తెలుగు నేర్పిన అడుగులివి

  • 2973 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా॥ వేలూరి సుమిత్రా పార్థ‌సార‌ధి

  • కూచిపూడి నృత్యాచార్యులు,
  • హైదరాబాదు
  • 9949467966
డా॥ వేలూరి సుమిత్రా పార్థ‌సార‌ధి

మార్గ, దేశీయ.. నృత్యమేదైనా సరే రసానందభరితమే! అనిర్వచనీయమైన తన్మయత్వంతో కళాకారులు ప్రదర్శించే ఆంగిక, వాచికాభినయాలు వీక్షకులను చూపు తిప్పుకోనివ్వవు. అలాంటి నృత్యరీతులకు తెలుగునాట కొదువలేదు. గుస్సాడీ లాంటి గిరిజన నాట్యాల నుంచి కూచిపూడి, పేరిణి లాంటి వాటి వరకూ ఈ గడ్డ మీద విలసిల్లుతున్న నృత్యాలన్నీ జాతి వారసత్వ సంపదలే. తరతరాల తెలుగు నాట్యవైభవ చిహ్నాలే.
నాట్యం,
నృత్యం, నృత్తం అనే పదాలు నాట్యానికి పర్యాయపదాలుగా వాడుకలో ఉన్నప్పటికీ, ప్రయోగదృష్ట్యా పరిశీలిస్తే వాటిలోని భేదాలను గమనించవచ్చు. ఈ పదాలను తొలిసారిగా క్రీ.శ.మూడో శతాబ్దానికి చెందిన తెలుగువాడైన నృత్యశాస్త్రజ్ఞుడు నందికేశ్వరుడు నిర్వచించాడు. ఇతిహాస, పురాణాదుల నుంచి ఇతివృత్తాన్ని స్వీకరించి, నాటక సహితంగా ప్రదర్శించేది నాట్యం. నర్తకి భావాభినయం ద్వారా ప్రేక్షకుల హృదయాంతరాళాల్లో నానాభావ సముద్ధితమై రసోత్పత్తిని కలుగజేేసేది నృత్యం. ఈ రసభావాలను కించిత్‌ పరిమాణంలో స్ఫురింపచేసేది నృత్తమని నందికేశ్వరుడు చెప్పాడు. నాట్యాన్ని స్థూలంగా ‘మార్గ’, ‘దేశీ’ నృత్యాలుగా విభజించవచ్చు. ‘మార్గ’ అంటే దారి లేదా తోవ అని అర్థం. సంగీత, సాహిత్య, వాద్య, నృత్య, విజ్ఞాన సర్వస్వమైన నాట్యశాస్త్రాన్ని రచించిన భరతముని, అభినయదర్పణ కర్త నందికేశ్వరాదులు సూచించిన సూత్రాలను అనుసరించి ప్రదర్శించే నాట్యం ‘మార్గ’మవుతుంది. భరతుడి నాట్యశాస్త్రంలోని ‘ఆంధ్రి’ అన్న పదం ద్వారానూ, ప్రవృత్తి అధ్యాయంలో దాక్షిణాత్యులు బహు నృత్త, గీత, వాద్య, లలితాభినయ ప్రియులనీ పేర్కొనడాన్ని బట్టి క్రీస్తుశకం ఆరంభం నాటికే తెలుగునాట ఉన్నతమైన నాట్యవ్యవస్థ ఉందని అర్థమవుతుంది. ఇక ఆయా దేశీయ, ప్రాంతీయ ప్రవృత్తి భేదాలతో కలసి ప్రదర్శితమయ్యేది ‘దేశీ’ నృత్యం. ఈ దేశీ నృత్యాలను, నృత్య విధానాలను కూడా మతంగుడు, జాయపాదులు గ్రంథస్థం చేశారు. ఇలా తెలుగునేల మీద శతాబ్దాలుగా మార్గ దేశీ నృత్యాలు రెండూ సమాంతరంగా ప్రవర్ధిల్లుతూ వచ్చాయి. అలాగే.. లలితకళలైన సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం, శిల్పాలన్నీ పరస్పరం అనుసంధానమై, పరస్పర ప్రేరకాలై ఒక కళపై మరొక కళ ఆధారపడి సమ్మిళితమై సమష్టిగా అభివృద్ధి చెందాయి.
      తెలుగునాట అభివృద్ధి చెందిన నాట్యరీతులను గురించి తెలిపే చారిత్రక ఆధారాల్లో సాహిత్యం, శిల్పాలు, రాజుల శాసనాలు ముఖ్యమైనవి. తెలుగువారి నృత్యాలను స్థూలంగా గిరిజన, జానపద, ఆరాధన, ఆలయ, రాజాస్థాన నృత్యాలు, ప్రదర్శనా కళారూపాలుగా విభజింపవచ్చు.
అడవి బిడ్డల అడుగుల్లో...
నెమలి పింఛంతో తయారుచేసిన తలపాగా, గొర్రెపోతు కొమ్ములు అమర్చిన తలపాగాలు లాంటి సహజ అలంకారాలతో ఆదివాసీలు నృత్యం చేస్తారు. గిరిజన నృత్యాల్లో కొన్నింటిని స్త్రీలు మాత్రమే చేస్తారు. మరికొన్ని నృత్యాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ పాల్గొంటారు కానీ జంటలుగా కలవరు. వీరి నృత్యాల్లో వినోదం కోసం చేసే వాటికన్నా కొండదేవతలను కొలుస్తూ చేసేవే ఎక్కువ.
      ఈ గిరిజన నృత్యాలన్నీ దాదాపుగా సామూహికంగానే ఉంటాయి. స్త్రీలు చేసే నృత్యంలో ఓ ప్రత్యేకపద్ధతిలో ముందుకు  ఐమూలగా నాలుగు అడుగులు వేసి, అదే పద్ధతిలో ఒక అడుగు వెనక్కు వేస్తారు. వలయాకారంలో చేరి అందరూ ఒకేసారి కేంద్రస్థానానికి వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లటం లాంటి కదలికలతో నృత్యాలు సాగుతాయి. తుండి, మోరి, కిరిడి, తుడుం, డప్పు మొదలైన సాంప్రదాయ వాద్యాల సహకారంతో వీళ్లు లయబద్ధంగా నృత్యం చేస్తారు. రెండు వరసల్లో నిల్చొని.. వెనక ఉన్నవారు ముందున్నవారి భుజాల మీద చేతులు ఉంచి కుడి, ఎడమవైపులకు, ముందుకు, వెనుకకు కదులుతుంటారు. ఈ నృత్యాలు అందరినీ అలరించటమేకాకుండా గిరిజనుల మధ్య సఖ్యతను, సుహృద్భావాన్ని పెంపొందిస్తాయి. పండగలు, పర్వదినాల్లోనూ, వేడుకల్లోనూ వీటిని ప్రదర్శిస్తారు. తెలుగు నేలపై జానపద నృత్యాలకు దీటుగా అనేక నృత్యాలను రూపొందించారు. గోండుల గుస్సాడి, చెంచు, కోయ, లంబాడీ, థింసా, గొండ్లి, జోడియా, కొరవంజి నృత్యాలు, దొమ్మరాటలు లాంటివి తెలుగునాట ప్రసిద్ధ గిరిజన నృత్యాలు.
జానపద నృత్యవైభవం
పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించే జానపద కళారూపాల్లో కూడా సంగీత సాహిత్యాలు, ఆహార్యాభినయాలు, వాద్య నృత్యాలున్నాయి. ఈ జానపద నృత్యాల్లో ఔత్సాహికులందరూ స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా పాల్గొంటారు. ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ ఎన్‌సైక్లోపీడియా’లో చెప్పినట్టు ‘‘జానపద సంగీత, నృత్యాలు ప్రజల్లో పుట్టిపెరిగి, వారి నిత్యజీవితంతో పెనవేసుకుపోయాయి. ఒక జాతి భావాలు, స్వభావాలు, ఆశలు, ఆశయాలు సునాద రూపంలో ఉప్పొంగిన అప్రయత్న ఆశుధారే జానపద సంగీత నృత్యాలు’’. కరచరణగ్రీవాది ఆంగికాభినయంతో, హృద్యమైన ఆహార్యాభినయంతో, చక్కని రూపసంపదతో జానపదులు చేసే నృత్యాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి.
      చిందు భాగవతం, ఒగ్గుకథ, యానాది భాగవతం, రకరకాల పగటి వేషాలు తదితరాల్లో వాచికాభినయం కూడా ప్రదర్శనానుగుణ్యంగా, సహజధోరణిలో మృదుమధుర సంభాషణలతో, ప్రాదేశిక మాండలిక పదజాలంతో ఉండి ప్రేక్షకులకు రసానందాన్ని కలిగిస్తుంది. జానపద కళారూపాల ప్రదర్శకులు తమ సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తితో పుట్టిన హాస్యంతో ప్రేక్షకులను రంజింపజేస్తారు. నాటి నుంచి నేటి వరకు బహుళ ప్రచారం పొందిన జానపద కళారూపాల్లో ఒగ్గుకథ, జముకుల కథ, జంగం కథ, బుర్రకథ, హరికథలు కథారూప ప్రయోగాలకు సంబంధించినవి. ఈ కళారూపాల్లోని కథలు, మాటలు.. రగడలు, దరువులు, వెలలు, ధవళాలు, అర్ధచంద్రికల్లా దేశీసాహిత్య లక్షణాలతో ఉంటాయి. ఇవే కాకుండా పిచ్చుకుంట్ల కథలు, రుంజ కథలు, వీరముష్ఠివారి కథలు, శారద కథలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట వివిధ దేవజాతర్లు,  ఊరేగింపులు, ఉత్సవాల్లో ప్రదర్శించే తప్పెటగుళ్లు, రొంజువాద్యం, కోలాటం, ఒగ్గుడోలు, డప్పు, కొమ్ముబూర నృత్యాలు, చెక్కభజనలు వాద్య సహితంగా చేసే నృత్యాల విభజనలోకి వస్తాయి. ఈ వాద్యాలతో జనించే గంభీరనాదం లయబద్ధంగా ఉండి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ నృత్యాలు విన్యాసాలతో కూడి ఉంటాయి. ప్రదర్శనలో ముందుగా ప్రార్థన అయ్యాక.. నృత్యం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. లయబద్ధమైన అడుగుల వరసలతో.. వాద్య, నృత్య, గాన సమ్మేళనంతో కథాగమనం సాగుతుంది. ఈ కథారూపాలను అనేక బాణీల్లో పాడతారు. కథలోని పాటకు పాటకు మధ్య కథనాన్ని రాగయుక్తమైన వచనంలో చదువుతారు. బహుశ ఇది యక్షగాన ప్రక్రియల నుంచి దిగుబడి చేసుకున్న ప్రక్రియల్లో ఒకటి కావచ్చు. అన్ని కథలూ దాదాపుగా పౌరాణిక ఇతివృత్తాలే అయినప్పటికీ కొన్ని సాంఘిక, చారిత్రక ఇతివృత్తాలు కూడా ఉంటాయి.
      స్త్రీలు మాత్రమే పాల్గొనే ఆరాధనా నృత్యాలైన బతుకమ్మ, గొబ్బెమ్మలూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక దీపమైన బతుకమ్మను వర్షరుతువులో ఆశ్వయుజమాసం శరన్నవరాత్రుల్లో జరుపుతుంటారు. ఆ సమయంలో పండి ఒంగిన జొన్నచేలూ, పచ్చగా పెరిగిన పైరు సంపద, విరబూసిన పూలతో ప్రకృతి అంతా సౌందర్యవంతంగా ఉంటుంది. బంతి, చామంతి, తంగేడు లాంటి రకరకాల పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. స్త్రీలు ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, వంగుతూ, లేస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’’ తదితర పాటలు లయబద్ధంగా సాగుతూ, నృత్యానికి అనువుగా ఉంటాయి. ఇక ఆంధ్రప్రాంతంలో గొబ్బి నృత్యం భోగి పండగనాడు చేస్తారు. గోమయాన్ని గొబ్బెమ్మ ఆకారంలో చేసి ముగ్గు వేసిన పీట మీద నిలిపి, దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి, దానిచుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ నర్తిస్తారు. ‘‘ఆనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బియ్యళ్లో’’ అనే పాట చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకమైన సామూహిక నృత్యాల ద్వారా ప్రజలు అరమరికలు లేకుండా నిర్మలమైన మనసులతో, నిష్కల్మషమైన ప్రేమలతో ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. ప్రాంతీయ ఆచారాలు, ఆధ్యాత్మిక చింతనలూ, ఆరాధనలూ, ఇంకా ప్రాచీన సంస్కృతీ చిహ్నాలైన ఈ నృత్యాలు ఓ విశిష్ట నర్తన రీతులుగా నిలుస్తున్నాయి.
వైదిక, ఆలయ నృత్యాలు 
యజ్ఞయాగాదులు, వ్రతాల సందర్భంలో దేవతలను ఆహ్వానిస్తూ స్త్రీలు చేసే నృత్యాలను వైదిక నృత్యాలంటారు. వేదకాలం నుంచి ఉన్న ఆచారవిధులకు సంబంధించినవి ఇవి. మహావ్రత సందర్భంలో స్త్రీలు వీణానాదానికి అనుగుణంగా దేవతలను ఆహ్వానిస్తూ చేసే నృత్యాల ప్రస్తావన వేదాల్లో ఉంది. తెలుగునేల మీది ప్రముఖ దేవాలయాలన్నింటిలోనూ అర్చామూర్తులను నాట్యసేవతో అర్చించారు. దేవాలయాల్లో మూలవిరాట్టుకు ఎదురుగా ఉండే మండపంలో అర్చామూర్తి మేలుకొలుపు సేవ నుంచి ధ్యాన, ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్యాది సేవలు మొదలు పవళింపుసేవ వరకూ ఆలయ అర్చకులు నిర్వహించే సేవల్లో తమ నృత్యం ద్వారా భగవంతుణ్ని ఆరాధిస్తారు దేవదాసీలు. జైమినీ అశ్వమేథ పర్వంలో ‘‘నృత్యతాం గాయతాంచైవ నానా వాద్య ప్రకుర్వతాం, యథా సంతుష్యతో దేవో నా ధ్యానదైరితి శ్రుతమ్‌’’ అని చెప్పారు. అంటే, ప్రజలు నృత్యం చేస్తూ, వివిధ రకాలైన సంగీత వాద్యాలను పలికిస్తూ, గానం చేస్తూ భగవంతుని స్తుతిస్తూంటే ధ్యానాది పారమార్థిక సాధనాల ద్వారా చేసే అర్చనకన్నా భగవంతుడు సంతుష్టుడవుతాడని భావం. భగవదారాధనలో ఆధ్యాత్మిక సాధన కన్నా కళలకే ప్రాముఖ్యం దక్కింది. 
      ఆలయ నృత్యాల్లో నృత్త ప్రాధాన్యమున్న అష్టదిక్పాలక ఆరాధనా నృత్తాలు, బలిహరణ, నవసంధి నృత్తాలు, కౌత నృత్యాలు ప్రధానమైనవి. ఇవి మూలవిరాట్టుకు ఎదురుగా ప్రదర్శితమవుతాయి. వీటిని ప్రదర్శించడానికి శిక్షణ పొంది, భగవదంకితమైన దేవదాసీలకు మాత్రమే అర్హత ఉంటుంది. ఈ దేవదాసీలు చేసే మరో నృత్యం కేళికలు. ఇవి ఆలయంలోనే కళ్యాణమండపం దగ్గర ఉత్సవ మూర్తుల సన్నిధిలో చేసే నృత్యాలు. దేవాలయాల్లో బయట రంగమండపంలో ప్రజల వినోదార్థం భామాకలాపం, జావళీల్లాంటి అంశాలను కూడా దేవదాసీలు ప్రదర్శించేవారు. ఒక ఆలయంలో దేవదాసీలా నియామకం పొందాలంటే, ఆమె కఠోర శిక్షణను పొందాల్సి ఉంటుంది. కేవలం నృత్యమే కాక అమరకోశం, అభినయం, సంగీతం, వేదం, స్మృతులు, పురాణాలు, భరతశాస్త్రం, అలంకారశాస్త్రం, రసశాస్త్రం, సంగీతాలను కూడా వీరు క్షుణ్నంగా అభ్యసిస్తారు. అందుకే వారిని పరిపూర్ణ కళాకారిణులుగా సంబోధిస్తారు. ఇరవయ్యో శతాబ్దంలో పేరెన్నికగన్న దేవదాసీమణుల్లో చిత్తజల్లు లక్ష్మీకాంతం, వైదేహి, సరిదె లక్ష్మీనరసమ్మ, అన్నాబత్తుల బులి వెంకటరత్నం, పందిరి వెంకటరత్నం ముఖ్యులు. భగవదారాధనలో కళలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలుసుకున్న శాతవాహనులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు వినూత్న వాస్తుకల్పనతో దేవాలయాలు నిర్మించారు. ఆ సుందర దేవాలయాల్లో భగవదారాధన కోసం  దేవదాసీలను నియమించారు. వారి పోషణార్థం మాన్యాలను సమకూర్చారు. గృహసముదాయాలను, ఆరామాలను నిర్మించారు. ఈ విషయాలను రూఢిపరచే అనేక శాసనాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. అయితే.. ఈ దేవదాసీ వ్యవస్థ 1925 ప్రాంతంలో రద్దయ్యింది.  
రాజాస్థానాల్లో... 
దేవాలయాల్లో ‘శుద్ధ’ పద్ధతి లేదా ‘మార్గ’ పద్ధతికి చెందిన నాట్యం అభివృద్ధి చెందినట్లే, దానికి సమాంతరంగా కళాభినివేశం, అభిరుచి కలిగిన రాజుల ఆస్థానాల్లో ప్రదర్శించడానికి వీలుగా ‘కేళికలు’ రూపొందాయి. వీటికే ‘కచ్చేరి ఆట’, ‘దర్బారు ఆట’ అని వివిధ నామాంతరాలున్నాయి. నేటి ‘భరతనాట్యం’ ఈ సంప్రదాయానికి చెందిన నృత్యమని పండితుల అభిప్రాయం. ఇది కేవలం స్త్రీలు మాత్రమే నర్తించే నట్టువమేళ సంప్రదాయాలకు చెందిన కళ. దేవాలయాల్లో దేవదాసీగా నియమితులయ్యే వారు ఎంత కృషి చేయాలో రాజనర్తకిగా స్థిరపడేందుకు అంతే కృషి చెయ్యాలి. రాచకొలువులో ఈ నర్తకీమణులకు ప్రత్యేకస్థానం దక్కేది. సర్వశాస్త్ర నిష్ణాతులై, మహాపండితులైన నాట్యాచార్యుల దగ్గర శిక్షణపొంది తెలియని విషయమంటూ ఉండదనేంతటి విశిష్టతను గడించుకునేవారు వీరు. ఆయా కాలాల్లో, ఆయా రాజుల అభిరుచులకు అనుగుణంగా ఆస్థాన విద్యలో కొత్త కొత్త కళారీతులను ఎన్నో సృష్టించి ప్రభువుల మన్ననలకు పాత్రులయ్యేవారు. ఒక్కోసారి సాహిత్యంలో అభినివేశం కలిగిన రాజుల రచనలకు సైతం అభినయాన్ని జోడించి నర్తించి అలరించేవారు. ఇలాంటి వారిలో రెడ్డిరాజుల కాలం నాటి లకుమాదేవి సుప్రసిద్ధురాలు.
భాగవత సంప్రదాయం
ఇది పురుషులు మాత్రమే నర్తించే ‘నాట్యమేళ’ సంప్రదాయానికి చెందింది. తెలుగువారి కళా విణ్నానానికి కూచిపూడి భాగవత సంప్రదాయం ఓ నిదర్శనం. సంస్కృతాంధ్ర భాషలను నేర్చి, కూలంకషమైన విజ్ఞాన సంపత్తి కలిగిన వారు భాగవతులు. కృష్ణాజిల్లాలోని కూచిపూడిలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వీరు ఈ గ్రామాన్ని నాటి కుతుబ్‌షాహీ వంశ ప్రభువైన అబుల్‌ హసన్‌ తానీషా నుంచి అగ్రహారంగా పొందారు. సంచార ప్రదర్శనల ద్వారా హైందవ సంస్కృతిని ఈ భాగవతులు ప్రచారం చేశారు. ఉషాపరిణయం, గిరిజాకళ్యాణం, భక్తప్రహ్లాద లాంటి అనేక యక్షగానాలు, భామ, గొల్ల వంటి కలాపాలతో ఈ నాట్యం సుసంపన్నమైంది. లౌకిక, ఆధ్యాత్మిక రంగాలను మేళవిస్తూ, జాతి విశిష్టతను, ఔన్నత్యాన్ని ప్రకటించేలా ఈ ప్రదర్శనలు ఉంటాయి. 
      పందొమ్మిదో శతాబ్దంలో కూచిపూడి నాట్యాన్ని సముద్ధరించిన వాళ్లలో చింతా వెంకటరామయ్య, వెంపటి వెంకట నారాయణ, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి ముఖ్యులు. కూచిపూడి నాట్యాన్ని తన నృత్యనాటికల ప్రదర్శనలతో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనులు ‘పద్మభూషణ్‌’ వెంపటి చినసత్యం. యక్షగానాలు, కలాపాలే కాకుండా అన్నమాచార్య, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, త్యాగయ్య సారంగపాణి లాంటి పదకర్తల రచనలకు కూడా ఆంగిక, సాత్త్వికాభినయాలను జోడించి ఈ నాట్యం మరింత పరిపుష్టమైంది. వేదాంతం, వెంపటి, చింతా, హరి, పసుమర్తి, కోరాడ, భాగవతుల, యేలేశ్వరపు, మహంకాళి.. ఇలా అనేక వంశాలవారు తరతరాలుగా వంశపారంపర్యంగా కూచిపూడి నాట్యాభివృద్ధికి ఇతోధికంగా కృషిచేశారు. కూచిపూడి భాగవతులు పగటివేషధారణలో కూడా సిద్ధహస్తులే. అసమానమైన ఆంగికాభినయం, సమ్మోహనపరచే సాత్త్వికాభినయం, పటిమగల వాచికాభినయం, అబ్బురపరచే ఆహార్యాభినయాలతో కూచిపూడి నాట్యం తెలుగువారికే తలమానికమైంది. ‘పద్మశ్రీ’ వేదాంతం సత్యనారాయణ శర్మ, పసుమర్తి వేణుగోపాలశర్మలు ప్రదర్శనలతోనూ, గురుత్వంలోనూ వాసికెక్కగా వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, చినసత్యం, వేదాంతం వీరరాఘవయ్యలు సినీపరిశ్రమలోనూ రాణించారు. తెలంగాణలో కూచిపూడిని వ్యాప్తి చేసినవారిలో భాగవతుల రామకోటయ్య ప్రథములు. భాగవతేతరుల్లో యామిని కృష్ణమూర్తి, సుమతీ కౌశల్, రత్నపాప, స్వప్నసుందరి, రాజారెడ్డి, రాధారెడ్డి, అలేఖ్య, శోభానాయుడు, బాలకొండలరావు ప్రముఖులు.
పేరిణి... ఆంధ్రనాట్యం
కాకతీయుల నాటి నృత్త విధానాన్ని రుద్రదేవుని గజసైన్యాధిపతి జాయప సేనాని తన ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. ఆ గ్రంథాన్ని, తదితర నాట్యశాస్త్రాలను, నాట్యప్రదర్శనారీతులను నటరాజ రామకృష్ణ క్షుణ్నంగా పరిశోధించారు. మరుగునపడిన నాటి నృత్యాలను పునరుద్ధరిస్తూ, ‘ఆంధ్రనాట్యం’ అని నామకరణం చేశారాయన. కాకతీయుల నాటి శిల్పాల్లో ద్యోతకమయ్యే పేరిణి తాండవం, పేరిణిలాస్యం, పిఠాపుర ప్రాంతంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నవజనార్దన పారిజాతం లాంటి నృత్యాలనూ వెలుగులోకి తెచ్చారు. పేరిణి తాండవాన్ని పురుషులు ప్రదర్శిస్తే, లాస్యాన్ని స్త్రీలు చేస్తారు. 
      కాకతీయుల కాలం నాటి పేరిణి తాండవం.. యుద్ధానికి సన్నద్ధులయ్యే సైనికులను ఉత్తేజపరిచే నృత్యం. ఇందులోని భంగిమలు, ముద్రలు తదితరాల మీద వీరశైవ సంప్రదాయాల ప్రభావం కనిపిస్తుంది. పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు లాంటి వారి రచనల్లో పేరిణి ప్రస్తావనలున్నాయి. కాలగతిలో కనుమరుగైపోయిన ఈ అపూర్వ నాట్యరీతికి రామప్ప దేవాలయ శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణ తిరిగి ప్రాణంపోశారు. తన శిష్యులకూ నేర్పించారు. పేరిణి తాండవం, లాస్యం, ఆంధ్రనాట్యాల్లో కళాకృష్ణ, పేరిణి ప్రకాశ్, భీమన్, రతన్‌కుమార్, శ్రీనివాస్, కుమార్, రమేశ్, డా।। సువర్చల ప్రసిద్ధులు. ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నవతరానికి పేరిణిలో శిక్షణ ఇస్తున్నారు. 
సాహిత్యంలో అందెల రవళి
తెలుగువారి నృత్యసాహిత్యంలో తొలుత పేర్కొనాల్సింది నందికేశ్వర ప్రణీత ‘అభినయదర్పణం’. 324 శ్లోకాలతో ఉండే రచన ఇది. ఇక జాయప సేనాని రచించిన మహత్తర గ్రంథం ‘నృత్త రత్నావళి’. సంగీత, నృత్య, సాహిత్య, శిల్పకళలను అధికంగా ఆదరించిన కాకతీయ ప్రభువుల పాలనలో జాయప గజసైన్యాధ్యక్షుడు. పశ్చిమ చాళుక్య రాజైన మూడో సోమేశ్వరుడు ‘అభిలాషార్థ చింతామణి’ అనే నాట్యశాస్త్రాన్ని రచించాడు. విజ్ఞాన సర్వస్వంగా ఎన్నదగిన ఈ గ్రంథానికి ‘మానసోల్లాసమ’నే పేరు కూడా ఉంది. ఆంగికాభినయంలో వినియోగించే శరీర అంగ, ఉపాంగ, ప్రత్యాంగాల కదలికలు, భేదాలు, తద్వివరణలు ఇందులో ఉంటాయి. క్రీ.శ.1300 కాలానికి చెందిన రేచర్ల వంశస్థుడు, రాచకొండ ప్రభువు సింహభూపాలుడు ‘రసార్ణవ సుధాకరమ’నే గ్రంథాన్ని రచించాడు. ఇందులో నర్తనాధ్యాయమనే పేర నృత్యశాస్త్ర విషయాలు పొందుపరచాడు. ఇక పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్ర’లో నాడు ప్రచారంలో ఉన్న వెడయాటలు, చిందు, కోడంగి యాటలు, పేరిణి, బహురూపాలు, గడలయాట లాంటి అనేక దేశీ నృత్యాలు కనిపిస్తాయి.  
      శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో రాయబారిగా సేవలందించిన భండారు లక్ష్మీనారాయణ ‘సంగీత సూర్యోదయ’మనే శాస్త్రాన్ని రచించాడు. లక్ష్మణ భరతమనే నామాంతరం ఉన్న ఈ గ్రంథంలోని రెండో అధ్యాయం నృత్యాధ్యాయం. పోలూరి గోవిందకవి ‘రాగతాళ చింతామణి’, చిల్లకూరి దివాకర కవి ‘భరతసార సంగ్రహము’, లింగంగుంట మాతృభూత కవి ‘అభినయ దర్పణము’ తదితరాలు తెలుగులో వచ్చిన నృత్యశాస్త్రాలు. 
      నృత్యశాస్త్రాలను సూత్ర, యోగాల సహితంగా చెప్పిన రచనలను అలా ఉంచితే.. తెలుగునాట సుప్రసిద్ధ కవులు ఆనాడు వ్యాప్తిలో ఉన్న నృత్యరీతులను తమ రచనల్లో సందర్భానుసారం పేర్కొనడం విశేషం. ఆదికవి నన్నయ్య మొదలు విరాటపర్వంలో బృహన్నల, ఉత్తరల నాట్య విన్యాసాన్ని వర్ణించేచోట తిక్కన నాడు తెలుగుదేశములో ప్రాచుర్యంలో గల అనేక దేశీ నృత్యాలను ప్రస్తావించాడు. సంస్కృత మహాభారతంలో వీటి ప్రస్తావన లేదు.
      ‘‘ఒండు పనులకు సెలవు లేకునికిఁ జేసి/ యభ్యసించితి శైశవమాదిగాఁగ/ దండలాసక విధమును గుండలియును/ బ్రేంఖణంబు తెఱంగును బ్రేరిణియును’’ అంటూ నాడు ప్రచారంలో ఉన్న దండలాసిక, కుండలీ, ప్రేంఖణం, పేరిణి నృత్యాలను తిక్కన మహాభారతాన్ని తెనుగించినపుడు చేర్చాడు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో శివతాండవ ప్రశంస చేశాడు. నాచన సోమన ఉత్తర హరివంశంలో దేశీ నృత్య సంప్రదాయాలను సమయోచితంగా దేవతలకు ఆపాదించి వర్ణించాడు. పన్నగరాజు పేరణం, ఆకాశలక్ష్మి కోలాటం, వరుణుడు గొండ్లి, కమల సంభవుడు ప్రేంఖణ నృత్యమాడినట్లు చెప్పాడు. ‘‘కుండలీ దండలాసకి ప్రేరిణీ ప్రేంఖణ సింధు కందుక ధమాళి చేల మత్తల్లీ హల్లీసకాది నృత్యంబులవలోకించుచూ’’... అని భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు నాటి దేశీ నృత్యాలను పేర్కొన్నాడు. కాశీఖండంలో కూడా నాటి దేవదాసీల నృత్యాన్ని శ్రీనాథుడు ఉట్టంకించాడు. అలాగే, పల్నాటి వీరచరిత్రలో రాజాస్థాన నృత్యాలు, వాటి ప్రదర్శనారీతులు, శాస్త్రరీతులను విపులముగా వివరించాడాయన. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొఱవి గోపరాజు శివపూజా సమయంలో చేసే నృత్యాలను అత్యద్భుతంగా వర్ణించాడు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో భ్రూకుంసుల (స్త్రీ వేషం ధరించి నృత్యం చేసే పురుషులు) గురించి చెప్పాడు. ఇక నాయకరాజుల్లో అచ్యుతప్పనాయకుడు, రఘునాథనాయకులు ముఖ్యులు. తంజావూరు ప్రాంతానికి వలసవెళ్లి తమ యక్షగాన ప్రదర్శనలతో మెప్పించిన తెలుగు భాగవత కుటుంబాల బ్రాహ్మణులకు అచ్యుతప్పనాయకుడు కొన్ని గ్రామాలను దానమిచ్చినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అపర శ్రీకృష్ణ దేవరాయలుగా ఖ్యాతికెక్కిన రఘునాథనాయకుడు పారిజాతాపహరణాన్ని పద్యప్రబంధంగా ఆశువుగా చెప్పాడని ప్రతీతి. గజేంద్రమోక్షం, రుక్మిణీ కృష్ణ వివాహం, జానకీ పరిణయాలనే నృత్యానుకూల యక్షగానాలను ఈయన రచించాడు. ఇతని కుమారుడు విజయరాఘవ నాయకుడు ఏకంగా 23 యక్షగానాలను సృజించాడు. శృంగార రసభూయిష్టమైన విజయరాఘవుడి రచనలు ప్రదర్శనానుకూలమైనవి.
శిల్పాల్లో తాండవించిన నృత్యం
ప్రాచీన దేవాలయాలు, బౌద్ధ స్థూప, చైత్యాల మీద కనిపించే వివిధ నృత్య శిల్పాల ద్వారా నాటి నాట్య వైభవాన్ని గుర్తించవచ్చు. నర్తకీమణుల కోలాటాది నృత్య భంగిమలతో పాటుగా భరతముని ప్రణీత నాట్యశాస్త్రంలోని వివిధ కరణాలు, పిండీబంధాల శిల్పాలు అప్పటి వారి నాట్యకౌశలాన్ని విశదపరుస్తాయి. విశేషించి దేవాలయ కుడ్యాల మీద నటరాజు, నృత్తగణపతి, కాళీయమర్దన తాండవ కృష్ణుడు.. ఇలా వివిధ దేవతలు అనేక భంగిమల్లో ఆభరణాది అలంకరణలతో మనోహరంగా చిత్రితమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరులోని నవబ్రహ్మదేవాలయాలు, రామప్ప దేవాలయం, నల్లగొండ జిల్లా పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున దేవాలయం, అమరావతి బౌద్ధస్థూపం, విజయవాడ మొగల్రాజపురంలోని గుహాలయాలు ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయం, తిరుమల దేవస్థానం.. ఇలా తెలుగునేల మీది మరెన్నో ప్రాచీన ఆలయాలు విభిన్న నృత్యశిల్పాలతో అలరారుతున్నాయి. అలంపురంలో దేవాలయం మీది నటరాజ మూర్తి శిల్పాలు చతుర్భుజాలతోనూ, కొన్ని అష్టభుజాలతోనూ కనిపిస్తాయి. నటరాజమూర్తి తన కుడిపాదాన్ని అపస్మార పురుషుడిపై నిలుపుతాడు. అలంపురంలో మాత్రం ఆ పాదం పద్మం మీద కనిపిస్తుంది. చతురస్ర ఫలకం ఉన్న నటరాజ విగ్రహాన్ని కూడలి సంగమేశ్వర దేవాలయ గోడల మీదా చూడవచ్చు. ఇక్కడి కుడ్య శిల్ప నటరాజస్వామి చతుర తాండవం చేస్తుంటాడు. ఇక ఇక్కడి నృత్త గణపతి ఏమో లలిత నృత్త భంగిమలో ఉంటాడు. శ్రీశైల దేవాలయ కుడ్యాల మీదా నృత్య గణపతి శిల్పాలు అనేకం ఉన్నాయి. అక్కడే ఎలుకపై నృత్యం చేస్తున్న గణపతి శిల్పం కూడా కనిపిస్తుంది. పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం కుడ్యంపైగల నృత్యగణపతి శిల్పం కాళీయమర్దన కృష్ణుణ్ని అనుసరిస్తూ పాముతలపై నర్తిస్తున్నట్టుగా ఉంటుంది. 
      తాండవ కృష్ణుడి శిల్పాలూ చాలా దేవాలయాల్లో కొలువుదీరాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చినమరూర్‌ కోవెల గోడమీది కాళీయమర్దన తాండవ కృష్ణుడి శిల్పం రమణీయమైంది. అలాగే కర్నూలుజిల్లా ప్రాతకోటలోని తొమ్మిదో శతాబ్దానికి చెందిన నాగేశ్వరస్వామి దేవాలయంపైనా కాళీయమర్దన బాలకృష్ణుడి శిల్పం తాండవ భంగిమలో దర్శనమిస్తుంది. ఇదే జిల్లా మంచాలకట్టలో చాళుక్య శైలిలో నిర్మితమైన ఆలయ గోడ మీద అత్యంత రమణీయమైన, లాస్యయుతమైన జగన్మోహినీ నృత్యశిల్పం అబ్బురపరుస్తుంది. నాగార్జునకొండ తవ్వకాల్లో నాట్యశిల్పాలు లభించాయి. ఇక్కడ లభ్యమైన బౌద్ధ శిల్పాల్లో వీణను మీటుతున్న స్త్రీమూర్తి, బృందనృత్యం చేస్తున్న ముగ్గురు స్త్రీల శిల్పం, ‘సరసిక’ అనే రంగస్థల అధ్యక్షిణి ముద్రిక ముఖ్యమైనవి. అమరావతి బౌద్ధస్థూపాల్లో నృత్య శిల్పాలు అనేకం ఉన్నాయి. అన్నీ బృందనాట్య శిల్పాలే. బెజవాడ అక్కన్న మాదన్న గుహలకు కొద్దిదూరంలో ఉన్న జమ్మిదొడ్డి మండప స్తంభాలు, దూలాలు, గోడల మీద తొమ్మిదో శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల వాస్తు సంప్రదాయానికి చెందిన నాట్య చిత్రాలున్నాయి. అనంతపురంలోని లేపాక్షి దేవాలయ స్తంభాలు, కుడ్యాలపైనా వివిధ విన్యాసాలు చేస్తున్న నర్తకీమణుల శిల్పాలు కనిపిస్తాయి. ఇక రామప్ప దేవాలయం అయితే... కాకతీయ కాలపు నాట్యకళా వైభవానికి ప్రతిరూపమే. 
      ‘‘రాజా, రాధల్లో నేను భారతదేశం మొత్తం చూశాను’’... రాజారెడ్డి, రాధారెడ్డిల కూచిపూడి నృత్యానికి మైమరిచిపోయిన ఫైడెల్‌ కాస్ట్రో నాటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాస్తూ అన్న మాటలివి. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన అప్పటి ఈ క్యూబా అధినేత  రాజా, రాధల ప్రదర్శన చూసి అబ్బురపడ్డారు. తర్వాత వాళ్లని తమ దేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ, మూడు రోజుల పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. వాటికి ఆయన స్వయంగా హాజరయ్యారు కూడా. తెలుగువారి నృత్యకౌశలాన్ని దిగంతాలకు చాటిన సందర్భమిది. ఇంకా ఎంతోమంది తెలుగు కళాకారులు విభిన్న నృత్యరీతుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. తెలుగుజాతి చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలకు సాక్షీభూతాలైన వివిధ నృత్యాలను కాపాడుకుంటూ వస్తున్న కళాకారులందరూ ప్రశంసనీయులే.


వెనక్కి ...

మీ అభిప్రాయం