అక్షరాలకు ఆది అమ్మ సన్నిధి...

  • 1615 Views
  • 2Likes
  • Like
  • Article Share

    వసంత్

  • బాసర
  • 9491746587

బాసర సరస్వతీ ఆలయం తెలుగునాట చిన్నారుల అక్షరాభ్యాసాలకు ప్రత్యేకం. అమ్మచెంత పిల్లలతో మొదటిసారి అక్షరాలు దిద్దించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. అలా ఇక్కడ ఏటా వేలాది మంది చిన్నారులు అఆలకు శ్రీకారం చుడతారు. వసంతపంచమి, దసరా, ఇతర పర్వదినాల్లో ఈ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. 
భూమండలం
మీది సమస్త జీవరాశుల్లోంచి మనిషిని వేరుచేసేది జ్ఞానం. మానవుడు తన పరిణామ క్రమంలో భాషను తద్వారా విజ్ఞానాన్ని సాధించి విశ్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. అంతటి ప్రాముఖ్యత కలిగిన జ్ఞానానికి ప్రతిరూపంగా సరస్వతీదేవిని కొలవటం మన సంస్కృతిలో అంతర్భాగం. అయితే.. చదువులతల్లి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతి చెందిన కోవెలల్లో ఒకటి కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ సమీపంలో శిథిలావస్థలో ఉండగా, మరొకటి నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీ ఆలయం. వేలాది మంది భక్తులు, అక్షరాభ్యాసానికి తరలివచ్చే చిన్నారులతో ఈ ఆలయం ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
      మహాభారత యుద్ధానంతరం మనసు వికలమైన వ్యాసుడు తన శిష్యబృందంతో దేశాటనకు బయల్దేరి బాసర వద్ద గోదావరి నదీ తీరానికి చేరుకుంటాడు. అక్కడ ఓ రాత్రి విశ్రమించిన వ్యాసునికి అమ్మవారు ప్రత్యక్షమై అవ్యక్తరూపిణిగా ఉన్న తనను ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించమని ఆదేశించిందన్నది ఈ క్షేత్ర స్థలపురాణం. వ్యాసుడి పేరిటే ఈ క్షేత్రం వ్యాసపురిగా, తదనంతరం వాసరగా, బాసరగా మారింది.
వసంతపంచమి నాడు..
వీణాధారిణి, సకలకళాభినేత్రి సరస్వతీ దేవి జన్మదినమే వసంతపంచమి. ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధపంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు. 
బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దీన్ని శ్రీ పంచమి, మదన పంచమిగా కూడా వ్యవహరిస్తారు. శుభకార్యాలకు, చిన్నారుల అక్షరాభ్యాసాలకు ఈ పర్వదినాన్ని ఓ సుముహూర్తంగా, విశిష్టదినంగా భావిస్తారు. ఈ రోజు అమ్మవారి సన్నిధిలో గడిపేందుకు, దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు అశేషసంఖ్యలో భక్తులు తరలివస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు భారీగా జరుగుతాయి. అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం దేవాదాయశాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
      బాసర సరస్వతీ ఆలయంలో శారదీయ నవరాత్రి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మొదటిరోజు నుంచి నవమి రోజు వరకు అమ్మవారికి అభిషేకం నిర్వహించరు. రాష్ట్రంలోని మిగతా శక్తిస్వరూపిణీ ఆలయాల్లో ప్రతీరోజూ అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అయితే బాసరలో మాత్రం ఉత్సవాలు జరిగే రోజుల్లో అభిషేకం నిర్వహించరు. తొమ్మిదో రోజైన మహార్నవమి నాడు చండీహవన పూర్ణాహుతి నిర్వహిస్తారు. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి నెమలి పల్లకిలో ఊరేగిస్తారు.
అనాదిగా పవిత్ర దీక్ష
బాసర ఆలయంలో అమ్మవారి దీక్ష ‘మధుకరం’ చాలా ప్రత్యేకమైంది. వ్యాస భగవానుని సమకాలీనంలో ఈ దీక్ష ఆరంభమైనట్టు భావిస్తారు. వ్యాసుడు అమ్మను కొలిచి, ఉపాసన చేసి, భిక్ష స్వీకరించటంతో ఆ ఆచారం ప్రారంభమైందన్నది గాథ. ఇప్పటికీ భక్తులు ఆలయానికి వచ్చి, అమ్మవారి ఉపాసకులుగా మారి ధ్యానం చేస్తూ గ్రామంలోని అర్చక కుటుంబాల వద్ద భిక్షను స్వీకరిస్తారు.
      బాసర ఆలయ సమీపం నుంచి పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. నదిలో పుణ్యస్నానాలతో పాటు పర్యాటకులు విహారం చేయటానికి అనువైన పరిస్థితులున్నాయి. ఆలయ సమీపంలోని కుమారచల పర్వతం మీద వ్యాసుడు తపస్సు చేశాడని చెప్పే గుహ, అమ్మవారి ఆభరణాలను తనలో ఇముడ్చుకుందని ప్రచారంలో ఉన్న వేదవతిశిల, పురాతన పాపహరేశ్వర ఆలయం చూడదగ్గ ప్రదేశాలు. తాజాగా గత కార్తీకపౌర్ణమి నుంచి బాసర గోదావరి తీరంలో నిత్యహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీటితో పాటు బాసరకు వంద కిలోమీటర్ల పరిధిలో నాందేడ్‌ గురుద్వారా, కడెం జలాశయం, కవ్వాల్‌ అభయారణ్యం, కుంటాల జలపాతం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్, కదిలి పాపహరేశ్వర ఆలయం ఉంటాయి. సరైన ప్రణాళికతో వస్తే వీటన్నింటినీ దర్శించవచ్చు.


సిద్ధం నమః
వసంత
పంచమి రోజు పిల్లలతో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ. అయితే.. అనేక కుటుంబాలు కలిసి ఒకేచోట తమ చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది! ‘ఈనాడు - సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న విశాఖలోని మద్దిలపాలెం సీఎంఆర్‌ సెంట్రల్‌లో జరిగిన ‘సామూహిక అక్షరాభ్యాసం - సరస్వతి పూజ ఉత్సవం’లో ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచీ ఎన్నో కుటుంబాలు ఈ వేడుకకు తరలివచ్చాయి. తమ బుడిబుడి అడుగుల బుజ్జాయిలు మొదటిసారి అక్షరాలు దిద్దుతుంటే చూసి మురిసిపోయాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వాహకులు బియ్యం, పూలు, ఇతర పూజ సామగ్రి అందించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి ఆ తర్వాత సరస్వతీదేవి పూజ చేయించారు. పిల్లల్ని తల్లిదండ్రులు ఒళ్లో కూర్చోబెట్టుకుని వేద పండితుల సూచనల్ని అనుసరిస్తూ వారితో మంత్రాల్ని చెప్పించారు. పళ్లెంలో బియ్యం, పూలు ఉంచి వాటి మధ్య పిల్లలందరితో ‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని, అలాగే తెలుగు వర్ణమాలలోని అక్షరాలు రాయించారు. మరికొందరు పలకల మీద దిద్దించారు. పూజలు, అక్షరాభ్యాసం అయ్యాక.. కొంతమంది పిల్లలు పద్యాలతో అలరిస్తే, మరికొంతమంది పురాణ వాక్యాల్ని పఠించి ఆకట్టుకున్నారు. మైత్రిక అనే బుజ్జాయి ద్రౌపది ఏకపాత్రాభినయం చేసి ఔరా అనిపించింది. అలాగే దీపిక అనే మరో అమ్మాయి ‘అదివో అల్లదివో’ అంటూ అన్నమయ్య కీర్తనని ఆలపించింది. తేజస్విని, మాధుర్య, స్వర్ణ, రుత్విక్, కార్తీక్‌ లాంటి పిల్లలందెరో తమ ప్రతిభను చాటుకున్నారు. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం