కారు చీకట్లలో ‘కొత్త ఇండ్లు’ 

  • 1028 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శివ మావూరి

  • తిరుపతి
  • 8008663632
శివ మావూరి

తెలుగునాట వీధినాటకాలకు పెట్టింది పేరు... ‘కొత్తఇండ్లు’. చిత్తూరు జిల్లాలోని ఈ చిన్న పల్లెటూరు వీధినాటక కళాకారుల కోసమే పుట్టింది. శతాబ్దాల పాటు ఆ కళకు వెలుగులద్దింది. దాని ప్రభలను దిల్లీ దాకా విస్తరింపజేసింది. కానీ, అదంతా గతం! కాలగమనంలో వీధి నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో, బతుకు పోరాటంలో ఆ కళాకారులు ఇతర పనుల్లోకి మరలిపోయారు. కొత్త తరమైతే ఇందులోకి అసలు రావట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ కళారూపం ఇక్కణ్నుంచి కనుమరుగైపోవడానికి మరెంతో కాలం పట్టదు!! 
ఇది ఏమొ మాయా... శ్రీకృష్ణుని దయలేకపోయా... శకునితో జూదంబులాడి సకలసామ్రాజ్యములనోడి... నిఖిల రాజ్యమంతయు ధారబోసి నున్నానె.. ఇది ఏమొ మాయా...  - ద్రౌపది వస్త్రాపహరణ వేళ ధర్మరాజు వేదన! 

రాజు రాజు వచ్చెను... దుర్యోధన మహరాజు సభకొచ్చెను... రాజు రాజు వచ్చె రవికేతుడై చూడ.. - దుర్యోధనుడు సభకొచ్చే సందర్భం (దరువు)
వినవె పాంచాలి నీవిపుడైన ధర్మ/ తనయందు మేమెల్ల తగదన్న వినక/ మా యన్నతోడ ముమ్మారు జూదంబు/ పాయకనోడి సామ్రాజ్యములనోడి/ రదగజ చతురంగసైన్యముల/ మదబడి దనుర్భాణ తనముల/ మందిర మాది సామ్రాజ్యములను వోడి/ తానును ఓడె తన తమ్ములను ఓడె/ నిన్ను ఓడె వినులై మాయన్న/ ఆజ్ఞకు లోబడి అడలుచున్నారు/ అజ్జసేనిరో మాకు ఆధీనమైతివీవు/ ఇక ఏల పతులపై ఇచ్చెల్ల మాని సుఖియింపుదువు... రావె పోదామూ... రావె నువ్వెంట.. - ద్రౌపదితో దుశ్శాసనుడి వాగ్వాదం (ద్విపద)
మానగ పాండవులింటను/ నేవంటలు చేయువాడ నేర్చున వారల్‌/ కానలకేగురో దిక్కుల... గానక వచ్చితి ఇందు వారాలందుండ గానుపొయ్యేను అందు నేను నీ బంటు నగుచు నిలచి ఉందు ఒక్కాయేడు మానవతా నన్ను మన్నించబోవవయ్య  - భీముడు విరాటరాజు కొలువులో వంటవాడిగా చేరే సమయం (కందార్థం)
దండము నీకు రిపూవే
దండోగ్రము వేంద్రు శత్రుధర దేవేంద్రా
దండము కరుణాసాంద్రా
దండము మత్స్యావనేంద్ర దండము నీకూ  - విరాటరాజు దగ్గర భీముడు (పద్యం)
ఇలాంటి దరువులు, ద్విపదలు, కందార్థాలు, పద్యాలు ఇంకా వచనాల్లాంటి వాటితో, చక్కని వేషభూషలతో భారత రామాయణ భాగవతాలను హృద్యంగా వినిపిస్తూ వందల ఏళ్లుగా తెలుగునేలను అలరిస్తున్నాయి. వీధినాటకాలు, తెలుగునాట విలసిల్లాయి. యక్షగానాల నుంచి రూపుదిద్దుకున్న ఈ కళకే అంకితమైన కుటుంబాలతో ఏర్పడిన గ్రామమే కొత్తఇండ్లు. 
      కొత్తఇండ్లు కళాకారుల పూర్వీకులు కృష్ణాతీర ప్రాంతానికి చెందిన వారని చెబుతారు. దీన్ని ధ్రువపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి భిన్నమైన తోట, సముద్రాల, పోతల, చల్లా లాంటి ఇంటి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. కృష్ణదేవరాయల పాలన తర్వాత వీరి పూర్వికులు తంజావూరుతో పాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారట. తర్వాత కుప్పం కంగుంది జమీందారు వీరి కళకు ముగ్ధుడై స్థలం కేటాయించి, వీరిని కొత్తఇండ్లు గ్రామంలో ఒకచోటకు చేర్చాడు. అనంతరకాలంలో వీధినాటకాలకు కొత్తఇండ్లు ప్రధాన కేంద్రమైంది. ఈ కళాకారులు క్రమంగా గుండ్లపల్లె, అడవిగానిపల్లె, వసనాడు, గొనుగోడు లాంటి చుట్టుపక్కల పల్లెల్లోకీ విస్తరించారు. 
సొంతగా సామగ్రి
పాండవ జననం నుంచి దుర్యోధన వధ వరకు మహాభారతం వీధినాటకాన్ని ఏకబిగిన 12 గంటలు ప్రదర్శించడంలో కొత్తఇండ్లు కళాకారులది అందెవేసిన చెయ్యి. తమ పూర్వికుల నుంచి వస్తున్న ఈ వీధినాటకాల్లో ప్రతి ఘట్టాన్నీ అక్షరం పొల్లుపోకుండా పాడుతూ, దాన్ని మళ్లీ పామరులకు సైతం అర్థమయ్యేలా తాత్పర్యం వివరిస్తూ అభినయిస్తారు. వాచకం స్పష్టంగా ఉండేందుకు పిల్లలతో చిన్నప్పటి నుంచే వ్యాకరణ గ్రంథాలు ఔపోసన పట్టించేవారు. పెద్దలు వాళ్లని తమతో వీధినాటక ప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. పెద్దవాళ్లని చూస్తూ పిల్లలు అభినయం, పద్యాలు పాడటం నేర్చుకునేవారు. పెరిగి పెద్దయిన తర్వాత ఈ కళనే వృత్తిగా చేసుకునేవారు. కొందరు ఒకే పాత్రను మక్కువతో పోషిస్తే, మరికొందరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు, భీముడు లాంటి పలు రకాల పాత్రలను నేర్పుగా అభినయిస్తారు. భారతం, భాగవతం, రామాయణ ప్రదర్శనల్లో ఆరితేరినా, భారతాన్నే వీళ్లు ఎక్కువగా ప్రదర్శిస్తారు.
      కేవలం వీధినాటకాల ప్రదర్శనలే కాకుండా, వాటికి సంబంధించిన సామగ్రిని తయారుచేయడంలోనూ కొత్తఇండ్లు పెట్టింది పేరు. వస్త్రాలు కుట్టేవారు, ఆభరణాలు, సంగీతవాద్య పరికరాలు తయారుచేసేవారు ఇక్కడ గతంలో పెద్ద సంఖ్యలో ఉండేవారు. ప్రదర్శనల్లో బయటి వ్యక్తుల అవసరం లేకుండా అవసరమైన సామగ్రిని సొంతగానే రూపొందించుకునే వాళ్లు. ఇందుకోసం ఊళ్లోనే వ్యక్తుల ఆసక్తిని బట్టి ఆయా అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవారితో చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పించేవారు. 1970వ దశకంలో ఏకంగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే వరకు వీరి ప్రాభవం వెళ్లింది. అప్పట్లో ఇక్కడ ఎనభై ఇళ్లుంటే, ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉండేవారు. వీరంతా ఏడాదిలో పదకొండు నెలల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రదర్శనలకు వెళ్తూ భారీగా ఆర్జించేవారు. ఊరూవాడా సన్మానాలు, సత్కారాలు అందుకునేవారు. ఊరంతా ప్రదర్శనలకు వెళ్లడంతో కొత్తఇండ్లు ఎప్పుడూ బోసిపోయి కనిపించేది. ఏడాదిలో ఒక నెల ఇంటి పట్టున ఉండి ప్రదర్శనలకు అవసరమైన సామగ్రి తయారుచేసుకునేవారు. ప్రదర్శనలో ఏదైనా లోపమున్నట్లు గుర్తిస్తే దర్శకుడు, ఇతర కళాకారులు సరిచేసుకునేవారు. గ్రామంలోని రచ్చబండ, వేణుగోపాలస్వామి ఆలయం ఇందుకు వేదికలుగా నిలిచేవి. వీధినాటకాలకు భారీగా ఆదరణ ఉండటంతో అప్పట్లో పక్క గ్రామాల యువకులు కూడా వీరి వద్దకు వచ్చి రుసుము చెల్లించి మరీ శిష్యరికం చేసేవారు. దీంతో ఇక్కడి కళాకారుల జీవితాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేవి.
30 మందే
కాలక్రమంలో సినిమా, టీవీ రంగప్రవేశం చేశాక గ్రామీణ కళారూపాలకు ఆదరణ కరవయ్యింది. ఈ క్రమంలో కొత్తఇండ్లు కళాకారులకు కూడా కష్టాలు మొదలయ్యాయి. 1990వ దశకం వచ్చేసరికి కేవలం వేసవి, పండగలకు మాత్రమే ప్రదర్శనలకు పిలవడం మొదలైంది. ఇక 21వ శతాబ్దం ఆరంభం నుంచి అవి కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం శివరాత్రి తర్వాతి నుంచి మూడు నాలుగు నెలల పాటు నెలకి పది నుంచి పదిహేను రోజుల పాటు ప్రదర్శనలు ఉంటున్నాయి. ఆ తర్వాత మిగిలిన ఏడాది మొత్తం దాదాపు ఖాళీనే. ఎండాకాలంలో జాతరలు, మహాభారత ఉత్సవాల సమయంలో కొద్ది రోజుల పాటు ప్రదర్శనలకు అవకాశాలు వస్తున్నాయని స్థానిక వీధినాటక కళాకారుడు సీద పురుషోత్తం చెప్పారు. పైగా ఇటీవల గంట, రెండు గంటలు అంటూ నిర్వాహకులు సమయం నిర్దేశిస్తుండటంతో వీధినాటకాలను కుదించి ప్రదర్శిస్తున్నామని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణలీలలు, పాండవజననం, ద్రౌపది కల్యాణం, ద్రౌపది వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, కీచకవధ, కురుక్షేత్రం లాంటి ఘట్టాల్లో నిర్వాహకులు ఎంచుకున్న దాన్ని వీరు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కొత్తఇండ్లు గ్రామంలో 220 గడపలున్నాయి. అన్ని ఇళ్లలో కలిపితే ముప్పయి మంది కళాకారులు కూడా లేరు. సరిపడా ప్రదర్శనలు లేకపోవడంతో చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. కొంతమంది ఉపాధి కోసం పట్టణాలకు వలసవెళ్లారు. ప్రస్తుతం ఉన్న కళాకారులు ఫ్యాక్టరీల్లో పనులు, డ్రైవింగ్, ఉపాధికూలి, వ్యవసాయ పనులకు వెళ్తూ.. ప్రదర్శన ఉన్న రోజు మాత్రం వేషాలు ధరించి తమ పూర్వికులు అందించిన కళను తలచుకుని మురిసిపోతున్నారు. 
      ఒక్కోప్రదర్శనకు ఈ కళాకారుల బృందానికి ప్రస్తుతం రూ.15 వేల వరకు ఇస్తున్నారు. ఒక్కో వీధినాటకానికి 20 మంది వరకు కళాకారులు అవసర మవుతారు. వచ్చిన ధనం పంచుకుంటే తలా రూ.అయిదారొందలకు మించి రాదు. మరోవైపు.. ప్రస్తుత కళాకారుల్లో అయిదుగురు యువకులే ఉన్నారు. నూతన తరం వీటిని నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. వందల ఏళ్లుగా నిరాఘాటంగా సాగిన తమ కళకు రాబోయే రోజుల్లో ఉనికే ఉండదేమోనని కొత్తఇండ్లు కళాకారులు ఆందోళన చెందుతున్నారు. ఏ కళారూపమైనా ఒక ప్రాంత సంస్కృతికి ప్రతీక. అది ఒక జాతి జీవనాడి. అలాంటి కళారూపాలను వారసత్వ సంపదలుగా గుర్తించి సంరక్షించుకోవాలి. దృశ్యశ్రవణ మాధ్యమాల రూపంలో వాటిని శాస్త్రీయంగా నమోదు చేయడంతో పాటు కళాకారులకు అండగా నిలబడాలి. ఒక తరం నుంచి మరో తరానికి మౌఖికంగా మాత్రమే అందుతున్న వీధినాటక సాహిత్యాన్ని లిఖిత రూపంలోకి తీసుకు రావాలి. ఇందుకు ప్రభుత్వంతో పాటు కళాభిమానులూ ముందుకు రావాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం