పాటల తోటలో పద్మసిరివెన్నెల

  • 975 Views
  • 6Likes
  • Like
  • Article Share

    భువ‌న‌చంద్ర‌

  • చ‌ల‌న‌చిత్ర గీత ర‌చ‌యిత‌
  • చెన్నై
భువ‌న‌చంద్ర‌

‘‘జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది’’
      ఈ ఒక్క గీతం చాలు.... సీతారామశాస్త్రికి ‘పద్మశ్రీ’ ఇవ్వడానికి. ఈ ఒక్క గీతాన్నీ ఎవరు లోతుగా విశ్లేషించాలన్నా వారికి మానవజాతి మీద అమితమైన ప్రేమ ఉండాలి. మానవత్వానికి వారు చిరునామా కావాలి. అంతేకాదు ఆధ్యాత్మికపు లోతుల్ని చవిచూసి ఉండటమే గాక అంతరాత్మ పిలుపులనూ వినగలిగి ఉండాలి. ‘ఏముందోయ్‌ సినిమా పాటలో?’ అని పెదవి విరిచిన వాళ్లు ఓ నాడు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. ‘సినిమా సంగీతమూ ఓ సంగీతమేనా?’ అంటూ చప్పరించిన వారూ లక్షల్లోనే ఉన్నారు.
      ఆకాశంలో మబ్బులా, చేతికందకుండా ఎగిరిపోయే శాస్త్రీయ సంగీతాన్ని నేలకి దించి సామాన్య మానవుడు కూడా హాయిగా పాడుకోగలిగేట్టు చేసింది సినీ గీతాలు (గీతకారులూ), సినీ సంగీత దర్శకులూ మాత్రమే. సామాన్యుడికి అందుబాటులో ఉండటం కన్నా మించిన పరమార్థం, ‘కళకి’ ఇంకేముంటుందీ! ఇరవై సార్లు రామాయణ సారాన్ని పాటలుగా రాసి సామాన్యుడికి రామాయణాన్ని అందించిన సముద్రాల గారిని తెలుగుజాతి మరవగలదా?
      ‘మేఘసందేశాన్ని’ ఒక్క పాటలో ఇమిడ్చిన కృష్ణశాస్త్రి గారిని మరువగలమా? పల్లెగుండె సవ్వడిని ప్రతి పాటలోనూ పలికించి ప్రేక్షకుల్ని వీక్షకుల్ని శ్రోతల్నీ మైమరపించిన కొసరాజు రాఘవయ్య చౌదరి గారిని మరచిపోగలమా? జీవిత సత్యాలని అలతి అలతి పదాలతో ఆవిష్కరించిన మనసుకవి ఆత్రేయనీ, తెలుగువారి పౌరుషాన్నీ, వారి జీవితాన్ని అద్భుతంగా సంక్షిప్తీకరించడమేగాక, పాటకి పదును పెట్టిన ఆరుద్రని మరువగలమా?
      ‘నరజాతి సమస్త చరిత్ర’ని ఉక్కు పిడికిలిలో పట్టి, తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నించడమేగాక, స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడకు... ముందు నీ స్వార్థాన్ని త్యజించుకో అని ఢంకాబజాయించి మరీ చెప్పిన శ్రీశ్రీని మరువగలమా?
      వారందరిదీ సువర్ణాక్షరాలతో లిఖింపదగిన చరిత్ర అయితే, సీతారామశాస్త్రిదీ అంతటి ఉన్నతమైన చరిత్రే.
      సినిమా పాటల గురించి ఎవరు ఎప్పుడు పరిశోధించినా సీతారామశాస్త్రి ‘పాఠాల్ని’ పరిశోధించక తప్పదు. నిజం.... శాస్త్రి రాసేవి పాటలు కాదు. పాఠాలు. నీ తప్పొప్పుల్ని ఎత్తిచూపే పాఠాలు. నిన్ను సరైన దోవకి రమ్మని పిలిచే దారిదీపాలు. రాబోయే గీత రచయితలకి పాఠం నేర్పే పాఠాలు.
      సీతారామశాస్త్రి సినిమాల్లో అడుగు పెట్టినప్పుడు పైన చెప్పిన వారందరూ ఉన్నారు. అంతేకాదు అపర సరస్వతి వేటూరి ‘చక్రవర్తి’గా వెలుగుతున్నారు. అంతమంది మధ్యనా అభిమన్యుడిలా ప్రవేశించి తెలుగువారి అభిమాన రచయిత అయ్యారు శాస్త్రి. వేటూరితోనే ‘శభాష్‌’ అనిపించుకున్నారు. ఇంకేంకావాలి ఏ రచయితకైనా! ఈ మాట మిగతా రచయితలకి. శాస్త్రికి కాదు. ఆయనకి ఇంకేదో, ఏదో ఏదో ఏదో కావాలి. తన విజ్ఞాన సర్వస్వాన్నంతా ప్రజలకి పంచిపెట్టడం కావాలి. తెలుగు సినిమా పాట దశ, దిశ మారడం కావాలి. పాటకోసం పాట (సాంగ్‌ ఫర్‌ సాంగ్‌) కాకుండా, ప్రేక్షకుల కోసమే పాట.. పాట కోసమే సినిమా అన్నంతగా పాట పరిపాలించడం కావాలి. పాటకి పట్టంగట్టడం కావాలి. ఎవరు శ్రీకారం చుట్టేదీ? కమర్షియల్‌ పరిధి నుంచి గుండె పరిధిలోకి పాటని లాక్కొచ్చారు సీతారామశాస్త్రి. ఒకరోజు కాదు.. ఒక ఏడాది కాదు.. ఓ దశాబ్దం కాదు.. మూడున్నర దశాబ్దాలుగా సీతారామశాస్త్రి ఏనాడూ నిద్రపోలేదు. మగత లాంటి పగటిపూట ఆలోచన... పగటి లాంటి రాత్రిపూట విశ్లేషణ, ఆచరణ.
      అందుకే పాట ఆయన కలంలోనే ప్రసవించింది, ప్రభవించింది... పులకించింది. ప్రజల పెదవుల మీద పరవశించింది. ‘సీతారామశాస్త్రి పాట’గా ‘బ్రాండ్‌’ అయింది. 
      పదాల పొందిక చాలు ఆయన పాటని గుర్తుపట్టడానికి. పదాల వెనుక తొణికిసలాడే వేదనో, వైరాగ్యమో మమతో, మైమరపో చాలు... ఇది శాస్త్రి మాత్రమే సృష్టించగల పాట అని తెలుసుకోవడానికి.
      శ్రమయేవ జయతే అన్నా.. 
      కృషితో నాస్తి దుర్భిక్షమ్‌ అన్నా..
      కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నా..
      అవన్నీ సిరివెన్నెలకే వర్తిస్తాయి. ఎందుకంటే ఆయన ఏనాడో ‘రుషిత్వాన్ని’ పొందారు. ఏనాడో పొగడ్తలకీ తెగడ్తలకీ అతీతుడయ్యారు. తన పాటతో అనంతాన్ని ఆక్రమించారు.
      మద్రాసులో ఉండగా ఎన్నోసార్లు శాస్త్రి, జొన్నవిత్తుల, వెన్నెలకంటి, నేనూ కలిసేవాళ్లం. అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. ఇప్పుడూ ఆ బంధం అలానే ఉంది. విచిత్రం ఏమంటే ఒకే సినిమాకి ముగ్గురమో, నలుగురమో ఒకే గదిలో కూర్చుని ఎవరి పాట వాళ్లు రాసుకునేవాళ్లం. హాయిగా పాడి ఒకరికొకరం వినిపించుకుని ఆనందించేవాళ్లం. ఆరోజుల్లోనే పాట గురించి చర్చ వస్తే- ‘‘సినిమా నేను చెప్పదలచుకున్న దానికి వేదిక. సినిమానే నేను పనిముట్టుగా ఎంచుకున్నా’’ అన్నారు శాస్త్రి.
      ‘‘సారీ... నా వేదిక రచన. నా వరకూ నేను నిర్మాత, దర్శకులు కోరుకున్నదే ఇస్తా. ఎందుకంటే నిర్మాత ఓ చెట్టయితే యూనిట్‌ అంతా ఆ చెట్టు కొమ్మన సేదతీరే గువ్వల్లాంటివారం’’ అని నేనన్నాను. ‘‘రెండూ చెయ్యచ్చు.... అయితే అది ‘సన్నివేశాన్ని బట్టి ఉంటుంది’’ అన్నాడు బుల్లెబ్బాయ్‌ (వెన్నెలకంటి). ‘‘పాడేందుకు పాట, ఆడేందుకు మాట రెండూ సంధిస్తేనే పాటకీ మాటకీ అందం’’ అన్నారు జొన్నవిత్తుల.
      ఈ సంభాషణ జరిగింది 29 సంవత్సరాల కిందట. చారి స్ట్రీట్‌లో ఉన్న మా ఇంట్లోనే. నలుగురమూ పైకివచ్చాం. కళామతల్లి పుణ్యమా అని నలుగురమూ గత 32 సం।।గా చలనచిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డాం. మాకు పాట (రచన) తప్ప మరొకటి తెలియదు. అయితే శాస్త్రి నిజంగానే ‘సినిమా’ని ‘సజీవ సాహిత్యానికి’ వేదికగా మార్చారు. అలా మలచడానికే దాదాపు పన్నెండు వేల రాత్రుల్ని పగళ్లుగా మార్చుకోవాల్సి వచ్చింది. ఇదీ ‘కృషి’ అనే మాటకి అర్థం. ఇదీ ‘శ్రమ’ అనే మాటకి విశేషార్థం.... ఇదే పాట అనే సాహిత్య ప్రక్రియకు గూఢార్థం. జీవితానికి పరమార్థం.
      ఒక్కటి మాత్రం చెప్పగలను... శాస్త్రి ఓ మహాశిల్పి. పదాలని శిల్పాలుగా మలచిన, మలుస్తున్న మహాశిల్పి. హృదయానికీ, పెదాలకీ పదాల వారధి కట్టిన సనాతన సారథి. ఇది పొగడ్త కాదు. వయసులో పెద్దవాడిగా తమ్ముడికి నా ‘దీవెన’.
      ఒకమాట చెప్పితీరాలి. ఎవరికి పురస్కారం లభించినా వివాదాలు ఉండి తీరతాయి. సమర్థించేవారు కొందరుంటే విమర్శించేవారు ఎంతో మంది ఉంటారు. కానీ శాస్త్రికి ‘పద్మశ్రీ’ విషయంలో మాత్రం ఏ ఒక్కరూ విమర్శించరు సరిగదా ఆనందిస్తారు. అంతే కాదు తొందరగా ఒక పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
      కనుక ఈ ‘పద్మశ్రీ’ తెలుగు పాటకి లభించిన పురస్కారంగా భావించి సీతారామశాస్త్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది గీత రచయితల కుటుంబానికి కట్టిన పట్టం. శాస్త్రి పాటల్లో కనీసం 75 శాతం కేంద్ర రాష్ట్ర పురస్కారాలకి అర్హమైనవే. శాస్త్రి అంతర్గతంగా రుషితుల్యుడు. ఈ లోకం తామరాకు అయితే ఈ లోకాన్ని అంటీ అంటకుండా ఉండే నీటిబొట్టు శాస్త్రి. అందుకే ఆధ్యాత్మికత ఆయన పాటల్లో తొణికిసలాడుతుంటుంది.
      ప్రియస్నేహితుడా- నీ స్నేహం నాకు గర్వకారణం. ‘జగమంత కుటుంబం నాది’ అని ఎలుగెత్తి చాటినా, వేలాది ఏకాంత రాత్రుల్ని గడిపిన రుషివి నువ్వు. సినీ వినీలాకాశంలో సీతారామశాస్త్రి అనే దివ్య సువర్ణ పతాకం శతాబ్దాలపాటు రెపరెపలాడుతూ, రాబోయే తరతరాలకీ దారి చూపాలనీ, వారు, వారి కుటుంబమూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలనీ కోరుకుంటూ తమ్ముడిగా భావించి దీవిస్తూ, నీలోని విజ్ఞతకీ ప్రతిభకీ తల వంచి నమస్కరిస్తూ... 


వెనక్కి ...

మీ అభిప్రాయం