కితే తొలగిపో.. నడుము తొక్కితే నావాడనుకో’’ అనేది నాగులచవితి నాటి ఆరాధన. అనంతనాగుడి గౌరవార్థం ఉత్తర భారతీయులు శ్రావణశుక్ల పంచమిని నాగపంచమిగా ఆరాధిస్తారు. బెంగాలులో అష్టనాగపూజగా సంవత్సరం పొడవునా నాగపంచమి చేస్తారు. పాములకు మేలు చేయమని కోరే భక్తి మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప పామును చంపడం పాపమనే భావన దేశమంతటా ఉంది. మానవులూ నాగులు కలిసి జీవించే ఇతివృత్తాలతో వస్తున్న కథలు, చిత్రాలు నేటికీ ప్రజాదరణ పొందు తున్నాయి. మహాభారత కాలం నుంచీ మానవ, నాగజాతుల మధ్య వివాహ సంబంధాలు నడిచాయి. అలాగే, ‘పాము పగ’ పదమూ ప్రసిద్ధం. పాముల విషపూరిత కోరలు వాటి ఆహార సంపాదనకు, రక్షణకే కాదు పగ తీర్చుకునే ఆయుధాలుగా ఉపయోగ పడతాయన్నది కథనం! దీనికి శాస్త్రీయ ఆధారాల్లేవు కానీ, ‘తాచుపాము పగ పన్నెండేళ్లు’ అనే నానుడి ఉంది. రాజుల చెలిమి, తాచుల చెలిమి సమానమేనన్న పోలిక కూడా కనిపిస్తుంది.  
తొలి తెలుగు మాట
నాగిని నృత్యం ప్రఖ్యాతిచెందింది. వైజయంతిమాల కథానాయికగా వచ్చిన ‘నాగిన్‌’ చలనచిత్రంలోని నాగిని నృత్యం, నాగస్వర సంగీతం నేటి తరం చలనచిత్రాలకూ ఓ ఒరవడి! నాగస్వర సంగీతం ప్రత్యేకమైంది. ఆధునిక సంగీత పరికరాల మీదా దీన్ని వినిపించవచ్చు. కానీ ‘పాముబూర’ అనే నాగస్వర పరికరముంది. పాములు దీన్నుంచి వచ్చే ధ్వనికి ఆకర్షితమై, తలలూపుతుంటాయని విశ్వాసం! అందుకే పాముబూర ధ్వని నాగస్వరంగా స్థిరపడింది. అలా ఏ వాద్య పరికరం మీద పాముబూర ధ్వనిని వినిపించినా దానికి నాగస్వర సంగీతంగానే గుర్తింపు ఇస్తున్నారు. పాములను చంపడమంటే నాగదేవతలను చంపడమేనని- ముఖ్యంగా తాచును చంపినప్పుడు భక్తిశ్రద్ధలతో కర్మకాండలను నిర్వహించే వారున్నారు. 
      మెసపటోమియా నాగరికతలో నాగదేవుడిగా భావించే సర్పమానవుడి విగ్రహాన్ని గుర్తించారు. నాగారాధన వల్ల పాము కరిచినా విషం ఎక్కదని భక్తుల భావన. దధికర్ణ, మణినాగ, మానస లాంటివి నాగదేవతలుగా పూజలు అందుకుంటున్నాయి. పరమపద సోపానమనే వైకుంఠపాళి ఆట లేదా పాము- నిచ్చెన ఆటలో పాములన్నీ నాగదేవ నామధేయ ఆరాధనా కృతులే! మత్స్య కన్యల్లానే నాగకన్యలూ ఉన్నారు. మన శరీరంలోని కుండలినీ శక్తి వెన్నుపూస సమీపంలో సర్పాకృతిని కలిగి ఉంటుందని చెబుతారు.   
      సర్పం అంటే పాము, కాళం లాంటి పర్యాయపదాలెన్ని ఉన్నా, నాగశబ్దమే పాములకు ఎక్కువగా ప్రచారం. నాగశబ్దం పాము అనే అర్థంలోనే కాకుండా ఇతర పదాలకూ ముందు చేరుతుంది. ‘నాగబు’ను మొదటి తెలుగుమాటగా, అమరావతి శాసనం మీద కనిపించిన మాటగా భావిస్తాం. నాగలోకం పాములది. అయినా నాగరికత, నాగరికం మనుషులవే. నాగవాసం, గొండ్లెం తగిలించిన రెండు కొనలుంచిన ఇనుపకమ్మ నాగదంతం.. గృహనిర్మాణ వస్తువులు. నాగబెత్తము, నాగబ్రాహ్మణులు, నాగమల్లెలు, నాగరం, నాగముస్తెగడ్డి లాంటి మాటలెన్నో వాడుకలో ఉన్నాయి. ‘దిగు దిగు దిగు నాగ నాగన్నా దివ్వా సుందర నాగో నాగన్న’ పాట తెలియని తెలుగువారుండరు. కుంభమేళాలో నాగసాధువులని చూడని భారతీయులూ ఉండరు. సత్పురుషులైన ఈ సాధువుల ముందు చేరిన ‘నాగ’ శబ్దం సర్వదా పరిశీలనీయం.


వెనక్కి ...

మీ అభిప్రాయం