రాజధాని నగరంలో రాజరాజేశ్వరుడు!

  • 938 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎస్‌.సీతాల‌క్ష్మి

  • ధ‌ర్మ‌పురి, క‌రీంన‌గ‌ర్‌

వేములవాడ ఓ ప్రాచీన రాజధాని నగరం. వెయ్యేళ్లకు పైబడిన చరిత్రకు సాక్షి. ‘మహిమగల్ల మా దేవుడు ఎములాడ రాజన్న’ అంటూ తరలివచ్చే అసంఖ్యాక భక్తులు, తమ ఇష్టదైవానికి కోడెమొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు! ఇంకా ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైన ఈ శైవక్షేత్రం.. సంగీత, సాహిత్యాల రచ్చపట్టు కూడా!
తెలుగునాట
గల అతిప్రసిద్ధ శైవక్షేత్రాల్లో వేములవాడ ఒకటి. ఇది ఉత్తర తెలంగాణలోని కరీంనగరానికి 40కి.మీ. దూరంలోని ఒక పుణ్యక్షేత్రం. తెలంగాణ ప్రాంతంలో అనేక వ్యక్తి నామాల్లో ‘రాజన్న’, ‘రాజవ్వ’ అనే పదాల వెనుక ఈ దైవనామం నేపథ్యంగా ఉంది. శ్రీశైలం, దక్షారామం తెలంగాణేతర ప్రాంతాల్లో, వేములవాడ, కాళేశ్వరాలు తెలంగాణలో అతి ప్రసిద్ధాలు. శ్రీశైలం, కాళేశ్వరాలు రెండు వేల సంవత్సరాల కిందటివి కాగా వేములవాడ, దాక్షారామాలు వెయ్యేళ్ల కిందటివి.  
      నదీతీరస్థం రాజధాని నగర నిర్మాణానికి శ్రేష్ఠం అన్న పద్ధతిలో బోధన్‌ చాళుక్యుల్లో మొదటి అరికేసరి తన రాజ్యాన్ని విస్తరించుకుని రాజ్యమధ్యస్థంగా ఉంటుందని బోధన్‌ నుంచి వేములవాడకు తన రాజధానిని మార్చి ఉంటాడు. పైన చెప్పుకున్న అన్ని శైవక్షేత్రాల్లో వేములవాడ ఒక్కటి మాత్రమే ప్రాచీన రాజవంశ రాజధాని నగరం. ఈ నగరం గోదావరి ఉపనది మానేరుకు ఉపోపనదిగా సాగే మూలవాగు ఒడ్డున ఉంది. అనేక చారిత్రక దేవాలయాలతో, శిల్పకళతో అలరారే ఈ నగరం, పరిపాలించిన ఒక్కోరాజు నిర్మించిన ఆలయాలతో శోభిస్తోంది.
చారిత్రకంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం తొలుత వేములవాడ చాళుక్యులకు క్రీ.శ. 750 నుంచి 975 వరకు రెండు శతాబ్దాలు, ఆపై పశ్చిమ చాళుక్యులకు క్రీశ. 975 నుంచి 1108 వరకు నూట పాతిక సం।। అంటే సుమారు 350సం।। రాజధానిగా భాసిల్లింది. తెలంగాణలో తొలి భూరి ఆలయాల నిర్మాణం ఈ నగరంలోనే జరిగింది. నిత్యం లక్షల మంది దర్శించుకునే రాజరాజేశ్వరాలయం తెలంగాణలో అతిపెద్ద ఆదాయం గల దేవస్థానం. సిరిసిల్లను జిల్లాగా మార్చిన తరువాత ఇక్కడి స్వామి పేరును జతచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చి ఈ స్థల ప్రాధాన్యతను రాష్ట్రప్రభుత్వం గుర్తించింది.
ప్రాచీనత
ఈ ప్రాంతం నవీన శిలా యుగం నుంచి జనావాస కేంద్రం. ఇక్కడికి దగ్గరలోని తొగర్రాయిలో రాతిపనిముట్లు చేసే పరిశ్రమ ఉంది. అనేకంగా ఉక్కుపరిశ్రమ గల గ్రామాలుండేవి. ఇది భీకరారణ్యాల మధ్య ఉండేది. కుంఫిణీ యుగపు యాత్రికుడు ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్రలో భాగంగా 1830 ప్రాంతాల్లో నిజాం రాజ్యంలో ప్రయాణించాడు. ‘కాశీయాత్రా చరిత్ర’లో ఈ వేములవాడను పేర్కొని పులుల భయం ఉన్నట్టు రాశాడు. బహుశ ఈ భయమే ఎడ్లబండ్లపై ప్రయాణించే వారికి రక్షకుడైన రాజేశ్వరస్వామికి కోడెను సమర్పిస్తామనే మొక్కులు చెల్లించేలా ప్రేరేపించి ఉంటుంది.
      శాతవాహనుల కాలపు కొదురుపాక, శాతఐరాజు పల్లె లాంటివి వేములవాడకు పరిసర చారిత్రక గ్రామాలు. ఈ ప్రాంతానికి ఒకనాడు ‘సపాదలక్ష భూమి’ అని పేరుండేది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రాంతాన్ని ఏలిన వేములవాడ చాళుక్య ప్రభువులు తమను సపాదలక్షభూమీశ్వరులుగా శాసనాల్లో పేర్కొన్నారు. వీరు రాష్ట్రకూటులకు సామంతులు. సపాదలక్ష స్వర్ణముద్రల వార్షికాదాయంకల రాజ్యమని నాడు ఈ ప్రాంతానికి గల పేరుకు అర్థం. ఈ రాజధాని రాజులైన తొలివంశపు వేములవాడ చాళుక్యులు జైనమతాన్ని, తర్వాత రాజవంశమైన పశ్చిమ చాళుక్యులు శైవాన్ని ఆదరించడం వల్ల ఇక్కడి ఆలయాల దర్శనానికి శైవులు, జైనులు, నిరంతరం వస్తుంటారు. నిత్యం శివనామస్మరణతో మారుమోగే ఈ ఆలయ నగరానికి, శక్త్యుపాసకులు కూడా వస్తారు. బద్దిపోచమ్మ రాజేశ్వరి, బాలాత్రిపురసుందరి ఆలయాలు కూడా ఇక్కడ విశిష్ట పూజలందుకొంటున్నాయి.
వేపచెట్ల కారణంగా..
ఈ నగరానికి ఒక ప్రసిద్ధ స్థలపురాణ గ్రంథం ఉంది. భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలోనిదంటూ సంస్కృతంలో విరచితమైందీ గ్రంథం. ఇందులో అర్జునుడి వంశీకుడైన నరేంద్రుడనే రాజు రుషిని చంపిన పాపానికి తీర్థయాత్రలు చేస్తూ వేములవాడకు వచ్చి ఇక్కడి కొలనులో మునిగి, అక్కడ దొరికిన శివలింగాన్ని ఒడ్డునే ప్రతిష్ఠించి పాపాలనుంచి విముక్తుడైనాడన్నట్లు గాథ ఉంది.
ఈ ప్రాంతానికి వేములవాడ, లేములవాడ, లేంబులవాడ, లేంబులవాటిక మొదలైన ప్రాచీన నామాలు శాసనాల్లో లభిస్తున్నాయి. స్థానికులు లేములాడ అని కూడా అపభ్రంశ రూపంతో పిలుస్తారు. పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలో వాడ, వాడె, వాటిక ఇత్యాది నామాలు గ్రామాలకు ఉండేవి. వేము అంటే వేపచెట్టు, ఈ ప్రాంతపు వేపచెట్ల కారణంగానే ఈ పేరు స్థిరపడి ఉంటుంది. 
