‘బతుకు పుస్తకం’ ఎవరి ఆత్మకథ?

  • 1828 Views
  • 0Likes
  • Like
  • Article Share

జీవితంలో ఎదురైన సవాళ్లను, ఆటుపోట్లను తట్టుకొని ఒక వ్యక్తి ఎలా ఉన్నత స్థానాలకి ఎదిగారో తెలియజెబుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి స్వీయ చరిత్రలు (ఆత్మకథలు). ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకూ, ప్రజల జీవన విధానానికీ ఇవి నిలువుటద్దాలు. తెలుగు నేల మీద ఎందరో రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు తమ స్వీయ చరిత్రలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పోటీ పరీక్షల్లో వీటి మీద కూడా ప్రశ్నలు వస్తుంటాయి. అందుకే తెలుగు ఆత్మకథల చరిత్రని అవలోకించండి....
ఒక
వ్యక్తి తన జీవన పయనాన్ని గురించి తనే రాస్తే దాన్ని స్వీయ చరిత్ర/ ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) అని అంటారు. అయితే జీవిత చరిత్ర అన్న విస్తృత అర్థంలో కూడా వాడుతున్నారు. అక్కిరాజు రమాపతి రావు ‘తెలుగులో స్వీయ చరిత్రలు’ అనే విమర్శ వ్యాసం రాశారు. ఇందులో యాత్రా చరిత్రలు కూడా స్వీయ చరిత్ర కిందకే వస్తాయని అంటూ ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రా చరిత్రను పేర్కొన్నారు. కానీ విమర్శకులు దీంతో ఏకీభవించలేదు. తెలుగులో స్వీయ చరిత్రకు తానే ఆద్యుడినని కందుకూరి వీరేశలింగం చెప్పుకున్నారు. అయితే, మద్రాసులోని సదర్‌ అదాలత్‌ కోర్టులో అనువాద అధికారిగా పనిచేసిన తెలుగు వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావు తొలి స్వీయ చరిత్రను ఆంగ్లంలో రాశారని రమాపతిరావు పేర్కొన్నారు. తెలుగులో స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదట గురజాడ శ్రీరామమూర్తి ప్రయోగించి ఉండొచ్చని రమాపతిరావు వ్యాఖ్యానించారు. 
* వెన్నెలకంటి సుబ్బారావు స్వీయ చరిత్ర పేరు - ఎ లైఫ్‌ అండ్‌ జర్నల్‌ ఆఫ్‌ వి.సుబ్బారావు
* వెన్నెలకంటి స్వీయ చరిత్ర ప్రచురితమైన సంవత్సరం - 1872
కందుకూరి కంటే ముందు పలువురు సాహితీవేత్తలు, రచయితలు తమ కావ్యాలు, శతకాల్లో నామ మాత్రంగా స్వీయ చరిత్రలను పద్యాల రూపంలో చెప్పుకున్నారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు బిల్వేశ్వరీయం కావ్యం, బిల్వేశ్వరీయం శతకంలో తన చరిత్రను సంగ్రహంగా పేర్కొన్నారు. మండపాక పార్వతీశ్వర శాస్త్రి ‘ఆత్మ పర్యాయ చర్య’ అనే పేరు కలిగిన తన హరిహరేశ్వర శతకాన్ని స్వీయ చరిత్రాత్మకంగా ప్రచురించారు. నిజానికీ ప్రాచీన కవుల కావ్యాల్లో కనిపించే షష్ఠ్యంతాలన్నీ స్వీయ కథనాత్మకాలే.
* పార్వతీశ్వర శాస్త్రి ‘ఆత్మ పర్యాయ చర్య’ ఏ మకుటంలో సాగుతుంది? - ‘హరిహరేశ్వర దేవ మహానుభావ’ 
* పార్వతీశ్వర శాస్త్రి స్వీయ చరిత్ర ముద్రణ పొందిన సంవత్సరం? - 1894
స్వీయ చరిత్ర అనేది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చింది. ఆంగ్లంలో స్వీయ చరిత్రలన్నీ వచనంలోనే ఉంటాయి. అందువల్ల తెలుగులో స్వీయ చరిత్రకు ఆద్యుడిగా కందుకూరినే విమర్శకులు పేర్కొన్నారు. అయితే స్వీయ చరిత్ర అనే పదం అపశబ్దమన్నది కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి వాదన. ‘స్వకీయ చరిత్ర, సౌవ చరిత్ర, స్వచరిత్ర’ లాంటి పేర్లను ఆయన సూచించారు.
* వీరేశలింగం ‘స్వీయ చరిత్ర’ మొదటి, రెండో భాగాలు ముద్రణ పొందిన సంవత్సరాలు - 1911, 1915
* వీరేశలింగం స్వీయ చరిత్రను ఆంగ్లంలోకి అనువదించినవారు - వేమూరి రామకృష్ణారావు
* వీరేశలింగం స్వీయ చరిత్రని ప్రచురించిన సంస్థ - విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి
కందుకూరి తర్వాత ఎంతో మంది తెలుగులో స్వీయ చరిత్రల రచనకు పూనుకున్నారు. చోడవరానికి చెందిన వకీలు రాంభట్ల జగన్నాథశాస్త్రి ‘స్వీయ చరిత్ర’, ప్రముఖ న్యాయవాది వల్లూరి సూర్యనారాయణరావు ‘స్వీయ చరిత్ర’, విద్యావేత్త రాయసం వెంకటశివుడు ‘ఆత్మ చరిత్రము’ లాంటివి వచ్చాయి. సూర్యనారాయణరావు స్వీయ చరిత్రలో న్యాయశాస్త్ర విద్యార్థులకు ఉపయుక్తమయ్యే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. మహిళల అభ్యున్నతి కోసం వెంకటశివుడు ‘జనానా’ అనే పత్రికను కూడా నడిపారు. 
తెలుగులో కొన్ని ప్రసిద్ధ స్వీయ చరిత్రలు - రచయితలు
* స్వీయ చరిత్ర - చిలకమర్తి  లక్ష్మీనరసింహం
* నా యెరుక - ఆదిభట్ల నారాయణదాసు 
* ప్రజ్ఞా ప్రభాకరం - వేటూరి ప్రభాకర శాస్త్రి
* శ్రీకృష్ణ స్వీయ చరిత్రము - శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 
* అనుభవాలూ- జ్ఞాపకాలూను - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 
* రాలూ రప్పలూ - తాపీ ధర్మారావు
* జీవన యానం - దాశరథి రంగాచార్య
* యాత్రాస్మృతి - దాశరథి కృష్ణమాచార్య
* బతుకు పుస్తకం - ఉప్పల లక్ష్మణరావు
* అనంతం - శ్రీశ్రీ
* కె.ఎన్‌.కేసరి - నా చిన్ననాటి ముచ్చట్లు
* గిడుగు సీతాపతి - స్వీయ చరిత్ర
* ఆచంట జానకిరామ్‌ - నా స్మృతి పథంలో, సాగుతున్న యాత్ర (రెండు భాగాలు)
* హంపీ నుంచి హరప్పా దాక - తిరుమల రామచంద్ర
* మామిడిపూడి వేంకటరంగయ్య - మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు
* అప్పారావు - నేనూ - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 
* పాలేరు నుంచి పద్మశ్రీ వరకు - బోయిభీమన్న 
* అంతరంగ కథనం - బుచ్చిబాబు
* తుమ్మపూడి - సంజీవ్‌దేవ్‌
* యాది - ఎస్‌.సదాశివ
* ఏభై సంవత్సరాల జ్ఞాపకాలు - దేవులపల్లి రామానుజరావు
* నటస్థానం - స్థానం నరసింహారావు 
* నిర్జన వారధి - కొండపల్లి కోటేశ్వరమ్మ 
* కోతి కొమ్మచ్చి - ముళ్లపూడి 
* అమ్మ కడుపు చల్లగా - గొల్లపూడి మారుతీరావు
రాజకీయ ప్రముఖులూ
తెలుగులో పలువురు రాజకీయ నాయకులు కూడా ఆత్మకథలను వెలయించారు. ఆంగ్లేయుల కాలంనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు, స్వాతంత్య్రోద్యమం, విప్లవపోరాటాలు, జైలు జీవితం, నిజాం కాలంనాటి స్థితిగతులు లాంటి వాటి గురించి ఇవి లోతైన అవగాహన కల్పిస్తాయి. తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆంగ్లంలో రాసిన స్వీయ చరిత్ర ‘లోపలి మనిషి’ పేరుతో తెలుగులోకి అనువాదమైంది. రాజకీయ ప్రముఖులు రాసిన కొన్ని స్వీయ చరిత్రలు... 
* స్వీయ చరిత్ర - పెద్దిభొట్ల వీరయ్య
* నా జీవిత కథ - అయ్యదేవర కాళేశ్వరరావు
* నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం పంతులు 
* స్వీయ చరిత్ర - మాదిరాజు రామకోటేశ్వరరావు 
* నా జీవిత నౌక - గొట్టిపాటి బ్రహ్మయ్య 
* స్వీయ చరిత్ర - కొండా వెంకటప్పయ్య 
* నేనూ- నాదేశం - దరిశి చెంచయ్య
* స్వీయ చరిత్రము - రావి నారాయణరెడ్డి
* అండమాన్‌ జీవితం - ప్రతివాది భయంకరాచారి
* స్వీయ చరిత్రము - కొండా వెంకట రంగారెడ్డి
* గడచిన రోజులు - డా।। పి.తిరుమలరావు
* నా అనుభవములు - సంగం లక్ష్మీబాయమ్మ
      ఆధునిక కాలంలో కూడా కొంతమంది తమ స్వీయ చరిత్రను పద్య రూపంలో రాశారు. తిరుపతి వేంకట కవులు ‘జాతక చర్య’ పేరుతో రెండు భాగాలుగా స్వీయ చరిత్రలను వెలువరించారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ‘నాకథ’ పేరుతో,  ‘తెనుగులెంక’ తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి ‘నా కథలు’ రూపంలో; ఆరుద్ర ‘ఆత్మకథ’గా తమ స్వీయ చరిత్రలు వెలువరించారు. ఇంకా ఎందరో ఔత్సాహికులు తెలుగులో జీవిత చరిత్రలు ప్రచురించారు. ‘‘జీవిత చరిత్ర రాయు రచయిత తన గ్రంథాన్ని రమ్యముగా ఆకర్షణీయముగా వినోద హేతువుగా చేయుటకై అబద్ధాలను, తన సొంత పైత్యాన్ని తన గ్రంథంలో నింపిన అది మదనకామరాజు కథలుగా మారిపోవచ్చును. అందువల్ల సత్యమునే చెప్పవలెను. చక్కగానే చెప్పవలెను. ఆ విధముగా చెప్పినవాడే ఘనుడు. రచయిత శైలి ద్వారా చాలా రమ్యతను తన గ్రంథానికి చేకూర్చగలడు. కావున జీవిత చరిత్రలకు శైలి చాలా ముఖ్యమైనదిగా నుండును’’ అని అన్నారు సురవరం ప్రతాపరెడ్డి ఒక వ్యాసంలో. తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలను పరిశీలిస్తే దాదాపుగా వాస్తవ విషయాలతోనే సాగుతూ అనంతమైన విజ్ఞానాన్ని అందిస్తాయనడం ఖాయం! 


వెనక్కి ...

మీ అభిప్రాయం