బొమ్మల కొలువు పాట

  • 897 Views
  • 0Likes
  • Like
  • Article Share

హారతులివ్వరె అంగనలందరు ఆనందము తోడన్‌
నీరజ నేత్రికి సావిత్రి దేవికి సత్యవంతుని ప్రియసతికి   ।।హా।।
మంగళ వాద్యములతో మండప మందు దేవిని ఉంచితిరి
కూరిమి తోడుత కుంకుమ పసుపు కోమలులొసగంగ   ।।హా।।
ఆవాహన చేసిరి అతివలందరూ అక్షింతలు వేసి
పూజలు చేసిరి పుత్తడి బొమ్మకు శాస్త్ర సమ్మతంగా       ।।హా।।
పుట్టిన రోజున పులగమన్నమూ రాజాన్నములిడిరి
రెండవ రోజున రమణులందరూ చలివిడి చేసితిరి       ।।హా।।
మూడవ రోజున ముద్దకుడుములు మోహన లొసగితిరి
నాల్గవ రోజున నానుమియ్యము నయమున ఒసగితిరి  ।।హా।।
ఐదవ రోజున అతివలందరూ అప్పాలు పెట్టితిరి
ఆరవ రోజున గారెలు వడలు గుమ్మాన పెట్టితిరి     ।।హా।।
ఏడవ రోజున అట్లు ఒసగితిరి ఐదవతనమునకు
ఎనిమిదవ రోజున పరమాన్నమ్ములు పడతులు చేసితిరి ।।హా।।
తొమ్మిదవ రోజున పెరుగు బెల్లం నవకాయ పులుసులు చేసితిరి
పిండివంటలతో సావిత్రి దేవికి నైవేద్యం బిడిరి
ఊరేగింపుతో సావిత్రి దేవిని ఓలలాడించేరు
బొమ్మల కొలువుకు కొమ్మన లందరు ముగింపు పలికారు
సౌభాగ్మమిమ్మని మగువలందరు అమ్మని కోరారు
సావిత్రమ్మని కోరారు. ।।హా।। ।।హా।।

గాయని: పూళ్ళ భానుమతి సేకరణ: కుంటముక్కుల సత్యవాణి, కాకినాడ
 


వెనక్కి ...

మీ అభిప్రాయం