నవరస పద నాట్యం!

  • 1123 Views
  • 9Likes
  • Like
  • Article Share

    డా॥ వేలూరి సుమిత్రా పార్థ‌సార‌ధి

  • కూచిపూడి నృత్యాచార్యులు,
  • హైదరాబాదు
  • 9949467966
డా॥ వేలూరి సుమిత్రా పార్థ‌సార‌ధి

సాధారణంగా ఒక వ్యక్తి మాట్లాడే భాష ద్వారా అతడు నివసించే ప్రాంతం, ఆ ప్రాంత జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, మొత్తంగా ఆ ప్రాంత సంస్కృతిని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రజల అలవాట్లు, వ్యాపార వాణిజ్యాలు, కళలు, సాహిత్యం, ప్రచార మాధ్యమాలు, వివిధ ప్రాంతాల ప్రజలతో వారి సహజీవనం లాంటి అంశాలెన్నో ఆయా సమాజ భాషల మీద ప్రభావం చూపుతాయి. అలా తెలుగు భాషాభివృద్ధికి సాహిత్యంతో పాటుగా సంగీతం, నాట్యం, జానపదకళలు కూడా ఇతోధికంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా నాట్య పారిభాషిక పదాలెన్నో మన భాషలో పలుకుబడులుగా స్థిరపడ్డాయి.
భాష,
నాట్యం రెండూ భావవ్యక్తీకరణ కోసం వినియోగించే ఉపకరణాలే. రెండూ మనిషి బుద్ధి వికాసానికి దోహదపడేవే. శాస్త్రీయం, జానపదం లాంటి ఏ నృత్యరీతులైనా, కళారూపమైనా ప్రజలకు నచ్చితే వాటిని అమితంగా ఆదరిస్తారు. భామాకలాపము, రాసలీల, భాగవతాలు, తాండవం, పగటివేషాలు లాంటి కళారూపాలెన్నో తెలుగునాట ప్రజాదరణ పొందాయి. అంతేనా! వాటికి సంబంధించిన పదాలూ వచ్చి తెలుగుతో జతకలిశాయి.. భాషను సంపద్వంతం చేశాయి. తెలుగువాళ్ల వాడుకలో ఉన్న నాట్యకళా సంబంధిత పదాల్లో ప్రధానంగా మూడు రకాలైనవి కనిపిస్తాయి.. కళారూపాల పేర్లు, నాట్యరూపకంలోని పాత్రలు, వాటి పేర్లు, ఇతర పారిభాషిక పదాలు! వీటిలో కొన్నింటి మూలాలను చూద్దాం. 
కలాపం అదొక్కటే కాదు!: కలాపం పదానికి నెమలి పింఛం, బాణం, సమూహం, ప్రణయ కలహం లాంటి నిఘంటు అర్థాలున్నాయి. కూచిపూడి నాట్యంలో ‘కలాపం’ ఒక విశిష్ట ప్రక్రియ. భామాకలాపం, గొల్ల కలాపం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భామాకలాప ఇతివృత్తాన్ని స్వల్ప మార్పులతో వంద మందికి పైగా కవులు రచించారు! సత్యా కృష్ణుల విరహవేదన, ప్రేమ ఘట్టాలు, అనునయ వాక్యాలు, అనురాగాలు, అతిశయోక్తులు, నిందలు, ప్రణయ కలహాలు, పునః సమాగమాలు లాంటివి భామాకలాప నృత్య ప్రదర్శనలో అంకాలు. బహుశా, నిజ జీవితంలో ప్రేయసీ ప్రియుల మధ్య సంభవించే ఘటనలు కూడా దాదాపుగా ఇలాగే ఉండటం వల్లనేమో, ఎవరైనా స్త్రీ పురుషులు అన్యోన్యంగా చర్చిస్తున్నా, ఏకాంతంగా సంభాషిస్తున్నా, వ్యవహరిస్తున్నా వాటిని ‘ప్రేమ కలాపాలు’గా వ్యవహరించటం పరిపాటి అయ్యింది. 
రకరకాల రాసలీలలు: రాసలీలకు అసలు సిసలు అర్థం రహస్యలీల. జయదేవుడి లాంటి భక్తాగ్రేసరులందరూ శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో జరిపిన రాసక్రీడా విశేషాలను భగవత్‌లీలలుగా వర్ణించారు. శ్రీకృష్ణ-గోపికల ఆటపాటలను రాసలీలలుగా పేర్కొన్నారు. రాన్రానూ గుజరాత్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో కోలాట నృత్యాన్ని రాసలీలగా వర్ణించారు. మణిపురి నృత్యంలో రాసలీలలను మనోహర శరీర కదలికలు, భంగిమలు, భక్తి పారవశ్యంతోనూ.. రాధాకృష్ణుల అద్వైత ప్రేమతత్త్వాన్ని తమ అభినయం ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంతటి సుందర  పదాన్ని వివాహేతర సంబంధాన్ని వర్ణించే క్రమంలో వాడటం బాధాకరం!
తెలిసిన బాగోతాలే!: రామాయణ, మహాభారత, భాగవతాది పురాణ ఇతిహాసాల నుంచి కథలను స్వీకరించి వాటికి నృత్యాన్ని కూర్చి యక్షగానాలుగా ప్రదర్శించే వారిని భాగవతులు అంటారు. వారు ప్రదర్శించే నాట్యం, నాటకం, యక్షగానాలను ‘భాగవతాలు’గా పిలుస్తారు. ఈ పదమే ‘బాగోతాలు’గా స్థిరపడింది. తూర్పు భాగవతులు, పిచ్చకుంట్ల భాగవతులు, యానాది భాగవతులు, కూచిపూడి భాగవతులు, చిందు భాగవతులు ఇలా అనేక మంది తెలుగునాట వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. వారివారి కళారూపాలను ఊరూరా తిరిగి ప్రదర్శనలిస్తుండేవారు. ఈ భాగవతుల కథలు బాగా ప్రచారంలో ఉన్నందువల్ల ప్రజలకు ఆ కథా ఇతివృత్తాలు బాగా పరిచయమైపోయాయి. ఈ పరిచయ ప్రభావం ప్రజాభాషపై కూడా పడి తెలిసిన ఎవరి విషయమైనా చెప్పాల్సివచ్చినప్పుడు ‘ఎవరికి తెలియవు వారి బాగోతాలు’ అన్న మాట వాడుకలోకి వచ్చింది. కొన్నిసార్లు నిందార్థంలోనూ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
ఏడు తాండవాలున్నాయి!: పరమశివుడు చేసే నృత్యానికే తాండవమని పేరు. ఆనంద తాండవం, సంధ్యా తాండవం, సంహార తాండవం ఇలా శివుడి తాండవాలు సప్తతాండవాలుగా ప్రసిద్ధికెక్కాయి. పరమేశ్వరుడి తాండవం అత్యంత వేగంగా, ఉద్ధతంగా ఉంటుంది. జానపదులు వీరనాట్య శైలిలో ‘శరభ శరభ అశ్శరభ శ్శరభ’ అంటూ వీరావేశంతో చిందులు వేసే నృత్యానికి కూడా తాండవమని పేరుంది. ఈ తాండవ నృత్యం కొంత ఉద్రేక పూరితంగా ప్రదర్శితమవుతుంది. అందుకే నిజజీవితంలో ఎవరైనా కోపంతో ఊగిపోయినా, ఉద్రేకంగా మాట్లాడినా, పోట్లాడినా అతను ‘శివతాండవం చేశాడ’నో, ‘తాండవమాడా’డనో, ‘శివమెత్తిపోయాడనో అనటం అలవాటయ్యింది.
పగటి వేషం రాత్రి బాగుంటుంది!: ప్రస్తుత వినోద కాలక్షేపాలైన సినిమా, టీవీ, రేడియోల నుంచి వెనక్కి వెళ్లి చూస్తే పగటివేషాలు అప్పటి సమాజానికి వినోదాన్ని అందించేవి. ఈ కళాకారులు పట్టపగలు వేషాలు వేసుకొని ఉదరపోషణార్థం హాస్య ధోరణిలో మాట్లాడుతూ కళా ప్రదర్శన చేసేవారు. ‘ఉదరపోషణార్థం బహుకృత వేషం’ అన్న  నానుడి ఇలా పుట్టిందే. ఈ కళాకారుల అలంకారం, వేషం రాత్రిపూట దీపాలంకరణలోనే బాగుంటుంది. పగటిపూట వీరి వేషం కొంత అసహజంగా అనిపిస్తుంది. అందువల్లనే ఎవరైనా అసహజంగా శ్రుతికిమించి అలంకరించుకుంటే ‘ఏమిటిది పగటి వేషగాడిలా’ అని పెద్దవాళ్లు అంటుంటారు.
      నృత్య కళారూపాల పేర్లు ఇలా ప్రచారంలో ఉంటే, నాట్యరూపకాల్లోని ముఖ్యపాత్రలైన సూత్రధారుడు, సత్యభామ, కేతిగాడు, శకారుడు లాంటి వాళ్లను నిజజీవితంలోని వ్యక్తులకు అన్వయించడం సాధారణమైంది.
సూత్రాలతో సూత్రధారి: నాట్యంలో గాన-వాద్య-పాఠ్యాల సూత్రాలు తెలిపి ప్రదర్శనను నిర్వహించే వ్యక్తిని సూత్రధారుడంటారు. తోలుబొమ్మలాటల్లో బొమ్మలకు దారాలు (సూత్రాలు) కట్టి ఆ సూత్రాలతో కథా విధానాన్ని నడిపే వ్యక్తిని ‘సూత్రధారి’ అంటారు. నిజజీవితంలో ఏదైనా కార్యక్రమాన్ని బాధ్యతతో నిర్వహించే వారిని ‘సూత్రధారులు’గా పేర్కొంటుంటారు. 
అహంకారాలంకృత సత్యభామ: భామా కలాపంలోని నాయిక సత్యభామ. ఈమె సౌందర్య, ఐశ్వర్య గర్విత. శృంగార నాయిక. కొంత అభిజాత్యం, కొంత అహంకారం కలిగిన నాయికగా ఈమెను కవులు వర్ణించారు. రాన్రానూ బయట అలా ప్రవర్తించే స్త్రీలను సత్యభామతో పోల్చడం రివాజయ్యింది.  
* అసందర్భ ప్రలాపాలు చేస్తూ, వికృతమైన చేష్టలు చేసేవారు, నాయకుడి మాటల మధ్యలో కలగచేసుకుని ప్రసంగించేవారు విదూషకుడు, కేతిగాడు తదితరులు. సమాజంలో కూడా ఇలాంటి వాళ్లు తారసపడుతుంటారు. వాళ్లనూ విదూషకుడు, కేతిగాడు పేరిటే పిలుస్తుంటాం.
శకారంగాడు!: అధముడు, వికారాలు కలవాడు, అనిమిత్తంగా కోపం తెచ్చుకునే వాణ్ని ‘శకారుడు’గా నాట్య శాస్త్రం పేర్కొంది. అందుకే వికార చేష్టలు చేసేవాణ్ని ‘వాడొక శకారం గాడులే’ అని అంటారు. 
      వీటితో పాటు నాట్య పారిభాషిక పదాలు ఎన్నో ప్రజాభాషలో ఇమిడి పోయాయి. భాషకు కొత్త జీవాన్నిచ్చాయి. వాడుక పదాలుగా అవతరించాయి.
ముందే నాంది: యక్షగానాల్లోనూ, నృత్యనాటికల్లోనూ ప్రదర్శనకు ముందుగా సూత్రధారుడు రంగస్థలంపైకి ప్రవేశించి ప్రదర్శించబోయే నాటకానికి సంబంధించిన కథా ఇతివృత్తాలను, సన్నివేశాలను ప్రేక్షకులకు తెలియపరుస్తాడు. ఈ ప్రక్రియకు ‘నాంది-ప్రస్తావన’ అని పేరు. నిజ జీవితంలో ఎవరైనా ఏదైనా గంభీర విషయాన్ని చెప్పడానికి ముందు సూచన ప్రాయంగా దాని గురించి ప్రస్తావిస్తే.. ‘నాందీ ప్రస్తావనగా పేర్కొన్నాడు’ అని అనడం పరిపాటి. 
దరువు, తానతందానాలు: సాధారణంగా ‘దరువు’ అన్న పదాన్ని ఒక పాటకు అనుగుణంగా వేసే తాళం అన్న అర్థంలో వినియోగిస్తాం. ఈ పదం ‘ధ్రువ’ శబ్దానికి చెందిన భ్రష్ట పదమని పరిశోధకుల అభిప్రాయం. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది, తప్పకుండా ఉండేది. ఇదే శబ్దం వికృతిలో ‘దరువు’గా మారింది. పోనుపోను తాళవాయిద్యాలైన డప్పు, మృదంగం, తబలాల జనితమైన శబ్దానికి మారుమాటగా స్థిరపడిపోయింది. ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటే దాన్ని ‘దరువెయ్యటం’గా పేర్కొనడం  వాడుకలోకి వచ్చింది. అంతేకాదు ఒకరు చెప్పిన దాన్ని మరొకరు సమర్థిస్తుంటే కూడా ‘వాడికి వీడు దరువేస్తున్నాడు’ అనీ లేదా బుర్రకథలోని వంతల్లా తానా అంటే తందానా అంటున్నాడనడం ప్రచారంలోకి వచ్చింది.
తైతక్కలు: నాట్యంలోనూ, తోలు బొమ్మలాట కళారూపంలోనూ పాత్రధారి వేసే నాట్య అడుగులకు తై, తక్క, ధిం, తక్క, తదిగిణతోం అన్న అక్షరాలు పలుకుతారు. ఈ రకమైన అడుగులు చేసేటప్పుడు ముఖంలో అర్థవంతమైన అభినయం ఏమీ ఉండదు. కేవలం నాట్యం రమణీయంగా ఉండటం కోసమే ముఖకవళికలు అభినయిస్తారు. నిత్యజీవితంలో ప్రయోజనమైన పని ఏదీ చెయ్యకుండా కేవలం సింగారించుకుని హొయలు పోతూ కబుర్లతో కాలక్షేపం చేసేవారి చేష్టలను తెలియపరిచే క్రమంలో ‘తైతక్కలాడుతున్నా’రని ఉపయోగిస్తున్నారు.  
హావభావాలు: శృంగారోచితమైన ఆకారాన్ని తెలిపేది.. కళ్లు, కనుబొమ్మలు, మెడ, తల కదలికల ద్వారా మనసులోని భావాన్ని తెలియచేసే అభినయానికే ‘హావ’మని పేరు. శరీర కదలికల ద్వారా, మాటల ద్వారా మనసులోని శృంగార భావాన్ని ప్రకటించే దేహ వికారానికే ‘భావ’మని పేరు. ఈ రెండింటినీ కలిపి ‘హావభావాలని’ ప్రస్తావిస్తుంటాం. నిజానికి ఇది సంపూర్ణ నాట్య పారిభాషిక పదం. శృంగారాభినయంలో నాయిక మనసులో చెలరేగుతున్న భావాలకు అనుగుణంగా ఈ హావభావాలను అభినయిస్తారు. పూర్తి శృంగార రస భూయిష్టమైన ఈ పదం వాడుక భాషలోకి వచ్చింది. నిజానికి హావభావాలు దేహవికారాలే అయినప్పటికీ నాట్యంలో వాటిని రసానుగుణంగా అభినయించే రసోత్పత్తి హేతువులుగానే పరిగణిస్తారు. కానీ జన సామాన్యంలో ఇవి మనోవికారాలుగా స్థిరపడ్డాయి.
      ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాభాషలో మమేకమైన నాట్య పారిభాషిక పదాలు కోకొల్లలు. ‘ఆ పరిస్థితికి ముందు కొంత పూర్వరంగముందిలే’ అని అంటుంటారు. నాట్యంలో ప్రదర్శనకు ముందుగా నిర్వర్తించేదే ‘పూర్వరంగం’! ‘ఆ విషయం అక్కడికి తెరదించినట్టేనా?’ అని ప్రయోగిస్తుంటారు. నాట్య ప్రదర్శన అనంతరం కార్యక్రమం ముగిసింది అని తెలిపేందుకు తెరను దించుతారు. దీన్ని లౌకికార్థంలో ఇలా ఉపయోగిస్తున్నారు. దీన్నే మరొకలా ‘మంగళం’ పాడారనీ, ‘ముక్తాయింపు’ పలికారనీ అంటుంటారు. నాట్యాంశం ముక్తాయింపుతోనూ, కార్యక్రమం మంగళంతోనూ సమాప్తమవుతుంది. ‘రంగం సిద్ధం చేశాడు, కచ్చేరి పెట్టాడు, నాటకాలాడుతున్నాడు, హరికథలు చెబుతున్నాడు, అంకం ముగిసింది. అక్కడ వాడి అభినయం చూడాలీ... ఇలా అనేకం తరచూ వినపడుతుంటాయి. ఇలా కేవలం మాటలేకాదు, మన భాషకు మరింత అందాన్ని, సోయగాన్ని కలిగించే జాతీయాలు, సామెతలపైనా నాట్య పరిభాషా ప్రభావం ఉంది.  ‘ఆడలేక మద్దెల ఓడు (చిల్లు) అన్నట్టు, ఆమె ఆడింది ఆట పాడింది పాట, ఒకరోజు వేషానికి మీసాలు గొరిగినట్టు, అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది (ఆరభటి అనే నాట్యవృత్తి నుంచి ఆర్భాటం అనే పదం పుట్టింది), తెరవెనక బాగోతం’ లాంటివి ఇలా వ్యవహారంలోకి వచ్చినవే. నిజానికి ఇవన్నీ నాట్యశాస్త్ర పారిభాషిక పదాలే అయినప్పటికీ సామాన్య ప్రజల నాలుకల మీద ఇవి నిత్యం నాట్యమాడుతూనే ఉంటాయి. ఆయా పదాలకు మారుగా మరొక పదాన్ని ప్రయోగించినా, అది అతికించినట్లుగానే ఉంటుంది. ఆ భాషలో బిగువు, సొంపు వినిపించదు. అంత అద్భుతంగా నాట్యపారిభాషిక పదాలను తియ్యందనాల తెలుగు తనలో ఇముడ్చుకుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం