నాదవినోదం

  • 782 Views
  • 59Likes
  • Like
  • Article Share

    గొట్టిముక్క‌ల సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి

  • విశ్రాంత తెలుగు పండితుడు
  • నంద్యాల‌, క‌ర్నూలు
  • 8514248135
గొట్టిముక్క‌ల సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి

తెలుగు పద్యాల సొగసుకు ‘నాదం’ కూడా ఓ ముఖ్య కారణం. నాదమంటే చెవులకు ఇంపుగా, ఆకర్షించేలా శబ్దం వినబడటం. అలా అని ఒక్క చుక్కా వాన కురవకుండా ఉత్త ఉరుములే వినపడితే ఏం లాభం? పద్యంలో శబ్దం మృదుమధురంగా అర్థవంతంగా పొదిగి ఉండాలి. మన ప్రాచీన సాహిత్యంలో ఇలాంటి అర్థవంతమైన, శ్రవణపేయమైన పద్యాలకు కొదవలేదు.
వినేవారి
చెవుల్ని అలా పట్టి ఇలా పద్యాల్లోకి లాగాలంటే అనువైన ‘నాదం’ అర్థవంతంగా ఉండాల్సిందే. అలా ఉంటేనే పద్యం నేర్చుకునేందుకు అనువుగా ఉంటుంది. తెలుగు కవికుల గురువు నన్నయభట్టు చెప్పిన అక్షర రమ్యత ఇదే. సుమతి శతకంలోనివన్నీ భావయుక్తమైన నీతి పద్యాలే. అయినా, సుమతీ శతకంలోని ‘‘ఏఱకుమీ కసుగాయలు...’’ పద్యంలోని ‘ఏఱకుమీ, దూఱకుమీ, పాఱకుమీ, మీఱకుమీ’ పదాలు ప్రాసతో ఉండటంవల్ల ఒక విధమైన మధురనాదం చెవికి సోకుతుంది.
      నలుగురు కవుల రచన ‘భాస్కర రామాయణం’. అందులో ప్రపంచమే ఎరగని ఋష్యశృంగుడిని నగరంలోకి తీసుకురావాలి. అందుకు నర్తకీమణులను ప్రయోగిస్తాడు రాజు. వాళ్లు ఋష్యశృంగుడి ఆశ్రమం చేరి సంచరిస్తుంటారు. వాళ్లు నడచినప్పుడల్లా వాళ్ల పాదాల అందెలు రమణీయంగా మోగుతున్నాయి. ఎలాగంటే... మణిఘృణి గణయుత రశనా/ ఝణఝణితా గణిత రణిత చరణాంచిత భూ/ షణ ఘోషణ రణన విచ/ క్షణ కంకణ కింకిణీక ఝంకృతులారన్‌! మణుల నుంచి వెలువడే కిరణాలతో, మొలనూలు ఝణఝణలతో బాగా మోగుతూ, కాళ్లకు ఒప్పారుతున్న అందెల రావాలతో కంకణాలు చిరుగజ్జెలతో మోగుతున్నాయి. దాన్ని పద్యంలో ‘ణణణణణ’ అంటూ మంజీరాల నాదం వినిపింపజేయటమే వినోదం! 
విశ్వామిత్రుని వెంట వెళుతుంటారు రామలక్ష్మణులు. ఎదురుగా రక్తసిక్తమైన కత్తితో భయంకరాకారంలో ‘తాటక’ నిలబడింది. ఎలా ఉందా ‘తా-టక’? ‘‘పాటిత దుష్టసత్వ వనవాటక, నిద్ధ బలావరుద్ధ శృం/ గాటక, గ్రంథిల భ్రుకుటి గాథలలాటక, క్రూర తారకా/ నాటక, నాంత్రకాంచి పరిణద్ధ స్రవత్‌ ప్రపతత్‌ క్రిమిచ్ఛటా/ కీటక రక్తసిక్త పటుఖేటక తాటక గాంచి రయ్యెడన్‌!’’ ఈ పద్యంలోని టకటక నాదం ‘తాటక’లోని ‘టక’కు అనుసంధానమైన వినోదం. పోతన పద్యాల్లోనూ ఇలాంటి నాద మాధుర్యాన్ని చవిచూడవచ్చు. ఇక ‘అల్లసానివాని అల్లిక జిగిబిగి’ అంటూ తెనాలి రామకృష్ణ కవి పెద్దన కవిత్వానికి కితాబునిచ్చాడు. అంటే పెద్దన పద్యరచనలో ప్రకాశం, పదాల పటిష్ఠమైన కూర్పు రెండూ కనిపిస్తాయని అర్థం. పెద్దన ‘మనుచరిత్ర’లోని ప్రవరాఖ్యోపాఖ్యానం సుప్రసిద్ధం. ఓ రోజు ప్రవరుడి ఇంటికి సిద్ధుడు వస్తాడు. వయసు చిన్నది. అన్ని క్షేత్రాలూ, తీర్థాలూ చూశానంటాడు. ఎలా సాధ్యమంటాడు ప్రవరుడు. సిద్ధుడు ఓ పసరు చూపించి దీని ప్రభావంతోనని చెబుతాడు. ‘‘దివి బిసరుహ బాంధవ సైం/ ధవ సంఘములెంత దవ్వుదగలేకరుగున్‌/ భువి నంత దవ్వు నేమును/ ఠవఠవలే కరిగెదము హుటాహుటి నడలన్‌’’- ఆకాశంలో ఆ ఆదిత్యుడి గుర్రాలు ఎంత దూరమైనా అలసట లేకుండా వెళ్తాయి కదా! అలా నేనూ ఈ పసరుతో ఏ ఆటంకాలు, శ్రమా లేకుండా భూమ్మీద ఎక్కడికైనా హుటాహుటిగా వెళ్తాను అంటాడు సిద్ధుడు. ఆ నడిచే వేగం పై పద్యంలోని ‘నాదం’ వల్ల విదితమవుతోంది కదా! దాంతో ‘బాబ్బాబు! నాకూ కాస్త పూయవూ?’ అని పసరు పూయించుకున్నాడు ప్రవరుడు. వెళ్లాడు. ఎక్కడికి? హిమాలయాలకు. ఒక సుందరమైన దృశ్యం అతని కంటబడింది. అదెలా ఉంది? 
ఉల్లల దలకా జలకణ
పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ
హల్లోహల మదబంభర
మల్లధ్వను లెసగ విసరె మరుదంకురముల్‌!

      ఎగసిపడే జలకణాలూ, తుమ్మెదల ఝంకారాలూ వెరసి పద్యంలో కుదిరిన నాద సౌందర్య సమాహారం. ఇలా ఒకటా రెండా? వందల పద్యాలు తెలుగు కావ్యాల్లో మధుర నాదాలకు, మేఘ గర్జనలకు, సింహ శార్దూల గళరవాలకు నిదర్శనాలుగా కొలువుదీరాయి. ఇక వసుచరిత్ర రచనలో తన సంగీత విద్యా ప్రావీణ్యాన్నంతా ప్రదర్శించి నాద వినోదాన్ని కలిగిస్తాడు రామరాజ భూషణుడు. చేమకూర వేంకటకవి ‘విజయవిలాసము’ లోనూ నాద మాధుర్యం కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తూ ఓ సారి అర్జునుడు కాశీకి వస్తాడు. గంగలో మునకలు వేసేప్పుడే నాగకన్య ఉలూచి పాతాళం నుంచి గంగపైకి వస్తుంది. అప్పుడు ఉలూచి అర్జునుణ్ని చూసిన సందర్భాన్ని... ‘‘అంత నింద్రోపల రోచి జూచి తలయూచి యులూచి రసోచితంబుగా’’ మాట్లాడిందంటాడు వేంకటకవి.
ఆధునిక కవులు కూడా...
బాగా నిశ్శబ్దంగా ఉన్నవేళ ఝణిల్లుమని జేగంట మోగితే! గుండె గుభిల్లు మంటుంది. చడీ చప్పుడూ లేకుండా శరీరాలకు ఆహ్లాదకరమైన చిరుజల్లు కురిసినా తెలియదు; అసలెవరూ దానిననుకోరు. అదే ఉన్నపళంగా మేఘం పెటిల్లుమని ఉరిమిందనుకోండి. ‘వర్షం వచ్చేలా ఉంది’ అనేస్తాం. నాదంలో ఉన్న ఆకర్షణే అది. ఈ ఝణిల్లు, గుభిల్లు, పెటిల్లు పదాల్ని వింటూంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రాసిన ఓ నాదమయ పద్యం స్ఫురిస్తుంది.  
      అది సీతా స్వయంవర సభ. శ్రీరామచంద్రమూర్తి శివధనువును అవలీలగా ఎత్తాడు; ఎక్కుపెడుతుండగానే ఆ విల్లు విరిగింది. అప్పుడు, ‘‘ఫెళ్లుమనె విల్లు; గంటలు ఘల్లుమనియె/ గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె/ జానకీ దేహమొక నిమేషమ్ము నందె/ నయము జయమును భయము విస్మయము గదుర’’! ఈ ‘ఫెళ్లు విల్లు ఘల్లు గుభిల్లు ఝల్లు, నయము జయము భయము విస్మయము’ పదాలు శ్రావ్యనాదాలని చెవుల్లో నింపుతాయి.
      గద్యంలోనూ నాదాన్ని నింపిన ఘనుడు చిన్నయసూరి. ఆయన పేరు వినగానే బాలలకు (పెద్దలకు కూడా) భయం కలిగించే ‘బాలవ్యాకరణం’ గుర్తొస్తుంది. వ్యాకరణం అంటే ‘భాషతో రణం’ అనుకోవచ్చు. అయితే అలాంటి వ్యాకరణ సూత్రాల్లోనూ నాదవినోదాన్ని ప్రదర్శించారు సూరి. ‘‘వర్తమానంబున లట్టగు - భూతంబన లిట్టగు - భావిని లృట్టగు/ ఆశీశ్శాప సంప్రార్థనా విధులందు లూట్టగు’’ అని వరుసబెట్టి చదివితే ఏదో మంత్రాక్షర విన్యాసంలా అనిపించడం లేదూ! కానీ ఇవి వ్యాకరణ సూత్రాలు. ‘‘అగు వచ్చు చొచ్చు చూచులకు కారాచొరు చూడులగు’’.. ఇలా సూరి సూత్రాల్లో నాదం నర్తనమాడుతుంటుంది. దీనివల్ల ఒక సౌకర్యం కూడా. ఆ లయ మాధుర్యానికి మనసు వశమై సూత్రాల్ని సులభంగా ఒంటబట్టించు కుంటుంది. 
      సూరి నీతి చంద్రికలో సైతం అడుగడుగునా అర్థవంతమైన నాదతాండవం కనిపిస్తూనే ఉంటుంది. ‘‘దక్షిణా పథంబున రక్షావతి యను పట్టణంబున వర్ధమానుండను సార్థవాహుండొక్కండు గలండు’’, ‘‘కేసరి ఆసన్నమైన మ్రుక్కిడి మృగముల లెక్కింపక నిజఖరనఖర విదారిత హస్తి మస్త మస్తిష్కమ గ్రోలును’’ లాంటివి నీతిచంద్రికలో కొల్లలు. ఇలా రాస్తే ఎవరికి బోధపడతాయి? అని ప్రశ్న. నిజమే! బోధపడవు. కానీ పఠితకు ముందు చెవులకింపైన నాదాన్ని అందించి, చదవడంవైపు దృష్టి మళ్లించడానికి ఇలాంటివే అవసరమవుతాయి. 
      ఆధునిక కవిచంద్రుల్లో ఆదిభట్ల నారాయణదాసు అఖండులు. ఆయన సత్యవ్రతి శతకం రాశారని ప్రతీతి. అందులోని ఓ పద్యం... ఋతతిత ఊత్తుల్తేతా/ తతేతి తాతేతితత్త తత్తై తత్తా/ తతతిత్తా తతిత్తిన్‌/ సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్‌.  దీని అర్థం తెలియాలంటే అది ‘పండిత బ్రహ్మలకే’ సాధ్యం. కానీ ఇందులో నాదం భలే తమాషాగా ఉంది కదా! 
      అర్థమేమీ లేకుండా కేవలం శబ్దాడంబరమే పద్యాన్ని ఆవహిస్తే అది దడబడ కవిత్వమవుతుందే తప్ప చక్కటి కవిత్వం కాదంటారు కొంతమంది. కావచ్చు! కానీ పాఠకులను/ శ్రోతలను ఆకర్షించేది ఏదీ అంటే మాత్రం నాదమే! అదే మన తెలుగు ప్రత్యేకత.


వెనక్కి ...

మీ అభిప్రాయం