మన మాటకు మూలాలెక్కడ?

  • 1142 Views
  • 1Likes
  • Like
  • Article Share

    నాగార్జున‌

  • హైద‌రాబాదు

తెలుగు భాష ఏనాటిది? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. కానీ తెలుగు మూడువేల ఏళ్లకు పూర్వమే ఉండి ఉంటుందని భాషా చరిత్రకారుల అంచనా. తెలుగుకు మూలభాషేమిటి? తెలుగువారెవరు? అన్న ప్రశ్నలెన్నో పరిశోధకుల ముందున్నాయి. ఇవి తేల్చలేనివి కావు. కానీ, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇంకొన్నేళ్లు పట్టవచ్చు. 
అంధయుగాల
తెలుగు వైభవం మీద వెలుగులు ప్రసరింపజేయాలంటే... లిపి పరిణామం, ఆదిమ భాషలు, వాటి ఆధారాలు, పురావస్తు ఆధారాలు, ప్రాచీన సాహిత్యం ఆధారంగా తులనాత్మక అధ్యయనంతో తెలుగువారి ప్రాచీన విశేషాలను తెలుసుకోవాలి. అందుకోసం పరిశోధన జరగాలి. భాషా చరిత్ర కోసం అన్వేషణ చేపట్టాలి. ఆధునిక కాలంలో తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేయాలో అంతకన్నా ఎక్కువ కృషి చేస్తేనే ప్రాచీన తెలుగు మూలాధారాలు ఎరుకలోకి వస్తాయి. ఇప్పటివరకు చరిత్రకారులు, సాహితీవేత్తలు, భాషావేత్తలు, పురావస్తు పరిశోధకులు సాధ్యమైనంత వరకూ తెలుగువారి చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తెచ్చారు. ఇవన్నీ సమగ్రతను సాధించకున్నా, చరిత్ర క్రమంలో తెలుగువారి అడుగుజాడల్ని, తెలుగు సాహిత్య అభివృద్ధిని తేటతెల్లం చేస్తున్నాయి.
      ప్రాచీన భాషలైన ప్రాకృతం, సంస్కృతం నుంచి తెలుగు పుట్టిందని కొన్నేళ్ల కిందట అభిప్రాయపడేవారు. కానీ తెలుగును ద్రవిడ భాషగా ఐరోపా భాషావేత్తలు నిర్ధరించారు. దీన్ని ఎందరో ప్రఖ్యాత పండితులు కూడా ఆమోదించారు. అయితే.. తెలుగుకు మిగతా దక్షిణ ద్రవిడ భాషల (మలయాళం, తమిళం, కన్నడం)కు భిన్నంగా మూల మధ్య ద్రవిడ భాషలతో (కోయ, కోయి మొదలైన) దగ్గర సంబంధం ఉన్నట్టు పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. క్రీ.శ.1000 సంవత్సరం వరకు తెలుగు అనే పదానికి సాహిత్య, శాసన ఆధారాలు లేవు. ఆ తర్వాత కాలంలోనే తెనుగు, తెలుంగు, తెలుగు అనే ప్రయోగాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అంతకుముందు కాలంలో తెలుగు లేదని భావించడానికి కూడా వీలు లేదు. తెలుగుని పేర్కొనకపోయినా తొలి చారిత్రక యుగంలో తెలుగు నేలను పాలించిన శాతవాహనుల కాలంలోని ప్రాకృత సాహిత్యం, శాసనాలు తెలుగు పదాలను పేర్కొంటున్నాయి. ఆ కాలంలో రాజభాషగా ఉన్న ప్రాకృతం, పండిత భాషగా ఉన్న సంస్కృతం కాకుండా తెలుగు మాట్లాడే ప్రజలున్నారనడానికి శాతవాహన రాజు ‘హాలుడు’ సంకలనం చేసిన ‘గాథాసప్తశతి’ ఒక ఉదాహరణ. హాలుడు క్రీ.శ. 1వ శతాబ్దికి చెందినవాడు. గాథాసప్తశతి ప్రాకృత పద్య సంకలనం. ఇందులో హాలుడు రచించిన గాథలతోపాటు ఆ కాలానికి చెందిన మరికొందరు కవులు రాసినవీ ఉన్నాయి. అవి ప్రాకృత రచనలే అయినప్పటికీ వాటిలో తెలుగు పదాలుండటానికి కారణం తెలుగు వారైన కవులు కూడా గాథలు రాసి ఉంటారని, అందుకే అందులో మాతృభాషలోని పదాలు దొర్లి ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. గాథాసప్తశతిలో అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డి (పంది) తదితర తెలుగు పదాలున్నాయి. క్రీస్తు పూర్వం నాటికే తెలుగు ఉందనడానికి ఇవి ఆధారాలు. 
తెలుగు... ఆంధ్రం
ప్రాచీన సాహిత్యంలో తెలుగు పదాలు దొరికినా తెలుగు భాష అనే పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. నన్నయ భట్టారకుడి కాలానికి తెలుగు అన్న పదం ఉపయోగంలో ఉన్నదని, ఈ కాలానికి తెలుగు, ఆంధ్రము అనే వాటిని ఒకే అర్థంలో ఉపయోగిస్తున్నారని అందుబాటులో ఉన్న చరిత్ర చెబుతోంది. ఈ ఆంధ్ర శబ్దం శాతవాహనుల కాలంనాటి సాహిత్యంలోనూ గుర్తించవచ్చు. క్రీ.పూ. 500- 400 మధ్య కాలానికి చెందిన బౌద్ధ జాతక కథలలో ‘ఆంధ్ర’ ప్రస్తావన ఉంది. ‘భీమసేన జాతకం’లో ‘ఆంధ్రాపథం’ని పేర్కొన్నారు. ‘సెరివణిజ జాతకం’లో ‘ఆంధ్రనగరి’ ప్రస్తావన ఉంది. ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలో ఆంధ్రుల గురించిన ప్రస్తావన ఇలా ఉంది...
      ‘‘పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే/ అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి’’! దీనికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అనువాదం- ‘‘అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్లున్నూ, అందమైన శరీరాలు గల వాళ్లున్నూ/ తిండిలో దిట్టలున్నూ అయిన ఆంధ్రులు, అటూ, పుటూ (పెట్టు కాబోలు) రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు’’!
      రెండో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత కవి భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనిని ఉపయోగించాలని సూచించాడు. బుద్ధఘోషుడు (మూడో శతాబ్దం) రాసిన ‘వినయపిటకం’లో ‘ఆంధ్ర అట్టకథ’ అన్న వ్యాఖ్య ఆంధ్ర భాషలోనిదే అయివుంటుందని కొందరి అంచనా. ఈ ఆధారాలను బట్టి తెలుగు భాష లేదా ఆంధ్ర భాష క్రీస్తు పూర్వానికి ముందే ఉందని అర్థమవుతోంది. అంతేకాకుండా ఆంధ్రభాష ఇతర భాషల నుంచి వేరై, ప్రత్యేకమైన భాషగా ఆవిర్భవించిందని భావించవచ్చు. ఈ ఆంధ్ర పదాన్ని భాష ప్రాతిపదికగా కాకుండా జాతి ప్రాతిపదికగా కూడా వాడిన సందర్భాలనేకం ఉన్నాయి. వాటిలో అతి పురాతనమైనది ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. క్రీ.పూ.1500- 800 దీని రచనాకాలంగా చరిత్రకారుల అంచనా. ఇందులోనే మొట్టమొదట ఆంధ్రులు అన్న ప్రస్తావన ఉంది. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఈ ప్రస్తావన ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద, జాతులతో కలిసి ఆర్యావర్తనానికి దక్షిణాన నివసిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. మహాభారతంలోనూ ‘‘ఆంధ్రాశ్చ బహవః’’ అన్న ప్రస్తావన ఉంది. మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవులపక్షాన నిలిచినట్లుగా వ్యాసుని కథ చెబుతోంది.
      ఆంధ్రులు అనే పదం నుంచి ఆంధ్రభాష అనే పేరు వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలుగు, తెలింగ, త్రిలింగ (మూడు శైవక్షేత్రాల మధ్య భూమి) దేశం నుంచి తెనుగు, తెలుగుగా పరిణామం చెందిందని, ఆంధ్రుల భాషగా తెలుగుకు ఆంధ్రము అనే మరోపేరు వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానిక తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలపై ఆంధ్రులు ఆధిపత్యం సాధించిన తర్వాత వారు ఇక్కడి వారితో కలిసిపోయారని, అందుకే ఈ రెండు పేర్లు ఒకే అర్థానికి ఉపయోగిస్తున్నారని ఇంకొందరి భావన. అక్కడక్కడా ఆధారాలు లభించడం మినహా పూర్తి వివరాలు చిక్కనందువల్ల చరిత్రకారుడు కాళ్లకూరి నారాయణరావు ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహం’లో క్రీ.శ. తొలి శతాబ్దం నుంచి క్రీ.శ.ఆరో శతాబ్దం వరకు అంధయుగంగా అభివర్ణించారు. ఆ కాలపు రాజులు తెలుగును విస్మరించడం, సంస్కృతాన్ని ప్రోత్సహించడమే దీనికి కారణం.
కురిక్యాల కందాలు
తెలుగు ప్రాచీనతకు వాఙ్మయ ఆధారాలే కాకుండా శాసన, సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సాహిత్య ఆధారాలు తెలుగంత ప్రాచీనమైనవి కాకపోయినా తెలుగు అతిప్రాచీనతను రుజువు చేసేందుకు దోహదపడేవే. నన్నయ భట్టారకుడు ఆంధ్రమహాభారతం రాసే కాలానికి సాహిత్యం ఉన్నత స్థితిని సాధించింది. నన్నయ విరచిత భారతమే తొలి తెలుగు కావ్యంగా గుర్తింపు పొందినప్పటికీ తెలుగు శిష్ట సాహిత్యంగా ఉన్నతి సాధించడానికి కొన్ని శతాబ్దాలు గడిచి ఉండాలి. ఈ సాహిత్యానికి ముందు జానపద సాహిత్యమూ వర్ధిల్లాలి. కాబట్టి నన్నయ కాలానికి పూర్వమే తెలుగు ఉందని భావించడంలో తప్పులేదు.  ఆధునిక పురావస్తు పరిశోధనల్లో ఈ భావనను బలపరిచే ఆధారాలెన్నో చరిత్రకు అందాయి. తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్రలేదన్న వాదన నిరాధారమని నిరూపించేందుకు కరీంనగర్‌ జిల్లా కురిక్యాలలోని బొమ్మలమ్మగుట్టలపై క్రీ.శ.946లో జినవల్లభుడు వేయించిన శాసనంలోని (తొలి తెలుగు) కంద పద్యాలే ఆధారం. ‘‘జిన భవనములెత్తించుట/ జిన పూజిల్సేయుచున్కి జినమునులకున/ త్తిన అన్నదానం బీవుట/ జినవల్లభుబోలగలరె జినధర్మపరుల్‌’’ అన్నది వాటిలో మొదటి పద్యం. జినవల్లభుడు పంపకవి తమ్ముడు. పంపన తెలుగువాడు. కానీ కన్నడంలో సుప్రసిద్ధమైన ‘విక్రమార్జున విజయ’ రాశాడు. పద్మకవి పేరుతో ‘జినేంద్రపురాణం’ రాసింది కూడా పంప కవేనని కొందరి భావన. 
      పంపకవి (పద్మకవి) క్రీ.శ.941లో జినేంద్రపురాణం రాసినట్లుగా ‘ప్రబంధ రత్నావళి’లో వేటూరి ప్రభాకరశాస్త్రి పేర్కొన్నారు. ఆ గ్రంథంలో జినేంద్ర పురాణంలోని సీసపద్యాన్ని ఆయనా గ్రంథంలో ఉదహరించారు. అది... ‘‘హరినిలయంబును హరినిలయంబును/ విషధరాఢ్యంబును విషధరాడ్య/ మప్సరోమయమును నప్సిరోమయమును/ వన విలాసమును పావన విలాస/ మున్నత కరిశృంగ మున్నతి కరిశృంగ/ మిందు కాంత స్రవమిందు కాంత/ మురుకలనకులంబు నురుకలనకులంబు/ నంశుకాంత ద్యోతి నాంశుకాంత/ మొనర నవశత సాహస్రయోజ నోన్న/ తమును పదివేల యోజనా- లమరు- వలము/ గలిగి కనాకాద్రికిన్నూటగలిగితనరి/ ప్రధితమై యెప్పు మందర పర్వతంబు’’! అలాగే, జనగామ జిల్లాలోని గూడూరులో సంస్కృత చంధస్సులోని తెలుగు శాసనం బయల్పడింది. ఈ స్తంభశాసనంలో మూడు చంపకమాల పద్యాలు, రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి. ఇవి క్రీ.శ.1000 నాటివి. కానీ ఈ శాసనం 1124 నాటిది. తెలుగు, కన్నడలో విరియాల కామసాని వేయించిన శాసనమిది. నన్నయ కంటే పూర్వమే ఛందోబద్ధంగా సాగిన తెలుగు రచనకు ఆధారం గూడూరు శాసనం.  
      జైన, బౌద్ధ మతాలు చారిత్రక తొలియుగంలో భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు దేశీభాషలను ఎంచుకున్నాయి. స్థానికంగా బౌద్ధం, జైనాన్ని ఆదరించే రాజ్యాలు నశించి, శైవ, వీరశైవ, వైష్ణవాన్ని ఆదరించే రాజ్యాలు తెలుగు నేలపై పాలన సాగించాయి. దాంతో దేశీభాషలో కావ్యాలు రాసే కవులకు ఆదరణ లేక జైనాన్ని ఆదరించిన కన్నడ రాజులను తెలుగువారు ఆశ్రయించారని తెలుస్తోంది. పంపతోపాటు కన్నడంలోని ప్రసిద్ధులైన కవులు తెలుగువారు కావడమే దీనికి ఉదాహరణ. తెలుగువారైన పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి కన్నడలో కావ్యాలు రాసినా తెలుగులో కూడా రాసి ఉండొచ్చని భావించేందుకు పైన చెప్పుకున్న కంద, సీస పద్యాలే ఆధారాలు.  
అద్దంకి తరువోజ.. కందుకూరు సీసం
నన్నయకు వందేళ్ల పూర్వమే తెలుగులో పద్యరచన ఉందని కురిక్యాల శాసనం నిరూపిస్తోంది. కానీ, అది శిష్టసాహితీ రూపానికి రావడానికి ఇంకో మూడు వందల ఏళ్లయినా పట్టి ఉండాలని సాహితీవేత్తల అభిప్రాయం. అయితే, ఈ కురిక్యాలకన్నా ప్రాచీనమైన మరో తెలుగు పద్యం ప్రకాశం జిల్లా అద్దంకిలో లభించింది. క్రీ.శ.848లో పండరంగడు అనేవాడు తను సాధించిన విజయాలను ఈ శాసనంలో ప్రస్తావించాడు. ఇతడు గుణగ విజయాదిత్యుని సేనాని. తన విజయాలను ప్రస్తావిస్తూ తరువోజ ఛందస్సులో పద్యశాసనం వేయించాడు. దీన్ని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి, ప్రకటించారు. ఆ పద్యం...
      ‘‘పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు/ బలగర్వ మొప్పగ బైలేచి సేన/ పట్టంబు గట్టించి ప్రభు బండరంగు/ ఒంచిన సామంత పదువతో బోయ/ కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి/ గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి/ కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి/ కందుకూర్బెజవాడ గవించె మెచ్చి’’! పండరంగడు అనే చాళుక్య సేనాని పన్నెండు బోయ కొట్టముల మీద దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. బోయరాజ్యపు ప్రధాన కొట్టం, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడలా ప్రధాన పట్టణంగా బలిష్ఠం చేశాడు. ఆదిత్య భట్టారకుడికి కొంతభూమి దానమిచ్చాడు. నెల్లూరును పరశురామప్రీతి చేశాడు. ఇదీ అద్దంకి శాసనపాఠం. కందుకూరులోనూ ఇలాంటి పద్యశాసనం ఒకదాన్ని గుర్తించారు. అందులో సీసపద్యమే ఇప్పటివరకు తొలితెలుగు సీసపద్యం. జినేంద్రపురాణంలోని సీసపద్యం కన్నా ఇది ఒక శతాబ్దకాలం ముందరిది. కురిక్యాల శాసనం కంటే ఒకటిన్నర శతాబ్దకాలం ముందే పద్యం ఉన్నట్లుగా ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
కలమళ్ల వచనం
ప్రాచీన తెలుగు సాహిత్యానికి ఆధారాలున్నట్లే తెలుగు భాష ఉనికి, పరిణామానికి ఆధారాలుగా అనేక శాసనాలున్నాయి. అలా బయటపడిన తొలి తెలుగు పదం ‘నాగబు’. క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన అమరావతి స్థూపం ముఖ్యమైంది. ఇందులో ‘నాగబు’ తొలి తెలుగు పదమని అత్యధికులు భావిస్తున్నారు. కానీ ఇది విరిగిపోయిన రాతిభాగంలో ఉన్న అసంపూర్తి పదమని పురావస్తు పరిశోధకుల అభిప్రాయం. శాతవాహనుల పతనానంతరం వచ్చిన ఇక్ష్వాకుల నుంచి పల్లవుల వరకు వేయించిన శాసనాల్లో తెలుగు పదాలున్నాయి. తలవర, ఊరు, పర(పఱ్ఱ), కొన్ఱ (కొండ), చెరువు లాంటి పదాలు, గోలశర్మ, కొట్టిశర్మ, దొడ్డిస్వామి వ్యక్తుల పేర్లు, కురువాడ, చిన్నపురి, తెల్లవల్లి, పెరువాటము అనే ఊర్లపేర్లు ఆ శాసనాల్లో కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలోనూ అనేక శాసనాల్లో తెలుగు పదాలున్నాయి. కానీ, లభ్యమైన పూర్తి తెలుగు శాసనం మాత్రం ఆరో శతాబ్ది నాటిది. అదే.. రేనాటి చోడులు వేయించిన క్రీ.శ.575కు చెందిన కలమళ్ల శాసనం (కడప జిల్లా).
      ఉన్న శాసనాలు తెలుగు భాష, లిపి పుట్టుకకు సంబంధించిన అనేక ఆధారాలను అందిస్తున్నాయి. వీటిలో కురవి, ధర్మవరం, బెజవాడ శాసనాలు కూడా అతిముఖ్యమైనవే. వీటన్నింటినీ కాపాడుకుంటూ తెలుగుభాష పుట్టుక, పరిణతి, సాహితీవికాసాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మన మూలాలను తెలుసుకోగలం. ఆధునిక పరిశోధకులు దృష్టి సారించాల్సిన ఆధారాలెన్నో ఉన్నా ఇంకా పరిష్కారం కాని శాసనాలు, తాళపత్రాలు మనకు తెలియని మన చరిత్రను పదిలంగా ఉంచాయి. దాన్ని వెలుగులోకి తేవడమే మన కర్తవ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం