పోరాటమే జీవితం

  • 1302 Views
  • 25Likes
  • Like
  • Article Share

అనేకానేక జీవన సంక్షోభాలు మనిషిని నిస్సహాయుణ్ని చేసినప్పుడు పోరాటమే ఆయుధమవుతుంది. చచ్చినా ఫర్వాలేదు ఓడిపోకూడదనే పట్టుదలను పెంచుతుంది. పరిస్థితులు ఎంతటి బలీయమైనవైనా ఎదురొడ్డి గెలవాలనే తపన సాహసాలకు ప్రేరేపిస్తుంది. అలాంటి సాహసగాథలు మానవ సంకల్పానికీ, మనోనిబ్బరానికీ చోదకశక్తులుగా నిలుస్తాయి. పరిస్థితులను నిందించకుండా ప్రతికూల ప్రభావాలను సైతం శ్లాఘిస్తూ జీవితంతో పోరాడటం అనివార్యమని చెబుతుంది ‘అతడు అడవిని జయించాడు’ నవల.
మనిషి
పుడుతూనే పరిసరాలతోనూ, పెరుగుతూ సామాజిక వైరుధ్యాలతోనూ, అవసానంలో తాత్విక భావాలతోనూ ఘర్షణ పడుతూ ఉంటాడు. తనచుట్టూ ఉన్న పరిస్థితులతో ఎలా స్పందించాలో ఒకరు నేర్పేది కాదు. ఎవరికి వారు అనుభవ పూర్వకంగా అలవరచుకోదగినదని, పోరాటం కూడా మనిషి జీవితంలో అనివార్యంగా ఏర్పడే ఒకానొక అంశమని ‘అతడు అడవిని జయించాడు’ నవల తెలియజేస్తుంది. డా।। కేశవరెడ్డి రాసిన ఈ నవల అటవీ నేపథ్యాన్ని జీవన తాత్వికతతో ముడిపెడుతూ ఉదాత్తంగా సాగిపోతుంది. అడవిలో ఒకరాత్రి జరిగిన సంఘటనని చిత్రించినది కాబట్టి దీన్ని ‘నైష నవలిక’ అనాలి అంటారు సంజీవ్‌దేవ్‌. నవల చిన్నదే అయినా భావ గాంభీర్యం, ఆటవిక పరిస్థితుల వైరుధ్యం ఈ రచన అంతటా పరుచుకుని ఉంటుంది.
      పందులు మేపుకునే ఒక సామాన్యుణ్ని వీరుడిగా తీర్చిదిద్దిన ఈ నవలంతటా... పోరాటమే కనిపిస్తుంది. మేతకోసం అడవికి వెళ్లొచ్చిన పందుల్లో సుక్కపంది కనపడదు ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆ పంది కుర్రాడి కన్నుగప్పి దారి తప్పిపోయిందని ముసలాడు భావిస్తాడు. దాన్ని వెతకడానికి అడవిలోకి ప్రయాణమవుతాడు. ఎటూతోచని దారుల మధ్య, ఎడతెగని ఆలోచనల మధ్య, తన జీవితానుభవాలను నెమరేసుకుంటూ వనమంతా గాలిస్తాడు. ఒక పొదలో పది కూనల్ని ఈనిన సుక్కపందిని చూస్తాడు. మాతృత్వపు మైకంతో ఉన్న ఆ పంది యాజమానిని కూడా దగ్గరికి రానివ్వదు. సలుగులను చూసిన ఆనందంలో దగ్గరికి పోతే ముసలాడి తొడను కొరికేస్తుంది. అప్పటికే నక్కలు రెండు పంది పిల్లల్ని పట్టుకుని తినేస్తాయి. వాటి బారి నుంచి పిల్లల్ని రక్షించుకునే క్రమంలో సుక్కపందినీ... తనకు సాయం చేసిన తోటిగువ్వను చంపేస్తాడు ముసలాడు. గుడిసెలో సలుగుల్ని కన్న మరో పందిదగ్గర పాలు పట్టించి వాటిని కాపాడుకుందామనుకున్న అతని యుక్తి ఫలించదు. సకాలంలో అడవి దాటించలేక మిగిలిన సలుగుల్ని కూడా పోగొట్టుకుంటాడు. తను చేసిన అవిశ్రాంత పోరాటం వృథాగా మిగిలిపోతుంది. 
