ఇద్ద‌ర‌మూ క‌ల‌సి యేక‌ముగా వుంటేను...

  • 940 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సిద్ధార్థ

ప్రేమ ఒక మధురభావన. దానికి పరవశించనివారంటూ ఉండరు. ప్రేమ ఇద్దరి మనసులను కలిపేది మాత్రమే కాదు విభిన్న జీవన సంస్కృతులనూ ఏకం చేస్తుంది. భావాలనూ అభిరుచులనూ మిళితం చేస్తుంది. కొత్త సృష్టికి, నవకల్పనలకు శ్రీకారం చుడుతుంది. ఈ సృష్టి యావత్తు ప్రేమభావనలో పులకిస్తుంటే భారతీయులు మాత్రం కులాల అంతరాలతో కునారిల్లుతున్నారు. ‘ప్రేమనిచ్చిన ప్రేమవచ్చును’ అన్న గురజాడ అడుగుజాడలు మసకబారిపోయాయి. ‘ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికై’ అన్న బసవరాజు భావపరిమళం ఆచరణకి అందకుండాపోతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా ప్రచారంలో ఉన్న ‘చంద్రమ్మ- యెంకయ్య పాట’ మన గడ్డ మీది సామాజిక అంతరాలకు దృశ్యమానమే కాదు, సరిహద్దులెరగని ప్రేమకు సాక్షి కూడా! 
పొద్దంతా కష్టపడి పనిచేసుకుని జీవించే వారిని పాట సాంత్వన పరుస్తుంది. చేసేపనిలో హెచ్చుతగ్గులే తప్ప నిజానికి మనుషులందరూ ఒకటే అనే నైతిక ప్రబోధం వారి పాటల్లో కనిపిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉంటే జీవితం సుఖంగా సాగిపోతుందని భావిస్తారు కాబట్టే ఆ పాటల్లో సకల జనుల ఏకత కనిపిస్తుంది. కానీ, ఎప్పటికప్పుడు కులం కోరలు చాస్తూ సర్వమానవ సమానత్వ భావనకు తూట్లు పొడుస్తోంది. యెంకయ్య, చంద్రమ్మల సామాజిక వర్గాలు వేరైనా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వీళ్ల వివాహానికి సామాజిక కట్టుబాట్లు అడ్డంకిగా నిలుస్తాయి. సంఘం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారు. కులాలతో తప్ప మనిషిని మనిషిగా గుర్తించలేని ఈ సమాజంలో మనుగడ సాగించలేమని తెలిసి ఆత్మహత్య చేసుకుంటారు. ఇదీ కోస్తాంధ్రలో.. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాచుర్యం పొందిన చంద్రమ్మ- యెంకయ్య పాట ఇతివృత్తం. ఈ పాట ఆ జంట ప్రణయ యాత్రనే కాదు, వారి కల్లోల జీవనగమనాన్నీ కళ్లకుకడుతుంది. వారిద్దరి మధ్య పొడసూపిన అనురాగ గాఢత అనుభూతుల కలనేతగా పాటంతా పరచుకుని ఉంటుంది. 
      నీ అందమూ సూసి, నీ చందమూ సూసి నేపొంగిపోయానురో యెంకయ్య! నేపొంగి పోయానురో! అని చంద్రమ్మ అంటే.. మిడిమిడియెండలో నడిసివస్తుంటావు జోడుకుట్టీ తెచ్చినానే చంద్రమ్మ! ఆకు చెప్పులుకుట్టినానే అంటూ బదులిస్తాడు  యెంకయ్య. ఇలా వీరిద్దరూ కబుర్లాడుకుంటూ.. భవిష్యత్తు గురించి కలలుకంటూ ఉంటారు. చెప్పులు కుట్టుకుని జీవించే యెంకయ్యకీ, రైతు కుటుంబానికి చెందిన చంద్రమ్మకు మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణే ఈ పాట.
      తెలిసందమామలో తేనె తెరలున్నా తెచ్చిపెడుదువుగాని రారో యెంకయ్య అని చంద్రమ్మ పిలిస్తే.. పండు యెన్నెల్లోన పక్కేసి పడుకుంటే మల్లెపాన్పుగా మారిపోనాదే చంద్రమ్మ పూలసెజ్జగా మారిపోనాదే చంద్రమ్మ అంటూ ఆమె వంక ఓరగా చూస్తాడు యెంకయ్య. అప్పుడామె ఏమని బదులిస్తుందీ అంటే! నువ్వు చెప్పినదెల్లా నిజమాని నమ్మేను నవ్వులాటకు కాదురోరెంకయ్య అని అంటుంది. 
      ఇలా వాళ్లిద్దరూ ఆకాశంలోని చుక్కలను లెక్కిస్తూ, వెన్నెలను ఆస్వాదిస్తూ ఉండగా.. భద్రాద్రికి పోయి రాములోరినీ, గోదారితీరాన కోటిలింగాల సామినీ చూసొద్దామేంటీ! అని అడుగుతుంది చంద్రమ్మ. ఏడుకొండల రేడు యెంకటేసరసామి కడకుబోయి మొక్కులిడుకొనివద్దాము మీతల్లితో చెప్పిరాయే చంద్రమ్మ అన్న యెంకయ్య మాటకు చంద్రమ్మ చెప్పే సమాధానమంతా ప్రేమమయమే. ఇద్దరమూ కలిసి యేకముగా వుంటేను ఏడులోకాలు మనకాడనే ఉంటాయి ఎక్కడికీ యెల్లొద్దురోరెంకన్న అనేసి ఊరుకోకుండా మనకి పెళ్లయితేనూ కనకదుర్గమ్మకు పళ్లు ఇచ్చితీరాలి రోరెంకయ్య! అంటూ తన మనసులో మాట చెబుతుంది. ఇక్కడ యెంకయ్య మాటల్లో కులరక్కసి విశ్వరూపం కనిపిస్తుంది.
నిన్ను పెళ్లాడితే నిలవనియ్యరు నన్ను
కులముతక్కువవాని కొట్టవస్తుంటారు
ఏడకెళ్లినగానియీసుతో సూస్తారు
ఎందుకొచ్చిన బ్రతుకే చంద్రమ్మ

యింక నే బతకలేనే చంద్రమ్మ
      దీనంగా పలికిన యెంకయ్యను చూస్తూ చంద్రమ్మ కూడా అదే మాట అంటుంది. ఇంట్లో తన మీద ఎగిరెగిరిపడ్డారంటూ.. కులం నుంచి వెలివేస్తారనీ కళ్లనీళ్లు పెట్టుకుని ఇంకా ఇలా అంటుంది..
నిన్నువిడువలేను! నిన్ను కూడాలేను
తిప్పలుపడలేనురోరెంకయ్య
తిట్లుకాయలేనురోరెంకయ్య
గోదారికిపోయి గోయిందునకు మ్రొక్కి
కడతేరిపోతానురోరెంకయ్య
కడసారి సూపిదేరోరెంకయ్య 

      కలిసి చనిపోవడమే తప్ప కలిసి బతికే దిక్కు ఇక్కడ కనిపించట్లేదని చంద్రమ్మ కుమిలిపోతుంది. అప్పుడు యెంకయ్య అవిసిపోయిన గుండెను అదిమిపట్టుకుని ఇలా పాడతాడు..
నువ్వు చచ్చిపోతే నేను బతికుంటాన
నేను కూడవస్తనే చంద్రమ్మ
నీతోడ నేనుంటానే
సొరగలోకంలోను సల్లనిసోటులో
సరసములాడుదామే చంద్రమ్మ
చందమామను సూతమే! 

      స్వర్గంలోనూ కలిసి జీవిద్దామన్న యెంకయ్య మాటలకు చంద్రమ్మ చిన్నగా నవ్వుతుంది. ఇలా యువతీయువకుల మధ్య పొడసూపే ప్రేమను కులం ఎలా విచ్ఛిన్నం చేస్తుందో ఈ పాట విస్పష్టంగా చెబుతుంది. ఇది నేదునూరి గంగాధరం జానపద పాటల సంకలనం ‘మిన్నేరు’ లో కనిపిస్తుంది. అసలు ఈ పాట నేపథ్యమేంటీ! ఇదింతగా ప్రచారంలోకి రావడానికి కారణమేంటీ! అని ఆలోచిస్తే నిష్కల్మషమైన ప్రేమతత్వమే ఈ పాటను ప్రజలకు చేరువచేసిందని అర్థమవుతుంది.
నిజ జీవితగాథ?
జానపద గీతాలన్నింటికీ మూలం పల్లీయుల అనుభవాలే. అలా చూస్తే, చంద్రమ్మ- యెంకయ్యలు నిజజీవిత వ్యక్తులు కావచ్చు. సమాజాన్ని ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఆ దురదృష్టవంతుల గాథ ఏ అజ్ఞాత జానపదుడో పాటగా కట్టి ఉండొచ్చు. అయితే.. రాన్రానూ ఈ పాట మధ్యలో బూతు చరణాలను చేర్చి, అశ్లీల గీతంగా మార్చారు కొంతమంది. నేదునూరి గంగాధరం దాన్ని గమనించి, బూతులు తొలగించి అసలు పాటలను తన ‘మిన్నేరు’ ద్వారా భావితరాల కోసం భద్రపరిచారు. 
      దేశ అభ్యున్నతికి కులం పెద్ద అడ్డంకిగా మారింది. సామాజిక అంతరాలు మానవతను ఛిద్రం చేస్తున్నాయి. అందుకే కులనిర్మూలన జరగాలనీ, లోకమంతా వసుధైక కుటుంబంలా మెలగాలనే ఆకాంక్షతో సామాజిక సంస్కర్తలు ఏళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మనుషులను పశువులకంటే హీనంగా చూసే ఈ అమానుషత్వం రోమన్ల బానిస వ్యవస్థకంటే హేయమైందని డా।। బి.ఆర్‌.అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా.. ఎన్నెన్ని చట్టాలు తెచ్చినా కులవివక్ష కనుమరుగు కావట్లేదు. ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఇంకా సజీవంగా ఉంటోంది. పుట్టుక ఆధారంగా మనుషులను విడదీస్తూనే ఉంది. వ్యక్తుల ఆలోచనాధోరణుల్లో మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. అలా రావాలంటే ప్రేమే ముఖ్య సాధనం. భారతీయ వివాహవ్యవస్థ అనగానే ప్రముఖంగా ప్రస్తావనకొచ్చే అరుంధతిదేవి మాతంగ కన్య. ఆమెను వివాహమాడిన వసిష్ఠుడు ద్విజుడు. కులం ప్రధానం కాదు గుణం ముఖ్యమని చాటిన అరుంధతీ వసిష్ఠుల సమాగమం ఇప్పటికీ వర్ణాంతర వివాహాల విశిష్టతను చాటుతూనే ఉంది. స్త్రీ పురుషుల కలయికలో కులమతాల ఆధిపత్యం ఏమాత్రం హర్షణీయం కాదనీ.. లోక కల్యాణానికీ సలక్షణజీవన వికాసానికి ప్రేమపూరకమైన జీవితమే పుష్టినిస్తుందని బోయి భీమన్న ‘రాగవాసిష్ఠం’ నిరూపించింది. భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకం కూడా వర్ణాంతర వివాహాలు నేటి సామాజిక వైరుధ్యాలకు విరుగుడు లాంటివని చెబుతుంది. 
      కులాల పట్టింపులూ, వైయక్తిక పంతాలు లేని సమాజమే జాతికి శ్రీరామరక్ష. కులం పునాదుల మీద కాదు ఉన్నతమైన వ్యక్తిత్వం మీదే దేశప్రగతి ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ‘చంద్రమ్మ- యెంకయ్య పాట’ ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. 

* * *

పూర్తి పాట‌

చంద్రమ్మ:- నీయందమూసూసి, నీచందమూసూసి
నేపొంగిపోయానురో యెంకయ్య! నేపొంగిపోయానురో    //యెం//
యెంకయ్య:- మిడిమిడియెండలో నడిసివస్తుంటావు
జోడుకుట్టీ తెచ్చినానేచంద్రమ్మ! ఆకు చెప్పులుకుట్టినానే     //చం//
చం:- తెలిసందమామలో తేనె తెరలున్నాయి
తెచ్చిపెడుదువుగానిరారో! యెంకయ్య     //తె//
యెం:- పండుయెన్నెల్లోన పక్కేసిపడుకుంటె
మల్లెపాన్పుగ మారిపోనాదే చంద్రమ్మ!
పూలసెజ్జగ మారిపోనాందే చంద్రమ్మ!
చం:- నువ్వుసెప్పినదెల్లా నిజమానినమ్మేను
నవ్వులాటకుకాదురో రెంకయ్య     //న//
యెం:- శిరసుతొడమీదెట్టి! సిరినవ్వునవ్వితే
సింతలన్నీ మాయమైనాయే చంద్రమ్మ!
వంతలన్నీ మాయమైనాయే చంద్రమ్మ!
చం:- ఒక్కకైగిలిల్లోన యేకమైపోతేను
పైన చుక్కలునవ్వినాయో రెంకన్న
కిందచుక్కలు రాలినాయో రెంకన్న,
యెం:- రాబోయేనవమికి రాములోర్నిసూడ
బద్రాద్రికిపోదమే చంద్రమ్మ    //బ//
చం:- గోదారితీరాన కోటిలింగాలుండె
కోట్లింగసామికి కొబ్బర్లుకొట్టాలి
మూటముల్లుకట్టరో రెంకయ్య     //మూ//
యెం:- ఏడుకొండలరేడు యెంకటేసరసామి
కడకుబోయి మొక్కులిడుకొనివద్దాము
మీతల్లితో సెప్పిరాయే చంద్రమ్మ     //మీ//
చం:- ఇద్దరమూకలసి యేకముగవుంటేను
ఏడులోకాలు మనకాడనేవుంటాయి
ఎక్కడికీయెల్లొద్దురో రెంకన్న     //ఎ//
యెం:- యెండికొండల్లాగ! పండుయెన్నెల్లో
మిలమిలామెరసేటి చెరువుకెరటాల్లో
కాళ్లుకడిగీకొందమా, చంద్రమ్మ     //కా//
చం:- చెరువుగట్టుమీద! సింతచెట్టున్నాది
సిగురాకుతింటాను! చిలుకలుకూకున్నాయి
చిలుకల పాటలు యిందామో రెంకయ్య  
సిగ్గిడిచి మాటాడుకొందా మెంకయ్య     //సి//
యెం:- మనప్రేమలగపెరిగి మనలనొకటిగసుట్టె
మనకడ్డమౌతాయా మతకట్టుదిట్టాలు
మనమందుచింతలేలా చంద్రమ్మ  
మనకిట్టించింతలేలా చంద్రమ్మ!    //మ//
చం:- మనకిపెళ్లయి తేను! కనకదుర్గకుపళ్లు
యిచ్చితీరాలి రోరెంకయ్య!     //ఇ//
యెం:- నిన్ను పెళ్లాడితే నిలవనియ్యరు నన్ను
కులముతక్కువాని కొట్టవస్తుంటారు
ఏడకెళ్లినగాని యీసుతోసూస్తారు
ఎందుకొచ్చినబ్రతుకే చంద్రమ్మ  
యింక నేబతకలేనే చంద్రమ్మ    //ఇ//
చం:- పెళ్లికాలేదాని పెద్దలుమాబాబుని
యెలియేత్తామన్నారో రెంకయ్య
ఎగిరెగిరిపడ్డారురా
యింతఅప్పరతిట్ట నేనుతెచ్చానని
ఎగిఎగిరిపడ్డారురో రెంకయ్య  
యేమిసెప్పాగలనురా!    //ఏ//
యెం:- ఇద్దరమూకలసి యేకంగ వుంటేను
ఏడులోకాలు మనకాడనేవుంటాయి
ఎక్కడికియెళ్లవద్దే చంద్రమ్మ
ఇక్కడే వుండిపోదామే
చం:- నిన్నుయిడువలేను! నిన్ను కూడాలేను
తిప్పలుపడలేనురో రెంకయ్య
తిట్లుకాయలేనురో రెంకయ్య     //తి//
చం:- గోదారికిపోయి గోయిందునకు మ్రొక్కి
కడతేరి పోతాను రోరెంకయ్య
కడసారి చూపిదేరో రెంకయ్య     //క//
యెం:- నువ్వు చచ్చిపోతే నేను బతికుంటాన
నేను కూడవస్తనే చంద్రమ్మ
నీతోడ నే నుంటానే
సొరగలోకంలోను సల్లనీ సోటులో 
సరసము లాడుదామే చంద్రమ్మ
చందమామను సూతమే 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం