నా తెలుగు నా వెలుగు

  • 532 Views
  • 2Likes
  • Like
  • Article Share

‘‘గంగ తల నుంచి కావేరి కాళ్లదాక వెలిగె దిగ్మోహనమ్ముగా తెలుగు ఠీవి...’’. సందేహం లేదు. నాడే, ఆనాడే, క్రీస్తుశకారంభానికి ముందే, రెండువేల సంవత్సరాల కిందటే అటు ఉత్తరం నుంచి ఇటు దక్షిణం వరకు తెలుగు ఠీవి తన వెలుగులను ప్రసరించిందనడంలో అనుమానం లేదు.
‘తెలుగదేలయన్న
దేశంబు తెలుగేను’ అని విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు అయిదువందల సంవత్సరాల కిందట ఉద్ఘాటించాడు. ఆయన ఆముక్తమాల్యద కావ్యం రాసే నాటికి, ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు గంభీర, మధురస్వరాలతో తమ ప్రబంధాలను వినిపించే నాటికి, అంతకుముందు భక్త కవి బమ్మెర పోతన ఏకశిలా నగరం సమీపంలో రామభద్రుని పలుకులతో శ్రీమద్భాగవత గానం చేసే వరకు, శ్రీనాథ మహాకవి ఓరుగల్లు నగర వీధుల్లో విహరిస్తూ అక్కడి జీవన దృశ్యాలకు అందంగా అక్షరరూపం కల్పించే సమయానికి, ఇంకా అంతకుముందు అదే ఏకశిలా నగరంలో కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి నెల్లూరు నుంచి విచ్చేసిన కవి బ్రహ్మ తిక్కన సోమయాజి భారతం వినిపించే వేళ, దాదాపుగా ఆ మహాకవి సమకాలికుడు పాల్కురికి సోమన జాను తెనుగు ద్విపదలలో బసవపురాణం భక్త్యావేశాన్ని పొంగి పొరలింపజేసేనాటికి మందారమకరంద మధుర బిందువుల సింధువు మన తెలుగు భాష ఎంతో పరిణతి పొందింది. అనేక కావ్యాలు, ప్రబంధాలు, పురాణాలు, ఇతిహాసాలు, శతకాలతో ఆధునికతను సంతరించుకుంది. మధ్యయుగపు ఆరోజుల్లోనే తెలుగు ప్రాచీన భాషగా పరిగణనకు వచ్చింది, ప్రాభవాన్ని ప్రదర్శించింది.
      మన తెలుగు నిశ్చయంగా రెండువేల సంవత్సరాల చరిత్రగల, కొందరు పరిశోధకులు, పండితులు, భాషావేత్తల అభిప్రాయంలోనైతే అంతకుమించిన చరిత్రగల ప్రాచీన భాష. ప్రాచీనత ఆధునికతకు నాంది. ప్రాచీనత ప్రశస్తంగా ఉన్న జాతి, భాష సులభంగా బహుముఖ వికాసం పొందగలుగుతాయి. రాజుల భాషలు అంతఃపురాలకు, ఆస్థానాలకు పరిమితమై గ్రంథస్థమవుతాయి. ప్రజల భాషలు ప్రాచుర్యం పొంది జనావళి కంఠకాహళుల్లో ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తుంటాయి. క్రీస్తుశకానికి పూర్వమే, రెండువేల సంవత్సరాల కిందటనే తెలుగుఠీవి దిగ్మోహనంగా తన కాంతులను ప్రసరింపజేసిందనడానికి ప్రబల సాక్ష్యాలు, నిదర్శనాలు ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణంలో అంకురించిన ఆంధ్ర ప్రసక్తి అనంతరయుగాల్లో అఖండయశస్సును ఆర్జించడం విశేషం- చారిత్రక సత్యం. క్రీస్తుకు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరాలు రాజ్యం చేసిన మన మొట్టమొదటి రాజవంశం శాలివాహనులు లేక శాతవాహనులది. వీరి మూలపురుషుడు శ్రీముఖుడు ఉత్తర భారతదేశంలో కూడా తెలుగు ఠీవిని ప్రదర్శించిన ఘనుడు, సార్వభౌముడు. అద్వితీయుడైన శాలివాహన చక్రవర్తి హాలుడు తమ రాజభాష ప్రాకృతంలో కవితలు రాసినా, ‘గాథాసప్తశతి’ రచించినా, హాలుని మంత్రి గుణాఢ్యుడు అదే ప్రాకృతంలో ‘బృహత్కథ’ రచించినా నాడు ప్రజల భాష తెలుగని, ప్రజల భాష తెలుగులో జానపదగీతాలు ఝరులయి ప్రవహించాయని మహా పండితుడు, పరిశోధకుడు సురవరం ప్రతాపరెడ్డి లాంటివారు భావించారు. తెలుగు భాష అత్యంత ప్రాచీనతను చాటిచెప్పే చారిత్రక శాసనాలు, కట్టడాలు, తాళపత్ర గ్రంథాలు అనేకం ఇప్పటికీ బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో.
      తెలుగు భాష ప్రాచీనతను తమ అమూల్య, మౌలిక పరిశోధనల ద్వారా ప్రపంచం దృష్టికి తెచ్చిన విద్వన్మణుల్లో అగ్రగణ్యుడు మానవల్లి రామకృష్ణకవి. తెలుగుజాతి, తెలుగుభాష తమదని, తమ సొంతమని గర్విస్తున్నవారందరూ మానవల్లి రామకృష్ణ మహాకవికి పాదాభివందనం చేసినా తక్కువే. ఆ మహనీయుడు, నూట ఇరవై సంవత్సరాల కిందట చెన్నపురిలో తెలుగు భాష, సాహిత్యాల మీద చేసిన ప్రసంగం అద్భుతవైదుష్యానికి ప్రతీక. 1895 మే 19న చెన్నపురి పురుషవాకంలో ఈ ప్రసంగం విన్నవారు, తర్వాత ఆ ప్రసంగాన్ని చదవడానికి మహదవకాశం లభించినవారు అదృష్టవంతులు. ఆ అదృష్టం పొందినవాళ్లలో నేనొకణ్నని చెప్పడానికి గర్వపడుతున్నాను. ‘‘ఆంధ్రభాష స్వల్పమయినది కాదు. నిన్న పుట్టి రేపు అస్తమించునది కాదు’’ అంటూ మానవల్లి మహా పండితుడు మన భాషకున్న ఉజ్వల భవిష్యత్తుపట్ల అకుంఠిత, అమిత విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఈ ప్రసంగంలో. మహాకవి కాళిదాసు సమకాలికుడైన మహాకవి బాణుని కాదంబరిలో ఆంధ్రశబ్దప్రయోగం ఉందని మానవల్లి వారు అన్నారు. ఉపనిషత్తులు పుట్టిన కాలంలోనే సంస్కృతం, ప్రాకృతాలకు సమానస్థాయిలో తెలుగు భాష నిలిచిందని, వాల్మీకి రోజుల్లో సంస్కృతం ప్రాధాన్యం పొందకముందే తెలుగు గొంతు వినిపించిందని, త్రిలింగ మధ్య దేశోద్భవం కాబట్టి తెలుగు అయిందని మానవల్లి మహాపండితుడు ఈ ప్రసంగంలో వివరించారు. నన్నయ భట్టుకు పూర్వం అనేక ఆంధ్రగ్రంథాలు వెలువడ్డాయని, వాటిలో ఒకటైన కవి వల్లభుని రచన విక్రమార్క చరిత్రం లభించలేదని మానవల్లి వారు వివరించారు.
      తెలుగు భాషలోని ప్రాచీన, ఆధునిక వాఙ్మయం విలువైంది, విశిష్టమైంది. భారతదేశ అధికార భాష కావడానికి అన్నివిధాల అర్హత తెలుగు భాషకు ఉందని ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త జె.బి.ఎస్‌.హల్డేన్‌ అభిప్రాయపడ్డారు. రెండు వందల సంవత్సరాల కిందటనే సి.పి.బ్రౌన్‌ లాంటి ఆంగ్లేయ పండితులు, భాషావేత్తలు తెలుగు భాష ప్రాచీనతా ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని గుర్తించి తెలుగు భాషావృద్ధి కృషికి అంకితమయ్యారు. ఈరోజు తెలుగు ప్రజలవి రెండు రాష్ట్రాలు. ప్రపంచమంతటా వివిధ దేశాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది కోట్ల మంది తెలుగు ప్రజలు, విశేషించి తెలుగు భాషాప్రియులు, కవులు, రచయితలు, విద్యావంతులు, మేధావులు తమ భాష, సారస్వతాలకు ఇక మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గాఢంగా ఆశిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల కిందట అవతరించి అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్న తెలంగాణ రాష్ట్రం తెలుగు భాష, సారస్వతాల పట్ల అపార అభిమానం ఆసక్తి గల రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలుగును అన్ని స్థాయిల్లో బోధనా భాషగా, అధికార భాషగా ప్రవేశపెట్టడానికి కంకణధారణ చేసి తెలుగు చరిత్రలో ఒక మహత్తర అధ్యాయాన్ని ప్రారంభించింది.
      తెలంగాణ రాష్ట్రంలో అధికార భాషా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆమేరకు చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగానికి కావాల్సిన పదజాలం రూపొందిస్తున్నాం. సంబంధిత శబ్దకోశాలు, ఇతరాలు ప్రచురణకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ స్థాయి నుంచి సచివాలయం వరకు అధికార భాషగా తెలుగు రావాలి. ఆ కోణంలో సాధిస్తున్న ప్రగతి మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. లేఖలు రాస్తున్నాం. మహాసభల తర్వాత తెలంగాణలోని 31 జిల్లాల్లో అధికార భాషగా తెలుగు అమలును పరిశీలిస్తాం. పంచాయతీ స్థాయి నుంచి ఎలా జరుగుతోందో సమీక్షిస్తాం. ఇంకా పటిష్టంగా అమలుచేయడానికి అవసరమైన చర్యలేంటో సూచిస్తాం.  రాష్ట్రంలో తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఉంది. దాన్ని కూడా రెండో అధికార భాషగా అమలు చేయడానికి కృషి జరుగుతోంది. అలాగే, హైదరాబాదు నుంచి జిల్లాల వరకూ అన్ని చోట్లా సంస్థల నామఫలకాలు తప్పనిసరిగా తెలుగులో ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మేరకు అన్నిచోట్లా తెలుగు వాతావరణం స్పష్టంగా కనపడుతోంది.  
      బోధనా మాధ్యమంగా, తప్పనిసరి పాఠ్యాంశంగానూ తెలుగు కచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇప్పటికే ఓ నిర్ణయం ప్రకటించారు... ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అది అమల్లోకి వస్తోంది. సీబీఎస్‌ఈ మాత్రమే కాదు ఇంకే సిలబస్‌ అయినా అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా చదవాల్సి వస్తుంది. బయటి నుంచి వచ్చిన వాళ్లు, వేరే భాషల వాళ్లు కూడా చదవాల్సిందే. తెలుగు తప్పనిసరి భాష- ఐచ్ఛికం కాదు. చదివితే చదవచ్చు, లేదా సంస్కృతం, ఫ్రెంచో తీసుకోవచ్చనే పరిస్థితి ఇక ఉండదు. ఈమేరకు అవసరమైన సూచనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ సంఘాన్ని కూడా నియమించింది. అందులో నేనూ ఓ సభ్యుణ్ని. సమావేశాలు, సమాలోచనలు జరిగాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వబోతున్నాం. 
      అలాగే, తెలంగాణ తెలుగు ప్రామాణీకరణ భాష రూపకల్పన కూడా జరుగుతోంది. తెలంగాణలో పుట్టిపెరిగిన వాళ్లు ఇక్కడి తెలుగునే మాట్లాడతారు, రాస్తారు. ఇంతకుముందున్న వేరే ఒత్తిళ్లు ఇప్పుడేమీ లేవు కదా! తెలంగాణ తెలుగులో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఇప్పటి బాధ్యత. ఆ దిశగా అడుగులు వేయడానికి అవసరమైన స్ఫూర్తినీ ఈ తెలుగు మహాసభలు అందిస్తాయి. మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్రంలో తెలుగుకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. అమ్మభాషకు అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం