జయహో జానపదం

  • 2516 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తిరునగరి దేవకీదేవి

  • విశ్రాంత ప్రధానాచార్యులు
  • హైదరాబాదు
  • 9949636515
తిరునగరి దేవకీదేవి

‘‘తెలుగు జానపద రచనలను సంపుటాలుగా వెలువరించదలిచిన, కనీసం కొన్ని వేల సంపుటాలనైనా ప్రచురించవలిసి యుంటుంది’’ అన్నారు ఎల్లోరా. అవును, నిజమే! అవి అసంఖ్యాకం. తెలుగువారి ఆచార వ్యవహారాల నుంచి ఆహారపుటలవాట్ల వరకూ... విశ్వాసాల నుంచి సంఘ జీవితానికి సంబంధించిన నైతిక ప్రమాణాల వరకూ... సరదాల నుంచి అధిక్షేపాల వరకూ ఈ జానపద గేయాల వస్తువైవిధ్యం అబ్బురపరుస్తుంది. 
జనపదంలో/
పల్లెటూరిలో నివసించేవారే జానపదులు. ఈ జానపదుల నుంచి ఆశువుగా వెలువడి మౌఖిక ప్రచారంలో ఉన్నదే జానపద వాఙ్మయం. అదేక్రమంలో వారు ఆశువుగా చెప్పిన గేయాలే జానపద గేయాలు. కాలక్రమంలో శిష్టులు కలం పుచ్చుకుని కాగితం మీద భద్రపరుస్తోన్న గేయాలూ జానపద గేయాలయ్యాయి. నిజానికి జానపద గేయాలకు నిర్దేశిత కవిగానీ కవయిత్రిగానీ ఉండరు. గేయానికి నియమిత స్వరూపముండదు. రచనా కాలాన్ని ఇదమిత్థంగా చెప్పలేం. గేయ ప్రచారం మౌఖికంగా సాగుతుంది. అందువల్ల గేయాలు మార్పునకు లోనవుతాయి. సహజ శైలి గలవై గానయోగ్యంగా ఉంటాయి. ఆశు రచన అయిన గేయం వస్తువు జనసామాన్యానికి తెలిసినదై ఉంటుంది. రచన రసవత్తరంగా సాగుతుంది. పునరావృతాలు గానానుకూలంగా హ్రస్వం దీర్ఘం కావటం, దీర్ఘం హ్రస్వం కావటం లాంటి మార్పులు సహజం. బిరుదురాజు రామరాజు ఈ జానపద గేయాలను ‘పౌరాణిక, చారిత్రక, మతసంబంధ, పారమార్థిక, స్త్రీల, పిల్లల, శృంగార, అద్భుత, కరుణ, హాసగేయాలని’ పలు రకాలుగా విభజించారు. అయినప్పటికీ ఓ విభాగంలోకి మరో విభాగం చొచ్చుకుని వచ్చే అవకాశం ఈ గేయాల్లో సర్వసాధారణం.
      సీతారాములతో కలిసి పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసానికి వెళ్లిన లక్ష్మణుడు ఏకంగా ఊర్మిళ అంతఃపురంలో ప్రవేశించాడు. అంతకాలమూ నిద్రిస్తున్న ఊర్మిళ కళ్లను మూసి ‘‘కొమ్మ నీ ముద్దు ముఖము సేవించకోరినాడే చంద్రుడు’’ అని తన విరహతాపాన్ని వ్యక్తం చేశాడు. ఊర్మిళకు ఆ సంఘటన భయం కలిగించింది. అందుకే, ‘‘అయ్య మీరెవ్వరయ్యా యింత యాగడమ్మునకొస్తిరి’’ అంటూ జానపద శైలిలో ‘‘ఎవ్వరూ లేని వేళ ఏకాంతమున కొస్తిరీ.../ మా తండ్రి జనకరాజు వింటే మిము ఆజ్ఞసేయకా మానరు,/ మాయక్క బావ విన్నా మీకిపుడు ప్రాణమునకు హానివచ్చు,/ మా యక్క మరిది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో’’ అంటూ లక్ష్మణున్ని బెదిరిస్తుంది. ఈ మాటల్లో ఊర్మిళకు తండ్రి, అక్కాబావల పట్ల గల గౌరవంతోపాటు తన పట్ల తప్పుగా నడుచుకున్నవారిని శిక్షించగలరన్న విశ్వాసం కనబడుతుంది. కథ పౌరాణికమైతే భావం జానపదులది.
జీవితాలకు ప్రతిబింబాలు
‘‘పసుపు చెట్టున్నాది బ్రాహ్మణుల వీధి, సురసాల యున్నది శూద్రుల వీధి/ విరజాజి యున్నది కోమటివీధి పువుతోటయున్నది శివభక్తవీధి/ పాలమ్రానున్నది శీలవంతులవీధి కలపొన్న యున్నది కంసాలివీధి/ చామంతి యున్నది జంగాలవీధి మొగిలిచెట్టున్నది వెలమల వీధి’’ అంటూ శివుడు వెళ్లిన వీధులన్నిటినీ పేర్కొని చివరిగా ‘చందనంబున్నది జాలారి వీధి’ అని హాస్యస్ఫోరకంగా పాడుకోవటంలో వీధుల పూల పొందికను అభినందించాల్సిందే. ‘‘ఏటికేతంబట్టి ఎయిపుట్లు పండించి/ ఎన్నడూ మెతుకెరుగనన్నా - గంజిలో మెతుకెరుగనన్నా’’ అనే పాటలో ఓ సన్నకారు రైతు ఏతంతో నీళ్లు తోడి ఎంతో శ్రమించి వెయ్యిపుట్ల ధాన్యం పండించినా ఏ రోజూ అన్నం కాదు కదా.. గంజిలో మెతుకును కూడా చూడలేక పోయానని దీనంగా పాడుకుంటున్నాడు. అతని వెత అంతటితో ఆగలేదు. పొద్దంతా కాయకష్టం చేసి ‘‘కాల్జేయి కడుక్కోని కట్టమీన కూసుంటె కాకి తన్నీపాయెరన్నా! కాకిపిల్లా తన్నిపాయెరన్నా!’’ అని దుఃఖిస్తున్నాడు. ఏ భూస్వామికైతే వెయ్యిపుట్లు పండించినాడో అదే భూస్వామి, అతని కొడుకూ ఏదో తప్పును వెతికి దేహశుద్ధి చేసిన విషయాన్ని కాకి, కాకిపిల్లా అని ప్రతీకాత్మకంగా పాడుకుంటున్నాడని బిరుదురాజు రామరాజు అభిప్రాయపడ్డారు. నిజమే మరి భూస్వామి కొట్టాడని చెప్పుకునే ధైర్యం లేని పరిస్థితి అతనిది.
      ‘‘వజనాల (వజ్రాల) బండమీద వడ్లెండాపోసి- ఉల్లిపువ్వుల జల్లెడ- మల్లెల్ల చోట వడ్లోడు చేసినా, వన్నెలా గజము (రోకలి)- కమ్మరోడు చేసినా గంటల్ల పోసి- కుమ్మరోడు చేసినా కూటి కుందెనా- కుసుమ రోలు తుడిచి-  కుందెండ్ల పెట్టి కంకణాల చేత గజమందుకోని- ఉంగరాల చేత ఊది పోటేసి- ఒక్కదాని పోటు ఒనగూడదమ్మ - వదినెను లేపరా అన్న రఘురామ’’.. ఈ గేయం అనేక విషయాలను నిక్షిప్తం చేసుకుంది. వడ్లు బియ్యంగా మారడానికి దంపుడు చర్య- దానికి ఉపయోగపడే పనిముట్లు, ఆ పనిముట్ల వెనుక వివిధ వృత్తుల హస్తం, వడ్లు దంచే విధానం అన్నీ పది పాదాల్లో ఒదిగిపోయాయి. ఆనాటి వస్తు సముదాయాన్ని మనకు ఎంతో అందంగా పరిచయం చేస్తూనే చెల్లెలు అన్ననుద్దేశించి తనకు తోడుగా ఉంటుందని నిద్దురపోతున్న వదినను లేపమంటుంది. అన్న భార్యను సుకుమారంగా చూసుకుంటున్నాడేమో అందువల్ల ‘‘నా యాలిని లేపనే సగము నిద్దురల్ల’’ అంటాడు. దానికి ఆడబిడ్డ అలిగి అత్తారింటికి పోయిందట. కానీ వచ్చిన సమస్యేమంటే ఆమె ఇల్లు వదిలిన అయిదునాళ్లలో.. ‘‘బండి ఇరుసు ఇరిగె/ ఆలికే జెరమొచ్చి/ ఎద్దు కాలిరిగె’’- ఇన్ని పర్యవసానాలు. అన్న ఆందోళన పడ్డాడు. ఆ రోజుల్లో మంచి చెడులను ఎరుకలి వాళ్లతో సోది చెప్పించుకునే అలవాటుండేది. అలా అంగడికి పోయి చేయి చూపించుకుంటే ఆడబిడ్డ శోకం కీడు కలిగించిందని తేలింది. తప్పు తెలుసుకున్న అన్న ‘‘అంగడి తోవల్ల చీరె రైకల్లు - చిన్ని సొమ్ములు’’ కొని చెల్లెలు దగ్గరికిపోతాడు. ‘‘ఆది కాలంనాడు అన్న నా మాట- ఎదురు గుండెల నాకు ఇమ్మ(అమ్ము)యి మెరుసు’’ అంటూ ఇంటికి రావాలని వేడుకుంటాడు.
      ఆడబిడ్డను నొప్పించడం వల్ల ఇంటికి అరిష్ఠమనే ఓ విశ్వాసాన్ని కూడా ఈ పాటలో పొందుపరిచారు. మొత్తం ఈ పాటలో ఓ వైపు ప్రతి ఇంటా కొనసాగే వ్యవసాయ వృత్తితోపాటు ఇతర వృత్తులను పరిచయం చేస్తూనే పుట్టింట్లో ఆడబిడ్డకు దక్కాల్సిన గౌరవాన్ని స్థిరపర్చారు. ‘‘ఎద్దు లేదు. ఎగుసం లేదు. ఏమంటొద్దుర నీవెంట’’ అనే పాటలో, ఓ ప్రేయసి ప్రియుడి వెంట వెళ్లడానికి నిరాకరించడాన్ని బట్టి అప్పట్లో వ్యవసాయాన్నే ప్రధానవృత్తిగా భావించేవారని తెలుస్తుంది.
వివాహ వేళ...
‘‘బిడ్డనిస్తావన్న పడ్డనేమిచ్చేను బిడ్డనిచ్చేను- నీ మాట నా మాట ఒక్కటేగాని ఆలితో ఒకమాట అనిపించవన్నా’’ అని అన్నను అడుగుతుందో చెల్లెలు. అక్కడితో ఆగలేదు. ‘‘ఇస్తనని పలుకవె ఇయ్యంపురాల- నీకును నాకును ఎవ్వరూ సాక్షి - బాసింగం కట్టిన బ్రాహ్మణుడు సాక్షి’’ అంటుంది. అన్నకు పెళ్లవుతున్న సందర్భం. అప్పటికే ఈ చెల్లెలుకు కొడుకున్నాడు. ఆ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిలు దొరకడం ఇబ్బందిగానే ఉండేది. కారణం బహుభార్యత్వమై ఉంటుంది. అందువల్ల ముందే సంబంధాన్ని నిశ్చయం చేసుకునేవారు. అదీ పిల్ల పుట్టిన తర్వాత కూడా కాదు. పుట్టబోయే పిల్లను నిశ్చయం చేసుకోవడం వింతగా అనిపించినా అది నమ్మి తీరాల్సిన యథార్థం. ‘‘పచ్చి మిరపచెట్టు ఉయ్యాలో వృక్షమై పుట్టింది ఉయ్యాలో’’ అనే పాటలో ‘‘అన్నరా పెద్దన్న ఉయ్యాలో పిల్లనియ్యారయ్యా ఉయ్యాలో’’ అని చెల్లెలు వేడుకుంటే... ‘‘మేనోల్ల కియ్యము - మెప్పియ్య లేమమ్మ - బయటోల్లకియ్యొచ్చు - మెప్పించుకోవచ్చు’’ అంటూ నిర్మొహమాటంగా వదిననే తేల్చి చెబుతుంది. 
      ‘‘హిమవంతూనింట్లో బుట్టి - హిమవంతునింట్లో పెరిగి’’ అనే పాట, పెళ్లి అనంతరం గౌరీదేవిని శివునికప్పగించి అత్తింటికి పంపిస్తున్న సందర్భానికి సంబంధించింది. ‘‘కాంతాలందరు గూడి- ఓడీ బియ్యము నింపి- ఆ శివునీ కప్పగించ మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ - మాయమ్మ లక్ష్మీదేవి మళ్లీ రావా’’ అంటూ పాడుతూనే/ పంపిస్తూనే ఆ పార్వతిని అనునయిస్తున్నారు. జానపదులు తమకు సంబంధించిన వ్యక్తులను శివపార్వతులుగా, సీతారాములుగా, సుభద్రార్జునులుగా పౌరాణిక వ్యక్తిత్వం కల్పించుకుని పాడుకుంటుంటారు. గతంలో బాల్యవివాహాలు అధికం. ఆ చిన్న పిల్లకు అత్తవారింటికి పోవడమంటే కొంత బెరుకు భయముండటం సహజం. అందువల్ల పోయిరమ్మంటూనే ఊరడింపుగా ‘‘కుదుర్లదొంతులిస్త - అపరంజి మొంటెలిస్త - మల్లెమొగ్గల చీరలిస్త’’ అన్న తాయిలాలతోపాటు లౌక్యంగా, ‘‘పోయి మీ అత్తింట్ల బుద్ధికల్గుండు - ఎవ్వరేమన్నను ఎదురాడకు’’ అంటూ రకరకాల సుద్దులు బుద్ధులు గరపుతారు. 
      అట్లా అత్తింటికి పోయిన ఆ బిడ్డ తొందరగానే అన్ని పనుల్లో లీనమవుతుంది. ‘‘చిత్తుమ్మ ఏకాశి, చిలుకు దాదోశినాడు ఆవు పెండాదెచ్చి అరుగుల్లు అలికి- గోవుపెండా దెచ్చి గోలెంలకలిపి ధరణి మీదా సాన్పు దట్టంగ సల్లి కాళ్లు మొకము కడిగి- కడుప కడిగి - కోటి సంపదలివ్వు - కోమాండ్ల నివ్వు - ఎప్పటికి ముత్తై దుతనము నాకివ్వు’’ అని ఆమె కోరుకుందట. ఈ గేయం జానపద స్త్రీ పనిపాటలను, మనోభావాలను ఎంతో సహజంగా చిత్రిస్తుంది. అచ్చంగా ఓ ఇల్లు.. ఆ ఇంటిముందు స్త్రీ పని చేస్తున్న తీరు కళ్లకు కట్టినట్లే ఈ గేయం సాగుతుంది. ఇక ఆచారానికి, ప్రయోజనాలకు ఇప్పటికీ అవినాభావ సంబంధం కొనసాగుతోంది. కడుప (గడప) కగిడి ఆమె సంపదలను, ముత్తయిదువతనాన్ని, కొడుకులనూ ఇవ్వమని కోరుతుంది. సంపదలు అందరూ కోరుకోవడం సహజం. ఇక ‘‘పున్నామ్నో నరకాత్తాయత ఇతిపుత్రః’’ అంటారు. అందుకే ప్రతిఫలంగా.. వాళ్ల విశ్వాసాల ఆధారంగా కొడుకులనూ కోరుకోవడం సహజమే. ఇక తరతరాలుగా కొనసాగుతున్న పితృస్వామ్యంలో భర్తలేని స్త్రీ ఉనికికి విలువలేదు. అన్నింటా అవమానాలే. ఆ అమానవీయాలకు దూరంగా ఉండాలంటే ముత్తైదువతనాన్ని రక్షించుకోవాలి. అంటే భర్తను కాపాడుకోవాలి. దానికై ఎన్ని పాట్లో, ఎన్ని పూజలో? ఎన్ని నోములో? చెప్పాల్సిన పని లేదు.
ఎంత చేస్తే మాత్రం..!
ఎంత అత్తింట్లో ఒదిగిపోయినా ‘‘కాకమ్మ నీకాల కట్టేవ గజ్జే- రత్నమ్మ మావార్ని రాగుయ్యె కాకి- నేరేడు పండంటి అన్న నాయన్న- నేడు వస్తానని నెలకన్నరాడు’’ అంటూ వాపోతుంది ఆ ఆడబిడ్డ. కాకి ఇంటిముందు ఏ గోడమీదో/ ఇంటి మీదో చేరి అరిస్తే చుట్టాలు వస్తారనేది విశ్వాసం. అందుకే కాకిని కుయ్యమని, కూస్తే కాలికి గజ్జె కట్టుతానని మాట కూడా ఇస్తుంది. పుట్టింటి వాళ్లను కలవాలనే ఆరాటం అలాంటిది మరి. ఇక అత్తగారింట్లో యారాండ్లు, ఆడబిడ్డలు... అంతా సమష్టిగా జీవనం. ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. అదే విషయాన్ని ఓ సాయంకాలం వర్ణనలో చెబుతుందీ పాట... ‘‘మోచేటి పెద్దమ్మ నోచేటివేళ - బేరాయి పువ్వుల్లు పూసేటివేళ, ఆవులు దూడలు వచ్చేటివేళ - సందిటి దీపాలు పెట్టేటివేళ - మరదళ్లు జూదమాడేటివేళ - కూతుళ్లు గుండిగలు దింపేటివేళ - చెల్లెళ్లు చేమంతులు ముడిసేటివేళ...’’ కూతుళ్లకు పని వెసులుబాటు కలిగి జూదం (పచ్చీసు అయి ఉంటుంది) ఆడతారని- అలంకరించుకునే పనిలో నిమగ్నమవుతారని కోడళ్లు (తాము) మాత్రం వంటపనిలో తలమునకలు కాక తప్పని పరిస్థితి అంటూ ఈ గాయకులు చెప్పకనే చెబుతున్నారు. 
ఇన్ని చేసినా చాలావరకు కొంతమంది పరస్త్రీ వ్యామోహంలో పడేవారు. ఓ ఇంటి భర్త వస్తూ వస్తూనే ‘‘వానా గొట్టదాయె- వరుదెల్లదాయె - అవ్వా మన వాకిట్లో వరుదెక్కాడిదె’’ అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడా తల్లి ‘‘నువ్వు పొయ్యి పొరుగింట్ల పడుకుంటె నా కొడుక- నీ ఆలి శోకంబు నా కొడుక’’ అని తల్లి ఉత్ప్రేక్షించిన తీరు ఎంతో మనోహరంగా ఉంటుంది. 
అది ఆత్మగౌరవం
మరోపాటలో కడవెత్తుకుని నీళ్లకని వచ్చిన చెల్లెలిని అన్న చూస్తాడు. చాలా రోజులకు కలిసినందువల్ల ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లు తుడిచి కడవెత్తిన ఆ అన్న చెల్లి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. అంతటితో ఆగలేదు. ‘‘పజ్జొన్నా మొలిచింది - సామ మొలిచింది - గోదూమ మొలిచింది - గోడా కొరిగింది - కొట్టెటోళ్లు లేక కొండలయ్యి పెరిగింది - మలిచేటోళ్లు లేక మన్నయిపాయె - కోడెటోళ్లు లేక - కొండ రాశాయె’’ అంటూ తన ఇంట్లో పనులన్నీ మూలకుపడ్డాయని చెప్తాడు. ఆ అన్న మాటల్లో లౌక్యం ఉంది.
      ఇంటికి వస్తే ఆ పనుల్లో చెల్లెలు ఆసరాగుండాలని అతని ఉద్దేశం. ప్రత్యక్షంగా ఆ విషయాన్ని చెప్పకుండా మా ఇంటికొస్తావా చీర పెడ్తానంటాడు. చెల్లెలూ ఏం తక్కువ తినలేదు. ఆమె కూడా అంతే లౌక్యంగా కొడుకులు, తమ్ములు, మరుదులతో ఆ పని చేయించుకోమని సలహా ఇస్తుంది. అన్న చీర ఆశ చూపించినందుకు నొచ్చుకుంది కూడా. అందువల్ల ‘‘పదివేల పెట్టెల్లొ ధనమున్న నీకు - పసుపు కుంకుమల దాన్ని అన్నయ్య నేను’’ అంటూ సమాధానమిస్తుంది. ఎంత పుట్టింటిపై మమతానురాగాలున్నా అత్తింటిని తనదిగా చేసుకుని సంసారం కొనసాగిస్తున్న క్రమంలోనే చెల్లెలు ఆ విధంగా బదులిస్తుంది. ఈ గేయంలో కూడా వ్యవసాయపు పనులు కనపడతాయి. చేను నుంచి పంట తీసిన తర్వాత కట్టెతో కొట్టడమో లేదా పశువులతో తొక్కించడమో (బంతికట్టడం) చేస్తారు. ధాన్యాన్ని చేటను అడ్డంగా పెట్టి చెరగటాన్ని మలవడమని, చేటను అటూ ఇటూ తిప్పుతూ ధాన్యాన్ని ముందుకు వచ్చేటట్లు చేటను కొంచెంగా ఎగరవెయ్యడాన్ని కోడటమంటారు. ఈ మలవడం, కోడటం వల్ల మట్టిపెడ్డలు చిన్నచిన్న రాళ్లు వెనక్కి ఉండిపోతాయి.
పరాచకాలకు లోటేంటి..!
సాధారణంగా వదినా మరదళ్లు ఒకళ్లనొకళ్లు వెక్కిరించుకోవడం ఎకసెక్కమాడటం మామూలే. ఓ ఇంటికి ఆడబిడ్డ వచ్చినపుడు... ‘‘వాన గొడ్తాంది జా(బా)న వదినె వచ్చెనమ్మ - ఎట్లా పొమ్మందు వదిన - వానగొడ్తాంది శాన - నీళ్లు ఇస్తామంటే చిల్లూల చెంబాయె సా(చా)ప వేస్తామంటె సందూ కొంచెమాయె- కల్లూ దెస్తామంటే చెల్లాని పైసాయె- కోడిని కోద్దామంటె- గుడ్లమీది కోడాయె- వడ్లు దంచుదామంటె - యిత్తనాల వడ్లు వదిన - కొఱ్ఱలు దంచుదామంటె కొత్త ధాన్యమాయె - సామలు దంచుదామంటే సన్నాని ధాన్యమాయె- కౌగిలిచ్చు కొందామంటె- యిత్తనాల వడ్లు వదినె కండ్ల చూస్తామంటె - కొండ్లొచ్చినాయి వదిన...’’ అంటూ తాను ఏ విధమైన మర్యాద చేయలేకపోతున్నానని తెగ బాధపడుతుంది. అంతటితో ఊరుకోలేదు. ‘‘నీవు పొయ్యె తొవ్వలోన - కండుకా లంగడి వదిన - కుప్పె కుదువబెట్టి కొబ్బెరంపు నాయి వదినె’’ అంటూ అదే క్రమంలో మడిమను కుదువబెట్టి మట్టెలను, కాలు కుదువబెట్టి గాజులను పంపించమనికోరడం ఎంతో నవ్వు తెప్పిస్తుంది. ఇక ‘‘తంటలమారి వదినకు- వంటా చేయరాదు/ వంటానా (శా)లె(ల) కింద- మంటా పెట్టారాదు/ అప్పడాలు ఏమొ- మస్తూగ చేసినాది/ అప్పడాలకేమొ - ఉప్పు సాలలేదు/ ఇద్దరికి ఒక అప్పడము - ఇరిసి పెట్టినాది’’ అంటూ వదినను ఆటపట్టించే ఆడబిడ్డలూ ఉంటారు. 
      కాముని పౌర్ణమి ముందు కొందరు ఇల్లిల్లూ తిరిగి పాటలు పాడుతా ఇనాం వసూలు చేస్తారు. ఆ సందర్భంగా ‘‘జాజిరి జాజిరి’’ అంటూ ఇంకా, ‘‘రంగుల బిళ్లా రూపాయి దండ- దండకాదుర దామెరమొగ్గ- మొగ్గ కాదుర మోదుగు నీడ- నీడ కాదురా నిమ్మలబాయి- బాయి కాదుర బచ్చలకూర- కూరకాదుర గుమ్మడిపండు- పండు కాదుర పావడ మీసం- మీసం కాదుర మిర్యాలపొడి- పొడి కాదుర పోరని జుట్టు- జుట్టు కాదుర- సీపిరికట్ట- కట్ట తీసి నీ మొకాన కొట్ట’’ అనే పాటను కూడా పాడతారు. పైసలు వసూలు చేయందే ఇల్లు వదలరు. ఈ పాట ముక్తపదగ్రస్తంలో మంచి లయతో మనోహరంగా సాగుతుంది. పాటలో కొంత హాస్యం కూడా ఉంటుంది. ఇదే గేయం పిల్లల పాటగా ‘‘కాళ్లగజ్జే - కంకాణమ్మ’’ అంటూ కొంచెం మార్పుతో కొనసాగుతుంది.
      లోకం విచిత్రమైంది. తప్పుచేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని నమ్ముతుంది. ఆయన్ను నమ్ముకుంటే పనులు సవ్యంగా జరుగుతాయనే నమ్మకమూ ఉంది. కానీ ఆ పనులు నీతి నిజాయతీలకు సంబంధించినవేనా? కాదా? అనే విచక్షణ మళ్లీ ఈ లోకానికి లేదు. అందువల్లే ‘‘దొంగతనము చెయ్యబోత - నాకూ తోడురావె తల్లిరో - మాంకాలమ్మ - మదిలోన ధైర్యమొస్తె నీకు మంచిగానె పూజ చేస్తు - కోళ్లుగాని కోళ్లుదెచ్చి తల్లి నీకు బలి యిస్తు - కల్లు కుండ దీసుకొచ్చి నీ కాళ్లకాడ శాక పోస్తు’’ అంటూ వేడుకొంటాడో మనిషి. దొంగతనం తప్పు. ఆ తప్పు చేస్తే దేవుడు శిక్షించాలి. కాని ఆ విచక్షణ లేకుండా ఆ తప్పు చేయడంలో కాళీమాతను సహకరించమని కోరుకుంటున్నాడు దొంగ. కానీ మనం నిశితంగా పరిశీలించినపుడు పరోక్షమైన దొంగలు చాలామందే కనబడతారు. పైకి గొప్పగా కనిపించేవాళ్లలో చాలా మంది ప్రజలను మోసం చేసి డబ్బు దండుకుంటున్న వాళ్లే. కానీ అందరూ దైవభక్తి తత్పరులే. అందరూ ఆ దైవాన్ని అనుగ్రహించమని కోరుకునేవాళ్లే!
ఒకటా రెండా...
జానపదుల గేయాల్లో వంటలూ తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. ‘‘మామిడి మామిడి- మంచి మామిడి- కొమ్మల్లు వంచేరు - కోసేర నిన్ను - ... ఉప్పు మిరంతోటి ఉంచేరు నిన్ను - ఉప్పు మిరంతో అద్దేరు నిన్నూ - నీలంపు కాగుల్లొ నింపేరు నిన్ను - పేరైన రాజులకు పంపేరు నిన్ను’’ అంటూ మామిడి కాయకారం తలచుకుంటూ శ్రమను మరచుకుంటు పనిలో ఊపును తెచ్చుకునే విధానం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.
      ఇంకా ఈ గేయాలనేకం. ‘‘అమ్మలార అయ్యలార ఊరోణ్ని నేను- పల్లెటూరోణ్ని నేను- పట్నపోల్లు అనుకునే రుమాలోన్ని నేను - నాగరీకం తెలియనోణ్ని- చదువు గిదువు లేనోణ్ని- మోసాలు చెయ్యనోణ్ని- సూటుబూటు ఎయ్యనోణ్ని - చదువు గిదువు లేనోణ్ని’’ అంటూ పల్లెటూరు స్వచ్ఛతను, చదువు - నగరీకరణ నాగరికతలు మోసం మార్గంలో నడుచుకుంటున్నాయనే విషయాన్ని స్పష్టం చేసే పాటలు; ‘‘నారిగా పేరిగా సూరిగా ఇనుకోండిరి నా మాట - పెళ్లాన్ని ఎట్టకండిర గోడు- పెళ్లామె పెట్టేది కూడు - రోగాలు వచ్చినా సుట్టాలు వచ్చినా - రాయల్లె చేసేది పెళ్లామె’’ అంటూ కుటుంబంలో భార్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన పాటలు; బతుకమ్మ పండుగ సందర్భంగా ‘‘తీరొక్క నగలేమో పెట్టుకున్నారు. రాజ్యాన లేనివి రైకలో తొడిగిరి- దేశాన లేనివి చీరలూ కట్టిరి  బంగారు ఒడ్డాణం బిర్రుగా పెట్టిరి’’ అంటూ స్త్రీలు అలంకరణ పట్ల ఆసక్తి చూపించే పాటలు; తల్లి పిల్లవాణ్ని జో కొడుతూ ‘‘జో అత్యుతానంద జోజో ముకుందా- లాలిపరమానంద’’’ అంటూ పాడే జోలపాటల్లాంటివీ ఎన్నో! ‘‘తారంగం- తారంగం- తాండవకృష్ణ తారంగం- వేణునాథ తారంగం- వెంకటరమణ తారంగం- చిన్ని కృష్ణ తారంగం’’ అంటూ చిన్నపిల్లలను ఆడిస్తూ ముద్దు చేస్తూ పాడే పాటలే కాకుండా ఇంకా ‘‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ/ బిస్తిగీరంగ’’ లాంటి పాటలు బోలెడు. అయితే... గతంలో పిచ్చుకగుంట్లు, శారదకాండ్రు, వీరముష్ఠివారు, బవనీలు, గొల్లసుద్దులు మొదలైనవారు జానపద గేయాలను పరిరక్షిస్తూ వచ్చారు. పట్టణీకరణలో కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా కేవలం గేయ పరిరక్షణలో జీవితాలను వెళ్లబుచ్చలేక వారు ఇతర వృత్తులను చేపట్టిన కారణంగా సంబంధిత సాహిత్యం అడుగంటిందని చెప్పవచ్చు. 
      ఈ రోజుల్లో జానపద గేయాలకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజల దగ్గరికి తమ రచనలు చేరాలనుకునే శిష్టులు వస్తువేదైనా జానపదుల శైలిలో రాస్తున్నారు. మలితరం తెలంగాణ ఉద్యమకాలంలో గోరటి ఎంకన్న, అందెశ్రీ, జయరాజ్, గూడ అంజయ్య, సుద్దాల అశోక్‌తేజ లాంటి ప్రముఖ జానపద రచయితలే కాక ఇంకా ఎంతోమంది జానపద గేయాల రాసి, పాడి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఓ రకంగా ఉద్యమం ఎంతోమంది జానపద రచయితలను కళాకారులను తయారు చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా జానపద గేయాలను ప్రోత్సహించింది. ప్రోత్సహిస్తోంది. దాంతో జానపద గేయాలు కొండంత ఎత్తుగా, రాశిగా వస్తున్నాయి. వీటిని యువ రచయితలు, సంకలనకర్తలు, భాషా సాంస్కృతిక శాఖలు అచ్చురూపంలో భద్రపర్చాల్సి ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం