చంద్రునికో నూలిపోగు

  • 1422 Views
  • 6Likes
  • Like
  • Article Share

కలంజమంటే..?
‘‘ఖగపతి అమృతము తేగా/ భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌/ పొగచెట్టై జన్మించెన్‌/ పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌’’ అని ‘కన్యాశుల్కం’లో గిరీశంతో చెప్పించారు గురజాడ. నాగజెముడులా ఈ పొగచెట్టు ప్రపంచమంతా వ్యాపించడానికి ముందు చాలా దూరం ప్రయాణించింది. వివిధ రూపాల్లో సంచరించింది.  
‘నికోటియానా తబాకమ్‌’ అనే కాలిఫోర్నియా మొక్క అరబ్బుల చేతుల్లోకి వెళ్లాక ‘తంబాక్‌’ అయిపోయింది. బెంగాలీలు మాత్రం తమక్‌గా పిలుచుకున్నారు. కన్నడ సోదరులు హొగె సొప్పు అనీ, తమిళ మిత్రులు పుగై ఇలై అని అంటూ మచ్చిక చేసుకున్నారు. మనవాళ్లు ‘పొగాకు, పుగాకు’ అని వ్యవహరిస్తున్నారు. అక్బర్‌ కాలానికే ఇది దేశంలో వాడుకలోకి వచ్చిందట. తర్వాత ఈ వ్యసనాన్ని ప్రమాదకరంగా పరిగణించి పొగతాగడం మీద నిషేధాజ్ఞలు విధించినా ధూమపానప్రియులు రహస్యంగా పొగలోకంలో విహరించేవారట. అయితే, భారతీయులకు అంతకు ముందునుంచే చిరపరిచితమైన ‘పొగచెట్టు’ గురించి ‘వాచస్పత్యం’ చెప్పింది. బహుశా అది గంజాయి కావచ్చు. ‘విష్ణు సిద్ధాంత సారావళి’ కూడా ‘‘కలంజ సంవేష్టన ధూమపానాత్‌..’’ అంటూ ఓ ఔషధంగా గంజాయి (కలంజం) ఉపయోగాలను వివరించింది. దొరలు చుట్టలు కాల్చినా.. అరబ్బులు హుక్కా పీల్చినా.. పండితులు పొడుం ఆఘ్రాణించినా.. అవేవీ మనవి కావనీ, కొత్త పొగాకు పాత గంజాయిని తోసిరాజని ముందుకొచ్చిందని అంటారు తిరుమల రామచంద్ర. అయితే.. ఔషధగుణాల మాట ఎలా ఉన్నా, గంజాయి సేవనమూ వ్యసనమే.. అది పొగాకును మించిన ప్రమాదకారి కూడా!!


చంద్రునికో నూలిపోగు
బాగా ఉన్నవాడికి ఇతరులు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్వాలేదు. అలా అని ఇవ్వకుండా ఉండలేరు. ఇచ్చినా అది గొప్పగా అనిపించదు. అయినా తమ భక్తిని ప్రదర్శిస్తూ తృణమో పణమో ఇచ్చేటప్పుడు ఈ సామెతను ప్రయోగించడం కద్దు. నన్నెచోడుడు తన కావ్యాన్ని జంగమ మల్లయ్యకి అంకితమిస్తూ ఇలాంటి సామెతనే కాస్త అర్థం మార్చి ఇలా అంటాడు- ‘‘....రవికి దీపమున నర్చనలిచ్చు పగిది వోలే’’! 


పదనిధి
తడి: తేమ, ఆర్ద్రత, నీరు అనే అర్థాలున్నాయి దీనికి¨. ఇటీవల తడి అనే మాటకు ‘డబ్బు’ కూడా వాడుకలోకి వచ్చింది. చేతిలో పైసా లేనివాణ్ని గురించి చెబుతూ ‘వాడి చేతిలో తడి లేదు’ అంటుంటారు.
దాహం: ఈ మాటకు మంట, జ్వాల, కాలుట అని నిఘంటువులు అర్థం చెబుతాయి. దప్పిక, పానీయం అనేవి అర్థపరిణామం వల్ల వ్యాప్తిలో కొచ్చాయి. దాహం పుచ్చుకోండి అనడం అందులో భాగమే.
ముహూర్తం: అసలైతే ఈ పదానికి అర్థం నిమేషకాలం, అల్పకాలం, లిప్త కాలం. మన వాడుకలో మాత్రం వివాహాది కార్యాలకు నిర్ణయించే శుభసమయం. ముహూర్త సమయం అంటే పవిత్రకాలంగా అర్థం స్థిరపడిపోయింది.


చెవిలో ఇల్లు
ఇదో జాతీయం. ఇది పదబంధంలా చిన్నగానే ఉన్నా లోతుగా ఆలోచిస్తే జాతిజనుల జీవనక్రమం కనిపిస్తుంది. చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా వినడండి! అంటుంటారు, మాట లక్ష్యపెట్టనివాణ్ని ఉద్దేశించి. చెవికి సంబంధించిన నానుడులు తెలుగులో బోలెడున్నాయి. ‘చెవికొరుకు, చెవియూరు, చెవులూరు, చెవిబడు, చెవినబెట్టు, చెవికోసుకొను, చెవికెక్కు’.. ఇలాంటివి సందర్భాన్ని అనుసరించి ప్రయోగించడం తెలుగువాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి చెవిలో ఇల్లు కట్టుకోవడమంటే చెవిలో స్థిరంగా కూర్చోవడమన్నమాట. నిరంతరం చెప్పి ఒప్పించడం అనే అర్థంలో ఇది వాడుకలోకి వచ్చింది. అంటే ఒక విషయాన్ని పదే పదే బోధించడమన్న మాట. ‘‘ఎల్లవేళల నేజెవి నిల్లుగటి విన్నపము చేయు నా మాట వినవు నీవు..’’ అని మొల్ల రామాయణంలో ఒక ప్రయోగముంది. స్థిరమైన ఇల్లు కట్టుకుని సుఖించినట్టుగానే ఎదుటివారి మనసునూ, బుద్ధినీ తనవైపు స్థిరపరచుకునే మిషతో చెప్పే మాటలను దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మంచిని పదిసార్లు చెప్పి ఒప్పించినట్టే, అబద్ధాన్ని అయినా పదిసార్లు చెప్పి నిజమనిపించే వారు ఉంటారు. అలాంటి వాళ్లతో తస్మాత్‌ జాగ్రత్త!


 


వెనక్కి ...

మీ అభిప్రాయం