ఆంధ్రసాహిత్యము తెలంగాణము

  • 454 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఇరువదవ శతాబ్ద మందలి రెండు తరాలకు జెందిన యిద్దరు ప్రముఖ కవీశ్వరులు తెలంగాణ ప్రశస్తిని కీర్తించినారు. ‘‘తేనె మాగాణ మీ తెలంగాణము. తమ్ముడా మా తల్లియని పాడరా, సోదరీ మా మాత యని పాడవే!’’ అని యొకరు ప్రబోధింపగా, ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ యని ఇంకొకరు ఉద్ఘాటించినారు. ఈ కవీశ్వరులలో ఒకరు భారత జాతీయతను, ఆంధ్రదేశ సంస్కృతిని నోరూర నోరారా గానము చేసిన ఆంధ్ర మహాశయులు; ఇంకొకరు యావదాంధ్రము యేకము కావలెనను ఆదర్శముతో ‘‘మూడు కోటుల నొక్కటే ముడి బిగించ’’ వలెనని ఉద్బోధించిన యువకవీశ్వరులు. కావున యీ ఉభయులు తెలంగాణమును కీర్తించుటకు కారణము యేవిధమైన సంకుచిత అభిమానము కాదని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆంధ్రదేశ చరిత్ర పుటలను అవలోకించినచో చరిత్ర నిర్మాణానికి, సంస్కృతికి, శిల్పమునకు చిత్రలేఖనమునకు తెలంగాణము ఆదినుండియు ఆటపట్టయినదన్న సత్యము ఎల్లడి కాగలదు.
ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానము
ఆంధ్ర సాహిత్య తెలంగాణమునకు గల స్థాన మేమిటియను ప్రశ్నకు యీ సందర్భమున సమాధానము చెప్పవలసి యున్నది. దేశ చరిత్రలోని ఒడుదుడుకుల ప్రభావము అన్ని ప్రాంతాల మీద పడినట్లే తెలంగాణము మీద కూడా పడినది. కాని యే పరిస్థితులలోను సాహిత్య దీపము యీ ప్రాంతమున యెన్నడును ఆరిపోలేదు. కొంతకాలము యీ జ్యోతి దేదీప్యమానముగా ప్రకాశించినది. మరికొంతకాలము మినుకుమను ఆముదపు దీపమువలె వెలిగినది. ఆంధ్ర సాహిత్యములోని ఉద్గ్రంథములను చెప్పవలసినదని యెవరిని కోరినప్పటికిని వెంటనే మూడు గ్రంథాలను సహజముగా పేర్కొనుట అనివార్యము. ఇందులో మొదటిది భారతము; రెండవది భాగవతము; మూడవది రామాయణము. తిక్కన భారతమును నెల్లూరులో రచించినప్పటికిని, దాని ఆవిష్కరణము తెలంగాణలోని యేకశిలా నగరమందలి గణపతి దేవుని ఆస్థానమున జరిగినదను సత్యము చరిత్రకారులకు తెలిసియే యున్నది. ఆంధ్రులపాలిటి అమృత మూర్తియైన పోతనామాత్యుడు తెలంగాణ ప్రాంతమందలి ఓరుగల్లు పరిసరములందు నివసించి, భాగవత రచన గావించిన సంగతి చరిత్ర ప్రసిద్ధమైనది. భాగవతము నందలి శిథిల భాగములను పూరణ గావించినవారు తెలంగాణ వాస్తవ్యులైన కవీశ్వరులే. భాస్కర రామాయణమును రచించిన భాస్కరుడు, మల్లికార్జునుడు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు, తెలంగాణమున జన్మించిన కవీశ్వరులని వేరుగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. రంగనాథ రామాయణ కృతికర్త రాయచూరు జిల్లా వాస్తవ్యుడు ఇటీవల వరకు, అనగా 1957 సంవత్సరము వరకు యీ జిల్లా పూర్వపు హైదరాబాదు రాష్ట్రము నంతర్భాగమై యుండెను. ఈ విధముగా భారత, భాగవత, రామాయణాలకు తెలంగాణము పరోక్షముగాను, ప్రత్యక్షముగాను జన్మస్థానమైనది. మారన మహాకవి మార్కండేయ పురాణము తెలంగాణములో ఉద్భవించిన ఉత్తమ సారస్వతములలో చేరుచున్నది.
జానుతెలుగు ప్రజా సాహిత్యము
సాహిత్యము ప్రజలకు అందుబాటులో నుండవలెనను సత్యమును గుర్తించి, జానుతెలుగులో ప్రజాసాహిత్యానికి మిక్కిలి అనుకూలమైన ద్విపదలో బసవపురాణమును వ్రాసిన పాలకురికి సోమనాథ కవికి జన్మస్థానము తెలంగాణము. ఆంధ్ర సారస్వతములో బసవపురాణము సర్వవిధాల విశిష్టమైన రచన. శైవ వాఙ్మయము తెలంగాణములో ప్రకాశించినది. మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము, పిడుపర్తి సోమనాథుని బసవపురాణ పద్యకావ్యము ప్రభులింగలీల, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రము యీ శైవ వాఙ్మయమున ప్రత్యేకముగా పేర్కొన దగిన గ్రంథములు. శివకవులతోపాటు వైష్ణవకవుల రచనలకును తెలంగాణము జన్మస్థానమైనది. ముముక్షు జనకల్పకము, తత్వార్థ దర్పణము, యతిరాజవింశతి మొదలైన కావ్యములను రచించిన కవీశ్వరులు యీ ప్రాంతమువారే. మేలుకొలుపులు, మంగళహారతులు మొదలైన గేయ వాఙ్మయమును అపారముగా రచించిన వైష్ణవ కవులు యీ ప్రాంతమున అసంఖ్యాకముగా నున్నారు. క్రీస్తు శకము 1700 ప్రాంతమున యేకామ్రనాథుడను పండితుడు ప్రతాపచరిత్రమను వచన గ్రంథమును వ్రాసి యుండెను. బహుశా ఆంధ్రభాషలోని మొట్టమొదటి వచన గ్రంథమేమో యిది! తరువాత కొంతకాలానికి అనగా 19వ శతాబ్దమున తెలంగాణములో మరొక మహాగ్రంథము విరచితమైనది. వేదాంత దృష్ట్యా ఆంధ్రభాషలో యిది అత్యుత్తమ శ్రేణికి జెందిన గ్రంథమై యున్నది. పరశురామ పంతుల లింగమూర్తి వ్రాసిన సీతారామంజనేయమే యీ వేదాంత గ్రంథమని ఆంధ్ర సారస్వతముతో పరిచయము కలిగిన ప్రతివారును వెంటనే గ్రహించగలరు. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము కూడా యీ ప్రాంతముననే విరచితమైనదని ఆంధ్ర సారస్వత చరిత్ర వివరించుచున్నది. పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్రము అచ్చతెనుగు కావ్యాలలో మొదటిదేకాక సర్వోన్నతమైనది కూడ. ఈ విధముగా ప్రాచీనాంధ్ర వాఙ్మయమున తెలంగాణ ప్రాంతమందు మహోజ్జ్వలమైన సారస్వత కృషి జరిగినది. జాను తెలుగు శైలి, ద్విపద ఛందస్సు, ప్రత్యేకముగా అచ్చ తెనుగు కావ్య రచన, వచనములో చరిత్ర గ్రంథ రచన మొదలైన అనేక వాఙ్మయ వీథులలో మార్గదర్శకమైన గౌరవము తెలంగాణమునకు లభించుచున్నది.
