అవన్నీ తప్పుడు అభిప్రాయాలే!

  • 346 Views
  • 5Likes
  • Like
  • Article Share

లోకంలో ఇప్పుడు ఆంగ్లానిదే రాజ్యం.. ఆ భాష రాకపోతే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడటం కష్టం.. ఈ అభిప్రాయాలు తల్లిదండ్రులందరిలో ఉన్నవే! అందుకోసం పిల్లల మెదడుకి బలవంతంగా ఆంగ్లాన్ని అంటగడుతూ ఉంటారు. అలాగని అమ్మలాంటి మాతృభాషను సమాంతరంగా నేర్పిస్తారా అంటే... అది ఆంగ్లానికి ఎక్కడ అడ్డుపడిపోతుందోనని అనుమానం. పిల్లలు ఒకేసారి రెండు భాషలను నేర్చుకోలేరనీ, అమ్మభాష ఆంగ్లానికి అడ్డుపడుతుందనీ భయపడుతుంటారు. చిన్నపిల్లలు ఎలాంటి అదనపు ఒత్తిడీ లేకుండా రెండేసి భాషలను నేర్చుకోగలరని ఇప్పటికే చాలా పరిశోధనలు నిరూపించేశాయి. ఇక ఈమధ్యనే వెలుగు చూసిన ఇంకో పరిశోధన... ఆ రెండు భాషల మధ్యా ఎలాంటి రాపిడీ ఉండదని తేల్చింది.
      ఒక భాష నుంచి పిల్లాడు మరో భాషలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మెదడులో ఎలాంటి మార్పు చోటుచేసుకుంటుంది? రెండు భాషల మధ్యా సంఘర్షణ ఉంటుందా? మెదడు అయోమయానికి లోనవుతుందా? మాట్లాడే సామర్థ్యం తగ్గుతుందా? లాంటి అనుమానాలతో న్యూయార్క్‌ విశ్వవిద్యాలయానికి చెందిన భాషావేత్తలు ఓ ప్రయోగం చేశారు. ఇందుకోసం రెండేసి భాషలు మాట్లాడే వ్యక్తులను పిలిపించారు. ఒక భాష తర్వాత మరో భాషను మార్చిమార్చి మాట్లాడుతూ ఉండగా, వారి మెదడులో వస్తున్న మార్పులను ‘ఎంఈజీ’ అనే అత్యాధునిక పరికరాల ద్వారా పసిగట్టే ప్రయత్నం చేశారు.
      దురదృష్టవశాత్తు ఈ ప్రయోగం కచ్చితమైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మెదడులో వస్తున్న మార్పులు ఒక భాషను ఆపడం వల్ల వస్తున్నాయో, మరో భాషకు మారడం వల్ల వస్తున్నాయో గ్రహించలేని పరిస్థితి. దాంతో మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంగ్లంతో పాటుగా సంజ్ఞ భాషను మాట్లాడగలిగే వ్యక్తులను ఎంచుకున్నారు. అలా అయితే ఒకేసారి రెండు భాషల్లోనూ సంభాషించవచ్చు కదా! ఆ సమయంలో వారి మెదడులో ఎలాంటి మార్పు వస్తోందో గమనించారు. రెండో భాష వల్ల మెదడు మీద ఎలాంటి అదనపు భారమూ లేదని తేలింది. మరింకేం! పిల్లాడికి రెండు భాషలు నేర్పడం వల్ల తన నైపుణ్యానికి ఎలాంటి లోటూ రాదని స్పష్టమయ్యింది కదా!


వెనక్కి ...

మీ అభిప్రాయం