శాసనాలు, చరిత్ర
రాజరాజేశ్వర ఆలయానికి, నగరానికి సంబంధించిన అనేక శాసనాలు లభ్యమవుతూ ఈ ప్రాంత విశిష్టతను చాటి చెబుతున్నాయి. ఈ శాసనాలాధారంగా వేములవాడ చాళుక్య రాజవంశంపై ప్రసిద్ధ చారిత్రకులు డా।। నేలటూరి వేంకటరమణయ్య ఓ గ్రంథం రచించారు. ఇమ్మడి అరికేసరి మహారాజు ఈ వంశంలో ప్రసిద్ధుడు. అతని తంత్రపాలుడు పెద్దన ఆదిత్యాలయం కట్టించి శాసనం వేయించాడు. ఇపుడా ఆలయం కనబడదు గాని సూర్యభగవానుడి విగ్రహం మాత్రం భీమేశ్వరాలయంలో ఉంది. ఈ మహారాజు కొలువులో ఉండి, ‘విక్రమార్జున విజయం, ఆదిపురాణం’ రాసిన కన్నడాదికవి పంపమహాకవి వేములవాడ రాజాశ్రితుడే. ఇతని తమ్ముడు జినవల్లభుడు అన్నకు అరికేసరి మహారాజు దగ్గరలోని ధర్మపురి గ్రామాన్ని అగ్రహారం ఇచ్చినట్టు కుర్క్యాలలో వేయించిన శాసనంలో తెలిపాడు. రెండో బద్దిగ ప్రభువు వేయించిన లఘుశాసనం (క్రీ.శ. 966), రెండో తైలపుడు వేయించిన వేములవాడ తటాకశాసనం, రాజరాజేశ్వరాలయంలో వాయవ్య దిశగా గల అరికేసరి సంస్కృత శాసనం, కేదారేశ్వరాలయంలోని చికరాజు (క్రీ.శ.1033) శాసనం, భీమేశ్వరాలయంలోని బద్దెగుని (క్రీ.శ.850) శాసనం చాలా ప్రధానమైన సమాచారం ఇస్తూ.. ఈ క్షేత్రం ప్రాచీనత, చారిత్రక ప్రాధాన్యాలను పట్టిచూపుతున్నాయి.
ప్రధానాలయ విశిష్టత
వేములవాడలో ప్రధానమైన ఆలయం శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం. ఇది ఒక బృహత్తటాకం ఒడ్డున ఉంది. ఈ ప్రాచీనాలయం చరిత్ర మన ఊహకు అందనిదైనా చెరువుల, నదీసంగమ స్థలాల ఒడ్డున శివాలయ నిర్మాణాలు సహజమే కనుక ఎంతో పాతదై ఉంటుంది. తొలిరాజులు జైనమతావలంబకులు కావడం వల్ల దీని ప్రాధాన్యం తొలుత లేకున్నా, పశ్చిమ చాళుక్యులు (మలిరాజులు) శైవాన్ని ఆదరించడంతో దీని ప్రసిద్ధి పెరిగి ఉంటుంది. ఈ ఆలయంలో ఇమ్మడి అరికేసరి శాసనం ఉన్నా.. దానికీ దేవాలయానికీ సంబంధంలేదు. మలిరాజులు ఏలినపుడు ఆరవ విక్రమాదిత్యుడి మాండలికుడైన రాజాదిత్యుడు క్రీ.శ.1083 ఫిబ్రవరి 25నాడు కన్నడ సంస్కృతాల్లో వేయించిన శాసనం ఆధారంగా ఇతడే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు నిర్ధరించవచ్చు. అతని పేరిటే రాజేశ్వరాలయం పేరు వచ్చి ఉంటుంది. చెరువు గోడవైపు గల ఆలయం వెనుక భాగంలో ఈ శాసనం కనిపిస్తుంది.
ఈ ఆలయంలో ప్రధానదైవమైన శివలింగం చాలా పెద్దది. ప్రతిఒక్కరూ ఈ లింగం దర్శనంతో బాటు స్పర్శభాగ్యం, అభిషేక భాగ్యం పొందవచ్చు. ఎడమవైపు రాజేశ్వరీదేవి, కుడివైపు లక్ష్మీగణపతి విగ్రహాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆలయం వెలుపల సీతారామచంద్రస్వామి, అనంత పద్మనాభస్వామి ఆలయాలు తర్వాత ఉపాలయ నిర్మాణాలుగా చూడవచ్చు. ఈ ఆలయంలో చుట్టూరా ప్రదక్షిణం చేసివచ్చాక ఈశాన్య భాగాన ఓ ముస్లిం వ్యక్తి సమాధి ఉంటుంది. ఇతడు సిద్ధపురుషుడని, ఇతని పేరు హజ్రత్‌ ఖ్వాజా బాఘ్‌స్వర్‌ అని, తనొక శివభక్తుడని చెబుతారు. గోలుకొండ మొఘలుల రాజ్యంగా మారిన తర్వాత ఈ ఆలయంలో ఈ సమాధి దర్గా ఏర్పడి ఉంటుంది.
భీమేశ్వరాలయం
భీమేశ్వరాలయం వేములవాడలోని ఆలయాల్లో చాలా గంభీరమైన, ప్రాచీనమైన చారిత్రక నిర్మాణం. దీని సౌందర్యానికి ముగ్ధులు కానివారుండరు. శిల్పరీత్యా ప్రధానమైందే. కొల్లేరు సరస్సులోని జలదుర్గంలో దాక్కొని ఉన్నపుడు బద్దెగుడు, చాళుక్య భీముణ్ని ఓడించి విజయచిహ్నంగా భీమేశ్వరాలయం నిర్మించాడని నేలటూరి వేంకటరమణయ్య చెప్పారు. ఈ ప్రభువు తన తాత భద్రగ లేదా భద్రదేవ పేరుతో ‘బద్దెగ’ అయ్యుంటాడు. ఆలయంలో ఎడమవైపుగల శాసనం ఇతనిదే. బయటితోటలో జైన విగ్రహాలు అనేకంగా ఉంటాయి. దాంతో ఇది జైనాలయమని, వేములవాడ చాళుక్యులు జైనులని కొందరు సందేహించినా, నిర్ధరణ చేయలేం. ఈ భీమేశ్వరాలయం ఆనుకొని ఒక పెద్ద పూదోట చిరకాలంగా ఉంది. మంచి గంగన అనే మాలాకారుడి సంరక్షణలో పూదోటకోసం ఆరో విక్రమాదిత్యుని కుమారుడైన కుమార సోమేశ్వరుడు ఇచ్చిన దానశాసనం ఒకటి ఇక్కడ లభిస్తోంది. 
ఇమ్మడి అరికేసరి జైనుడే అయినా శివాలయాలను సంరక్షించాడు. అతను వేయించిన శాసనంలో బద్దగేశ్వరాలయం, నగరేశ్వరాలయం, ఆదిత్యేశ్వరాలయాలను పేర్కొన్నారు. ఆదిత్యేశ్వరాలయం ఈ ప్రభువుకు తంత్రపాలుడైన పెద్దనార్యుడు నిర్మించినట్టు శాసనం ఉన్నా ఆ ఆలయం జాడలు లేవు. శిథిలం అయ్యుండవచ్చు. లేదా మరో ఆలయంగా మారి ఉండవచ్చు.
ఇతరాలయాలు
ఇక్కడి మరొక ప్రాచీనాలయం నగరేశ్వరాలయం. ఇది నకరేశ్వరాలయం. రాజుకు పన్నులు చెల్లించే వ్యాపారుల సంఘాన్ని నకరంగా పిలిచేవారు. ఈ ఆలయాన్ని వారు కట్టించి ఉంటారు. ఆ తర్వాత నగరేశ్వరాలయంగా పిలుచుకుని ఉంటారు. ఇది అరికేసరికి (క్రీ.శ.940) ముందే ఉంది. శిల్పం దృష్ట్యా ఇది చూడదగింది. కేదారేశ్వరాలయం మరో సుందరమైన కోవెల. ఈ ప్రాచీనాలయంలో క్రీ.శ.1033 నాటి జగదేకమల్ల రెండో జయసింహుని శాసనం ఉంది. చికరాజు రాజేశ్వరుని పేరుతో ఆలయ నిర్మాణం చేశాడు. ప్రధానదైవం రాజేశ్వరుడు కనుక తర్వాత ఆలయాల్లో కూడా శివుణ్ని రాజేశ్వరుడే అన్నారు.
వేములవాడ ఆలయాల్లో బద్దిపోచమ్మ దేవాలయం మరో ప్రధానాకర్షణ. ఈ దేవత శక్తి ఉపాసనకు సంకేతంగా గ్రామీణుల పూజలందుకుంటోంది. శాక్తేయారాధనలో భాగంగా విస్తృతంగా మద్యం, జంతు బలులుంటాయి. రాజేశ్వరీదేవి, బాలాత్రిపుర సుందరీదేవికి ప్రత్యేకాలయాలు ప్రధానాలయంలో వెనుక వైపు, ప్రదక్షిణా పథపు నిర్మాణం మండువాల్లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం సాత్త్వికాహారమే నైవేద్యంగా ఉంటుంది.
బృహత్తటాకం
ఆలయానికి ఉత్తరాన స్థలమాహాత్మ్య పురాణంలో పేర్కొన్నట్టు ఒక పెద్ద చెరువుంది. రాజేశ్వరునికి అభిషేక జలాలు ఈ చెరువులోవే. దీనికి ‘రాజాదిత్య సముద్రం’ అని పేరు. కల్యాణి చాళుక్య చక్రవర్తి రెండవ తైలపుని శాసనం ఇక్కడ ఉంది. ఈ తటాకం ముందు నుంచే ఉంది కనుక, మరమ్మతు పనులు చేయించి శాసనం వేయించి ఉంటాడు ప్రభువు. 
      వేములవాడ విశిష్టతల్లో మరొక అంశం.. ఆలయ నిర్మాణం చేసి, తమ గురువులను, మతాధిపతులను అధికారులుగా చేసే సంప్రదాయం! వాగరాజు గురువు సోమదేవసూరి శుభధామ జినాలయాధిపతి.
వేములవాడ చాళుక్య ప్రభువుల కారణంగా ఈ నగరాన్ని ఆశ్రయించిన ప్రాచీన మహాకవులెందరో ఉన్నారు. కన్నడ ఆదికవి పంపడు విక్రమార్జున విజయం రాసింది వేములవాడలోనే. ఇది ఇమ్మడి (రెండవ) అరికేసరికి అంకితంగా రాశాడు. ఆయనే ఆదిపురాణమనే మరో కన్నడ కావ్యం ఇక్కడే రాశాడు. ఈ రెండూ వేములవాడలో క్రీ.శ.930-950 మధ్యలో రాసినవి. విక్రమార్జున విజయం క్రీ.శ.946 నాటికే పూర్తి అయ్యింది. దీనిలోని పద్యాలు ఇమ్మడి అరికేసరి వేయించిన ఇదే సంవత్సరం నాటి అర్పణపల్లి శాసనంలో ఉన్నాయి. అర్పణపల్లిని అరిపిరాలగా పిలిచేవారు. ఈ అరిపిరాల మానేటి ఒడ్డున ఉండే నేటి కరీంనగర్‌ పట్టణపు ప్రాచీన నామం. మరొక మహాకవి సోమదేవసూరి ఈ గ్రామంలోని శుభధామ జినాలయంలో కోవెల పారుపత్తెం వహించి, వాగరాజుకు గురువుగా, తండ్రి ఇమ్మడి అరికేసరికి సన్నిహితుడు. ఇతని ‘యశస్తిలక చంపువు’ సుప్రసిద్ధ చారిత్రక కావ్యం. ఇదే రాజ్యాన్ని ఆశ్రయించిన పంపని తమ్ముడు జినవల్లభుడు మరొక మహాకవి. ఇతని మిత్రుడు మల్లియరేచన ఇక్కడి నుంచే కవిజనాశ్రయమనే పేరుతో తెలుగులోని తొలి ఛందో గ్రంథం రాశాడు. తెలుగులో తిట్టుకవిగా సుప్రసిద్ధుడై రాఘవ పాండవీయ ద్వ్యర్థి కావ్యం రాసిన ఉద్దండకవి భీమకవి ఈ నగరం వాడే. రామరాజ భూషణుడి వసుచరిత్రకు వ్యాఖ్య రాసిన సోమకవి లాంటి దిగ్గజాలూ ఇక్కడే పుట్టారు.
      వేములవాడ రాజేశ్వరుడి మహిమలను, నగర విశిష్టతలను తెలిపే సాహిత్యం, విశేషంగా శతక రచనలు కొల్లలు. మామిడిపల్లి సాంబకవి, సి.నారాయణరెడ్డి తదితర ఆధునిక కవులకు వేములవాడ పుట్టిల్లు. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వేములవాడ రాజేశ్వరునిపై మధ్యాక్కర ఛందంలో మూడు శతకాలు రాశాడు. వాటిలో ఓ పద్యం...
నిన్ను భావించుచు విష్ణువనుకొందు, నీ వనుకొందు
వెన్ను నూహించుచు, నిద్దఱుంగారు, వెస భావమందు
నన్ను నేనె విముక్తినిగ దేజస్సనాథునిగా బిట్టు
నిన్నంచు వేములవాడ రాజరాజేశ్వరా! స్వామి!

      సంగీతాదికళలకు కూడా వేములవాడ నెలవు. ఇదో గొప్ప సాంస్కృతిక కేంద్రం. చౌటి భాస్కర్‌ లాంటి మహాసంగీత విద్వాంసులకు పుట్టిల్లు. ఇక్కడ ఏటా జరిపే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సుప్రసిద్ధ కళాకారులు వస్తారు. బాలమురళీకృష్ణ, ఘంటసాల, జానకి లాంటి వారు కళాప్రదర్శనలు చేసి స్వామిని సేవించారు. వేములవాడలో తమకళా ప్రదర్శన చేయని ప్రసిద్ధ కళాకారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరంటే అతిశయోక్తికాదు. ఈ సంగీతారాధన సంప్రదాయం అరవై సంవత్సరాలుగా కొనసాగుతోంది.
      వేములవాడ రాజేశ్వరుణ్ని భక్తులపాలిట కొంగుబంగారంగా భావిస్తారు. ఇక్కడ తలనీలాల సమర్పణ పదకొండు వందల సంవత్సరాల కిందటే ఉన్నట్టు శాసనాధారం ఉంది. మరొక విశేషమైన మొక్కు మరే దేవాలయంలో లేనిది ఇక్కడ ఉంది. అదే కోడె మొక్కు. తెలంగాణలోని ఈ ప్రాంతపు రైతులు తమ గోశాలనుంచి తొలి మగ చూలు (కోడె)ను స్వామికి సమర్పణం చేస్తారు. వ్యవసాయం, గోసంపద బాగుండాలని కోరుకుంటారు. కోడెద్దు స్వామికి వాహనం కావడం కూడా ఈ మొక్కుకు మరో కారణం. వేములవాడ శివసత్తులకూ (శివశక్తికి రూపాంతరం) ప్రసిద్ధం. తెలంగాణలోని అవిద్యావంతులైన స్త్రీలు, కుటుంబంలో ఒకరు, స్వామికి సమర్పణంగా దేవాలయానికి ఇచ్చివేయబడేవారు. వీరు త్రిశూలధారులై అమ్మవారి రూపంగా భక్తుల గౌరవమర్యాదలు అందుకొంటారు. విద్యాబుద్ధులు పెరిగిన సమాజంలో ప్రస్తుతం ఈ వ్యవస్థ కనుమరుగవుతోంది. వందలాది సంవత్సరాలుగా తొలుత జినమత కేంద్రంగా, తర్వాత శైవక్షేత్రంగా వెలుగొందుతూ అనేక దేవాలయాలతో విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరుడి వేములవాడ పుణ్యక్షేత్రం కాశీ, రామేశ్వరాలతో పోల్చదగిన పవిత్ర శివధామం.


వెనక్కి ...

మీ అభిప్రాయం