రాజకీయాల ప్రభావము
రాజకీయముగా ఆనాడు కలిగిన మార్పుల ఫలితము తెలంగాణము మీద స్పష్టముగా కనిపించుచున్నది. కాకతీయుల పతనానంతరము రెడ్లు, వెలమలు, కమ్మలు ఆంధ్రదేశమును, తెలంగాణమును పరిపాలించి యుండిరి. ఆంతరంగికమైన విభేదాలు యెన్ని యున్నప్పటికిని, ఆంధ్రభాషా పోషణము వీరి కాలమున చక్కగా జరిగినదని చెప్పవలసి యున్నది. తరువాత తెలుగుసీమ కుతుబ్షాహీల హస్తగతమైనది. కుతుబ్షాహీల పరిపాలనలో తెలంగాణమున వైజయంతీ విలాసమును రచించిన సారంగు తమ్మయ్య, యయాతి చరిత్ర కృతికర్త పొన్నగంటి తెలగన్న, షడ్చక్రవర్తి చరిత్రను వ్రాసిన మల్లారెడ్డి, తపతీసంవరణోపాఖ్యాన గ్రంథకర్త అద్దంకి గంగాధరకవి మొదలైనవారు ప్రశస్త సారస్వత నిర్మాణము గావించియుండిరి. క్రమక్రమముగా అసఫ్జాహీలకు ఆంధ్రదేశము ఆధీనమైనది. ఇంతలోనే ఇంగ్లీషువారు తమ సామ్రాజ్యమును విస్తరింపసాగిరి. తత్ఫలితముగా కుతుబ్షాహీల కాలములో ఏకఖండముగా నుండిన తెలుగుసీమ రెండు ప్రాంతాలుగా విడిపోయి, తెలంగాణ ప్రాంతము ఇటీవల వరకు అసఫ్జాహీ వంశీయుల పరిపాలనలో నుండుట జరిగినది (1957 వరకు)
      ఈ పరిపాలనలో యీ ప్రాంతమున ఆంధ్ర సారస్వతాభివృద్ధి కుంటుపడినదను సత్యము సుప్రసిద్ధమైనది. పరిపాలకులకు ప్రజల భాష మీద ఆదరము లేకుండెను. వారు అభిమానించిన ఉర్దూ, అరబ్బీ, పారసీల క్రింద తీయని తెలుగు నలిగిపోయినది. ఈ పరిస్థితుల్లో మినుకుమినుకుమని తెలుగు భాషా దీపములు వెలుగుచుండిన ప్రమిదలలో చమురుపోసి వానిని ఆరిపోకుండ కాపాడిన గౌరవము వనపర్తి, గద్వాల, ఆత్మకూరు మొదలైన సంస్థానాలకు జెందుచున్నది. కవులను, పండితులను పోసించి యీ సంస్థానాలు గడచిన రెండు శతాబ్దాలలో తెలంగాణమున ఆంధ్రభాషా పోషణకు చేసిన సహాయము అమూల్యమైనది. ఆధునికాంధ్ర కవులకు గురుపీఠమైన తిరుపతి వేంకటకవులు యీ సంస్థానాలను సందర్శించి, గౌరవాదరాలను పొందియుండిరి. తెలంగాణమందలి సంస్థానాలు ఆంధ్రభాషకు, ఆంధ్ర సంస్కృతికి గావించిన దోహదము ఒక ప్రత్యేక గంథానికి ఆధార సామాగ్రి కాగలిగినదిగా నున్నది. ఈ సందర్భమున ఆధునిక చరిత్ర పరిశోధకులలో అగ్రగణ్యులైన మానవల్లి రామకృష్ణ కవిగారు చిరకాలము వనపర్తిలో ఆస్థాన విద్వాంసులుగా నుండి, ఆ కాలమున అనేక గ్రంథాలను ప్రకటించి, అపారమైన పరిశోధన గావించిన సత్యము ప్రత్యేక స్మరణీయమై యున్నది.

***

‘తెలంగాణలో జాతీయోద్యమాలు’ పేరిట డా।। దేవులపల్లి రామానుజరావు రాసిన వ్యాసపరంపర నుంచి...
 


వెనక్కి ...

మీ అభిప్రాయం