ఓడి గెలిచాడా..!?
పరిస్థితులతో ఎడతెగని పోరాటమే తప్ప ఈ నవలలో గెలుపూ.. ఓటముల ప్రస్తావన కనిపించదు. ఒకదానివెంట మరొకటి అనేక ప్రమాదాలు.. పరిస్థితులు ముసలాణ్ని ఒంటరిని చేసి బాధిస్తాయి. గతంలో అడవిలో తను పొందిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ అతడు ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగించుకుంటాడు. సుక్కపందిని చేతులారా చంపుకున్నప్పుడు తనలో తను ఇలా అనుకుంటాడు.. ‘‘ఈరోజు నేను విపరీతమైన దురదృష్టాలకు లోనయ్యాను. లెక్కలేనన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. అయినా ఇది నా చివరిరోజు కాదు’’! అడవిలో సుక్కపందిని అన్వేషించే క్రమంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు ముసలాడికి గుర్తొస్తాయి. అవే అతనికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. చీకటిలో వెలుగురేఖలా అతని ఆలోచనలు పురోగమనాన్ని కాంక్షిస్తాయి. అసంబద్ధమైన ఆలోచనలను తలలోకి రానీయకూడదనే వీరోచిత సంఘటనలను గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటాడు. తన ప్రయత్నలోపం లేకుండా, అలసత్వాన్ని ఏమాత్రం దరికి రానీకుండా, ప్రతికూల ఆలోచనలు వెనక్కి లాగుతున్నప్పుడు తనను నిభాయించుకోవడానికి ముసలాడు చెప్పే మాటలు పాఠకులకు ఉత్తేజాన్నిస్తాయి. ‘‘నేను ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. తోటిగువ్వను చంపి పడేసినంత మాత్రాన శత్రువులందరినీ నిర్మూలించేసినట్టు కాదు. భీకరమైన పోరాటానికి నేను సన్నద్ధుడినై ఉండాలి’’!  
      ప్రకృతిలోని చీకటి వెలుగులను గెలుపు ఓటములతో ముడిపెడుతూ ఈ నవల్లో రచయిత గమ్మత్తయిన వర్ణనలు చేశారు. ముసలాడు అడవిలో సంక్షుభిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతని మానసిక స్థితిమీద పాఠకుడికి అవగాహన కలిగించేందుకు సానుకూల భావధారను సృష్టించడం రచయిత మేధోక్తికి నిదర్శనం. ‘‘నా సంకల్పబలానికి పరాజయం లేదు. అది అన్ని బలహీనతల్ని జయిస్తుంది, నిరుత్సాహం కార్యశూరునికి లక్షణం కాదు, ప్రాణభీతిలేకుండా గడపడం ఏ యుగంలోనూ సాధ్యపడలేదు’’ లాంటి తాత్విక విషయాలను ప్రస్తావిస్తూ రచయిత ముసలాణ్ని ధీరోదాత్తుడిగా మలిచారు. ‘‘70 ఏళ్ల పైబడిన వృద్ధుడు. కథ జరుగుతున్నప్పుడు అతడు అస్వస్థుడు. ఒంటరివాడు. అతడు తనకి నెలవుగాని అడవిలో పోరాటం సాగించాల్సివస్తుంది. తోటిగువ్వ మొదట ముసలివాడికి సహాయంగా ఉన్నా చివరికి అదే అతనికి చేటు తెస్తుంది. కథలోని ఇతివృత్తం గంభీరమైనది. దానిని వ్యక్తంచేసే శైలికూడా గంభీరంగా మిస్టీరియస్‌గా ఉండాలని కథను ఫస్ట్‌ ఫర్సన్‌లో రాశాను..’’ అంటారు రచయిత. నవల చివర్లో ఆయన చెప్పే మాటలు జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నిలదొక్కుకోవడానికి అవసరమైన కొత్త శక్తిని అందిస్తాయి.. ‘‘యుద్ధం ముగిసిందని అనుకోవడం పొరబాటు. ఏ మానవుడూ పూర్తిగా అదృష్టవంతుడు కాదు. ఏ మానవుడూ తను వేలుపెట్టిన చోటల్లా విజయుడై రాలేడు. జయాపజయాల సమన్వయ భావమే జీవితం. కన్నీళ్లు దుఃఖభారాన్ని తగ్గించినట్టుగా ఈ సమన్వయభావం ఓటమిలో ఊరటనిస్తుంది’’! 
అందుకే పేరు పెట్టలేదు
ఈ నవల 1984లో ఆంధ్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. 1985లో పుస్తకరూపంలోకి వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1988లో దీన్ని ఉత్తమ నవలగా ఎంపికచేసింది. ఆ తర్వాత ఇది తమిళం, హిందీ, మరాఠీ, ఒడియా, ఆంగ్లం లాంటి అనేక భాషల్లోకి అనువాదమైంది. ఎర్నెస్ట్‌ హెమింగ్వే ‘ద ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’లోని ముసలాడి టోన్‌ని ఈ నవల్లో అనుకరించానని కేశవరెడ్డి చెప్పారు. హెమింగ్వే రచనకు సముద్రం నేపథ్యమైతే ఇందులో అడవి.. దాన్ని ఆశ్రయించుకునే పరిస్థితులు, వైరుధ్యాల సంఘర్షణ కనిపిస్తుంది. ‘‘నీ చుట్టూ ఉన్న శక్తులతో నువ్వు నిరంతరంగా సాగించే పోరాటమే జీవితం. మనిషి తన పోరాటంలో గెలిచాడా ఓడిపోయాడా అనేది ప్రధానం కాదు. పోరాటంలో అతడు కనబరిచిన సంకల్పశుద్ధి, కార్యదీక్ష, చిత్తశుద్ధి ఎలాంటిదీ! అన్నదే ప్రధానం. దీన్ని చెప్పడం కోసమే ఈ నవల రాశాను’’ అని చెప్పారు కేశవరెడ్డి తన ‘ముందుమాట’లో! ముసలాడి పాత్రను విశ్వజనీనంగా ఉంచాలనే ఉద్దేశంతోనే రచయిత ఆ పాత్రకు పేరు పెట్టలేదు.  
      స్త్రీ పాత్రలు లేని నవలలు అప్పటికి తెలుగులో లేవు. పైగా కుటుంబ నవలలు విస్తృతంగా వెలువడుతున్న ఆ కాలంలో లోతైన విషయాలను చర్చకుపెట్టే ‘అతడు అడవిని జయించాడు’ నవల ఏడాది పాటు నిరంతరాయంగా ప్రచురితమవడం, ప్రజాదరణ పొందడం మామూలు విషయం కాదు. మానవ జీవితాన్ని వ్యాఖ్యానిస్తూ తెలుగులో చాలా సాహిత్యం వచ్చింది. చాలా నవలలు జీవితమంటే ఏంటో చెప్పాయి. మంచీ చెడుల విశ్లేషణ చేశాయి. కానీ, జీవిత పోరాటానికి అవసరమైన మౌలిక సూత్రాలని అందించలేకపోయాయి. చీకట్లో ఉంటూ చీకటిని నిందించడం కాకుండా, దాన్ని ప్రతిఘటిస్తూ చేసే మానవ ప్రయత్నమే పోరాటమని ఈ నవల రుజువు చేస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం