భక్తప్రహ్లాద నుంచి బాహుబలి దాకా

  • 1372 Views
  • 1Likes
  • Like
  • Article Share

    హెచ్‌.రమేష్‌బాబు

  • తెలంగాణ సినీ చరిత్రకారుడు, చరిత్ర విమర్శకులు,
  • హైదరాబాదు
  • 7780736386
హెచ్‌.రమేష్‌బాబు

ఎనిమిదిన్నర దశాబ్దాల తెలుగు చలనచిత్ర యాత్రలో తీపిగుర్తులెన్నో! ఆబాలగోపాలాన్ని అలరించే ఏకైక మాధ్యమమైన సినిమా తెలుగునాట ఎన్నో అంచెలు దాటుకుంటూ అపూర్వ ఖ్యాతిని గడించింది. భారతీయ చిత్ర పరిశ్రమకే తలమానికంగా, హిందీ చిత్రపరిశ్రమకు ధీటుగా ఎదిగిన తెలుగు చలనచిత్ర చరిత్రలోని మైలురాళ్లు... తెలుగువారి స్మృతిపథంలోంచి తొలగిపోని తారల ఆనవాళ్లు ఇవి...
అచ్చతెలుగులో
‘చలనచిత్ర కళ’ అన్న మాట వాడుకలో ‘సినిమా’ అని పిలిపించుకుంటున్నది. ఇది ‘కినిమా’ అనే గ్రీకు పదం నుంచి ‘సినిమా’గా రూపాంతరం చెందింది. ఫ్రాన్స్‌లో థామస్‌ ఆల్వా ఎడిసన్‌ 1889లో కెనెటోస్కోపును కనుగొనడంతో ఈ సినిమా కళ పుట్టింది. తొలుత ఒక నిమిషం, తర్వాత రెండు, మూడు, అయిదు నిమిషాల వ్యవధి వరకు చిన్న చిన్న మూకీలు తయారయ్యాయి. ఇలాంటివాటితో డిసెంబరు 28, 1895న పారిస్‌లో లూమియర్‌ బ్రదర్స్‌ తొలి ప్రదర్శన ఇచ్చారు. వీళ్లే జులై 7, 1896న బొంబాయిలోని వాట్సన్‌ హోటల్‌లో మూకీ చిత్రాల ప్రదర్శన ఇచ్చి భారతీయులకు సినిమాలను పరిచయం చేశారు.
      ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో 1895లోనే సినిమా రంగానికి పునాదులు పడ్డాయి. లండన్‌ సేజ్‌ పబ్లికేషన్స్‌ వారు 2010లో ప్రచురించిన ‘బయస్కోప్‌’ అర్ధవార్షిక సంచికలో ‘సౌత్‌ ఆసియా స్క్రీన్‌ స్టడీస్‌’ విభాగంలో రచయిత స్టీఫెన్‌ హ్యూస్‌ దక్షిణ భారత మూకీల చరిత్ర మీద కొత్త వాస్తవాలను ఆవిష్కరించారు. లండన్‌కి చెందిన ప్రొ.స్టీవెన్‌సన్‌ 1895లోనే మద్రాసు వచ్చి 167, మౌంట్‌ రోడ్‌లో ‘మడ్రాస్‌ ఫొటోగ్రఫిక్‌ స్టోర్‌’ పెట్టారు. ఈయన మొదట యానిమేషన్‌ పద్ధతిలో రూపొందించిన ప్రదర్శనను 1896 డిసెంబరు మొదటివారంలో నిర్వహించాడు. దీంతో మొన్నటి వరకు ఎం.ఎడ్వర్డ్‌ అనే ఆసామి 1897లో మద్రాసులో తొలి మూకీల ప్రదర్శన ఇచ్చినట్లు జరిగిన ప్రచారం తప్పని తేలిపోయింది. 
      మద్రాసులో ప్రదర్శనలు విజయవంతం కావడంతో స్టీవెన్‌సన్‌  బ్రిటిష్‌ ఇండియా మొత్తం పర్యటించి మూకీ ప్రదర్శనలివ్వాలని బయలుదేరారు. ఈ పర్యటనలో ముందుగా ఆయన హైదరాబాదుకు వచ్చారు. ఆగస్టు 1897లో జంటనగరాల్లో మూకీల ప్రదర్శన నిర్వహించాడు. దీని తర్వాత హైదరాబాదులోని ధనికుల ఇళ్లలోనూ కొన్ని ప్రదర్శనలిచ్చారాయన. ఈ విషయాలన్నీ స్టీఫెన్‌ హ్యూస్‌ ‘బయస్కోప్‌’ సంచికలోని ‘వెన్‌ ఫిలిం కేమ్‌ టూ మద్రాస్‌’ అనే అధ్యాయంలో రాశారు. ఈ స్టీఫెన్‌ హ్యూస్‌ ఫిబ్రవరి 14, 2010 నాటి ‘ది హిందూ’లో ‘ఇన్‌సెర్చ్‌ ఆఫ్‌ బిగినింగ్స్‌’ పేరిట రాసిన వ్యాసంలో కూడా పై విషయాలను పేర్కొన్నారు. ఈ హ్యూస్‌ మరొక అడుగు ముందుకేసి హైదరాబాదుకు స్టీవెన్‌సన్‌ రాక (1897) కన్నా ముందుగా 1896లోనే సికిందరాబాదు నుంచి చిన్న చిన్న మూకీలతో కూడిన ‘పీప్‌హోల్‌ షోస్‌’ మద్రాసు మీదుగా దేశవ్యాప్తంగా వెళ్లినట్లు రాశారు. ఈ పీప్‌హోల్‌ షోలకి సంబంధించిన సమీక్షలను 1896 సెప్టెంబరు 2 నాటి ‘మద్రాసు మెయిల్‌’లో ప్రచురించారు. ఇలా మద్రాసు-హైదరాబాదుల్లో మూకీల కాలంలో జరిగిన పరిణామాలు తెలుగు సినిమాకు భారతీయ సినిమాతో సమాంతరంగా చరిత్ర ఉందని నిరూపిస్తాయి. మూకీల పరిచయాలే 1908లో మూసీ వరదల బీభత్స దృశ్యాలను చిత్రీకరింపజేయడానికి ఆరో నిజాం కలకత్తాలోని జె.ఎఫ్‌.మదన్‌ని హైదరాబాదుకు పిలవడానికి ప్రేరణలయ్యాయి.
రఘుపతి తరం
1908లోనే పి.ఎస్‌.బాబు అనే ఆయన ‘ఇంపీరియల్‌ బయస్కోప్‌ కంపెనీ’ పేరిట నాటి హైదరాబాదు రాజ్యమంతటా మూకీలు ప్రదర్శించారు. ఈయన ఎవరో కాదు.. 1935లో సి.పుల్లయ్య తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’లో కృష్ణుడి వేషం వేసిన జైసింగ్‌ తండ్రి. అటు మద్రాసులో అప్పటికే స్థిరపడిపోయిన రఘుపతి వెంకయ్య 1905లో విక్టోరియా పబ్లిక్‌ హాల్‌లో మూకీల ప్రదర్శన నిర్వహించారు. ఈ రెండు ప్రదర్శనలు దాదాఫాల్కే తొలి భారతీయ కథాచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ (1913) కన్నా ముందు జరిగినవి కావడం గమనార్హం. ఈ వెంకయ్యే 1921లో తన కుమారుడు రఘుపతి ప్రకాష్‌తో ‘భీష్మప్రతిజ్ఞ’ మూకీ తీయించారు. మద్రాసులో తెలుగువారు తీసిన తొలి మూకీ ఇది. ఆ తర్వాత ‘స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ ఫిలిం కంపెనీ’ మీద రఘుపతి ప్రకాశ్‌ మూకీలు తీశారు. నష్టాలు రావడంతో ఈ కంపెనీని వెంకయ్య మూసివేశారు.
      అనంతరం మద్రాసు పరిసర ప్రాంతంలోని తొండైర్‌ పేట దగ్గర్లోని చల్లపల్లి రాజావారి భూమిలో రఘుపతి ప్రకాష్‌ స్టూడియోని నెలకొల్పి, ‘దశావతారం’ (1927), ‘కోవలన్‌’ (1928) మూకీలు తీశారు. ఆ తర్వాత గొప్ప దర్శకులుగా పేరొందిన సి.పుల్లయ్య, వై.వి.రావు లాంటి వారు ఈ చిత్రాలకు ప్రకాష్‌ దగ్గర సహాయకులుగా పనిచేశారు. ఇవేవీ విజయవంతం కాకపోవడంతో స్టూడియో మూతపడింది. అప్పటి వరకు తన దగ్గర పనిచేసిన నారాయణన్‌ నెలకొల్పిన ‘జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌’ సంస్థలో సాంకేతిక నిపుణుడిగా చేరారు ప్రకాష్‌. 1929- 31 మధ్య నారాయణన్‌ తీసిన 17 మూకీలకు కెమెరామెన్‌గానో, దర్శకుడుగానో పనిచేశారు. వీటిలో ‘ధర్మపత్ని’ మద్యపానానికి వ్యతిరేకంగా తీసిన చిత్రం. ఆ రోజుల్లో ప్రకాష్‌ దర్శకత్వం వహించిన ‘‘లైలా ది స్టార్‌ ఆఫ్‌ మింగ్రిలియా’ శ్రీలంక, మలేసియా, మయన్మార్‌ దేశాల్లో విడుదలై విజయవంతమైంది.
మెహమూద్‌ మియా సినిమా బండి
థియేటర్ల విషయానికి వస్తే, హైదరాబాదులో తొలి శాశ్వత థియేటర్‌ నిర్మాణానికి పూనుకున్నది సాక్షాత్తూ నిజాం నవాబే. మూడో సాలార్‌జంగ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ దేవిడీ పాలెస్‌లో 1920లో ‘సెలెక్ట్‌ టాకీస్‌’ కట్టించారు. 1920లోనే అవిభాజ్య నిజాం రాజ్యంలోని బీడ్‌ జిల్లా కేంద్రంలో మహ్మద్‌ సర్దార్‌ అలీఖాన్‌ ‘దక్కన్‌ టాకీస్‌’ పేరున శాశ్వత థియేటర్‌ను ఏర్పాటుచేశారు. బెజవాడలో పోతిన శ్రీనివాసరావు 1921లో ‘మారుతి సినిమాహాల్‌’ను నిర్మించారు.
      ఇవన్నీ ఇలా ఉండగా, 1908లో విలియమ్‌ అనే బ్రిటిష్‌ సైన్యాధికారి కలకత్తా నుంచి సికిందరాబాదు సైనిక పటాలానికి వచ్చారు. ఈయన తన పిల్లలకు ఇంట్లో మెటల్‌ 16, 8 ఎం.ఎం. ఫిలిం కెమెరాలతో మూకీ చిత్రాలను డైనమో సాయంతో చూపేవారు. ఈయన 1928లో ఇంగ్లాండ్‌ వెళ్లిపోతూ.. తమ ఇంట్లో పనిచేసే మెహమూద్‌ మియా అనే యువకుడికి ‘తోపుడుబండి సినిమా’ను ఇచ్చి వెళ్లాడు. 8 ఎం.ఎం.కెమెరాను ఓ నాలుగు చక్రాల తోపుడు బండికి అమర్చి చుట్టూ పరదాకట్టి దాని ఇరువైపులా తొంగి చూసేలాగా రంధ్రాలు చేసిన ఏర్పాటిది. ఈ మెహమూద్‌ మియా 1928 నుంచి 1957 వరకు ముప్పయి ఏళ్ల పాటు అణా, బేడా, అర్ధణాకి హైదరాబాదు వీధుల్లో పది, పదిహేను నిమిషాల నిడివిగల సినిమాలను చూపి పొట్ట పోసుకున్నాడు. ‘మెహమూద్‌ మియా సినిమా బండి’గా హైదరాబాదులో ఇది పేరు పొందింది. 
హైదరాబాదు నుంచి..
అటు మద్రాసులో రఘుపతి వెంకయ్య- ప్రకాష్‌లు మూకీలు తీస్తుండగా ఇటు హైదరాబాదులో ఏడో నిజాం కలకత్తా నుంచి ధీరేన్‌ గంగూలీని పిలిపించి, మూకీల నిర్మాణానికి సకల సదుపాయాలు కల్పించారు. ఈ గంగూలీ ‘లోటస్‌ ఫిలిం కంపెనీ’ పేరిట 1922-24 మధ్యలో ‘హరగౌరి, ఇంద్రజిత్‌’ లాంటి చిత్రాలు తీశారు. 1924లో ధీరేన్‌ ‘రజియాబేేగం’ మూకీని విడుదలచేశారు. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ చిత్రాన్ని నిషేధించడమే కాకుండా, ధీరేన్‌ను నగరం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ధీరేన్‌ తర్వాత మహావీర్‌ ఫొటో ప్లేస్‌ సంస్థ 1929-31 మధ్యకాలంలో అరడజను మూకీలను నిర్మించింది.
      ధీరేన్‌ మూకీలు ఇక్కడివారిని సినిమా రంగం వైపు ఆకర్షించాయి. హైదరాబాదుకు చెందిన సరోజినీదేవి చెల్లెళ్లు సునాళినీదేవి, మృణాళినీదేవి ఇద్దరూ 1925లో బొంబాయి వెళ్లారు. హిమాంశురాయ్‌ తీసిన ప్రసిద్ధ మూకీ చిత్రం ‘ది లైట్‌ ఆఫ్‌ ఆసియా’ (1925)లో నటించారు. వీళ్లే మూకీల్లో నటించిన తొలి తెలుగు తారలు. ఆ తర్వాత హైదరాబాదు పాతనగరం నాగులచింతకు చెందిన రాంప్యారీ, 1927లో చందులాల్‌షా తీసిన ‘గుణసుందరి’ మూకీలో నటించారు. ఇక బొంబాయిలో కాలుమోపిన తొలి తెలుగు కథానాయకుడు పైడి జైరాజ్‌. ఈయన 1929లో ‘జగ్‌మగాతీ జవానీ’ మూకీలో తొలిసారి నటించారు. తర్వాత 11 మూకీల్లో నటించారు జైరాజ్‌. 1930లో బొంబాయి వెళ్లిన ఎల్‌.వి.ప్రసాద్‌ తొలి తెలుగు, తమిళ, హిందీ టాకీలు ‘భక్తప్రహ్లాద’ (1932), ‘కాళిదాసు’, ‘ఆలం ఆరా’ (1931)ల్లో నటించారు. ఆ తర్వాత నటుడిగా, దర్శక నిర్మాతగా, స్టూడియో అధినేతగా చాలా ఖ్యాతి గడించారు..
టాకీ శకం ఆరంభం
1932లో తొలి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ విడుదలైంది. అర్దేషీర్‌ ఇరానీ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. హిరణ్యకశ్యపుడుగా ఎం.వి.సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదుడిగా ఖమ్మానికి చెందిన కృష్ణాజీరావు షిండే నటించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులి ‘ప్రహ్లాద’ నాటకం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో పాటలను చందాల కేశవదాసు రాశారు. అప్పటి వరకు మూకీ చిత్రాలు, నాటకాలు చూసిన ప్రజలను ‘భక్తప్రహ్లాద’ ఇట్టే ఆకర్షించి, కనక వర్షం కురిపించింది. సినిమారంగం చాలామందిని తనవైపు లాక్కుంది. 1932లో మూడు చిత్రాలు తయారైతే.. 1933లో ఆరు, ఆ తర్వాత డజను, పాతిక, ఇట్లా ఏటా వందకు పైగా చిత్రాలు నిర్మించే స్థాయికి తెలుగు సినీపరిశ్రమ ఎదిగింది. జనాదరణ పెరిగేకొద్దీ సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో నాటకరంగం నుంచి చాలామంది సినిమా పరిశ్రమకు మారిపోయారు.
తొలిసారథులు
టాకీలు వచ్చాక అయిదేళ్లపాటు పౌరాణికాలే తయారయ్యాయి. వాటిలో నటన, సంగీత, గానాలన్నీ రంగస్థలం వాసనలతోనే కనిపిస్తాయి. అయితే మూకీ కాలం నుంచి సినిమాలు తీసిన సి.పుల్లయ్య, పి.పుల్లయ్యల ప్రవేశంతో సినిమాల నిర్మాణం వేగం పుంజుకుంది. 1934లో సి.పుల్లయ్య తీసిన ‘లవకుశ’ పెద్ద హిట్‌ చిత్రం. సీతగా నటించిన సీనియర్‌ శ్రీరంజనికి ప్రేక్షకులు ఆరతులు పట్టారు. 1935లో సి.పుల్లయ్యే ‘శ్రీకృష్ణ తులాభారం’ తీసి కాంచనమాల, ఋష్యేంద్రమణిని, 1939లో ‘వర విక్రయం’ ద్వారా భానుమతిని, ‘అనసూయ- ధృవవిజయం’లో బాలసరస్వతి, కృష్ణవేణిలను తెలుగు తెరకు పరిచయం చేశారు. 1963లో మళ్లీ ‘లవకుశ’ తీసిన సి.పుల్లయ్య సంచలనం సృష్టించారు.  
      పి.పుల్లయ్య ‘హరిశ్చంద్ర’(1935)తో దర్శకుడయ్యారు. కన్నాంబను తెలుగు తెరకు పరిచయం చేశారు. 1939లో ‘శ్రీబాలాజీ’ తీసి విజయం సాధించారు. ఇదే చిత్రాన్ని 1960లో మరోసారి ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’గా తీసి విజయం సాధించారు. 1941లో పి.పుల్లయ్యే ‘ధర్మపత్ని’లోని చిన్న పాత్ర ద్వారా అక్కినేనిని సినిమాకు పరిచయం చేశారు.  తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో 46 సినిమాలు తీసిన పి.పుల్లయ్యతో పాటు ఆయన భార్య శాంతకుమారి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.  
      1936లోనే తొలి సాంఘిక చిత్రం ‘ప్రేమవిజయం’ వచ్చింది. 1938లో రోహిణీ పిక్చర్స్‌ ప్రారంభించిన హెచ్‌.ఎం.రెడ్డి తెలుగులో సాంఘికాలకు ఆదరణ పెరగడానికి కారకులయ్యారు. ఇందులో బి.ఎన్‌.రెడ్డి, కన్నాంబ, మూలా నారాయణస్వామి తదితరులు భాగస్వాములు. అంతాకలిసి హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీశారు. ప్రేక్షకుల ఆదరణ పొందిన తొలి సాంఘికం ఇదే. నాగయ్యకిదే తొలి సినిమా. లాభాలు వచ్చినా భాగస్వాములు విడిపోయారు.  
      బి.ఎన్‌.రెడ్డి ‘వాహినీ’ సంస్థను ప్రారంభించి, 1939లో ‘వందేమాతరం’ తీశారు. మూలా నారాయణస్వామి అందులో ఓ భాగస్వామి. మొదటి చిత్రమే విజయం సాధించడంతో వాహినీ సంస్థ ఆ తర్వాత దేవత, సుమంగళి, స్వర్గసీమ, మల్లీశ్వరి లాంటి గొప్ప చిత్రాలు తీసింది.  ఇక 1938లో గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ తీశారు. కులం సమస్యతో వచ్చిన ఈ సినిమా విజయం సాధించినా.. 85 ఏండ్ల మన టాకీ చరిత్రలో కులం సమస్యతో పట్టుమని పది చిత్రాలు కూడా రాలేదు! రామబ్రహ్మమే ఆ తర్వాత రైతుబిడ్డ (1939) తీసి చేతులు కాల్చుకున్నారు. జమిందారీ వ్యవస్థను దుయ్యబడుతూ తీసిన సినిమా ఇది. 1940లో నాలుగు చిత్రాలు తీసిన రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ తీస్తూ కాలం చేశారు. ఆ సినిమాను ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేశారు. ఈ దశకారంభంలో వచ్చిన జెమినీవారి ‘బాలనాగమ్మ’ తెలుగు సినిమా వ్యాపారస్థాయిని నిరూపించింది.
ఇద్దరూ ఇద్దరే
ఘంటసాల బలరామయ్య తీసిన ‘సీతారామజననం’ (1944)లో శ్రీరాముడిగా నటించడంతో కథానాయకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు ఏడు దశాబ్దాలకు పైగా ఓ వెలుగు వెలిగారు. మొదట్లో ‘బాలరాజు, కీలుగుర్రం’ తదితర చిత్రాలతో జానపద కథానాయకుడిగా ముద్రపడినా.. 1951లో వచ్చిన ‘పల్లెటూరిపిల్ల’తో సాంఘికాల్లో కూడా మెప్పించగలనని నిరూపించుకున్నారు. దాదాఫాల్కేతోబాటు పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్‌ పురస్కారాలు ఆయన్ను వరించాయి.
      ‘మనదేశం’(1949)తో సినిమాల్లోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు ఆ తర్వాత పౌరాణికాలతో తెలుగు తెర వేలుపుగా వినుతికెక్కారు. ఒక రకంగా ఏఎన్నార్‌ క్లాస్‌ హీరో అయితే ఎన్టీఆర్‌ మాస్‌ హీరో.  మాయాబజార్‌లో శ్రీకృష్ణుడుగా ఆయన నటన అనితరసాధ్యం. ఆ తర్వాత తెలుగు తెరపై శ్రీకృష్ణుడంటే ఆయనే. అలాగే శ్రీరాముడు పాత్ర. రావణ, దుర్యోధన లాంటి ప్రతినాయక పాత్రలను తెర మీద హీరోలుగా చూపడం ఆయనకే సాధ్యమైంది. చివర్లో ‘బొబ్బిలిపులి, కొండవీటిసింహం, జస్టిస్‌ చౌదరి’ లాంటి సినిమాలు ఆయన రాజకీయారంగ ప్రవేశానికి కారణాలయ్యాయి.  
ఉద్దండులైన దర్శకనిర్మాతల్లో
వాహినీ తర్వాత విజయా సంస్థ ఆవిర్భావం తెలుగు సినిమాను కీలకమైన మలుపు తిప్పితే.. ఆ తర్వాత ఎన్‌ఏటీ, పీసీపీ, వినోదా, అంతకు ముందున్న ఏవీఎం, భరణి, జెమినీలు, అన్నపూర్ణ, జగపతి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లాంటి సంస్థలు జనాదరణ పొందిన చిత్రాలు తీశాయి. డి.రామానాయుడు శతాధిక చిత్రాలు తీశారు. గిన్నిస్‌ పుస్తకంలోకి ఎక్కారు. ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకన్నా ముందు బి.ఎన్‌.రెడ్డి, పైడి జైరాజ్, ఎల్‌.వి.ప్రసాద్, బి.నాగిరెడ్డి, అక్కినేని, కె.విశ్వనాథ్‌లు ఈ గౌరవాన్ని స్వీకరించారు. తెలంగాణకి చెందిన శ్యాంబెనెగల్‌కి 2005లో సమాంతర సినిమా కృషికి గుర్తింపుగా ఫాల్కే పురస్కారం వచ్చింది.
      దర్శకుల్లో బి.ఎన్‌.రెడ్డి కళాత్మక చిత్రాలకే పరిమితమైతే కె.వి.రెడ్డి విజయవంతమైన చిత్రాలు తీయడంలో దిట్ట అనిపించుకున్నారు. ఆయన తర్వాత ఆదుర్తి సుబ్బారావు తెలుగుదనం కలబోసుకున్న చిత్రాలు తీశారు. భరణీ రామకృష్ణ, వేదాంతం రాఘవయ్య, కె.ఎస్‌.ప్రకాశరావు, బి.ఎ.సుబ్బారావు, టి.ప్రకాశరావు, సి.ఎస్‌.రావు, యోగానంద్, బి.ఎస్‌.రంగా, బి.తిలక్, విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు, ప్రత్యగాత్మ, కెఎస్‌ఆర్‌ దాసు లాంటివారు; దాసరి నారాయణరావు, బాపు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, విజయబాపినీడు, సింగీతం శ్రీనివాసరావు, టి.కృష్ణ తదితర దర్శకులందరూ అప్పటి తరాలను ప్రభావితం చేసిన సినిమాలు తీశారు. 40కి పైగా చిత్రాల దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్‌ గుర్తింపు పొందారు. 
తెలంగాణ నుంచి..
మద్రాసులోని చలనచిత్ర పరిణామాలన్నీ తెలంగాణలోని ఔత్సాహికులను ఆకర్షించాయి. 1951లో నల్లగొండ జిల్లా కందిబండ- గణపవరం దేశ్‌ముఖ్‌లు కలిసి మద్రాసులో సినిమా తీయడానికి వెళ్లారు. హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో షావుకారు జానకి, జగ్గయ్య, సావిత్రి, రామశర్మ, ఆత్రేయ (అవును పాటల రచయిత ఆత్రేయనే), గౌరీనాథశాస్త్రిలతో ‘ఆదర్శం’ (1952) తీశారు. ఈ సినిమాలో తెలంగాణకు చెందిన బి.ఎస్‌.నారాయణ, టి.కృష్ణ (ఎడిటర్‌), ఎం.వి.రాజులు వివిధ శాఖల్లో పనిచేశారు. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా తెలుగు సినిమాల్లోకి తెలంగాణ వారి ప్రవేశానికి ద్వారమైంది. వీరిలో ఎం.వి.రాజు సంగీత దర్శకుడై.. ‘భక్తకనకదాస’ కన్నడ చిత్రానికిగాను 1960లో జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడి అవార్డు అందుకున్నారు. టి.కృష్ణ ఎడిటర్‌గా 300 చిత్రాలకు పనిచేశారు. బి.ఎస్‌.నారాయణ ‘ఊరుమ్మడి బతుకులు’, ‘నిమజ్జనం’, ‘మార్గదర్శి’ లాంటి జాతీయ అవార్డు చిత్రాలు తీశారు.
      ‘ఆదర్శం’ వేసిన దారిలో మద్రాసు వెళ్లి సినిమాల్లో విజయవంతమైన వ్యక్తి టి.ఎల్‌.కాంతారావు. జానపద కథానాయకుడిగా ఆయన తెలుగు సినిమాను రెండు దశాబ్దాలపాటు చకచ్ఛకితం చేశారు. నల్లగొండ జిల్లా గుడిబండకు చెందిన కాంతారావు 1952లో మద్రాసుకెళ్లి హెచ్‌.ఎం.రెడ్డి కంట్లో పడి, ‘ప్రతిజ్ఞ’ (1953) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత దాదాపు యాభై జానపద చిత్రాల్లో తనదైన విలక్షణ ముద్రతో నటించారు. విఠలాచార్య, రాజనాల, కృష్ణకుమారి, రాజశ్రీలతో ఆయనది విజయవంతమైన జట్టు. మరోవైపు తెలుగు సినిమాల్లో నారదుడంటే కాంతారావే. డజనుకు పైగా చిత్రాల్లో నారదుడుగా తెరకు నిండుదనం తెచ్చారు. ఇంకా ఎన్టీఆర్‌కు వీలుకాకపోతే అర్జునుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వేషాలు కాంతారావే వేయాలి. సాంఘికాల సంగతి సరేసరి. 1952లోనే సినిమాల్లోకి వచ్చిన మరో హైదరాబాదీ ఆర్‌.నాగేశ్వరరావు. సంక్రాంతి, రాజు-పేద, దొంగరాముడు, మాయాబజార్, ఇల్లరికం లాంటి చిత్రాల్లో తను తప్ప మరొకరు చేయలేని వేషాలు వేశారాయన.
ఎందరో తారలు
ఎన్టీఆర్, అక్కినేని తర్వాత తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్లిన మలితరం కథానాయకులు శోభన్‌బాబు, కృష్ణ, హరనాథ్, కృష్ణంరాజులు. అయితే అసలు తెలుగు సినిమా హీరో స్థాయి పొందిన తొలి వ్యక్తి చిత్తూరు నాగయ్య. ఆయన తెలుగు సినిమా గర్వించదగిన ‘పోతన, వేమన, త్యాగయ్య, రామదాసు’ లాంటి చిత్రాలు తీశారు. బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డిల తొలి చిత్రాలకు ఆయనే హీరో. రేలంగి, ఎస్‌.వి.రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, శివరావు, పద్మనాభం, రాజబాబు, రావు గోపాలరావు లాంటివారు కథానాయకులతో సమానమైన పేరుప్రఖ్యాతులను అందుకున్నవారే. మలితరం కథానాయకుల్లో అందాల నటుడుగా శోభన్‌బాబు కుటుంబ కథా చిత్రాలు చేశారు. కృష్ణ కౌబాయ్‌ పాత్రలకు, రైతు పాత్రలకు పెట్టింది పేరుగా ఎదిగి, ‘అల్లూరి సీతారామరాజు’గా నటించి తన సినీ జీవితానికి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ అధ్యాయాన్ని సంపాదించుకోగలిగారు. 
సావిత్రి.. భానుమతి
తెలుగు సినిమా కథానాయిక అనగానే ముందుగా గుర్తొచ్చేవారు మహానటి సావిత్రి. కంటితో, కనుపాపలతో, పెదాల విరుపులతో మహాద్భుతమైన నటనను ఆవిష్కరించగలిగిన సహజనటి ఆమె. ‘దేవదాసు’తో మొదలైన సావిత్రి నటనా వైభవం.. ‘మిస్సమ్మ, అర్ధాంగి, దొంగరాముడు, మూగమనసులు, రక్తసంబంధం, మాయాబజార్‌’ తదితర చిత్రాలతో శిఖరస్థాయిని అందుకుంది. అక్కినేని, ఎన్టీఆర్‌లతో ఆమె జోడి దర్శక నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. అయితే సావిత్రి కన్నా ముందు తరంలో నాయికగా రంగప్రవేశం చేసి నటగాయనిగానే గాక దర్శకనిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా తనదైన ముద్రవేసిన తార భానుమతి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ‘‘మేడమ్‌’’ అని పిలిపించుకున్న ఏకైక నాయిక భానుమతే. పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారామె. 
      ఈ పరంపరలో ఎస్‌.వరలక్ష్మి, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, మాలతి, జూనియర్‌ శ్రీరంజని, అంజలీదేవి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, రాజశ్రీ, భారతి, చంద్రకళ, వాణీశ్రీ; తర్వాత తరంలో జయప్రద, జయసుధ, శ్రీదేవి వెండితెర మీద వెలిగిపోయారు. ఇక సహాయపాత్రలు ధరించిన వాళ్లలో ముందుగా చెప్పుకోదగినవారు ఋష్యేంద్రమణి. తర్వాత హేమలత ఎన్టీఆర్‌కు పెంపుడు తల్లిగా పేరుపొందారు. సూర్యకాంతం, గిరిజ, గంగారత్నం, ఛాయాదేవి, రమాప్రభ, గీతాంజలి, నిర్మలమ్మ తదితరులూ మర్చిపోలేనివారే. మరోవైపు.. బాలీవుడ్‌లో పనిచేసినవారిలో ‘ఆలంఆరా’ కథానాయిక జుబేదా హైదరాబాదుకు చెందిన ధనరాజ్‌ గిరిధర్‌ భార్య. ఇంకా హీరోయిన్‌ నిగార్‌ సుల్తానా, హీరోలు అజిత్, చంద్రశేఖర్, సరీన్, సంగీతదర్శకులు శంకర్, ఖురేషి, దర్శకుడు కె.కె.రెడ్డి, మణిశంకర్, సెంథిల్‌ కుమార్‌ (కెమెరామెన్‌), షాకత్‌ అజ్మీ, షబానా అజ్మీలు హైదరాబాదీలు.
మట్టిమనుషుల కథలతో..
1970ల్లో తెలుగు సినిమా మీద ఒక కొత్త చూపు ప్రసరించింది. సత్యజిత్‌రే, తపన్‌సిన్హా, రిత్విక్‌ ఘటక్, మృణాళ్‌ సేన్‌ల చిత్రాల ప్రేరణతో దక్షిణాదిన ఆదూర్‌ గోపాలకృష్ణన్, అరవిందన్, బెంగాల్‌లో బుద్ధదేవ్‌దాస్‌ గుప్తా లాంటివారు నవ్య సినిమాకు, వ్యాపార సినిమాకు మధ్యస్థంగా సమాంతర సినిమానొకదాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ ప్రేరణతో సికింద్రాబాదులో పుట్టి పెరిగిన శ్యాంబెనెగల్‌ 1974లో ‘అంకుర్‌’ సినిమా తీసి జాతీయస్థాయిలో పురస్కారాలు కొల్లగొట్టారు. ఈయనే ఆ తర్వాత ‘నిషాంత్, సుస్మాన్, వెల్డన్‌ అచ్చా’ చిత్రాలను తెలంగాణ కథలతో నిర్మించారు. శ్యాంబెనెగల్‌ ప్రభావంతో సారథీ సంస్థ అధినేతల్లో ఒకరైన రవీంద్రనాథ్‌.. మృణాళ్‌సేన్‌ను ఆహ్వానించి 1977లో ‘ఒక వూరి కథ’కు దర్శకత్వం చేయించారు. 1977లోనే దాశరథి ‘చిల్లరదేవుళ్లు’ నవలను టి.మాధవరావు అత్యంత సహజమైన తెలంగాణ భాషలో తీశారు.
      తెలుగులో విభిన్న చిత్రాల నిర్మాణానికి ‘ఒక వూరి కథ’ స్ఫూర్తినిచ్చింది. రవీంద్రనాథ్, బి.నరసింగరావులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ‘మాభూమి’ పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. బెంగాలీ దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తయారైన ‘మాభూమి’ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాను చూపింది. గద్దర్‌ పాడిన ‘బండెనక బండి కట్టి’ పాట తెలుగునాట మార్మోగింది. ‘మాభూమి’ విజయోత్సాహంతో బి.నరసింగరావు ఒక చిత్రకారుడి జీవితంతో ‘రంగుల కల’ తీశారు. ఈ చిత్రం బి.నరసింగరావును నటుడిగా, దర్శకుడిగానేగాక రచయితగా, సంగీతదర్శకునిగానూ ఆవిష్కరించింది. 
      జీవితాన్ని సజీవంగా ఉన్నది ఉన్నట్లు అదీ మనకు కనిపించని కోణాలను చూపించాలనుకునే దర్శకుడు బి.ఎన్‌.- ఇదే లక్ష్యంతో ఆ తర్వాత తీసిన సినిమా ‘దాసి’. దొరగడిలోకి కట్టుబానిసగా వచ్చిన స్త్రీ జీవితానికి అనన్యసామాన్యంగా దృశ్యరూపం కల్పించారు బి.ఎన్‌. ‘దాసి’గా నటించిన అర్చనకు ఆ ఏడాది జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఈ చిత్రానికి మరో అయిదు పురస్కారాలు వచ్చాయి. ఈ సినిమా అనేక దేశాల్లో జరిగిన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. బి.నరసింగరావు పాలమూరు వలసకూలీల మీద ‘మట్టిమనుషులు’, బాలల చిత్రం ‘హరివిల్లు’తో బాటు ‘ది సిటి, మావూరు’ లాంటి ఏడు డాక్యుమెంటరీలు కూడా తీశారు. ఈ పరంపరంలో తెలంగాణకు చెందిన దర్శకులు అల్లాణి శ్రీధర్‌ ‘కొమురం భీం’ సినిమా తీశారు. తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌.శంకర్‌ ‘జై బోలో తెలంగాణ’ తెరకెక్కించారు. అయితే వీరందరికన్నా ముందుగా 1960లో తెలంగాణ వారు తీసిన ‘చివరకు మిగిలేది’లో వెండితెరకు పరిచయమైన డా।। ప్రభాకర్‌రెడ్డి సహాయ నటుడుగానేగాక రచయితగా, దర్శకనిర్మాతగా సినిమాలు తీసి లక్ష్మీదీపక్, భాస్కర్‌రావు లాంటి దర్శకులను పరిచయం చేశారు.
పాటల తోటలో...
పాటలు, సంగీతం లేని తెలుగు సినిమాను ఊహించలేం. భీమవరపు నరసింహారావు, సి.ఆర్‌.సుబ్బరాయన్, నాగయ్య, రజనీ, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, ఆదినారాయణరావు, కె.వి.మహదేవన్, టి.వి.రాజు, రమేష్‌ నాయుడు, ఎస్‌.పి.కోదండపాణి, చక్రవర్తి, జి.కె.వెంకటేశ్, విశ్వనాథన్‌-రామ్మూర్తి, టి.చలపతిరావు, సత్యం, ఇళయరాజా, ఎ.ఆర్‌.రహమాన్, కీరవాణి లాంటివారు తెలుగు సినిమా సంగీతాన్ని తమ మధుర స్వరాలతో రాగరంజితం చేశారు. 
      తెలుగు సినిమా పాట అంటేనే ఘంటసాల. ఆయన పాడిన వేలాది పాటలు తెలుగు ప్రజలను అలరిస్తూనే ఉంటాయి. అయితే తొలి తెలుగు నేపథ్యగాయకుడు ఎం.ఎస్‌.రామారావు కాగా, తొలి గాయనీమణులు బెజవాడ రాజారత్నం, రావు బాలసరస్వతి. తర్వాత పి.లీల, సుశీల, జానకి, వసంత, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి, వాణీజయరామ్, చిత్ర లాంటి గాయనీమణులు పేర్కొనదగిన వారిలో కొందరు. ఇక 1969లో సినీరంగ ప్రవేశం చేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అనేక భాషల్లో వేలాది పాటలు పాడారు. ఎ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్, జేసుదాస్, జి.ఆనంద్, రామకృష్ణ, మనోలు గాయకుల్లో ప్రముఖులు. 
      తొలినాళ్లలో రంగస్థల నాటకకర్తలే సినిమాలకు పనిచేశారు. అయితే సీనియర్‌ సముద్రాల రాకతో సినిమా రచనా ధోరణి మలుపు తిరిగింది. మల్లాది రామకృష్ణశాస్త్రి, తాపీ ధర్మారావు, కొసరాజు, సదాశివ సుబ్రహ్మణ్యం, పింగళి, చక్రపాణి, ఆరుద్ర, ఆత్రేయ, జూనియర్‌ సముద్రాల, దేవులపల్లి, శ్రీశ్రీ, అనిసెట్టి, పినిశెట్టి, డి.వి.నరసరాజు, పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీ, వేటూరి, సినారె, వేణుగోపాల్, దాశరథి, బొల్లిముంత, ముళ్లపూడి, మల్లెమాల, మోదుకూరి జాన్సన్, జాలాది తొలి మలితరానికి చెందిన కవులు, రచయితలు. ఆ తర్వాత ఎం.వి.ఎస్‌.హరనాథ]రావు, పరుచూరి బ్రదర్స్, భారవి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అనంత శ్రీరామ్, భువనచంద్ర, సిరివెన్నెల, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, వెన్నెలకంటి, రామజోగయ్యశాస్త్రి, కందికొండ, అందెశ్రీ, గోరటి వెంకన్న లాంటివారు నవతరం గేయ, సంభాషణ రచయితలు. 
      సినిమా నిర్మాణంలో ఛాయాగ్రాహకుడు కీలక సాంకేతిక నిపుణుడు. తొలినాళ్లలో పరిమితమైన వనరులతో అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించిన వారిలో ఎం.ఎ.రహమాన్, మార్కస్‌ బార్‌ట్లే, రవికాంత్‌ నగాయిచ్, కన్నప్ప, స్వామి, బాబూబాయి మిస్త్రీ, వెంకటరత్నం ముఖ్యులు. తర్వాత రఘు, తేజ తదితరులు పేర్కొనదగిన వారిలో ఉన్నారు. కళాదర్శకుల గురించి చెప్పుకొనకపోతే అది అసంపూర్ణమే అవుతుంది. వాలి, కళాధర్, మాగోఖలే, తోటతరణి లాంటి వారు ప్రసిద్ధుల్లో కొందరు.
రాశిలో ఎక్కడ?
కేంద్రప్రభుత్వం 1955లో చలనచిత్రాలకు పురస్కారాలు మొదలుపెట్టినపుడు సత్యజిత్‌రే ‘పథేర్‌ పాంచాలి’కి పోటీపడింది ఓ తెలుగు సినిమా అంటే ఆశ్చర్యపోవచ్చు. అవును అది బి.ఎన్‌.రెడ్డి ‘బంగారుపాప’. అయితే ఆనాడు వెంట్రుకవాసిలో జాతీయ ఉత్తమచిత్రం అవార్డు చేజారింది. గడచిన అరవై ఏళ్లలో ఆ ఛాయలకు కూడా వెళ్లలేకపోయింది తెలుగు పరిశ్రమ. కానీ మొన్న 2015లో వచ్చిన ఓ వాణిజ్య సినిమా ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై, తెలుగువారికి కొంత ఊరట కలిగించింది. ‘బాహుబలి-2’ వెయ్యికోట్ల వసూళ్లను దాటింది. మరోవైపు... బాలు, సుశీల, జానకి, వాణీజయరాం, ఇళయరాజా, రమేష్‌నాయుడు, శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్‌తేజ, వైకుంఠం, సుదర్శన్‌ తదితరులు తమ రంగాల్లో జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
      1964లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం నంది పురస్కారాలను ప్రవేశపెట్టింది. తర్వాత వీటిని టీవీ, నాటక రంగాలకు విస్తరించారు. 1996 నుంచి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని, ఆ తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి, బి.ఎన్‌.రెడ్డి పురస్కారాలను ప్రవేశపెట్టారు. వీటికన్నా ముందు 1980లోనే సినిమారంగానికి అత్యున్నత సేవలందించిన వారికి ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు ఇవ్వనారంభించారు. అది ఎల్‌.వి.ప్రసాద్‌తో మొదలుకుని 45 మందికి అందజేశారు. ఉత్తమ చిత్రాల నిర్మాణమే ఈ అవార్డుల లక్ష్యం. కానీ ‘ఆ లక్ష్యం నెరవేరిందా?’ అన్న ప్రశ్న ఇంకా సజీవంగానే ఉంది. సినిమాల్లో అశ్లీలత, హింస మోతాదు మించే ఉంటున్నాయి. సినిమా నిర్మాణంలో ఒకనాటి మానవీయ కోణాలు, విలువలు అన్నీ అంతరించిపోయాయి. బి.ఎన్‌.రెడ్డి తీసిన పదకొండు చిత్రాలు ఒక్క కత్తిరింపు కూడా లేకుండా సెన్సార్‌ సర్టిఫికేటు పొందాయంటే ఏ నిబద్ధతతో ఆయన సినిమాలు తీశారో అర్థం చేసుకోవచ్చు. 
      ఎనభై అయిదేళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘భక్తప్రహ్లాద’ నుంచి ‘బాహుబలి’దాకా సుమారు ఆరు వేలకు పైగా సినిమాలు వచ్చాయి. 30వ దశకాన్ని ఆరంభశకంగా భావిస్తే, ఆ తర్వాత 1940-1965 మధ్యకాలమంతా స్వర్ణయుగంగా భావించవచ్చు. ఆ తర్వాతి నుంచి ఇప్పటిదాకా అడపాదడపా ఒకటి, అరా ఉత్తమ చిత్రాలు వచ్చాయి కానీ, మిగతావన్నీ వ్యాపారమే ప్రధానంగా రూపొందాయి. గతమెంతో ఘనమైన తెలుగు సినిమా సామాజిక ప్రయోజనం సాధించే అత్యుత్తమ చిత్రాలు తీయాలి. జాతీయస్థాయిలో మనదంటూ విభిన్నమైన గుర్తింపు పొందాలి. అప్పుడే తెలుగు సినిమాకు నిజమైన అస్తిత్వం ఏర్పడినట్లు. ఈ విషయంలో బెంగాలీ, మరాఠీÈ, కన్నడ, మలయాళీ, అస్సామీ చిత్రరంగాలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం